పీఎఫ్ఏఎస్-టెఫ్లాన్: ఈ నాన్-స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?

నాన్ స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ప్రమాదకరం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రిస్టీన్ రో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వస్తువులను ఒకసారి గమనించండి. వంటింట్లో మూకుడుకు కూర ఎందుకు అంటుకోవట్లేదు. ఎక్కువ నూనె వేయకుండానే అట్లు పెనానికి అంటుకోకుండా ఎలా వస్తున్నాయి?

కాగితం సంచీలో కొన్ని మొక్కజొన్న గింజలు, కాస్త నూనె లేదా బటర్ వేసి మైక్రోవేవ్‌లో పెట్టి చూడండి. చక్కటి పాప్‌కార్న్ తయారైపోతుంది. సంచీ నుంచి ఒక్క చుక్క నూనె కూడా బయటకు కారదు. ఇదెలా సాధ్యం?

వర్షాకాలంలో మనం వేసుకునే రెయిన్ కోట్లు నీటిని ఎందుకు పీల్చుకోవు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా?

మనిషి సృష్టించిన సింథటిక్ రసాయనాలే వీటన్నింటికీ కారణం.

వీటిని 'పెర్- అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ సబ్‌స్టాన్సస్' (పీఎఫ్ఏఎస్) అంటారు.

ఇప్పుడు ఈ రసాయనాలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని చోట్ల వీటిని నిషేధించారు కూడా.

పీఎఫ్ఏఎస్ సమూహం కిందకు వచ్చే పదార్థాలు అనేకం ఉన్నాయి. సుమారు 4,700 పైగా ఈ ఫ్లోరిన్ ఆధారిత సమ్మేళనాలు అందుబాటులో ఉన్నాయి.

వీటి రసాయన గుణాలు ఎప్పటికీ మారవు. అందుకే వీటిని "శాశ్వత రసాయనాలు" (ఫర్ఎవర్ కెమికల్స్) అంటారు.

తాగే నీటిలో, దుమ్ము, ధూళిలో, మనుషుల రక్తంలో కూడా ఇవి కలిసిపోయాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మన ఇళ్లలో, మన రక్తంలో కూడా పీఎఫ్ఏఎస్ రసాయనాలు చేరిపోయాయి.

2019లో వచ్చిన డార్క్ వాటర్స్ అనే హాలీవుడ్ సినిమాలో చూపించినట్లు, పెర్- అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్థాలను అధికంగా ఉపయోగించే లేదా పారేసే ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చవచ్చు.

ఈ రసాయనాలు ఏయే వస్తువుల్లో ఉన్నాయో తెలుసుకుంటే తల తిరిగిపోతుంది. ఆహార పదార్థాల ప్యాకెట్లు, సౌందర్య సాధనాలు, ఫర్నీచర్‌తో సహా ఇవి అన్నింటా నిక్షిప్తమై ఉన్నాయి.

వీటి వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల క్యాన్సర్, పుట్టుకతో వచ్చే జన్యులోపాలు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

డార్క్ వాటర్స్‌ నటుడు మార్క్ రుఫాలో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్క్ రుఫాలో నటించిన డార్క్ వాటర్స్‌ కథ పీఎఫ్ఏఎస్ చుట్టూ తిరుగుతుంది

పీఎఫ్ఏఎస్ వాడకాన్ని ఎలా నిరోధించాలి?

పీఎఫ్ఏఎస్ ఉన్న వస్తువులను నిషేధించాలని వినియోగదారుల వైపు నుంచి ఒత్తిడి వస్తే చాలదని నిపుణులు అంటున్నారు.

చాలామంది వినియోగదారులకు ఏ వస్తువుల్లో ఈ రసాయనాలు ఉన్నాయో కనిపెట్టడం కష్టం అవుతోంది.

