భారత్-పాకిస్తాన్ యుద్ధం 1971: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్ ఆల్బర్ట్ ఎక్కా

భారత జవాన్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

ఫొటో క్యాప్షన్, భారత ఆర్మీ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1971 డిసెంబర్ 2 అర్థరాత్రి 14 గార్డ్స్‌కు చెందిన అల్ఫా, బ్రావో కంపెనీలు తూర్పు పాకిస్తాన్‌లోని గంగాసాగర్‌లో పాకిస్తాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించాయి.

ఆ ప్రాంతం అఖౌరా రైల్వే స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో బ్రాహ్మణబరియా, భైరబ్ బజార్, కమలాపూర్ ఉన్నాయి.

అది చిత్తడి ప్రాంతం కావడంతో సైనికులు మోకాళ్ల వరకూ ఉన్న గడ్డిలో నడుస్తున్నారు. వాళ్లను రైల్వే ట్రాక్ పక్కనే ఒక వరుసలో నడవమని ఆదేశాలు ఇచ్చారు.

ఆ రైల్వే ట్రాక్‌ను నేలకు 8 నుంచి 10 అడుగుల ఎత్తులో నిర్మించారు. అల్ఫా కంపెనీ రైల్వే ట్రాక్‌కు కుడివైపు, బ్రావో కంపెనీ లైన్‌కు ఎడమవైపు నడుస్తున్నాయి. లాన్స్ నాయక్ గులాబ్ సింగ్, ఆల్బర్ట్ ఎక్కాకు అందరికంటే ముందు నడిచే బాధ్యత అప్పగించారు.

పాకిస్తాన్ సైనికులు కనించగానే దాడి చేయాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్ 12 ఫ్రంటియర్ ఫోర్స్‌కు చెందిన మూడు కంపెనీలకు ఆ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యతల్లో ఉన్నాయి.

మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో తన 'పరమవీర్ అవర్ హీరోస్ ఇన్ బాటిల్' పుస్తకంలో ఆనాటి వివరాలు రాశారు.

పెట్రోలింగ్ చేస్తున్న 14 గార్డ్స్ జవాన్లు పాకిస్తాన్ సైనికులు రైల్వే ట్రాక్ చుట్టు పక్కలే తిరుగుతుండడం గమనించారు. దాంతో అక్కడ వాళ్లు మందుపాతరలు అమర్చలేదని మన సైనికులకు అర్థమైంది. దాంతో, రైల్వే ట్రాక్ పక్కనే ముందుకు నడవాలని భారత జవాన్లకు ఆదేశాలు ఇచ్చారు.

జనరల్ ఇయాన్ కార్డోజోతో బీబీసీ స్టూడియోలో రేహాన్ ఫజల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ స్టూడియోలో జనరల్ ఇయాన్ కార్డోజోతో రేహాన్ ఫజల్

పాకిస్తాన్ జవాన్లకు భారత్ దాడి గురించి తెలిసింది

ఆ రోజున ట్రాక్‌కు ఎడమవైపున దానికి కాస్త కిందుగా నడుస్తున్న బీ కంపెనీ కమాండర్ మేజర్ ఓపీ కల్నల్ కోహ్లీ ఆ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.

"అంతా బాగానే ఉంది. కానీ, అప్పుడే ఒక సైనికుడు రైల్వే ట్రాక్ మీద పాకిస్తానీలు వేసిన ఒక ట్రిప్ ప్లేయర్ వైర్ మీద కాలు వేశాడు. ఫలితంగా ఆకాశంలో హఠాత్తుగా టపాసులు పేలినట్లు మెరుపులు వచ్చాయి. ఆ కాంతికి చుట్టూ పట్ట పగల్లా మారింది."

"ఎక్కా నిలబడిన చోటుకు 40 అడుగుల దూరంలో పాకిస్తానీల బంకర్ ఉంది. అక్కడ ఒక సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. వెలుగు రావడంతో ఆశ్చర్యపోయిన పాక్ సైనికుడు 'ఎవరక్కడ' అని గట్టిగా అడిగారు. ఎక్కా అంతే గట్టిగా 'తేరే బాప్'(నీ అబ్బను) అని సమాధానం ఇచ్చాడు. ఆ మాట చెబుతూనే ముందుకు ఉరికిన ఎక్కా తన తుపాకీ బాయినెట్‌తో ఆ సైనికుడి కడుపులో పొడిచాడు."

ఆల్బర్ట్ ఎక్కా

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

ఆల్బర్ట్ ఎక్కా చేతిలో, గొంతులో బుల్లెట్లు దిగాయి

"ఆ మొదటి బంకర్‌లో ఒక లైట్ మెషిన్ గన్, ఒక రికాయిలెస్ గన్‌తోపాటూ నలుగురు పాకిస్తాన్ జవాన్లను మోహరించి ఉన్నారు. ఎక్కా చేతికి బుల్లెట్ తగిలింది. కానీ భారత జవాన్లు ఆ బంకరును తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది."

