కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్ కరోనాతో మృతి

Eliyantha White

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్ తీసుకునేందుకు ఎలియంత వైట్ తిరస్కరించారు.

కరోనావైరస్ నుంచి ప్రజలను రక్షిస్తుందంటూ ఓ మందును తయారుచేసిన శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్, కోవిడ్-19తో మరణించినట్లు ఆయన కుటుంబం వెల్లడించింది.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి ప్రముఖ క్రీడాకారులతో పాటు, రాజపక్స వంటి అగ్రశ్రేణి రాజకీయ నాయకులకు ఎలియంత వైట్ వైద్యం అందించారు.

ఆయన తయారు చేసిన ఔషధాన్ని నదుల్లో కలిపితే అది శ్రీలంకతో పాటు పొరుగునే ఉన్న భారత్‌లో కరోనావైరస్‌ను అంతమొందించగలదని వైట్ గతంలో పేర్కొన్నారు.

48 ఏళ్ల ఎలియంత వైట్ ఈ నెల ప్రారంభంలో వైరస్ బారిన పడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

శ్రీలంక మాజీ ఆరోగ్య మంత్రి పవిత్ర వన్నిరాచ్చి కూడా ఆయన ఔషధానికి బహిరంగంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వైరస్ బారిన పడిన ఆమె రెండు వారాల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో గడిపారు.

పలువురు భారత ప్రముఖ క్రికెటర్లకు చికిత్స అందించిన ఆయన ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యం పొందారు. కానీ వైద్య నిపుణులు, ఆయన చికిత్స విధానాన్ని తిరస్కరించారు.

ఎలియంత వైట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలియంత వైట్

మోకాలి గాయం నుంచి కోలుకోవడంలో ఎలియంత వైట్ తనకు సహాయపడ్డారని, 2010లో సచిన్ టెండూల్కర్ ఆయనకు బహిరంగంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్రస్తుత శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స కూడా ఎలియంత వైట్ వద్ద చికిత్స పొందారు. ఆయన మృతికి రాజపక్స ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

''ఆయన వారసత్వం ఎప్పటికీ బతికే ఉంటుంది. అనేక వ్యాధులను ఆయన నయం చేశారు'' అని రాజపక్స ట్వీట్ చేశారు.

కోవిడ్ నిబంధనల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

డెల్టా వేరియంట్ వ్యాప్తి కారణంగా శ్రీలంకలో గత నెల రోజుల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది. వైరస్ కారణంగా శ్రీలంకలో 12,000 మంది మరణించారని, 5 లక్షలకు పైగా వైరస్ బారిన పడ్డారని అధికారులు చెబుతున్నారు. కానీ వైద్యనిపుణులు మాత్రం మరణాల సంఖ్య దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)