ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టుల విషయంలో ప్రభుత్వ విధానం ఎలా ఉంది...హింస ఎందుకు తగ్గడం లేదు?

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
    • హోదా, బీబీసీ కోసం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ ఘటనపై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి.

తర్రెమ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో తాము ఉన్నట్లు మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్ గెరిల్లా దళం బెటాలియన్ ఒకటో నెంబర్ కమాండర్ హిడ్మా స్వయంగా సమాచారం వ్యాప్తి చేశారని... 2వేలకు పైగా పోలీసులు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకునేలా పథకం రచించారని ప్రచారం జరుగుతోంది.

భద్రతా దళాలవైపు జరిగిన నష్టానికి వ్యూహాత్మక లోపం కారణమా? లేక దీన్ని నిఘా వైఫల్యంగా భావించాలా? లేదా పోలీసుల మధ్య సమన్వయం లోపించిందా? అందుకే అత్యాధునిక ఆయుధాలు, అధిక సంఖ్యలో బలగం ఉన్నప్పటికీ మావోయిస్టులను ఎదుర్కోలేకపోయారా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ఇక మావోయిస్టులవైపు నుంచి చూస్తే వారు మూడు, నాలుగు ట్రక్కుల్లో గాయపడ్డ తమ సహచరులను తీసుకుని పారిపోయారని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రాంతంలో భద్రతా దళాలు దిగడంతో ఇక్కడ తమ ప్రభావాన్ని చాటుకునేందుకు మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే ఈ సందేహాలకు సమాధానాలు కనిపెట్టడం అంత సులువు కాదు.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, Getty Images

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం

ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ కొసన బీజాపూర్, సుక్మా జిల్లాలు ఉంటాయి.

ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో టెక్లాగుడా ఊరు ఉంది.

శనివారం మధ్యాహ్నం కొన్ని గంటలపాటు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగింది ఇక్కడే.

ఈ ప్రాంతాన్ని మావోయిస్టులకు బాగా పట్టున్న ప్రాంతంగా చెబుతారు.

ఇక్కడ ఒకటో నెంబర్ బెటాలియన్ ప్రభావం ఎక్కువ.

ఈ బెటాలియన్‌ కమాండర్ మాడ్వీ హిడ్మా గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

దూకుడైన వ్యూహాలకు ఆయన పెట్టింది పేరు.

శనివారం ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం హిడ్మా ఊరు పువర్తీకి దగ్గర్లోనే ఉంది.

హిడ్మా 1990లలో మావోయిస్టుల్లో చేరారు. ఆయనకు సంతోష్, పోడియం భీమా, మనీష్ అని కూడా పేర్లు ఉన్నాయి.

2010లో తాడ్మెట్లలో 76 మంది జవాన్లను హత్య చేసిన ఉదంతం తర్వాత మావోయిస్టు పార్టీలో ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించినట్లు చెబుతారు.

ఝీరం లోయ ఘటన వెనుక సూత్రధారి కూడా హిడ్మానే అని అంటుంటారు.

హిడ్మా తలపై రూ.35 లక్షల రివార్డు కూడా ఉంది.

2010 నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు హిడ్మా మరణించినట్లు వార్తలు వచ్చాయి.

అతను ఇప్పుడు ఒక వ్యక్తి కాదని, అది ఒక హోదాగా మారిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మావోయిస్టు పార్టీలో ఇలాంటివి సహజంగానే కనిపిస్తుంటాయని ఆ అధికారి అన్నారు.

హిడ్మా, ఆయన బృందం తర్రెమ్‌కు సమీపంలోనే ఉందంటూ పోలీసులకు సమాచారం అందగానే...ఉసూర్, పామేడ్, తర్రెమ్, మిన్పా, నర్సాపురం క్యాంపుల్లోని ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా బెటాలియన్‌లకు చెందిన దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలు 'ఆపరేషన్ హిడ్మా' చేపట్టాయి.

హిడ్మా, ఆయన సహచరుల కోసం గాలించేందుకు భద్రతా దళాలు గుండం, అలీగూడెం, టెక్లాగూడెం ప్రాంతాలకు వెళ్లాయి. కానీ, వారికి మావోయిస్టుల ఆచూకీ దొరకలేదు.