వాటి మీద ఉన్న లేబుల్స్ చదివి, ఆ సమ్మేళనాల పేర్లను అర్థం చేసుకోవడం సగటు వినియోగదారులకు అసాధ్యం అని జోనాటన్ క్లైమార్క్ అంటున్నారు.

రసాయనాల సురక్షిత వినియోగాన్ని ప్రోత్సహించే స్వీడిష్ సంస్థ 'కెమ్‌సెక్‌'లో సీనియర్ కెమికల్ అండ్ బిజినెస్ అడ్వైజర్‌గా క్లైమార్క్ వ్యవహరిస్తున్నారు.

"సాధారణ వినియోగదారులకు ఇది చాలా క్లిష్టమైన విషయం. దీని గురించి ఎక్కడా, ఎవరూ బోధించరు. కావాల్సినంత సమాచారం కూడా అందుబాటులో ఉండదు."

వివిధ వస్తువుల ఉత్పత్తిదారులకు ఫోన్ చేసి లేదా ఉత్తరం రాసి వారి ఉత్పత్తుల్లో పీఎఫ్ఏఎస్ ఉన్నాయో, లేదో కనుక్కునేంత సమయం, ఓపిక కూడా ఎవరికీ ఉండదు. అలా చేయమని కొన్ని ప్రభుత్వ సంస్థలు సలహా ఇస్తున్నాయి. కానీ, సగటు వినియోగదారుడికి అది సాధ్యం కాదు.

తమ ఉత్పత్తులలో పీఎఫ్ఏఎస్ వాడుతున్నట్లు కొంతమంది తయారీదారులకు కూడా తెలియకపోవచ్చు.

"ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. వీటిపై నిబంధనలను వ్యవస్థీకృతం చేయాలి. అప్పుడే కంపెనీలు దారికొస్తాయి.

పీఎఫ్ఏఎస్‌పై నిబంధనలు అనే విషయం చర్చకు వస్తే చాలు, కంపెనీలు ఆలోచించడం మొదలుపెడతాయి. సమస్య తీవ్రతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. దీనికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాయి" అని క్లైమార్క్ అన్నారు.

ఇప్పటివరకూ ఈ రసాయనాలపై ఉన్న పరిమితులు చాలా తక్కువ.

పీఎఫ్ఏఎస్ లేని పాన్‌లు తయారు చేస్తున్న గ్రీన్ పాన్

ఫొటో సోర్స్, CHRISTINE RO

ఫొటో క్యాప్షన్, పీఎఫ్ఏఎస్ లేని పాన్‌లు తయారు చేస్తున్న గ్రీన్ పాన్

2030 నుంచి పీఎఫ్ఏఎస్ ఉన్న ఉత్పత్తులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అమెరికాలోని మెయిన్ రాష్ట్రం జూలైలో ప్రకటించింది. ఈ రసాయనాలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన తొలి ప్రభుత్వం ఇదే.

అయితే, కొన్ని వైద్య ఉత్పత్తుల్లో పీఎఫ్ఏఎస్ వాడడం అనివార్యం. అలాంటివాటిల్లో వీటిని ఉపయోగించవచ్చని మినహాయింపు ఇచ్చింది.

కాగా, కొన్ని రకాల పీఎఫ్ఏఎస్ వినియోగంపై యూరోపియన్ యూనియన్ దేశాల్లో పరిమితులు ఉన్నాయి.

పీఎఫ్ఏఎస్ సమూహం కిందకు వచ్చే అన్ని పదార్థాల వినియోగంపై నిబంధనలు విధించాలని పర్యావరణ పరిరక్షకులు, కొన్ని యూరోపియన్ ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి.

అంతే కాకుండా, వీటికి ప్రత్యామ్నాయాలుగా వాడే పదార్థాల గురించి కూడా తయారీదారులు పూర్తి సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు.

ఎందుకంటే ప్రత్యామ్నాయాలుగా మరింత ప్రమాదకరమైన పదార్థాలను వాడే అవకాశం ఉందని వారు అంటున్నారు.

