ఆపరేషన్ బ్లూస్టార్: అకాల్ తఖ్త్ నుంచి కాలు బయటపెట్టగానే భింద్రన్‌వాలే మీదకు బుల్లెట్లు దూసుకొచ్చాయి

ఫొటో సోర్స్, RAGHU RAI
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చనిపోయే కొన్ని గంటల ముందు భింద్రన్‌వాలే ముగ్గురు జర్నలిస్టులతో మాట్లాడారు.
వారిలో బీబీసీకి చెందిన మార్క్ టలీ ఒకరు. ఇంకొకరు టైమ్స్ ఆఫ్ ఇండియా సుభాష్ కిర్పేకర్ కాగా, మూడో వ్యక్తి ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్.
సీఆర్పీఎఫ్ 'ఆపరేషన్ బ్లూస్టార్' ప్రారంభించడానికి నాలుగు రోజుల ముందే.. అంటే జూన్ 1న స్వర్ణ దేవాలయం కాల్పులు మొదలయ్యాయి.
జూన్ 2న మార్క్ టలీ భింద్రన్‌వాలేను చివరిసారి కలిశారు. ఆ సమయంలో ఆయన అకాల్ తఖ్త్‌లో కూర్చుని ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్క్ టలీ, సతీశ్ జాకబ్ తమ 'అమృత్‌సర్-మిసెస్ గాంధీస్ లాస్ట్ బాటిల్' పుస్తకంలో అప్పుడు ఏం జరిగిందో వివరించారు.
"నేను భింద్రన్‌వాలేను కాల్పుల గురించి అడిగినపుడు, ప్రభుత్వం స్వర్ణ దేవాలయాన్ని అవమానించడానికే మొగ్గు చూపుతోందని, ఈ ఫైరింగ్ ఘటనలే చెబుతున్నాయి. సిక్కులు, వారి జీవనశైలిని ప్రభుత్వం భరించలేకపోతోంది. సైన్యం ఆలయంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే, వారికి తగిన జవాబు చెబుతాం అన్నారు".
"కానీ, ఆ రోజు భింద్రన్‌వాలే ఎందుకో, ఇబ్బందిగా కనిపించారు. ఆయన, ఒత్తిడిలో ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడేవారు. కానీ, ఆరోజు ఆయన మాతో "మీరు త్వరగా కానివ్వండి, నాకు వేరే ముఖ్యమైన పనులున్నాయి" అన్నారు అని వారు కూడా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యం లోపలికి రాదని భింద్రన్‌వాలే నమ్మకం
స్వర్ణ దేవాలయాన్ని ఆర్మీ చుట్టుముట్టిన తర్వాత, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను కలిసిన ఒకే ఒక్క జర్నలిస్ట్.. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సుభాష్ కిర్పేకర్. సైన్యం లోపలికి రాదని అని భింద్రన్‌వాలే అనుకున్నారని ఆయన చెప్పారు..
ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ప్రచురితమైన కిర్పేకర్ 'ద పంజాబ్ స్టోరీ' పుస్తకంలో ఆయన ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు.
"నేను భింద్రన్‌వాలేతో సైన్యం సంఖ్య ముందు మీ యోధులు తక్కువ మంది అవుతారేమో, వాళ్ల దగ్గర మెరుగైన ఆయుధాలు కూడా ఉన్నాయి అన్నాను. భింద్రన్‌వాలే వెంటనే 'తోడేళ్ల గుంపు ఎప్పుడూ సింహాల కంటే పెద్దదిగానే ఉంటుంది. కానీ, ఒక సింహం వెయ్యి తోడేళ్లకు సమానం. సింహం నిద్రపోతుంటే, పిచుక కూడా అరుస్తుంది. కానీ అది లేవగానే, ఆ పిచుక ఎగిరిపోతుంది' అన్నారు"
"మీకు చావంటే భయం లేదా అని నేను అడగగానే, ఆయన మృత్యువుకు భయపడే సిక్కు, అసలు సిక్కు కానే కాదు" అన్నారని అందులో రాశారు.
