మానేరు చెక్ డ్యామ్ విషాదం: ఒకరిది ఈరోజు పుట్టిన రోజు, ఇంకొకరు లేక లేక పుట్టారు.. విషాదంలో తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, ugc
తెలంగాణలో సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు మానేరు వాగులో గల్లంతయ్యారు.
వీరిలో ఐదుగురి మృతదేహాలను వెలితీసారు. మిగిలిన ఒకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో 9 మంది విద్యార్థులు మానేరులోని చెక్ డ్యామ్ దగ్గరకు సైకిళ్లపై వచ్చారు. వీరంతా సిరిసిల్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 7,8,9 తరగతుల్లో చదువుతున్నారు.
సరదాగా కాసేపు ఇసుకలో సైకిల్ తొక్కిన తర్వాత ఆరుగురు విద్యార్థులు స్నానం చేయడానికి మానేరులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం, ఈత రాకపోవడంతో అందరూ నీటిలో మునిగిపోయారు.
ఒడ్డున ఉన్న మిగతా ముగ్గురు విద్యార్థులు భయంతో ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పడంతో ఈ విషాదం గురించి తెలిసింది.
విద్యార్థుల కుటుంబ సభ్యుల సమాచారంతో మానేరు దగ్గరకు చేరుకున్నపోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గజఈతగాళ్ల సాయంతో నిన్న మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.
రాత్రి వర్షం వల్ల గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, ఈరోజు ఉదయం మళ్లీ వాటిని ప్రారంభించారు.
గల్లంతైన విద్యార్థుల్లో గణేష్, జడల సాయి, సింగం మనోజ్, తీగల అజయ్, రాకేశ్, శ్రీరాం క్రాంతికుమార్ ఉన్నారు.
ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గల్లంతైన విద్యార్థుల్లో ఒకరైన శ్రీరాం క్రాంతి కుమార్‌కు ఈరోజు పుట్టినరోజు కావడంతో అతడి కుటుంబ సభ్యులను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.
మానేరులో మునిగి చనిపోయిన మరో విద్యార్థి రాకేష్ తమకు పెళ్లైన 13 ఏళ్లకు పుట్టాడని చెబుతూ అతడి తల్లితండ్రులు రోధించడం అందరినీ కలచివేసింది.

ఫొటో సోర్స్, UGC
తెగిన చెక్ డ్యాం దగ్గర లోతు తెలీక దిగారు
మానేరు వాగులో విద్యార్థులు గల్లంతైన ప్రాతంలో నిర్మించిన చెక్‌డ్యాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగడంతో అక్కడ లోతుగా ఒక గుంటలా ఏర్పడింది.
అదే ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఇసుక తవ్వకాలతో అది మరింత ప్రమాదకరంగా మారింది.
ఇదేదీ తెలియని విద్యార్థులు తమకు ఈత రాకపోయినా స్నానాలు చేయాలని ఆ గుంట ఉన్న ప్రాంతంలోనే దిగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఫొటో సోర్స్, UGC
ఘటనపై దర్యాప్తు చేస్తాం- ఎస్పీ
కొనసాగుతున్న గాలింపు చర్యల గురించి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడారు. ఉదయం ఘటనా స్థలం దగ్గరకు వచ్చిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మృతదేహాల వెలికితీత చర్యలను పర్యవేక్షించారని తెలిపారు.
"నిన్న మధ్యాహ్నం 9 మంది విద్యార్థులు మానేరు వాగు దగ్గరకు వచ్చారు. వారిలో ఆరుగురు స్నానానికి దిగి గల్లంతయ్యారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్నీ వెలికి తీసిన తర్వాత ఈ ఘటనపై దర్యాప్తు చేస్తాం" అని ఎస్పీ రాహుల్ హెగ్డే స్థానిక మీడియాకు తెలిపారు.
ప్రాజెక్టుల దగ్గర రక్షణ చర్యలు-కేటీఆర్
మానేరులో ఆరుగురు విద్యార్థులు గల్లంతవడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న జల వనరులన్నీ నిండుగా ఉండడంతో, జనం ఆయా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు.
జిల్లాలోని ప్రాజెక్టుల దగ్గర కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- అలెగ్జాండర్ ‘గ్రేట్’ కాదా? యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు? పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- IPLలో కెప్టెన్‌గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. తన దేశానికి వరల్డ్ కప్ అందించాడు
- గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