"వచ్చే అయిదారేళ్లల్లో పరిస్థితి మెరుగుపడవచ్చు. ఈ పదార్థాలపై కొన్ని నిబంధనలైనా వస్తాయనే అనుకుంటున్నాను" అని క్లైమార్క్ అన్నారు.

పీఎఫ్ఏఎస్ నుంచి దూరం జరగడానికి, ప్రత్యామ్నాయాలను వాడడానికి మరికొన్ని సలహాలు, మార్గదర్శకాలు అవసరమని రసాయన పరిశ్రమ సభ్యులు కోరుతున్నారు.

అలాగే, పీఎఫ్ఏఎస్ రసాయనాలను తప్పనిసరిగా వేటిల్లో వాడొచ్చో కూడా చెప్పాలని, దీని గురించి మరింత సమాచారం అందించాలని 'సెఫిక్' (ది యూరోపియన్ కెమికన్ ఇండస్ట్రీ కౌన్సిల్) కోరుతోంది.

ఐకియా తన మొత్తం ఫర్నీచర్ నుంచి పీఎఫ్ఏఎస్ తొలగించింది

ఫొటో సోర్స్, Ikea

ఫొటో క్యాప్షన్, ఐకియా తన మొత్తం ఫర్నీచర్ నుంచి పీఎఫ్ఏఎస్ తొలగించింది

ప్రత్యామ్నాయాల అన్వేషణ

కొన్ని పరిశ్రమల్లో ఈ రసాయనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడం సులువే. ఉదాహరణకు, వస్త్ర పరిశ్రమ.

"ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ముందంజలో ఉంది" అని క్లైమార్క్ తెలిపారు.

అయితే, కొన్ని సంస్థలు, పీఎఫ్ఏఎస్ రసాయనాలకు బదులు ప్లాస్టిక్ ఆధారిత వస్త్రాల తయారీవైపు మొగ్గుచూపుతున్నాయి. ఇవి ఆరోగ్య సమస్యలను తగ్గించినా, పర్యావరణానికి హానికరంగా పరిణమిస్తాయి.

కాగా, ప్రత్యామ్నాయాలను అన్వేషించే దిశలో స్వీడన్‌కు చెందిన 'ఆర్గానోక్లిక్' సంస్థ ముందడుగు వేసింది. వాటర్ ప్రూఫ్ వస్తాలను తయారుచేయడానికి ఉపయోగించే 'పీటీఎఫ్ఈ' (పీఎఫ్ఏఎస్ సమూహంలో ఒక పదార్థం)కు ప్రత్యామ్నాయంగా 'ఆర్గానోటెక్స్' అనే పదార్ధాన్ని కనిపెట్టింది.

పీటీఎఫ్ఈనే 'టెఫ్లాన్' అంటారు. దీనికి నీటి వికర్షక శక్తి ఉంటుంది. ఫలితంగా దుస్తులు నీటిని పీల్చుకోకుండా అడ్డుతుంది.

పీటీఎఫ్ఈకి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.

దీన్ని నాన్-స్టిక్ వంటపాత్రల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అధిక వేడిని తట్టుకోగలదు. తక్కువ రాపిడి కలిగి ఉంటుంది.

పీటీఎఫ్ఈ ఎంత ఉపయోగకరం అంటే 1960ల నుంచి నాసా కూడా వీటిని స్పేస్ సూట్లలో, హీట్ షీల్డులలో వాడడం మొదలుపెట్టింది.

రెయిన్ కోట్లు, వాటర్ ప్రూఫ్ జాకెట్ల తయారీకి పీటీఎఫ్ఈని ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆర్గానోక్లిక్ సీఈఓ మార్టెన్ హెల్బెర్గ్ అంటున్నారు.

ఆస్ట్రోనాట్లకు నీరు, చమురు, ఇతర పదార్థాలను వికర్షించే దుస్తులు అవసరం అవుతాయి. కానీ సాధారణ వినియోగదారులకు ఇది అంత అవసరం ఉండదన్నది ఆయన వాదన.