భింద్రన్‌వాలే పక్కనే స్వర్ణ దేవాలయంలో వ్యూహాలకు ప్రణాళికలు రూపొందించే మేజర్ జనరల్ షాబేగ్ సింగ్ కూడా ఉన్నారు. నేను ఆయనతో 'మీకు ఏమనిపిస్తోంది, యాక్షన్ ఎప్పుడు మొదలవ్వచ్చు' అన్నాను. ఆయన నాతో 'బహుశా ఈరోజు రాత్రే' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చింతనిప్పుల్లా భింద్రన్‌వాలే కళ్లు
భింద్రన్‌వాలే చనిపోడానికి ఒక్క రోజు ముందు ఆయన్ను కలిసినట్లు ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ నాకు చెప్పారు.
"భింద్రన్‌వాలే నన్ను చూడగానే 'ఇక్కడికెందుకొచ్చావ్' అన్నారు."
"నేను 'పాజీ… మిమ్మల్ని కలవడానికే వచ్చా, నేను ఎప్పుడూ వస్తూనే ఉంటానుగా' అన్నాను"
"ఆయన 'మళ్లీ ఇప్పుడెందుకు వచ్చావ్' అన్నారు. 'మీరెలా ఉన్నారో చూద్దామని' అన్నాను.
"ఆయన కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆ కళ్లల్లో నాకు కోపం, భయం రెండూ కనిపిస్తున్నాయి" అని రఘు రాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, UBS PUBLISHERS
పట్టుబడ్డ మిలిటెంట్లను సైనికులు శవం దగ్గరికి తీసుకెళ్లారు
జూన్ 6 సాయంత్రం 4 గంటలకు లౌడ్ స్పీకర్లలో పదే పదే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. లోపల గదుల్లో, చావడిలో ఉన్న వాళ్లు బయటికొచ్చి లొంగిపోవచ్చని చెబుతున్నారు. కానీ, అప్పటికీ భింద్రన్‌వాలే గురించి ఎలాంటి సమాచారం తెలీలేదు.

ఫొటో సోర్స్, VIKAS PUBLISHING
ఆపరేషన్ బ్లూస్టార్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బుల్‌బుల్ బరార్ ఈ ఆపరేషన్ గురించి తన 'బ్లూస్టార్ ద ట్రూ స్టోరీ' పుస్తకంలో వివరించారు.
"26 మద్రాస్ రెజిమెంట్ జవాన్లు అకాల్ తఖ్త్‌లోకి చొచ్చుకొళ్లినపుడు, పారిపోవాలని చూస్తున్న ఇద్దరు మిలిటెంట్లు వారికి కనిపించారు. సైనికులు వాళ్లపై కాల్పులు జరిపారు. ఒకరు చనిపోయినా, రెండో వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని అడిగినప్పుడు భింద్రన్‌వాలే చనిపోయారని చెప్పాడు. ఆ మిలిటెంట్ తర్వాత భింద్రన్‌వాలే, ఆయన 40 మంది అనుచరుల శవాలు ఉన్న చోటుకు తీసుకెళ్లారు" అని రాశారు.
"కాసేపటి తర్వాత మాకు వ్యాయామశాలలో జనరల్ షాబేగ్ సింగ్ శవం కూడా దొరికింది. చేతిలో అప్పటికీ ఆయన కార్బన్ అలాగే ఉంది. బాడీ పక్కనే వాకీ-టాకీ కూడా పడుంది".
ఆ తర్వాత నేను బరాన్‌తో మాట్లాడినపుడు భింద్రన్‌వాలే చనిపోయారని తను ఎలా తెలుసుకున్నానో ఆయన నాకు చెప్పారు.
