హబీబ్‌గంజ్ స్టేషన్ పేరును రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా ఎందుకు మార్చారు?

ఫొటో సోర్స్, SHUREH NIYAZI
- రచయిత, షురైహ్ నియాజీ
- హోదా, బీబీసీ హిందీ, భోపాల్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్‌గంజ్ స్టేషన్ పేరును రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మార్చారు. ఈ నిర్ణయంతో మధ్యప్రదేశ్ చరిత్రలో రాణి కమలాపతి ప్రాముఖ్యతపై చర్చ మొదలైంది.
రాణి కమలాపతి ఒక గోండు రాణి. ఆమె గిన్నౌర్ రాజును వివాహం చేసుకున్నారు. ఆమెను గోండు రాజవంశపు చివరి రాణిగా పరిగణిస్తారు.
భోపాల్‌లోని కమల పార్క్‌కి కూడా ఆమె పేరునే పెట్టారు. ఆమె ప్యాలెస్ కూడా ఇందులో ఉంది. రాణి కమలాపతి చాలా అందంగా ఉండేవారని చెబుతుంటారు.
చరిత్రకారుల ప్రకారం.. భోపాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో గిన్నౌర్ కోట ఉంది. అందులోనే రాజా నిజాం షా ఉండేవారు. ఆ సమయంలో భోపాల్ కూడా నిజాం షా ఆధీనంలో ఉండేది.
నిజాం షా భార్య కమలాపతి
నిజాం షా ఒక గోండు రాజు. ఆయనకు ఏడుగురు భార్యలు ఉన్నారు. నిజాం షా ఏడుగురు భార్యల్లో కమలాపతి ఒకరు.
కానీ నిజాం షా మేనల్లుడు ఆలం షా తన మేనమామ ఆస్తిని దక్కించుకుని, కమలాపతిని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు.
ఒకరోజు ఆలం షా, తన మేనమామ నిజాం షా ఆహారంలో విషం కలపడంతో ఆయన మరణించారు.
నిజాం షా మరణానంతరం ఆయన రాజ్యాన్ని ఆలం షా స్వాధీనం చేసుకున్నాడు. నిజాం షా మరణానంతరం, రాణి కమలాపతి తన కుమారుడు నవల్ షాతో కలిసి భోపాల్‌లోని రాణి కమలాపతి మహల్‌లో నివసించడం ప్రారంభించారు.
కానీ రాణి కమలాపతి తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవారు. అలాంటి పరిస్థితిలో రాణి కమలాపతి స్నేహితుడైన మొహమ్మద్ ఖాన్ సహాయం కోరారు. ఆ సమయంలో మొహమ్మద్ ఖాన్ నేటి ఇస్లాంపూర్‌ను పాలించేవారు.

ఫొటో సోర్స్, SHUREH NIYAZI
మొహమ్మద్ ఖాన్
రాణి కమలాపతి తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని మొహమ్మద్ ఖాన్‌ను ఆశ్రయించారు. ప్రతిఫలంగా లక్ష అషర్ఫీలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో మొహమ్మద్ ఖాన్ ఆలం షాను చంపాడు.
దీని తరువాత మొహమ్మద్ ఖాన్‌కు రాణి కేవలం 50 వేల అషర్ఫీలను మాత్రమే ఇవ్వగలిగారు. మిగిలిన డబ్బుకు బదులుగా, ఆమె భోపాల్‌లో కొంత భాగాన్ని ఆయనకు ఇచ్చారు.
"రాణి కమలాపతి జీవించి ఉన్నంత వరకు, మొహమ్మద్ ఖాన్ ఆమెపై ఎప్పుడూ దాడి చేయలేదు. ఆమె మరణం తర్వాత మాత్రమే భోపాల్‌ను స్వాధీనం చేసుకున్నాడు" అని చరిత్రకారుడు శంభు దయాళ్ గురు తెలిపారు.
మొహమ్మద్ ఖాన్‌తో రాణి కమలాపతికి మంచి సంబంధాలు ఉన్నాయని శంభు దయాళ్ చెప్పారు.
ఇదే అంశంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఓ బ్లాగ్‌లో రాశారు.
"మొహమ్మద్ భోపాల్ రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. తన అంతఃపురానికి రావాలని, తనను వివాహం చేసుకోవాలని ఆయన కమలాపతి రాణికి ప్రతిపాదించారు.
దాంతో రాణి కమలాపతి 14 ఏళ్ల కుమారుడు నవల్ షా, మహమ్మద్ ఖాన్‌పై పోరాడటానికి తన 100 మంది యోధులతో లాల్ ఘాటికి వెళ్లారు. వీరి మధ్య భీకర యుద్ధం జరిగింది. అందులో నవల్ షా మరణించారు'' అని బ్లాగులో శివరాజ్ సింగ్ చౌహాన్ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఈ ప్రదేశంలో రక్తం ఏరులై పారడంతో నేల ఎర్రగా మారింది. అందుకే దీనికి లాల్ ఘాటి అని పేరు వచ్చింది. ఈ యుద్ధంలో రాణి కమలాపతికి చెందిన ఇద్దరు యోధులు ప్రాణాలతో బయటపడ్డారు. వారు తమ ప్రాణాలను కాపాడుకుంటూ మనుభాన్ కొండకు చేరుకున్నారు. యుద్ధంలో ఓడిపోయామని చెప్పారు.
ఈ విపత్కకర పరిస్థితిని చూసి రాణి కమలాపతి పెద్ద చెరువు ఆనకట్టకు చెందిన ఇరుకైన మార్గాన్ని తెరిపించారు. దీంతో పెద్ద చెరువులోని నీరు చిన్న చెరువులోకి ప్రవేశించడం ప్రారంభమైంది. రాజభవనంలోని సంపదను తనతోపాటూ తీసుకెళ్లి రాణి కమలాపతి జలసమాధి అయ్యారు"
"మొహమ్మద్ ఖాన్ కోటకు చేరుకునే సమయానికి అంతా అయిపోయింది. రాణి కమలాపతి బతికుండగా భోపాల్ పీఠాన్ని ఇతర మతస్తులకు దక్కనివ్వలేదు. రాణి కమలాపతి జీవితం 1723లో ముగిసింది. ఆమె మరణం తర్వాత భోపాల్ నవాబుల చేతిలోకి వెళ్లిపోయింది. మన సంస్కృతిని కాపాడటానికి కమలాపతి రాణి జలసమాధి అయి చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు'' అని రాశారు.