''మొదటిసారి బలగాలు మావోయిస్టుల వలలో చిక్కుకున్నాయి. జగర్‌గుండా-తర్రెమ్‌ మార్గం మూసేసి ఉంది. మేం అదే మార్గాన్ని ఎంచుకున్నాం. తిరిగి వస్తున్న సమయంలో సిల్గేర్ సమీపంలో మాపై దాడి జరిగింది'' అని ఈ ఎదురు కాల్పుల్లో పాల్గొన్న ఒక జవాను బీబీసీతో చెప్పారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక రోజు ముందే మావోయిస్టులు ఇక్కడి సమీప అటవీ ప్రాంతంలో మొహరించి ఉన్నారు. మొత్తం గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆపరేషన్ నుంచి తిరిగివస్తున్న భద్రతాదళాలలోని ఆఖరి బృందాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు.

ఇప్పటి వరకూ తెలిసిన సమాచారం ప్రకారం భద్రతా దళాల బృందం టెక్లాగూడెంకు వంద మీటర్ల దూరంలో ఉన్న సమయంలో మావోయిస్టులు దాడి చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. దాదాపు రెండు గంటలపాటు కొనసాగాయి.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఫైల్‌ఫొటో

మావోయిస్టులు దాడి చేయడంతో దగ్గర్లోని రహదారి, అటవీ ప్రాంతాల నుంచి పారిపోతూ పోలీసులు చెట్ల వెనుక, ఊరిలోని ఇళ్ల వెనుక దాక్కున్నారు.

కానీ, అప్పటికే అక్కడ ఉన్న మావోయిస్టులు వారిపై దాడి చేశారు. మధ్యాహ్నం మూడున్నర సమయంలో దాడి జరిగింది.

జవాన్లు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో మైదానం వైపు, అడవి వైపు వెళ్లారు. సమీపంలోని గుట్టల మీద మాటు వేసి ఉన్న మావోయిస్టులు వారిపై దాడికి దిగారు. ఎల్ఎంజీ, యూబీజీఎల్, బీజీఎల్, రాకెట్ లాంచర్, మోర్టార్ వంటి ఆయుధాలను ఉపయోగించి ఈ దాడులు చేశారు.

చనిపోయిన వారి శవాలను తీసుకువెళ్లేందుకు భద్రతా దళాల బృందం ఆదివారం అక్కడికి చేరుకుంది. మావోయిస్టులు వ్యూహం పన్నిన తీరును చూసి ఆ బృందం నిర్ఘాంతపోయింది.

'వి' ఆకారంలో మావోయిస్టులు ఉచ్చును పన్నారని, అందులో నుంచి బయటపడటం పోలీసులకు చాలా కష్టమైందని అక్కడికి వెళ్లిన బృందంలో ఒకరు చెప్పారు.

''ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా లేడు. ఇళ్లన్నీ తాళాలు వేసి ఉన్నాయి. ఊరి వీధుల్లో పోలీసుల శవాలు పడి ఉన్నాయి. ఒక ఇంటి ద్వారం వద్ద ఓ డెడ్‌బాడీ కనిపించింది. శవాల కింద మావోయిస్టులు పేలుడు పదార్థాలు పెట్టే అవకాశాలు ఉండటంతో, మేం వాటిని మొదట తాళ్లతో లాగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది'' అని ఆయన వివరించారు.

శనివారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు ముగిశాయి.

అయితే ఆదివారం ఉదయం భద్రతా దళాలు అక్కడికి చేరుకునే ముందు వరకూ మావోయిస్టులు అక్కడే ఉన్నారు.

ఒక్కో పోలీసును సోదా చేసి , వారి వద్ద ఉన్న ఆయుధాలు, సెల్‌ఫోన్లు, బూట్లు, బెల్టులు, ఇతర వస్తువులు తీసుకువెళ్లారు.