"హఠాత్తుగా 30-40 మంది బయటకు రావాలని పరిగెత్తారు. భింద్రన్‌వాలే ఇక లేరని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అప్పటికి లోపల నుంచి ఫైరింగ్ కూడా ఆగిపోయింది. తర్వాత నేను నా జవాన్లతో లోపలికి వెళ్లి గాలించండి అని చెప్పాను. అప్పుడే నాకు ఆయన చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన శవాన్ని ఉత్తర వింగ్ వరండాలోకి తీసుకొచ్చి పెట్టాం. అక్కడ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నారు. మా అదుపులోకి ఉన్న మిలిటెంట్లు భింద్రన్‌వాలేను గుర్తించారు" అని బరాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, ROLI BOOKS
నేలమీద రెండగుళాల ఎత్తున బుల్లెట్ షెల్స్
ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ప్రచురితమైన 'ద పంజాబ్ స్టోరీ'లో శేఖర్ గుప్తా ఆనాటి ఘటనల గురించి వివరించారు.
"అకాల్ తఖ్త్ లోపలికి వెళ్లినపుడు, ఆ ప్రాంతమంతా గన్ పౌడర్ వాసనతో నిండిపోయి ఉంది. కాల్పులు జరిపిన తర్వాత పడిన బుల్లెట్ షెల్స్ నేలమీద రెండు అంగుళాల ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి" అని సైనికాధికారులు నాకు చెప్పారు".
"మిలిటెంట్లు అంత భారీ ఎత్తున ఫైరింగ్ ఎలా చేయగలిగారని కూడా కొందరు అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆటోమేటిక్ ఆయుధాలతో అలా ఆపకుండా కాల్పులు జరపడం కుదరదు. ఎందుకంటే, ఆ ఆయుధాల్లో సమస్యలు తలెత్తుతుంటాయి. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోకుండా ఫైరింగ్ కొనసాగిస్తే, అప్పుడప్పుడూ తుపాకీ గొట్టం వేడెక్కిపోతుంది, ఒక్కోసారి అది ఆ వేడికి కరిగిపోతుంటుంది కూడా" అని చెప్పారు.
అదే, భారత జవాన్లు అలా భీకర కాల్పులు జరిపి ఉంటే, బుల్లెట్లు వృథా చేసినందుకు తమ అధికారుల నుంచి బాగా తిట్లు తినాల్సొచ్చేది. చాలామంది మిలిటెంట్ల భుజాలు నీలం రంగులో కమిలిపోయాయి. వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ, ఆగకుండా కాల్పులు జరపడంలో వాళ్లు ఏమాత్రం వెనక్కు తగ్గలేదనే విషయాన్ని అవి చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, VIKAS PUBLISHING
జ్ఞానీ ప్రీతమ్ సింగ్ భింద్రన్‌వాలేను చూశారు
భింద్రన్‌వాలే చివరి క్షణాల్లో కనిపించడం గురించి రెండు చోట్ల రాశారు.
అకాల్ తఖ్త్ అప్పటి జత్థేదార్ కిర్పాల్ సింగ్ తన 'ఐ విట్నెస్ అకౌంట్ ఆఫ్ ఆపరేషన్ బ్లూస్టార్ పుస్తకంలో అకాల్ తఖ్త్ చీఫ్ గ్రంథీ జ్ఞానీ ప్రీతమ్ సింగ్ ఆనాటి ఘటనల గురించి మాటలను వివరించారు.
"నేను ముగ్గురు సేవకులతో కలిసి అకాల్ తఖ్త్ ఉత్తరం అంచున కూర్చుని ఉన్నాను. రాత్రి దాదాపు 8 గంటలకు ఫైరింగ్ కాస్త తగ్గింది. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మా గది దగ్గరున్న టాయిలెట్ వైపు రావడం చూశాను. ఆయన కుళాయి దగ్గర తన చేతులు కడుక్కుని మళ్లీ అకాల్ తఖ్త్ వైపు వెళ్లిపోయారు" అని జ్ఞానీ ప్రీతమ్ సింగ్ అందులో చెప్పారు.
"దాదాపు ఎనిమిదిన్నరకు అమ్రీక్ సింగ్ తన చేతులు కడుక్కుంటూ, మీరంతా వెళ్లిపోవాలని మాకు సలహా ఇచ్చారు. మేం ఆయన్ను మీరు ఏం చేయబోతున్నారు అని అడిగాం. ఆయన సంత్ వ్యాయామశాలలో ఉన్నారని చెప్పారు".