"వర్షంలో బయటకి వెళ్లడానికే తప్ప, మనకేమీ నూనె వర్షం పడదు కదా" అని హెల్బెర్గ్ అన్నారు.

ఆర్గానోక్లిక్ తయారుచేసిన ఆర్గానోటెక్స్, తామరాకు లక్షణాలను కలిగి ఉంటుంది. తామరాకుపై నీరు నిలవదు కదా. అదే గుణాన్ని ఇందులో ప్రవేశపెట్టారు.

"సహజంగా లభ్యమయ్యే నీటి వికర్షక అణువులను ఇందులో వాడాం. ఇవి సులభంగా భూమిలో కలిసిపోతాయి. సింథటిక్ రసాయనాల్లా కాదు" అని హెల్బెర్గ్ వివరించారు.

ఆర్గానోటెక్స్‌లో కొన్ని రకాల స్ప్రేలు, మైనం, డిటర్జెంట్లను వాడారు. ఇవి నీటిని త్యజిస్తాయి. వినియోగదారులకైతే 5-10 ఉతుకుల వరకూ కాసుకొంటాయి. పారిశ్రామిక ఉత్పత్తుల్లో 20 ఉతుకుల వరకూ కాసుకొంటాయి.

ఓర్గానోటెక్స్ తామరాకు లక్షణాలు కలిగుంటుంది

ఫొటో సోర్స్, ORGANOTEX

ఫొటో క్యాప్షన్, ఆర్గానోటెక్స్ తామరాకు లక్షణాలు కలిగుంటుంది

కాస్ట్-ఐరన్, స్టెయిన్‌లెస్ స్టీల్, పింగాణీ పాత్రలు ఉత్తమం

నాన్-స్టిక్ పాత్రల్లో పీటీఎఫ్ఈ వాడతారు. వాటిపై పీటీఎఫ్ఈ ఫ్రీ అని ఉంటే మాత్రం సురక్షితమే.

కాస్ట్-ఐరన్, స్టెయిన్‌లెస్ స్టీల్, పింగాణీ పాత్రలు ఖరీదు ఎక్కువైనా సురక్షితం. ఎక్కువకాలం మన్నుతాయి కూడా.

ఈ పాత్రలు వాడడం, టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రలంత సులభం కాకపోవచ్చు. మరీ అంత కష్టం కూడా కాదు. కాస్త అలవాటు పడాలంతే.

"అయినప్పటికీ, టెఫ్లాన్ ఉన్న నాన్-స్టిక్ పాత్రలు కాకుండా ఇతర రకాల పాత్రలు కొనేలా చేయడం దుర్లభం అయిపోతోంది" అని క్లైమార్క్ అంటున్నారు.

పీఎఫ్ఏఎస్ లేని వస్తువులను వాడడం కూడా నేర్చుకోవాలి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయాలను ప్రయత్నించాల్సిందే.

"కొన్ని విమానాశ్రయాలలో పీఎఫ్ఏఎస్ లేని వస్తువులను విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసినవారు బావున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదాహరణకు, లండన్ హీత్రో విమానాశ్రయంలో వీటిని వాడుతున్నారు" అని షారి ఫ్రాంజెవిక్ తెలిపారు.

వస్తువులకు పీఎఫ్ఏఎస్-ఫ్రీ సర్టిఫికెట్ ఇచ్చే గ్రీస్‌స్క్రీన్ సంస్థలో ఫ్రాంజెవిక్ ప్రోగ్రాం మేనేజర్‌గా ఉన్నారు.

"ఇంట్లో వస్తువుల నుంచీ దుస్తుల వరకూ అన్నిట్లో పీఎఫ్ఏఎస్ రసాయనాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి వీటిని భర్తీ చేయడానికి భారీగా ప్రత్యామ్నాయాలు అవసరం. దానికోసం మరింత విస్తృతంగా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది" అని క్లైమార్క్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)