ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా? :డిజిహబ్

ఆత్మహత్యలను అడ్డుకోవచ్చా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

(సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం)

ఒక విమానం కూలిపోయినప్పుడో, ఎక్కడైనా బాంబులు పేలడం వల్ల వార్తల్లో మృతుల సంఖ్య కనిపించగానే మనం అయ్యో అని బాధపడతాం.

కానీ, ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి మాట్లాడ్డానికే సంకోచిస్తాం.

ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) రిపోర్టు ప్రకారం ఒక్క 2019లోనే దాదాపు లక్షా నలభై వేల మంది భారతీయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే సగటున రోజుకు 381 మంది ప్రాణాలు తీసుకున్నారు.

మన చుట్టుపక్కలో, మనకి తెలిసినవారో, మనవారో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసినా దానిపై మాట్లాడ్డానికి, ఆలోచించడానికి ఒక సమాజంగా మనం ఇంకా సుముఖంగా లేమని నాకు అనిపిస్తుంటుంది.

ఆత్మహత్యలకు పాల్పడకుండా అవగాహన పెంపొందించడానికే ప్రతీ ఏడాది సెప్టంబర్ 10న "వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే" జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఈ వారం డిజీహబ్ సిరీస్‌లో ఆత్మహత్యకు ప్రేరేపించే ధోరణులు పసిగట్టడం, వాటిని అడ్డుకోవడంలో టెక్నాలజీ పాత్ర గురించి మాట్లాడుకుందాం.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆత్మహత్యల నివారణలో సాయపడే అంశాలు

ఆత్మహత్య చేసుకోవాలనో, తమకు తాము హాని చేసుకోవాలనో (self-harm) అనిపించేవారికి టెక్నాలజీ ఇప్పటికే కొంత సాయం చేస్తోంది.

సూసైడ్ హాట్లైన్లు 24 గంటలూ పనిజేస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజన్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అనే అంశం గురించి ఏదైనా సెర్చ్ చేయగానే ముందు ఆయా దేశాల హాట్లైన్ నెంబర్లు చూపిస్తుంది.

అలాగే, ఆత్మహత్యలపై అవగాహన పెంపొందించే ప్రచారాలు, ఈమెయిల్, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి చేరగలుగుతున్నాయి.

ఆ తొలి అడుగులు దాటుకుని టెక్నాలజీని మరింతగా ఉపయోగించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి ఎదురవుతున్న కొన్ని ముఖ్యమైన అడ్డంకులని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.

1. సూసైడ్ రిస్క్ ఉందని గ్రహించడంలో అలక్ష్యం/ఆలస్యం

ఏవైనా తీవ్రమైన మానసిక వ్యాధులు, కుటుంబంలో ఆత్మహత్యల చరిత్ర, ఇంతకు ముందు ఆత్మహత్యాయత్నం చేసినవారికి ఈ ప్రమాదం పొంచి ఉంటుందనేది తెలిసిందే.

కానీ, మారుతున్న కాలంతో పాటు ఒత్తిళ్ళు కూడా ఎక్కువై, వేరే కొత్తవో, ఇప్పటికీ కనిపెట్టలేని కారణాలో ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి.

ముఖ్యంగా సోషల్ మీడియా ఉపయోగించే టీనేజర్స్ బాధితులవుతున్నారు. అందుకని సూసైడ్ రిస్క్ గురించి గుర్తించడం అత్యంత కీలకం.

ఆత్మహత్యలను అడ్డుకోవచ్చా

2. భద్రతకి అనుకూల వాతావరణం లేకపోవడం

ఆత్మహత్యాయత్నానికి దారితీసే కొన్ని ఉంటాయి: పదునైన పరికరాలు, విష పదార్థాలు, మత్తు మందులు అందుబాటులో ఉండడం, గదిలోనో ఎత్తైన మేడలపైనో ఒంటరిగా ఉండడం లాంటివి.

సూసైడ్ ఆలోచనలు తీవ్ర రూపం దాల్చాక కూడా అవేవీ అందుబాటులో లేకపోతే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.

