కోవిడ్-19కు యాంటీవైరల్ నోటి మాత్ర.. ఈ టాబ్లెట్ మింగితే ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రమాదం తగ్గిపోతుందా?

ఫొటో సోర్స్, Merck
- రచయిత, జిమ్ రీడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్-19 భయం ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకున్నప్పటికీ, ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు, ప్రమాదాన్ని నివారించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో మరణాలు లేదా ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని సగానికి తగ్గించడంలో నోటి ద్వారా తీసుకునే మాత్ర సత్ఫలితాలను ఇచ్చిందని ఇటీవల క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.
'మోల్నుపిరావిర్' మాత్రను కోవిడ్-19 సోకినవారికి రెండు పూట్ల ఇచ్చి పరీక్షించారు.
ఈ ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చాయని అమెరికాకు చెందిన ఔషధ తయారీదారీ సంస్థ 'మెర్క్' తెలిపింది.
రాబోయే రెండు వారాల్లో అమెరికాలో ఈ ఔషధం అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని ఆ సంస్థ తెలిపింది.
సానుకూల ఫలితాలు రావడం "శుభసూచికమే", అయితే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ డేటాను సమీక్షించేవరకు జాగ్రత్తగా వహించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ కోరారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తొలిసారిగా నోటి మాత్ర
మోల్నుపిరావిర్ ఆమోదం పొందితే కోవిడ్ 19 చికిత్సకు ఇదే తొలి ఓరల్ యాంటీవైరల్ ఔషధం అవుతుంది.
తొలుత ఈ మాత్రను ఇంఫ్లుయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేశారు. తరువాత దీని లక్షణాలను మార్చి కోవిడ్-19 చికిత్స కోసం సిద్ధంచేశారు.
కరోనావైరస్ శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు, దాని జన్యు కోడ్‌లో లోపాలను ప్రవేశపెట్టగలిగేలా ఈ మాత్రను రూపొందించారు. అంటే ఇది శరీరంలోకి ప్రవేశించి, లోపల ఉన్న వైరస్ జన్యువులను ఛిన్నాభిన్నం చేస్తుంది.
మొత్తం 775 మంది రోగులపై చేసిన అధ్యయనంలో..
- మోల్నుపిరావిర్ తీసుకున్న రోగుల్లో 7.3% మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు.
- డమ్మీ పిల్ ఇచ్చిన వారిలో 14.1% మంది ఆస్పత్రిలో చేరారు.
- మోల్నుపిరావిర్ తీసుకున్నవారిలో మరణాలు లేవు. డమ్మీ పిల్ ఇచ్చినవారిలో ఎనిమిది మంది కోవిడ్‌తో మరణించారు.
అంటే ఈ మాత్ర కోవిడ్ రిస్క్‌ను సగానికి తగ్గించిందన్నమాట.

ఫొటో సోర్స్, Reuters
ఈ డేటాను పత్రికా ప్రకటనలో ప్రచురించారు. కానీ, పీర్-రివ్యూ జర్నల్స్‌లో ఇంకా పబ్లిష్ అవ్వలేదు.
చాలావరకు కోవిడ్ వ్యాక్సీన్లు వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి.
అలా కాకుండా, వైరస్ తనని తాను కాపీ చేసుకోవడానికి ఉపయోగించే ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ మాత్ర పనిచేస్తుంది.
భవిష్యత్తులో ఈ ఔషధాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి కరోనావైరస్ కొత్త వేరియంట్లపై కూడా ఇది బాగా పనిచేయగలదని మెర్క్ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.
"వ్యాక్సీన్ వేసుకోనివారికి లేదా టీకాలకు తక్కువగా స్పందించే ఇమ్యూనిటీ ఉన్నవారికి ఈ చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారిని అంతం చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది" అని మెర్క్ వైస్ ప్రెసిడెంట్ డారియా హజుడా బీబీసీతో అన్నారు.
మెరుగైన ఫలితాల కోసం కోవిడ్-19 లక్షణాలు కనిపించిన వెంటనే, తొలి దశలోనే మోల్నుపిరావిర్ మాత్ర తీసుకోవాలని ట్రయల్ ఫలితాలు సూచిస్తున్నాయి.
తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులపై గతంలో చేసిన అధ్యయనంలో నిరాశజనకమైన ఫలితాలు రావడంతో ఆ పరిశోధనలు నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Handout
అంతర్జాతీయ ఆమోదం
కోవిడ్-19 చికిత్సలో నోటి ద్వారా తీసుకునే మాత్ర విషయంలో ప్రయోగ ఫలితాలను నివేదించిన తొలి సంస్థ మెర్క్. మరికొన్ని సంస్థలు కూడా ఈ దిశలో ప్రయోగాలు చేపడుతున్నాయి.
అమెరికాకు చెందిన ఫైజర్, స్విస్ సంస్థ రోష్ కూడా యాంటీవైరల్ మాత్రలపై ప్రయోగాలు చేస్తున్నాయి.
2021 చివరికల్లా 10 మిలియన్ల (ఒక కోటి) మోల్నుపిరావిర్ డోసులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు మెర్క్ తెలిపింది.
ఎఫ్‌డీఏ ఆమోదం పొందినట్లయితే, 1.2 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అంగీకరించింది.
బ్రిటన్‌తో సహా పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని, తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు తయారీదారులతో లైసెన్సింగ్ డీల్స్ మాట్లాడుతున్నామని మెర్క్ సంస్థ తెలిపింది.
"సురక్షితమైన, ప్రభావవంతమైన, చౌక ధరలకు లభ్యమయ్యే నోటి మాత్ర కోవిడ్-19ను ఎదుర్కోవడంలో సాధించబోయే గొప్ప విజయం"అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల నిపుణులు ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు.
"మోల్నుపిరావిర్, ప్రయోగశాలలో ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చింది. రోగులలో ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందన్నది నిజమైన పరీక్ష. చాలా ఔషధాలు ఇక్కడే విఫలం అవుతాయి. ఈ మధ్యంతర క్లినికల్ ట్రయిల్ ఫలితాలు మాత్రం ప్రొత్సాహకరంగా ఉన్నాయి" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- కోవిడ్-19 వ్యాక్సీన్: దుష్ప్రభావాలకు గురైతే ఏం చేయాలి?
- తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సీన్ డెలివరీ
- ‘ప్రపంచంలో కరోనావైరస్ చేరని దేశం మాదే’ అంటున్న తుర్క్మెనిస్తాన్, నిజమెంత?
- కోవిడ్-19 వ్యాక్సీన్: టీకా వేసుకుంటే నపుంసకత్వం వస్తుందా?
- కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్ కరోనాతో మృతి
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ సోకడానికి నాలుగు ప్రధాన కారణాలు
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూళ్లలో 'నో అడ్మిషన్' బోర్డులు, సీట్లు లేవంటే ఏం చేయాలి?
- బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా ప్రకటించాలని కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు చెప్పింది
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








