COP 26: పేద దేశాలకు ఇవ్వాల్సిన నిధులను ధనిక దేశాలు కచ్చితంగా ఇస్తున్నాయా లేక మభ్య పెడుతున్నాయా?

- రచయిత, క్రిస్ మోరిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో పేద దేశాలకు సంపన్న దేశాలు ఎంత సాయం చేస్తాయన్న అంశం కాప్-26 సదస్సులో చర్చనీయాంశమైంది.
2020 నాటికి ప్రతి సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు అందజేస్తామన్న సంపన్న దేశాల హామీ ఇంకా పూర్తిగా నెరవేర లేదు.
సంపన్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల నుండి శిలాజ ఇంధనాలు, కార్బన్‌లను తొలగించడం కొంచెం కష్టమైన పని. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరింత కష్టంగా ఉంటుంది.
మౌలిక సదుపాయాలు, సాంకేతికత కోసం ఈ దేశాలు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. శిలాజ ఇంధనాలను వాడటం మానేస్తే ప్రజలు ఇబ్బందుల్లో పడతారు.
అందువల్ల వాతావరణ మార్పులకు అనుగుణంగా, దాని ప్రభావాలను తగ్గించే ప్రయత్నాలకు మద్ధతు కోసం గ్రాంట్లు, రుణాలు, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ప్రోత్సాహకాలు కల్పించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
వరదలు, తుపాన్ల నుంచి ప్రజలను రక్షించడానికి తీర రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, నష్టాలు తక్కువగా ఉండే వ్యవసాయ విధానాలను అనుసరించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్షణ ఆర్థిక సాయం అవసరం.
వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించే ప్రయత్నాలలో పేద దేశాలు కూడా భాగస్వాములు కావాలంటే, సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు మారేందుకు వారికి సహకరించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత హామీ ఇచ్చారు?
ప్రపంచంలోని పేద దేశాలకు సహాయం చేయడానికి 2020 నాటికి సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను అందిస్తామని 2009లో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి.
కానీ, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ, ఈ నిధుల లక్ష్యం ఇంకా చేరుకోలేదని నిర్ధరించింది. మళ్లీ ఇప్పుడు 2025కి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నారు.
''చేసింది కొంతే. చేయాల్సింది చాలా ఉంది'' అని వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ థింక్ ట్యాంక్‌కు చెందిన అమర్ భట్టాచార్య అన్నారు.
కాప్-26 సదస్సు పరిష్కరించాల్సిన అతి పెద్ద సమస్య ఇదేనని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ హామీ నెరవేర్చడంపై చర్యలు తీసుకోవాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాప్-26లో కొత్త హామీలేంటి?
ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు, మొదలైన కొద్ది రోజులపాటు కొన్ని దేశాలు కొత్త వాతావరణ, ఆర్థిక హామీలను ప్రకటించాయి.
2024 నాటికి సంవత్సరానికి 11.4 బిలియన్ డాలర్లు, అలాగే వాతావరణ అనుకూల చర్యల కోసం ప్రత్యేకంగా 3 బిలియన్ డాలర్లను అమెరికా హామీ ఇచ్చింది.
2020, 2025 మధ్య క్లైమేట్ ఫైనాన్స్ 11.6 బిలియన్ డాలర్లకు అంటే ఇప్పుడు ఇస్తున్నదానికి రెట్టింపు చేస్తామని బ్రిటన్ తెలిపింది.
2020, 2025 మధ్య తన వాతావరణ ఆర్థిక సహాయాన్ని రెట్టింపు (5.3 బిలియన్ డాలర్లు) చేస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
ఆసియాలో ఉద్గారాలను తగ్గించేందుకు వచ్చే అయిదేళ్లలో 10 బిలియన్ డాలర్లను ఇస్తామని జపాన్ వెల్లడించింది.
నార్వే తన అడాప్టేషన్ ఫైనాన్స్‌ను మూడు రెట్లు పెంచుతామని హామీ ఇవ్వగా, ఆస్ట్రేలియా తన సహకారాన్ని రెట్టింపు చేస్తామంది.
స్పెయిన్ 2025 నుండి తన క్లైమేట్ ఫైనాన్స్ వాగ్దానాన్ని 50% పెంచి సంవత్సరానికి 1.55 బిలియన్ డాలర్లను ఇస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ హామీలు సరిపోతాయా?
మొత్తం డబ్బులో ఎవరి వాటా ఎంత అన్నది లెక్కించి చెప్పడం కష్టం. ఎందుకంటే వీటిలోప్రభుత్వాలు ఇచ్చేవి, అంతర్జాతీయ రుణదాతలు ఇచ్చేవి, ప్రైవేట్ కంపెనీల నుండి వచ్చే నిధులు కలిసి ఉంటాయి.
కానీ, ప్రస్తుతం ఇచ్చిన హామీలు 2022 చివరి నాటికి సంవత్సరానికి 96 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
2023లో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటామని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది.
తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్డీసీ గ్రూప్, లక్ష్యసాధనలో ఆలస్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తోంది.
"2023 నాటికి 100 బిలియన్‌ల అమెరికన్ డాలర్లను ఇవ్వడం వేగంగా ఇచ్చినట్లు కాదు" అని ఈ గ్రూప్‌కు చెందిన గెబ్రూ జెంబర్ చెప్పారు.
2025 తర్వాత క్లైమేట్ ఫైనాన్సింగ్ కోసం దీర్ఘకాలిక, మరింత ప్రతిష్టాత్మకమైన లక్ష్యం కోసం కాప్-26 సదస్సులో ప్రణాళికలను రూపొందించారు.

