ఉజ్జయిని: ‘ముస్లిం చిరువ్యాపారిని బెదిరించి జై శ్రీరాం అనిపించిన యువకులు’

అబ్దుల్ రషీద్
ఫొటో క్యాప్షన్, అబ్దుల్ రషీద్
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ ముస్లింతో బలవంతంగా జైశ్రీరాం అని పలికించారన్న ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తుక్కు వ్యాపారం చేసే ఆ వ్యక్తిని జైశ్రీరాం అనాలంటూ బలవంతం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఉజ్జయినికి 60 కిలోమీటర్ల దూరంలోని ఝరడా స్టేషన్ పరిధిలోని సేంకలీ గ్రామంలో జరిగింది.

దీనిపై సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి ఆర్‌కే రాయ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''ఈ కేసులో ఈశ్వర్ సింగ్, కమల్ సింగ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరినీ కస్టడీకి పంపించాం'' అన్నారు.

రషీద్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, రషీద్ ఇల్లు

ఇంతకీ ఏం జరిగింది?

ఉజ్జయినిలోని మాహిద్‌పుర్‌లోని ఫకీర్ మొహల్లాలో నివసించే 44 ఏళ్ల అబ్దుల్ రషీద్ గత 20 ఏళ్లుగా తుక్కు సేకరించే వ్యాపారం చేస్తున్నారు.

సమీప గ్రామాల్లో తిరుగుతూ తుక్కు, పాత వస్తువులు కొని మాహిద్‌పుర్‌లోని పెద్ద తుక్కు దుకాణాలకు విక్రయిస్తారు.

శనివారం సెంకలీ గ్రామంలో తుక్కు కొనుగోలు చేస్తుండగా ఇద్దరు యువకులు వచ్చి ఎవరి అనుమతితో ఇక్కడ వ్యాపారం చేస్తున్నావంటూ గదమాయించారు.

ఆ తరువాత ఆయన్ను కొట్టారు. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అబ్దుల్ రషీద్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''నేను సెంకిలిలో తుక్కు కొంటున్నాను. మోటార్ ‌సైకిల్ మీద వచ్చిన కొందరు యువకులు నన్ను ఆపి, ఎవరు నువ్వు? ఎవరినడిగి ఇక్కడ తుక్కు కొంటున్నావు? అన్నారు. నా బండిలో ఉన్న తుక్కంతా విసిరేసి నాతో దురుసుగా ప్రవర్తించారు'' అన్నారు.

ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ చాలామంది ఉన్నారని, వారంతా మౌనంగా ఉండిపోయారని రషీద్ చెప్పారు.

''నేను ఆ గ్రామం నుంచి వచ్చేస్తుండగా నన్ను మోటా‌ర్ సైకిళ్లపై వెంబడించారు. దారిలో ఆపి జైశ్రీరాం అని పలికించారు'' అన్నారు రషీద్.

ఈ ఘటన తరువాత రషీద్ బాగా భయపడిపోయారు.

''నేనీ విషయం ఎవరికీ చెప్పలేదు. చాలా భయపడ్డాను. కానీ, ఆ కుర్రాళ్లే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. అది చూసిన కొందరు నాకు ధైర్యం చెప్పడంతో నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను'' అన్నారు రషీద్.

FIR
ఫొటో క్యాప్షన్, ఎఫ్ఐఆర్ కాపీ

పోలీసులు భరోసా ఇచ్చారు

''పోలీసులకు జరిగిందంతా చెప్పాను. వారు ఆ ఇద్దరు కుర్రాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నాతో దురుసుగా ప్రవర్తించిన కుర్రాళ్లను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు''

కాగా ''వెంటనే చర్యలు తీసుకున్నాం. ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశాం. ముందుముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఎస్‌డీఓపీ ఆర్‌కే రాయ్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇలా జరుగుతుందని ఏనాడూ అనుకోలేదు

ఇరవయ్యేళ్లుగా తాను ఇదే ప్రాంతంలో తిరుగుతున్నానని.. తనను ఇంతవరకు ఎవరూ అడ్డుకోలేదని రషీద్ చెప్పారు.

''నేనొక పేదవాడిని. తుక్కు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా పని నేను నిర్భయంగా చేసుకుంటుండేవాడిని. ఇలా జరుగుతుందని ఏనాడూ అనుకోలేదు'' అన్నారు రషీద్.

ఈ ఘటన తరువాత తనకు చాలా భయం వేస్తోందని చెప్పారాయన.

ఇకపై ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతూ వెళ్లాలి. బయటకు వెళ్లకపోతే కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా అని ఆవేదన చెందారు రషీద్.

రషీద్ ఇల్లు

''ఇలాంటి ఘటనలు ఉజ్జయిని ప్రాంత ముస్లింలలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్థానిక ముస్లింలకు భరోసా కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.

ఈ కేసులో కూడా ఎఫ్ఐఆర్ కనుక నమోదు కాకపోతే ఎన్నో కేసుల్లా ఇదికూడా మరుగున పడిపోయేది'' అన్నారు ఉజ్జయినికి చెందిన సామాజిక కార్యకర్త షఫీ నాగోరీ.

'ఈ ప్రాంతంలో ఇటీవల ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాలక పార్టీకి చెందిన హిందూత్వకార్యకర్తలు వీటి వెనుక ఉన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటివి ఆగవు'' అన్నారు షఫీ.

బజరంగదళ్ ఉజ్జయిని యూనిట్ ఇన్‌చార్జ్ నీరజ్ కౌశల్ దీనిపై మాట్లాడుతూ.. హిందూ సంస్థల కార్యకర్తలెవరూ ఈ ప్రాంతంలో ఇలాంటి దాడికి పాల్పడలేదని చెప్పారు.

''ఇది పాత వీడియో అయినా కావొచ్చు, లేదంటే సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేందుకైనా ఎవరో వైరల్ చేసి ఉండొచ్చు'' అన్నారు.

''కొద్దిరోజుల కిందటే మొహర్రం జరిగింది.. ముస్లింలు ర్యాలీ తీస్తే ఎవరూ అడ్డుకోలేదు కదా. కానీ, ఇక్కడ తాలిబాన్ తరహా ఆలోచనలున్న కొందరు సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)