"తర్వాత మేం సంత్ వాళ్ల నుంచి ఇనుప తలుపు తాళం చెవి తీసుకున్నాం. నా 12 మంది అనుచరులతో కలిసి నేను బయట వీధిలోకి వచ్చేశాను. దర్బార్ సాహబ్ దగ్గర ఉండే మరో సేవకుడు భాయీ బల్బీర్ సింగ్ ఇంట్లో ఆశ్రయం పొందాం" అన్నారు.

ఫొటో సోర్స్, B CHATTAR SINGH JIWAN SINGH
భింద్రన్‌వాలే చివరి ప్రార్థనలు
'ద గాలంట్ డిఫెండర్' అనే మరో పుస్తకం రచయిత ఎఆర్ దర్శీ అకాల్ తఖ్త్ సేవకుడు హరి సింగ్ తనకు చెప్పిన కొన్ని వివరాలు రాశారు.
నేను 30 మందితో కోఠా సాహబ్‌లో దాక్కున్నాను. జూన్ 6న రాత్రి దాదాపు ఏడున్నరకు అమ్రిక్ సింగ్ అక్కడికొచ్చారు. సైన్యం తీసుకొచ్చిన ట్యాంకులను మనం ఎదుర్కోలేమని, మీరంతా కోఠా వదిలి వెళ్లిపోవాలని మాకు చెప్పారు".
"కొన్ని నిమిషాల తర్వాత భింద్రన్‌వాలే 40 మంది అనుచరులతో గదిలోకి అడుగుపెట్టారు. ఆయన గురుగ్రంథ్ సాహబ్ ముందు కూర్చుని ప్రార్థనలు చేశారు. తన మద్దతుదారులతో 'బలిదానానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో వాళ్లు నాతోపాటూ ఉండచ్చు, మిగతావాళ్లు అకాల్ తఖ్త్ వదిలి వెళ్లిపోవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భింద్రన్‌వాలే తొడకు తగిలిన బుల్లెట్
భింద్రన్‌వాలే శిథిలాల మీద నడుస్తూ అకాల్ తఖ్త్ ముందు వైపు వెళ్లినపుడు, వెనక ఆయన 30 మంది అనుచరులు కూడా వెళ్లారు. బయట అడుగుపెట్టగానే, ఆయన్ను బుల్లెట్లు పలకరించాయి.
మార్క్ టలీ, సతీశ్ జాకబ్ తమ 'అమృత్‌సర్- మిసెస్ గాంధీస్ లాస్ట్ బాటిల్' పుస్తకంలో ఆ ఘటన గురించి రాశారు.
"బయట అడుగుపెట్టగానే అమ్రిక్ సింగ్‌కు బుల్లెట్ తగిలింది. కానీ కొంతమంది ముందుకు పరిగెత్తి వెళ్లిపోయారు. తర్వాత మరోసారి బుల్లెట్ల వర్షం కురిసింది. అప్పుడు బింధ్రన్‌వాలే 12-13 మంది సహచరులు కుప్పకూలిపోయారు.

ఫొటో సోర్స్, RUPA PUBLICATION
"ఆయన ప్రధాన అనుచరుడు ప్రీతమ్ సింగ్ కూడా ఆ గదిలో దాక్కుని ఉన్నారు. హఠాత్తుగా కొంతమంది లోపలికి వచ్చి అమ్రిక్ సింగ్ చనిపోయారని చెప్పారు. భింద్రన్‌వాలే గురించి అడిగినప్పుడు ఆయన చనిపోవడం మేం చూడలేదని వాళ్లు చెప్పారు".
"భింద్రన్‌వాలే బయటకు వచ్చినపుడు మొదట ఆయన తొడకు బుల్లెట్ తగిలింది" అని రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ సలహాదారు త్రిలోచన్ సింగ్‌కు ఒక అకాల్ తఖ్త్ గ్రంధీ చెప్పారని మార్క్ టలీ, సతీశ్ జాకబ్ తమ పుస్తకంలో రాశారు.