ఫొటో సోర్స్, EPA
హామీలను పూర్తిగా నెరవేర్చని దేశాలు
''జీ-7 దేశాలలో జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ దేశాలు అగ్రగామిగా ఉన్నాయి" అని భట్టాచార్య చెప్పారు.
అదనపు నిధులపై చేసిన ప్రకటనలతో అమెరికా, బ్రిటన్‌లు అధికంగా నిధులు ఇచ్చే దేశాలలో మళ్లీ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, అమెరికా ఇంకా తాను ఇవ్వాల్సినంత ఇవ్వడం లేదన్న వాదన ఉంది.
భారీ మొత్తంలో కర్బన ఉద్గారాలకు కారణమైన సంపన్న దేశాలు మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
"100 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఏమీ కాదు. దీన్ని ట్రిలియన్లకు చేర్చాలి'' అని వాతావరణ మార్పు, పర్యావరణంపై పని చేసే గ్రాంథమ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అలీనా అవెర్చెంకోవా అన్నారు.
రాజకీయ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని కరోనా మహమ్మారి మనకు చూపించిందని ఆమె అన్నారు.
''దురదృష్టవశాత్తు వాతావరణ మార్పు కూడా అదే రకమైన అత్యవసర పరిస్థితిగా మారుతోంది. ఇది కూడా దీర్ఘకాలం మనతో ఉంటుంది" అన్నారు అవెర్చెంకోవా.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిధుల విషయంలో సమస్యలున్నాయా?
ఉన్నాయి. 2018 నాటికి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ చర్యల కోసం అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ సొమ్ములో మూడొంతుల వంతు రుణాల రూపంలో ఉంది. అంటే ఇవి తిరిగి చెల్లించాల్సినవి. చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్‌లు కాదు.
ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన దేశాలకు ఇది మరింత పెద్ద సమస్య. కోవిడ్ కారణంగా చాలా దేశాలు అప్పులు చేయాల్సి వచ్చింది.
రుణాల కంటే గ్రాంట్ల రూపంలో నిధులు ఎక్కువ కేటాయించాలని కాప్-26 సదస్సులో ఒప్పందం జరిగింది. అయితే, దాని నిబద్ధత ఎంత అన్నది ప్రశ్నార్ధకం.
"అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం రుణాలపై ఆధారపడలేవు. కాబట్టి గ్రాంట్లలో మరింత క్లైమేట్ ఫైనాన్స్ అందించడం అవసరం" అని డాక్టర్ అవెర్చెంకోవా చెప్పారు.
వాతావరణం విషయంలో పేద దేశాలు ఇస్తున్న సందేశం ఒక్కటే. మీరు ఎంత పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఆ సందేశం సారాంశం.

ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
- వరదలొస్తే నీటిని పీల్చేసుకునే నగరాలు.. స్పాంజ్ సిటీలను రూపొందిస్తున్న చైనా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపిస్తాం - టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