పాకిస్తాన్ సైనికులు వెలుతురు వచ్చే షెల్స్ పేల్చి ఆ ప్రాంతమంతా వెలుగు వచ్చేలా చేశారు. దాడికి దిగిన రెండు భారత కంపెనీలపై విరుచుకుపడ్డారు. దాంతో అక్కడ 120 మంది సైనికులు ఉన్న రెండు కంపెనీలూ విడిపోయాయి.

ఏ కంపెనీ ముందుకు వెళ్లగా, బీ కంపెనీ చెరువు వైపు తిరిగి ఒక్కొక్క పాకిస్తాన్ బంకరునూ ధ్వంసం చేయడం మొదలెట్టింది.

ఎక్కా తన చేతికి బుల్లెట్ తగిలినప్పటికీ సింహంలా శత్రువులపై దాడి చేస్తున్నాడు. ఆయన మేజర్ కోహ్లీతోపాటూ నడుస్తున్న సమయంలో ఒక బుల్లెట్ ఆయన గొంతును చీల్చుకుంటూ వెళ్లింది.

కల్నల్ కోహ్లీ ఆ రోజును గుర్తు చేసుకున్నారు. "బుల్లెట్ తగలగానే ఎక్కా కింద పడిపోయాడు. కానీ, వెంటనే లేచి నిలబడి నాతోపాటూ నడవడం మొదలెట్టాడు. మా వాళ్లు అప్పటికే ఎంఎంజీతో మాపై ఆగకుండా ఫైరింగ్ చేస్తున్న పాక్ సైనికులున్న రైల్వే సిగ్నల్ బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆ మెషిన్ గన్‌ కాల్పులు వెంటనే ఆగేలా చేయడం చాలా ముఖ్యం. అక్కడే ఎక్కా సాహసానికి ఒక కొత్త నిర్వచనం చెప్పాడు."

ఆల్బర్ట్ ఎక్కా

పాకుతూ రైల్వే సిగ్నల్ బిల్డింగ్ దగ్గరకు చేరుకున్న ఎక్కా

చీకటిలో ఎక్కా నేలపై ఎలాంటి చలనం లేకుండా పడున్నాడు. అతడి బూట్లకంతా బురద ఉంది. తన ఎడమ కాలిపై ఒక చీమ కదలడం అతడికి తెలుస్తోంది. కానీ అతడు అంగుళం కూడా కదల్లేకపోతున్నాడు. చీమల వల్ల అతడికి ఎలాంటి ఇబ్బందీ అనిపించడం లేదు. అతడి చెయ్యి తన గొంతు మీదకు వెళ్లింది. చేతికి అతుక్కుంటున్నది చెమట కాదని అతనికి అనిపించింది. చీకట్లో అదేంటో ఆల్బర్ట్ చూడలేకపోతున్నాడు. కానీ, దాని వాసనను బట్టి అది తన రక్తమేననే విషయం అతడికి అర్థమైంది.

రక్తం అయిన తన చేతిని పాంటుకు తుడుచుకున్న అతడు తన తుపాకీని మరింత బలంగా పట్టుకున్నాడు. కాసేపట్లోనే సూర్యుడి తొలి వెలుగు కనిపించబోతోంది. ఇక ఆలస్యం చేయకూడదనుకుని లేచి మోకాళ్లపై కూర్చున్న ఎక్కా మళ్లీ బోర్లా పడుకుని పాములా నేలపై పాకుతూ ముందుకు కదిలాడు.

ఆల్బర్ట్ చేతులో 7.62 ఎంఎం రైఫిల్ ఉంది. చేతికి తగిలిన బుల్లెట్ నొప్పికి అతడి శరీరమంతా అల్లాడుతోంది. అతడి గొంతుకు కూడా ఒక బుల్లెట్ తగిలింది. కానీ పళ్లు బిగబట్టిన ఎక్కా ముందుకు కదులుతూనే ఉన్నాడు. గొంతులో బుల్లెట్ గాయం నుంచి కారుతున్న రక్తంతో అతడి షర్టు కాలర్‌ తడిచిపోతోంది.

రక్తం పోయేకొద్దీ తుపాకీపై తన పట్టు సడలుతుందనే విషయం ఎక్కాకు తెలుసు. కానీ, అధి పట్టించుకోని అతడు తన బలమంతా కూడగట్టుకుని మోచేతుల మీద పాకుతూ చీకట్లోనే ఆ రెండతస్తుల రైల్వే సిగ్నల్ బిల్డింగ్ వైపు కదిలాడు. కాసేపటికే పాకిస్తాన్ సైనికులు పైనుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు.