3. సరైన సపోర్ట్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం

తమ సమస్యలనుంచి తప్పించుకోడానికి మరణం తప్ప మరో మార్గం లేదనుకుని, దిక్కుతోచని పరిస్థితుల్లో, లేదా తమ వల్ల ఇతరులకి(ముఖ్యంగా కుటుంబ సభ్యులకి) ఇబ్బంది కలుగుతుందనో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

సమస్యల నుంచి బయటపడే మార్గం ఉందని తెలియజేసి, మంచి కౌన్సిలింగ్‌తో పాటు సామాజికంగా కూడా వారికి ఆసరాగా ఉండగలిగితే ఈ ఆత్మహత్యలని నివారించవచ్చు.

అయితే, ఆ విపరీత ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు వెంటనే ఎవరో ఒకరు అందుబాటులో ఉండడం అనేది ఎల్లప్పుడూ సాధ్యపడే విషయం కాదు.

ఈ మూడు కేటగరీల్లో మొదటిది అయిన సూసైడ్ రిస్క్ గ్రహించడానికి టెక్నాలజీ ఉపయోగాన్నికొంచెం ఎక్కువగా పరిశోధిస్తున్నారు.

మిగతా రెండు కేటగారీల్లో పరిసరాలు, మనుషులపై ఆధారపడాలి కాబట్టి టెక్ పాత్ర కొంచెంగానే ఉంటోంది.

ఆత్మహత్యలను అడ్డుకోవచ్చా

ఫొటో సోర్స్, Getty Images

ఆత్మహత్యా ఆలోచనలని, ప్రవర్తనని పసిగట్టడానికి టెక్

సామాజిక బంధాలకు దూరమవ్వడానికి స్మార్ట్ ఫోన్ల ద్వారా పసిగట్టడంలో టెక్నాలజీ సాయపడుతుంది. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఒంటరిగా ఉండడం అనేవి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు.

అంటే, ఒక మనిషి మిగతావారితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది పరిశీలించగలిగితే ఆత్మహత్య అవకాశాలు కనుగొనవచ్చు.

దీని ఆధారంగా కొందరు పరిశోధకులు ఒక మొబైల్ యాప్ కనుగొన్నారు. ఇది నిర్ధారిత సమయానికి చుట్టుపక్కల ఉన్న డివైజ్‌లను బ్లూటూత్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని సర్వర్‌కు చేరవేస్తుంది.

అలా చేరవేసిన సమాచారాన్ని అనలైజ్ చేయడం ద్వారా ఒక మనిషి మిగతావారితో కలిసుండే తీరులో మార్పులు వస్తే అది తెలుస్తుంది.

అంటే, ఆన్‌లైన్ సోషల్ యాక్టివిటీని ఫాలో అయినట్లే ఆఫ్లైన్ సోషలైజింగ్‌ను కూడా పరిశీలించి, అనలైజ్ చేసి, తేడా ఉందనిపిస్తే అది హెచ్చరిస్తుంది.

వ్యక్తులు తమంతట తాము ఎలాంటి డేటా ఎంట్రీ చేయనవసరం లేకుండా, ఏ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ యాప్స్ వాటంతట అవే పనిజేస్తాయి. కాబట్టి యూజర్స్ మీద కూడా ఒత్తిడి ఉండదు.

ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఉన్న ఇలాంటి యాప్స్ భవిష్యత్తులో ఆత్మహత్యాయత్నం చేసేలోపు కనిపెట్టి సాయం అందించే అవకాశాలు పెంచవచ్చు.

సోషల్ మీడియాలో స్టేటస్‌ల విశ్లేషణ

ప్రస్తుతం అందరికీ ఆఫ్లైన్ జీవితం కంటే, ఆన్లైన్ జీవితమే ఎక్కువైపోతోంది. అందరూ మనవాళ్ళేనన్న భావన కలిగిస్తున్న సోషల్ మీడియా, అంతే ఒంటరితానానికీ గురిజేస్తోంది.

చుట్టూ ఉన్న మనుషులతో పంచుకోలేని భావాలను ఫేక్ ఐడి పెట్టుకుని ఆన్లైన్లో ఉన్న అపరిచితులతో పంచుకునే వాళ్ళూ ఉంటారు.

అందుకే, సోషల్ మీడియా అనాలిసిస్ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయింది. మరి కొన్నాళ్ళకు ఇది అనివార్యం కూడా కావచ్చు.

ట్విటర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఆత్మహత్యలను సూచించే ఆలోచనలు, మాటలని పసిగట్టడానికి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వాడడానికి ప్రయత్నిస్తున్నాయి.

యూజర్స్ రాసే పోస్టులు, వాటికి వచ్చే కామెంట్స్ తీసుకుని వాటిని ముందే మాన్యువల్‌గా "లేబుల్" చేస్తారు.