"తర్వాత ఆయన మళ్లీ భవనం లోపలికి వెళ్లారు. కానీ భింద్రన్‌వాలే చనిపోవడం ఎవరూ తమ కళ్లతో చూళ్లేదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, RAGHU RAI
అకాల్ తఖ్త్ పరిసరాల్లో శవాలు దొరకడంపై వివాదం
భింద్రన్‌వాలే, అమ్రిక్ సింగ్ శవాలు జూన్ 7న ఉదయం అకాల్ తఖ్త్ పరిసరాల్లో లభించాయని సైనికులు గ్రంథీ జ్ఞానీ పూరన్ సింగ్‌కు చెప్పారు.
స్వర్ణ దేవాలయంలో దొరికిన ఈ మూడు శవాల పొటోలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక ఫొటోలో షాబేగ్ సింగ్ చేతులు తాడుతో కట్టి ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. దానిని బట్టి ఆయన శవాన్ని అకాల్ తఖ్త్ నుంచి లాక్కుని బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
శవాలు అకాల్ తఖ్త్ ముందు కనిపించాయని, వాటిని అంతకు ముందు ఎక్కడ గుర్తించారో తమకు తెలీదని చెప్పాలనేది సైనికుల ఉద్దేశం కావచ్చు.

ఫొటో సోర్స్, BRIGADIER ONKAR SINGH GORAYA
భింద్రన్‌వాలే శవం గుర్తింపు
భింద్రన్‌వాలే జూన్ 6నే చనిపోయారు. మార్క్ టలీ, సతీశ్ జాకబ్ తమ పుస్తకంలో "భింద్రన్‌వాలే కోట కుప్పకూలిందని ఒక అధికారి బరార్‌కు సమాచారం ఇచ్చాడు. దాంతో ఆయన అక్కడ ఒక గార్డును డ్యూటీలో పెట్టారు" అని రాశారు.
పరిసరాలను గాలించడానికి ఆయన తెల్లారేవరకూ వేచిచూశారు. జూన్ 7న ఉదయం గాలించినపుడు భింద్రన్‌వాలే, షాబేగ్ సింగ్, అమ్రిక్ సింగ్ శవాలు వ్యాయామశాలలో దొరికాయి.

ఫొటో సోర్స్, BRIGADIER ONKAR SINGH GORAYA
బ్రిగేడియర్ ఓంకార్ ఎస్ గోరాయా కూడా తన 'ఆపరేషన్ బ్లూస్టార్ అండ్ ఆఫ్టర్ ఎన్ ఐవిట్నెస్ అకౌంట్' పుస్తకంలో ఈ విషయంరాశారు.
భింద్రన్‌వాలే శవాన్ని మొట్టమొదట గుర్తించిన వ్యక్తి డీఎస్పీ అపర్ సింగ్ బాజ్వా అని ఆయన చెప్పారు.
"మంచు గడ్డ మీద పడుకోబెట్టిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే శవాన్ని నేనూ గుర్తించుండేవాడిని. అయితే అంతకు ముందెప్పుడూ ఆయన్ను నేను సజీవంగా చూడలేదు. ఆయన జుట్టు విడిపోయి ఉంది. ఒక కాలి ఎముక విరిగిపోయింది. ఆయన శరీరంపై చాలాబుల్లెట్ గాయాలు ఉన్నాయి" గోరాయా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భింద్రన్‌వాలే అంత్యక్రియలు
జూన్ 7 సాయంత్రం ఏడు గంటలకు భింద్రన్‌వాలే మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.
"ఆ సమయంలో స్వర్ణ దేవాలయం చుట్టుపక్కల దాదాపు పది వేల మంది గుమిగూడారు. కానీ సైన్యం వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. భింద్రన్‌వాలే, అమ్రిక్ సింగ్, దమ్‌దమీ టక్సాల్ డిప్యూటీ చీఫ్ థారా సింగ్ మృతదేహాలకు ఆలయం దగ్గరే చితులు పేర్చారు" అని మార్క్ టలీ రాశారు.