ఉదయం సుక్మా, బీజాపూర్ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టుల బృందంతో మావోయిస్టులు మాట్లాడారు. ఆదివారం ఉదయం సహాయ చర్యలు చేపట్టేందుకు వచ్చిన భద్రతా దళాల బృందాన్ని కూడా లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారంనాడు జరిగిన ఐఈడీ పేలుడులో ఒక జవాను గాయపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, CHHATTISGARH DPR

ఫొటో క్యాప్షన్, ఇది నిఘా వైఫల్యమని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు

నిజంగా బలహీనపడ్డారా?

గత రెండేళ్లలో మావోయిస్టులు బలహీనపడ్డారంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ వచ్చింది.

కానీ, తాజా ఘటన ఈ ప్రకటనలపై సందేహాలు లేవనెత్తుతోంది. మావోయిస్టులు కొంత ప్రాంతానికి పరిమితమై ఉన్నారని, ప్రస్తుతం అస్తిత్వం కోసం పోరాడుతున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. కానీ, ఇది నిజమేనా?

గత నెలలో బస్తర్‌లోని ఈ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఘటనలను పరిశీలిద్దాం....

మార్చి 26: బీజాపుర్‌లో మావోయిస్టులు జిల్లా పంచాయత్ సభ్యుడు బుఘ్‌రామ్ కశ్యప్‌ను హత్య చేశారు.

మార్చి 25: కోండాగావ్ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వాహనాలకు నిప్పు పెట్టారు.

మార్చి 23: నారాయణ్‌పుర్ జిల్లాలో భద్రతాదళాలు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేయగా, ఐదుగురు జవాన్లు మరణించారు.

మార్చి 20: దంతెవాడ దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను చంపినట్లు పోలీసులు ప్రకటించారు. అదే రోజు బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు ఒక జవానును హత్య చేశారు.

మార్చి 13: బీజాపూర్‌లో సునీల్ పదేం అనే మావోయిస్టు ఐఈడీ పేలుడు ఘటనలో చనిపోయారు.

మార్చి 5: నారాయణ్‌పుర్‌లో ఐటీబీపీ జవాను ఒకరు ఐఈడీ పేలుడులో మరణించారు.

మార్చి 4: సీఐఎస్‌ఎఫ్‌ 22వ బెటాలియన్ చీఫ్ కానిస్టేబుల్ లక్ష్మీకాంత్‌ ద్వివేది దంతెవాడలోని ఫుర్నార్‌లో ఐఈడీ పేలుడులో మరణించారు. దీనిని మావోయిస్టులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు.

''మావోయిస్టులు వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. వాళ్లు బలహీనపడినట్లు కనిపించడం లేదు. మావోయిజాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర ఏ వ్యూహమూ లేదు. మావోయిస్టులు పెద్ద దాడి చేసిన ప్రతిసారీ జవాన్ల త్యాగాలు వృథా పోవని ప్రకటనలు మాత్రం వస్తాయి. ప్రభుత్వం ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వారి దగ్గర ఏదైనా విధానం ఉంటే కదా...అమల్లో పెట్టడానికి'' అని ఛత్తీస్‌గఢ్ హోంశాఖ మాజీ కార్యదర్శి బీకేఎస్ రే అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, ANI

నక్సల్స్‌ను ఎదుర్కొనే విధానమేదీ?

2018లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 'ప్రజా మేనిఫెస్టో'ను విడుదల చేసింది.

2013లో ఝీరం లోయలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన కాంగ్రెస్ నాయకులకు దీన్ని అంకితం చేశారు

ఈ మేనిఫెస్టోలో 22వ అంశంగా...''నక్సల్ సమస్య పరిష్కరానికి ఓ విధానం రూపొందిస్తాం. చర్చలకు గట్టి ప్రయత్నాలు చేస్తాం" అని ఉంది.

నక్సల్ ప్రభావిత పంచాయతీలన్నింటికీ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.కోటి చొప్పున కేటాయిస్తాం. అభివృద్ధి ద్వారా వారిని జనజీవన స్రవంతిలో కలుపుతాం'' అని ఉంది.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. 15 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. భూపేశ్ బఘేల్ సీఎం అయ్యారు.

ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాత్రే ఈ మేనిఫెస్టోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. క్యాబినెట్‌ మొదటి సమావేశంలో మూడు నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఒకటి ఝీరం లోయ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం.

2013 మే 25న బస్తర్‌లోని ఝీరం లోయ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన దాడిలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు సహా 29 మంది మరణించారు.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండున్నరేళ్లు గడుస్తున్నా, ఝీరం లోయ ఘటనపై విచారణ అంశం ఇంకా కోర్టుల్లోనే ఉంది. నక్సల్ సమస్య పరిష్కారానికి సంబంధించిన విధానం గురించి ఊసే లేదు.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, GANESH MISHRA BASTAR IMPACT

ఫొటో క్యాప్షన్, బస్తర్‌లోని సంఘటన జరిగిన ప్రాంతం

మావోయిస్టులతో చర్చల ప్రయత్నాల కోసం ఎలాంటి బ్లూప్రింట్‌నూ ఇంత వరకూ ప్రభుత్వం వెల్లడించలేదు. అసలు మావోయిస్టులతో చర్చలు జరుపుతామని తాను ఎప్పుడూ చెప్పలేదని, బాధితులతోనే చర్చలు జరుపుతామని అన్నానని సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు.

''పదిహేనేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. మన పోలీసులు మావోయిస్టులతో పోరాడుతున్నారు. మా ప్రభుత్వం బస్తర్‌లో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది'' అని కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ శైలేశ్‌ నితిన్ త్రివేది అన్నారు.

''ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం వంటి రంగాలు మెరుగుపరుస్తున్నాం. దేశంలో అటవీ ఉత్పత్తుల్లో 75 శాతం కొనుగోళ్లు మా రాష్ట్రంలోనే జరిగాయి. ఆదివాసీల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. అభివృద్ధి ద్వారా మావోయిజాన్ని అంతం చేయొచ్చన్నది మా అభిప్రాయం. ఇదే మా విధానం కూడా'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, ALOK PUTUL / BBC

ఎటూతేలని ఆదివాసీల విడుదల అంశం

అయితే ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయవాది రజనీ సోరెన్ మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు.

కొత్త ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని, కానీ ప్రభుత్వం ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రజనీ సోరెన్ అన్నారు. జైళ్లలో మగ్గుతున్న ఆదివాసీల విడుదల కోసం ఏర్పాటైన జస్టిస్ పట్నాయక్ కమిటీని దీనికి ఉదాహరణగా ఆమె చూపించారు.

దీర్ఘకాలంగా రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న నిర్దోషులైన ఆదివాసీల విడుదల కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పట్నాయక్ అధ్యక్షతన 2019లో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది.

4,007 మంది ఆదివాసీల విడుదల కోసం పట్నాయక్ కమిటి మూడు అంశాలను సూచించింది.

కానీ ఈ కమిటీ మొదటి సమావేశంలో 313, రెండవ సమావేశంలో 91, మూడవ సమావేశంలో 197 కేసులు మాత్రమే చర్చకు వచ్చాయి. వీటిలో ఎక్కువ మద్యానికి సంబంధించినవి కాగా, మరికొన్ని జూదం, గొడవలకు సంబంధించినవి.

"బస్తర్‌లో కూడా కొన్ని సమావేశాలు జరిగాయి, కానీ గత రెండేళ్లలో, గిరిజనులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు" అని రజనీ సోరెన్ అన్నారు.

చట్టాలను ఉల్లంఘిస్తూ బస్తర్ ప్రాంతంలో క్యాంప్‌లు నిర్వహిస్తున్నారని, ఈ అంశంపై గిరిజనులు చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు కూడా జరిపారని, కానీ వారి గొంతు ఎవరికీ వినిపించ లేదని రజనీ సోరెన్‌ అన్నారు.