ఫొటో సోర్స్, SHUREH NIYAZI
సీఎం వాదనలపై అనేక ప్రశ్నలు
అయితే మొహమ్మద్ ఖాన్ కారణంగానే రాణి కమలాపతి తన జీవితాన్ని ముగించుకున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని భోపాల్‌లో హెరిటేజ్ వాక్ నిర్వహించిన చరిత్రకారుడు సికందర్ మాలిక్ అంటున్నారు.
''రాణి కమలాపతి తన జీవితాన్ని ముగించుకున్నారని చెబుతున్న చిన్న చెరువు అప్పట్లో లేదు'' అని సికందర్ మాలిక్ అన్నారు.
అదే సమయంలో, మరొక చరిత్రకారుడు రిజ్వాన్ అన్సారీ కూడా ఆ సమయంలో చిన్న చెరువు లేదని సికందర్ మాలిక్ వాదనలతో ఏకీభవిస్తున్నారు.
మొహమ్మద్ ఖాన్‌ను రాణి కమలాపతి తన సోదరుడిగా భావించేవారని రిజ్వాన్ అన్సారీ చెప్పారు.
"మొహమ్మద్ ఖాన్ కూడా రాణి కమలాపతిని తన సోదరిగా భావించి సహాయం చేశారు. ఆమె మేనల్లుడి నుండి ఆమెను రక్షించారు"
"ప్రతిఫలంగా రాణి కమలాపతి డబ్బు ఇవ్వడమే కాకుండా ఆయనకు భోపాల్‌లో ఎక్కువ భాగాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత రాణి కమలాపతి ఆయన రక్షణలోనే ఉండేవారు. రాణి కమలాపతి మరణం తర్వాత మొహమ్మద్ ఖాన్ మళ్లీ భూపాల్‌ని తన అధీనంలోకి తీసుకున్నారు" అని వివరించారు.
మరోవైపు, భోపాల్‌లోని హబీబ్‌గంజ్ స్టేషన్ పేరును మార్చడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి రజనీష్ అగర్వాల్ మాట్లాడుతూ రాణి కమలాపతి చరిత్ర గర్వకారణమని అన్నారు.
ఒక పేరుతో ఉన్న బోర్డును తీసివేసి, మరొకటి తగిలించడం మాత్రమే కాదు.. చరిత్ర వైభవాన్ని పునరుద్ధరించేందుకు చేసిన ఒక సాంస్కృతిక, వారసత్వ ప్రస్తావన అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మధ్యప్రదేశ్ అడవుల్లో కూలీల వేషాల్లో చిత్తూరు పోలీసుల సాహసాలు
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- డేవిడ్ బ్యూక్: ‘లక్షల కోట్ల కంపెనీకి ఆద్యుడు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చనిపోయాడు’
- మానేరు చెక్ డ్యామ్ విషాదం: ఒకరిది ఈరోజు పుట్టిన రోజు, ఇంకొకరు లేక లేక పుట్టారు.. విషాదంలో తల్లిదండ్రులు
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- IPLలో కెప్టెన్‌గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. తన దేశానికి వరల్డ్ కప్ అందించాడు
- సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగించాలన్న ప్రధాని మోదీ నిర్ణయంపై వివాదం ఎందుకు
- హార్దిక్ పాండ్య: రూ. 5 కోట్లు కాదు ఆ వాచీల ధర రూ. 1.5 కోట్లే
- ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