ఎక్కా పేరుతో పోస్టల్ స్టాంప్

ఫొటో సోర్స్, INDIA POST

ఫొటో క్యాప్షన్, ఎక్కా పేరుతో పోస్టల్ స్టాంప్

పాకిస్తాన్ బంకరులో గ్రెనేడ్ విసిరిన ఎక్కా

ఎక్కా సహచరులకు తమ రైఫిళ్లతో పాకిస్తానీల మెషిన్ గన్లకు జవాబు చెప్పడం కష్టంగా మారుతోంది. దాంతో ఆ ఆపరేషన్ విజయవంతం కావాలంటే కచ్చితంగా ఆ మెషిన్ గన్ల గొంతు నొక్కాలని వారికి అనిపిస్తోంది.

తన రైఫిల్‌ను వీపుకు తగిలించుకున్న ఎక్కా చెయ్యి తన బెల్టుకు ఉన్న గ్రెనేడ్ పైకి వెళ్లింది. పళ్లతో దాని పిన్ బయటికి లాగిన ఎక్కా ఆ గ్రెనేడ్‌ను ఆ భవనానికి ఉన్న ఒక కిటికీ లోంచి లోపలికి విసిరాడు.

లోపలున్న పాకిస్తానీ సైనికులు దాని గురించి తెలుసుకునేలోపే అది పేలింది.. ఎగసిన శిథిలాలు ఆల్బర్ట్ ఎక్కా చాతీని తాకాయి. కానీ, పాకిస్తానీ సైనికులు ఆ పేలుడు ధాటికి బలంగా గోడలకు గుద్దుకున్నారు.

ఆల్బర్ట్ ఎక్కా

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

బాయినెట్‌తో పాకిస్తాన్ సైనికుడిపై దాడి

సైన్యం చరిత్రకారులు రచనా బిష్ట్ రావత్ తన 'ద బ్రేవ్.. పరమవీర్ చక్ర స్టోరీస్‌'లో కూడా ఈ పోరాటం గురించి రాశారు.

"పాత తుప్పు పట్టిన నిచ్చెన ఎక్కిన ఆల్బర్ట్ ఎక్కా కుంటుకుంటూ ఆ భవనంలోకి వెళ్లాడు. గ్రెనేడ్ విసిరిన కిటికీలోంచే లోపలికి దూకాడు. ఒక భుజం మీద నుంచి తన రైఫిల్ తీసి దాని చివరన మెరుస్తున్న బాయినెట్‌తో ప్రాణాలతో ఉన్న ఒక సైనికుడిపై దాడి చేశాడు. కత్తితో పొడవాలని తమ గురువు నేర్పిన పాఠం ఆయనకు బాగా గుర్తుంది".

"పాకిస్తానీ సైనికులు పడిపోయినపుడు వాళ్ల మెషిన్ గన్ నుంచి పొగలు వస్తున్నాయి. చనిపోయిన పాకిస్తాన్ జవాన్ల రక్తం మరకలు ఎక్కా ముఖం అంతా ఉన్నాయి. ఆయన తన యూనిఫాం చొక్కాకు దాన్ని తుడుచుకున్నారు. ఎక్కా కళ్లలో విజయం సాధించామనే సంతోషం కనిపిస్తోంది"

బీబీసీ స్టూడియోలో రచనా బిష్ట్ రావత్‌తో రేహాన్ ఫజల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ స్టూడియోలో రచనా బిష్ట్ రావత్‌తో రేహాన్ ఫజల్

మెట్ల మీద నుంచి కింద పడిన ఎక్కా

ఆల్బర్ట్ ఎక్కా చూపిన ఆ ధైర్యసాహసాలు ఆ యుద్ధంలో భారత్‌దే పైచేయిగా చేసింది. బ్రావో కంపెనీ కంపెనీ కమాండర్ మేజర్ ఓపీ కోహ్లీ 10 అడుగుల దూరం నుంచి ఎక్కా సాహసాలను చూస్తున్నారు. ఎక్కా ఆయన కళ్ల ముందే గ్రెనెడ్ విసిరి ఆ మెట్ల మీద నుంచి పైకెళ్లారు.

"అదంతా చూసి నా గుండె గర్వంతో ఉప్పొంగింది. నేను ఎక్కా ఆ భవనం నుంచి బయటకు వచ్చే సమయం కోసం కింద ఎదురుచూస్తున్నా. నాకు అంతలోనే బక్కపలచగా ఉన్న ఎక్కా మెట్ల మీద నుంచి కిందికి దిగడం కనిపించింది. నేను ఊపిరి బిగబట్టి తను కిందికి రావడం చూస్తున్నాను. అంతలోనే హఠాత్తుగా ఎక్కా కుప్పకూలిపోయాడు. ఆ మెట్ల మీద నుంచి కిందికి పడిపోయాడు".