దంతెవాడలోని పొటాలి క్యాంప్‌కు సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

"ప్రతి నిరసన మావోయిస్టుల కోసం జరిపే నిరసనగా కొట్టిపారేయలేము. బస్తర్‌లోని గిరిజనుల మీద నకిలీ ఎన్‌కౌంటర్లు, అత్యాచారాలు, ఇళ్లు తగలబెట్టడం వంటి అనేక కేసులపై దర్యాప్తు జరిగాయి.

కోర్టుల నుంచి, మానవ హక్కుల కమిషన్, ట్రైబల్‌ కమిషన్‌ల వరకు అనేక సంస్థలు ఈ వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిహారం ఇవ్వాలని తేల్చి చెప్పాయి. భద్రతా దళాల మీద స్థానికులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ప్రభుత్వం తెలుసుకోకపోతే ఇంకా ఎవరు తెలుసుకుంటారు" అని రజనీ ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌

ఫొటో సోర్స్, CG KHABAR

ఫొటో క్యాప్షన్, ఏఎస్‌ఐ దీపక్‌ భరద్వాజ్‌ ఎదురుకాల్పుల్లో మరణించారు.

శాంతి ఎలా సాధ్యం?

గత 40 సంవత్సరాలుగా బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ 3200కు పైగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. హోంశాఖ నివేదిక ప్రకారం జనవరి 2001 నుంచి 2019 మే వరకు మావోయిస్టు హింసలో 1002 మావోయిస్టులు, 1234 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

మావోయిస్టుల హింసకు 1782 మంది సాధారణ పౌరులు కూడా బలయ్యారు. అదే సమయంలో 3896 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2020-21 నాటి గణాంకాల ప్రకారం నవంబర్ 30 వరకు రాష్ట్రంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మరణించగా, 270 లొంగిపోయారు.

మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల మధ్య అప్పుడప్పుడు శాంతి చర్చల మాట వినిపిస్తుంది. కానీ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోరు.

బస్తర్‌ నుంచి భద్రతా దళాలను వెనక్కి పిలవాలని, మావోయిస్టు నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నెలలో కూడా మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు.

కానీ వారి డిమాండ్లను నెరవేర్చలేమని, ముందు మావోయిస్టులు తుపాకులను వదలాలని, తర్వాతే చర్చల గురించి మాట్లాడాలంటూ ఈ డిమాండ్‌లను ప్రభుత్వం తిరస్కరించింది.

అయితే ఆయుధాలను వదులుకోవడాన్ని మావోయిస్టులు ఏమాత్రం ఇష్టపడరని బస్తర్‌లో గిరిజన హక్కుల కోసం పని చేసే న్యాయవాది ప్రియాంక శుక్లా అన్నారు.

"మావోయిస్టులు లొంగిపోతే వారిని భద్రతా దళాలలో చేర్చుకుని తిరిగి వారిని ఇక్కడికే యుద్ధానికి తీసుకువస్తారు. వారిలో వారే పోరాడుకునేలా చేస్తారు. చివరకు ఇందులో నష్టపోయేది గిరిజనులే" అని ప్రియాంక శుక్లా అన్నారు.

ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి తామ్రధ్వజ్ సాహు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ డీఎం అవస్థీని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు.

ఇక ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ మాత్రం ఈ దాడి ప్రభుత్వ వైఫల్యమని వ్యాఖ్యానించారు.

పోలీసుల మృతిని రాజకీయం చేయడానికి రమణ్‌ సింగ్‌ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఇంఛార్జ్‌ శైలేశ్‌ నితిన్‌ త్రివేది అభిప్రాయపడ్డారు.

"15 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో ప్రజలు మరిచిపోలేదు. బస్తర్‌లోని మూడు బ్లాకులకు మాత్రమే పరిమితమైన మావోయిజం ఇప్పుడు 14 జిల్లాలకు వ్యాపించింది. రమణ్‌ సింగ్‌, అమిత్‌ షా ఈ రోజు అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా లేదా ?" అని శైలేశ్‌ ప్రశ్నించారు.

రాజకీయాల్లో చాలాసార్లు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఉంటుంది.

కానీ మావోయిస్టుల హింస అనే ప్రశ్న అలాగే ఉంది. దీనికి సమాధానం కనుక్కోవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)