ఉదాహరణకు, ఒక మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ మోడల్ కేటగిరీలు ఇలా ఉండచ్చు:

  • ప్రమాదం పొంచి ఉంది
  • పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ, ఏదో తేడా అయితే ఉంది
  • అంతా బాగానే ఉంది

ఈ డేటాని, లేబుల్స్‌తో సహా మెషిన్ లెర్నింగ్ మోడల్కి(Natural Language Processing) అప్పజెప్పితే అది ఆ డేటానంతా క్రంచ్ చేసుకుంటుంది, ఏ కాటగిరినీ ఎలా గుర్తుపట్టాలో నేర్చుకుంటుంది.

ఆ పైన కొత్త ట్వీట్ లేదా పోస్ట్ దానికి ఇస్తే, అవి ఏ కేటగరీకి సంబంధించిన పోస్టు అనేది చూచాయిగా చెప్పగలుగుతుంది.

ఖచ్చితంగా చెప్పలేదు. ఒక అంచనా మాత్రమే. ఆ అంచనాల్లో కూడా పొరపాట్లు, తప్పులు ఉండే అవకాశాలే మెండు.

ఎందుకంటే, మనం భాష వాడే తీరుతెన్నులు మనుషులనే తికమకకు గురిచేస్తుంటాయి. అలాంటిది మెషిన్ పట్టుకోవడం కష్టమే.

పైగా సున్నితమైన మానసిక భావోద్వేగాలని పట్టుకోవడం ఇంకా కష్టం. ఎంత ఎక్కువ డేటా ఇచ్చి, ఎంత జాగ్రత్తగా శిక్షణ ఇస్తే, అంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఇలా మెషిన్ సాయంతో పాటూ, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌లో మనకి ఏదైనా పోస్ట్ అనుమానం కలిగించేలా ఉంటే, దాని మీద క్లిక్ చేసి "ఈ మనిషి తనకు హాని చేసుకుంటారనిపిస్తోంది" అని రిపోర్ట్ చేసే అవకాశం ఇస్తున్నాయి.

ఆత్మహత్యలను అడ్డుకోవచ్చా

ఫొటో సోర్స్, Getty Images

ముఖకవళికలు, గొంతును కంప్యూటర్‌తో విశ్లేషించడం

ఆత్మహత్యా ఆలోచనలు పసిగట్టడానికి సైక్రియాట్రిస్టులు, థెరపిస్టులు ఎంఎస్ఈ (Mental State Examination) అనే పరీక్ష నిర్వహిస్తారు.

ఇందులో ముఖకవళికలు, గొంతులో మార్పులు, మాటలు వాడే తీరు అన్నీ పరీక్షిస్తారు. ఇప్పుడు వీటికి టెక్నాలజి వాడడం వల్ల మానవ మేధ కనిపెట్టలేని తేడాలని పసిగట్టే వీలుందా (ఉదా: ఆత్మహత్యా ఆలోచనలు ఉన్నవాళ్ళ మాట్లాడే మాటల ఫ్రీక్వెన్సీలో మార్పులు కనిపిస్తాయా?) అనే పరిశోధనలు జరుపుతున్నారు.

ఆత్మహత్య ఆలోచనలని థెరపీలో కూడా బయటపెట్టని వారు (బయటపెడితే తిడతారనో, శిక్షిస్తారనో భయం ఉండచ్చు), బయట పెట్టలేనివారు (చిన్నపిల్లలు, సరిగా వ్యక్తం చేయలేనివారు) విషయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా.

ఆత్మహత్యలను అడ్డుకోవచ్చా

వర్చువల్ రియాలిటీతో కౌన్సిలింగ్

ఇది ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న టెక్నాలజీ. వర్చువల్ రియాల్టీలో సాఫ్ట్‌వేర్ ద్వారా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, మనం అక్కడ ఉన్నామనే భ్రమ కలిగిస్తారు.

ఆత్మహత్య ఆలోచనలు వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేటప్పుడు, ఈ కృత్రిమ వాతావరణంలో ఉంచి, థెరపిస్ట్ పర్యవేక్షణలో, వాళ్ళు ఆత్మహత్య కోసం వేసుకున్న ప్లాన్స్ అమలు చేసేలా ప్రోత్సహిస్తుంటారు.