పెద్దగా మాట్లాడని సిగ్గరి

లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా ఇప్పుడీ లోకంలో లేరు. కానీ ఆయన తన మిషన్ పూర్తి చేసి చూపించారు. బ్రావో కంపెనీ జవాన్లు పాక్ బంకర్ల నుంచి కాసేపటి ముందు తమపై బుల్లెట్ల వర్షం కురిపించిన ఎంఎంజీని బయటకు తీస్తున్నప్పుడు, వారు పైకి ఎక్కి వెళ్లిన అవే మెట్ల కింద లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా ప్రాణం లేకుండా పడున్నాడు.

కల్నల్ ఓపీ కోహ్లీ కోటా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంబల్ నదీ తీరంలోని అబరెరా క్యాంప్‌లో విధుల్లో ఉన్నప్పుడు బక్కపలచగా ముదురు రంగులో ఉన్న ఆల్బర్ట్ ఎక్కా అనే జవానును మార్చ్ చేయిస్తూ తన దగ్గరకు తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

అప్పుడు ఎక్కా తన బాటిల్ ఫిజికల్ ఎఫిషయెన్సీ టెస్ట్ పాస్ అయ్యాడు. కానీ కమాండర్ కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నాడు.

"ఎక్కా బిహార్ రెజిమెంట్‌ నుంచి నా దగ్గరకు వచ్చాడు. నిజం చెప్పాలంటే నేను అతడిని పెద్దగా పట్టించుకోలేదు. తను చాలా తక్కువ మాట్లాడేవాడు. వినయంగా ఉండేవాడు. కానీ, తను ఒక ఆదివాసీ కావడంతో, అతడి శారీరకంగా ఫిట్‌గా ఉంటుందనే విషయం నాకు తెలుసు. మాకు కావల్సింది కూడా అదే" అన్నారు.

"ఎక్కా ప్లటూన్‌ను 1968 మేలో మిజోరాంలో మోహరించారు. అతడు తన సబార్డినేట్లతో చాలా బాగా ప్రవర్తించేవారు. దాంతో వారంతా ఆయన్ను గౌరవించేవారు. ఎక్కా చాలా సిగ్గరి.. అందుకే తన తోటి సైనికులతో, అధికారులతో పెద్దగా కలవలేకపోయేవారు".

పరమ వీర్ చక్ర స్టోరీస్

ఫొటో సోర్స్, PENGUIN BOOKS

ఫొటో క్యాప్షన్, ది బ్రేవ్ పరమ వీర్ చక్ర స్టోరీస్

"ఆల్బర్ట్ తను ఎలా కనిపిస్తున్నాను, తన యూనిఫాం ఎలా ఉండాలి అనేది కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఏ సైజ్ యూనిఫాం ఇచ్చినా వేసుకునేవాడు. దాన్ని టైట్ చేయించుకోడానికి కనీసం టైలర్ దగ్గరకు కూడా వెళ్లేవాడు కాదు. దాంతో అతడి బక్కపలచటి శరీరానికి ఆ బట్టలు వదులుగా వేలాడేవి. స్మార్ట్ టర్నవుట్ ఉండాలని గట్టిగా చెప్పే నేను అప్పుడప్పుడూ తనపై కోపగించుకునేవాడిని". అని కోహ్లీ గుర్తు చేసుకున్నారు.

"నేను అతడితో తరచూ నీ నడుముకు లూజుగా ఉన్న బెల్ట్ తీసి దాన్ని టైట్‌గా పెట్టుకో అని చెబుతూ ఎక్కాను తిట్టేవాడిని. తను పెట్రోలింగ్‌కు వెళ్లినపుడు చాలాసార్లు కాలువల నుంచి పీతలు పట్టుకొచ్చేవాడు. వాటిని నిప్పుల మీద కాల్చి ఉప్పూకారం చల్లుకుని తినేవాళ్లం. తన గురి అద్భుతం. ఎక్కా మంచి హాకీ ఆటగాటు కూడా" అన్నారు కోహ్లీ

గంగాసాగర్ యుద్ధంలో ఎక్కాతోపాటూ 11 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటూ ఒక ఆఫీసర్, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, మరో 55 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన 25 మంది సైనికులు చనిపోయారు. మరో ఆరుగురు జవాన్లను భారత్ యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది.

ఆల్బర్ట్ ఎక్కా చూపిన సాహసాలకు ప్రభుత్వం ఆయన్ను భారత అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్రతో సన్మానించింది. ఈ పతకం అంత ముఖ్యమైనది అంటే, బిహార్(ఇప్పుడు జార్ఖండ్), బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్‌కు చెందిన ఒక సైనికుడికి ఈ పురస్కారం రావడం అదే మొదటిసారి. తూర్పు సెక్టార్‌లో సైనికులకు ఇచ్చిన ఒకే ఒక పరమవీర చక్ర కూడా ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)