"నలుగురు పోలీసు అధికారులు భింద్రన్‌వాలే శవాన్ని లారీ నుంచి తీసుకుని, చితివరకూ గౌరవంగా తీసుకొచ్చారు. అక్కడున్న చాలామంది పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టారని ఒక అధికారి నాకు చెప్పారు" అని ఆయన తన పుస్తకంలో చెప్పారు.

ఫొటో సోర్స్, VIKAS PUBLISHING
షాబేగ్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి కొడుకు అనుమతి
జనరల్ షాబేగ్ సింగ్ శవాన్ని కూడా అకాల్ తఖ్త్ వ్యాయమశాలలో గుర్తించారు. ఆయన జూన్ 5 లేదా 6 రాత్రే గాయపడి ఉంటారని భావిస్తున్నారు.
షాబేగ్ సింగ్ కొడుకు ప్రభ్‌పాల్ సింగ్, పంజాబ్ గవర్నర్‌కు ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి అనుమతి అడిగారు. కొన్ని వేలమంది తనను దానికి అనుమతి అడిగారని, మీకు అనుమతి ఇస్తే, మిగతావారికి కూడా ఇవ్వాల్సి ఉంటుందని గవర్నర్ ఆయనకు చెప్పారు.
తండ్రి అస్థికలైనా దొరుకుతాయా అని ప్రభ్‌పాల్ సింగ్ అడిగినప్పుడు, వాటిని భారత్‌లో ప్రవహించే పవిత్ర నదుల్లో కలుపుతామని ఆయనకు గవర్నర్ చెప్పారు.
షాబేగ్ సింగ్ అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులూ లభించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భింద్రన్‌వాలే బతికే ఉన్నారని వదంతులు
భింద్రన్‌వాలే అంత్యక్రియలు ముగిసిన తర్వాత చాలా రోజుల వరకూ ఆయన ఇంకా బతికే ఉన్నారన్ వదంతులు వ్యాపిస్తూనే వచ్చాయి.
జనరల్ బరార్ ఆనాటి ఘటనల గురించి నాకు వివరించారు.
"భింద్రన్‌వాలే ఆ రోజు సురక్షితంగా తప్పించుకుని, పాకిస్తాన్ చేరుకున్నారని.. ఆపరేషన్ జరిగిన తర్వాత రోజు నుంచే కథలు ప్రచారం అయ్యాయి. పాకిస్తాన్ టీవీ కూడా భింద్రన్‌వాలే తమ దగ్గర ఉన్నారని, జూన్ 30 తర్వాత ఆయన్ను టీవీలో చూపిస్తామని అనౌన్స్ చేసింది" అన్నారు.

ఫొటో సోర్స్, UBS PUBLISHERS
"నాకు సమాచార, ప్రసార మంత్రి హెచ్‌కేఎల్ భగత్, విదేశాంగ కార్యదర్శి ఎంకే రస్గోత్రా నుంచి ఫోన్లు వచ్చాయి. 'భింద్రన్‌వాలే చనిపోయాడని మీరు చెబుతున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఆయన తమ దేశంలో ఉన్నాడని అంటోందేంటి' అని అడిగారు".
"నేను వారికి మేం శవాన్ని గుర్తించాం. ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించాం. ఆయన మద్దతుదారులు కూడా ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. అని చెప్పాను" అని తెలిపారు.
పంజాబ్ గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా జూన్ 30 వరకూ ఆతృతగా వేచిచూశారు. భింద్రన్‌వాలేను పాకిస్తాన్ టీవీలో చూపిస్తారేమో అని ఆశగా ఉన్నారు. కానీ, వారి కోరిక నెరవేరేలేదు.
జనరల్ బరార్ తన 'ఆపరేషన్ బ్లూస్టార్ ద ట్రూ స్టోరీ'లో మరో విషయం కూడా చెప్పారు.
"భింద్రన్‌వాలేలా కనిపించే ఎవరికో, ప్లాస్టిక్ సర్జరీ చేయించి, పాకిస్తాన్ టీవీలో చూపిస్తారనే వదంతులు వస్తుండడంతో, ఆ రోజు నేను కూడా టీవీ ఆన్ చేశా... కానీ అలా జరగలేదు" అని బరార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