అలా చేయడం వల్ల నిజంగా ప్రాణహాని తలపెట్టాలనేంత ఆవేశం కలిగి, అది చల్లారాక, వివేచన మొదలై వాళ్ళు పాజిటివ్గా ఆలోచించగలరని పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే, ఇది చాలా కొత్త టెక్నాలజి. థెరపీకోసం ఇలాంటివి వాడడం వల్ల కలిగే లాభనష్టాలపై ఇంకా క్షుణ్ణంగా పరిశోధన చేయాల్సి ఉంది.

రెండు వైపులా పదునున్న టెక్నాలజీ

ఒక పక్క "బ్లూ వేల్ ఛాలెంజ్" లాంటి గేమ్స్ ఒక్కో లెవల్లో ఒక్కో విధంగా హాని కలిగించుకోడానికి ప్రేరేపించి, చివరికి ప్రాణాలు తీసుకునేలా, సామూహిక ఆత్మహత్యలకు పాల్పడేలా చేసింది కూడా టెక్నాలజీనే.

మరోవైపు అసలే తక్కువ సంఖ్యలో ఉన్న మానసిక వైద్య నిపుణులకి ఆసరాగా, జటిలమైన కేసులు పరిష్కరించి, ప్రాణాలు కాపాడ్డానికి సాయం చేసేది కూడా టెక్నాలజీనే.

సూసైడ్ లాంటి సున్నితమైన, సంక్లిష్టమైన విషయంలో టెక్నాలజీని వాడడం కత్తి మీద సాములాంటిది.

పైన ప్రస్తావించిన టెక్నాలజీలని వాడడంలో నైతిక సమస్యలు తలెత్తుతాయి.

టెక్నాలజీ పదునైన కత్తి

ఫొటో సోర్స్, Getty Images

అసలే ప్రైవసీ గురించి ఆందోళనలు ఎక్కువవుతున్న తరుణంలో ప్రతి కదలికనీ, ప్రతి మాటనీ అనలైజ్ చేయడంలో వ్యక్తిగత సమాచారం (private info) ఎంత బయటపడుతుంది, ఎవరికి అందుబాటులో ఉంటుంది అనేది ప్రధాన ప్రశ్నగా మారుతుంది.

మెషీన్ లెర్నింగ్ మోడల్ వాడి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం ఉన్న వారి సన్నిహితులను అలర్ట్ చేయచ్చు. అలాగే వారికి రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలకు కూడా చెప్పవచ్చు.

అసలే ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి "మీరు ఆత్మహత్య చేసుకునే రిస్క్ ఉంది. అందుకే మీకు రుణం రిజెక్ట్ చేస్తున్నాం" అని వారు అంటే, మొదటికే మోసం వస్తుంది.

వర్చువల్ రియాలిటీ వాడిన థెరపీలు ఎంత సమర్థవంతంగా పనిజేయగలవో, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇంకా కచ్చితంగా తెలీదు.

వర్చువల్గానే అయినా వాళ్ళు మరణానికి చాలా దగ్గరగా వెళ్తారు, చావుకి సంబంధించిన దృశ్యాలు వారి మనసులో ఉండిపోవచ్చు. ఇలాంటివన్నీ క్షుణ్ణంగా స్టడీ చేస్తే గానీ వాడుకలోకి తీసుకురాలేం. అది ప్రమాదకరం. ప్రాణాంతకం.

చుట్టూ ఉన్నవారికి ఆత్మహత్యల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ ఆలోచనలున్న వారిపై, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబ సభ్యులపై విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది.

ఒక అవగాహన ఏర్పడకముందే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణకి, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం సోషల్ మీడియా వల్ల ఆత్మహత్యల గురించి, మానసిక ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చించే అవకాశం ఏర్పడింది.

కానీ అవగాహనా లోపం వల్ల ఆ చర్చ అన్ని రకాలుగా తప్పుదోవ పట్టింది.

టెక్నాలజీతో మనకున్న సమస్యలని పరిష్కరించడం ఒక ఎత్తు అయితే, ఆ పరిష్కారాలతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవడం మరో ఎత్తు అనేది గుర్తుంచుకోవాలి.

మానవతా దృక్పథం, టెక్నాలజీ ఆవిష్కరణలు కలిసి ప్రయాణించినప్పుడే ఆత్మహత్యల్లాంటి జటిలమైన ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది.

(ఈ కథనం టెక్నాలజీ మీద అవగాహన కోసం మాత్రమే. ఇందులో రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)