సౌదీ అరేబియా: మక్కాలో దాడులు ఎందుకు జరుగుతున్నాయి... మహదీలంటే ఎవరు?

జుహేమాన్ అల్-ఒతాయ్బీ

ఫొటో సోర్స్, Getty Images/AFP

ఫొటో క్యాప్షన్, 1979లో మక్కాపై జరిగిన భారీ దాడికి సంబంధించి ఉరిశిక్షకు గురైన 63 మందిలో ఒకరైన జుహేమాన్ అల్-ఒతాయ్బీ

సౌదీ అరేబియాలో మక్కాలోని ఒక ఇమామ్ మీద రెండు వారాల కిందట దాడి యత్నం జరిగింది. దీనిపై సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మక్కాలో ప్రార్థనలు జరిగినప్పుడు అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి హఠాత్తుగా ఇమామ్ ప్రసంగిస్తున్న వేదిక వైపు పరిగెత్తాడని సౌదీ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఘటన జరిగినపుడు టీవీలో లైవ్ వస్తోంది. మక్కాలో ధరించే పవిత్ర దుస్తులలో ఉన్న ఆ వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకుని కింద పడేయడం దృశ్యాల్లో కనిపించింది.

ప్రాథమిక దర్యాప్తులో దాడికి ప్రయత్నించిన వ్యక్తి సౌదీ పౌరుడేనని తేలిందని, అతడు తనను తాను ఇమామ్ మహదీ అని చెప్పుకున్నాడని అరబ్ న్యూస్ పత్రిక రాసింది.

అధికారులు ఆయన మానసిక స్థితి గురించి తెలుసుకోడానికి వైద్య పరీక్షలు చేయించినట్లు గల్ఫ్ న్యూస్ పత్రిక చెప్పింది.

మక్కా మసీదు

ఫొటో సోర్స్, Reuters

ఇమామ్ మహదీ అంటే...

ఇస్లాంలో ఇమామ్ మహదీ అనే భావన ప్రధానంగా షియా సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది సున్నీ ముస్లింలు కూడా దీనిని విశ్వసిస్తారు.

తమ మొదటి ఇమామ్ హజరత్ అలీ అని, చివరి అంటే 12వ ఇమామ్ జమానా అంటే ఇమామ్ మహదీ అని షియాలు భావిస్తారు. అరబిక్‌లో మహదీ అంటే 'సరిగా వివరించినది' అని అర్థం

ఇమామ్ మహదీని విశ్వసించేవారు, యుగాంతం సమయంలో ఇమామ్ మహదీ వస్తారని, అంతటా న్యాయం, శాంతి నెలకొనేలా చేస్తారని భావిస్తారు.

ఎన్నో దశాబ్దాలుగా చాలా మంది తమను తాము మహదీగా ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఇస్లాం ప్రపంచానికి కొత్త జీవితం ఇవ్వడానికే తాము వచ్చామని చెప్పుకుంటున్నారు. అయితే, సున్నీ సంప్రదాయంలోని చాలా మంది వారిని అంగీకరించడం లేదు.

కొంతమంది సంప్రదాయ సున్నీ ముస్లింలు మహదీ భావన గురించి పవిత్ర ఖురాన్‌లో, సున్నాలో ఎలాంటి ప్రస్తావన లేదని, దానిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మక్కాలో దాడి

ఫొటో సోర్స్, Reuters

మక్కాలో దాడుల ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా కాబా పరిసరాల్లో కత్తితో తిరుగుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అనుమానితుడు మసీదు మొదటి అంతస్తులో తీవ్రవాద గ్రూపులకు మద్దతుగా నినాదాలు చేశాడని, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశామని ఆ సయమంలో మక్కా ప్రతినిధి చెప్పారని గల్ఫ్ న్యూస్ పత్రిక ఒక రిపోర్టు ప్రచురించింది.

ఆ ఘటనకు సంబంధించి ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో పవిత్ర దుస్తులు, మాస్క్ ధరించిన ఒక వ్యక్తి చేతిలో కత్తితో మాట్లాడుతూ నడవడం కనిపిస్తుంది. చుట్టుపక్కల వారు అతడిని చూస్తుంటారు. తర్వాత భద్రతా సిబ్బంది అక్కడకు వస్తారు.

2017 జూన్‌లో కూడా కాబాపై దాడికి ప్రయత్నం జరిగినట్టు ఒక వార్త వచ్చింది. మక్కాలో కాబా పవిత్ర మసీదును లక్ష్యంగా చేసుకున్న ఒక మిలిటెంట్ ఎత్తులను చిత్తు చేశామని అప్పుడు అప్పుడు సౌదీ అరేబియా చెప్పింది.

ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు వసతి భవనంలో ఉన్నప్పుడు భద్రతా బలగాలు అతడిని చుట్టుముట్టాయని, దాంతో, అతడు తనను తాను పేల్చుకున్నాడని అప్పటి సౌదీ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

ఆ పేలుడులో భవనం కూలిపోవడంతో పోలీసుల సహా 11 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు అనుమానిత మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

మక్కాలో కాబా

ఫొటో సోర్స్, Reuters

1979లో మక్కా చరిత్రలో అతిపెద్ద దాడి

మక్కాపై ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో అతిపెద్ద దాడి 42 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు కూడా తనను తాను మహదీగా చెప్పుకున్న ఒక వ్యక్తి, తన మద్దతుదారులతో కాబా మసీదును తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

ఆ సంక్షోభం 15 రోజులపాటు కొనసాగింది. ఆ సమయంలో ఆ గ్రూప్ వందల మందిని బందీలుగా పట్టుకుంది. అప్పుడు జరిగిన భీకర ఘర్షణల్లో చాలా మంది చనిపోయారు.

ఈ దాడి 1979లో జరిగింది. నవంబర్ 20న దేశవిదేశాల నుంచి వచ్చిన యాత్రికులు మక్కాలో సాయంత్రం నమాజు కోసం వేచిచూస్తున్నప్పుడు అది జరిగింది.

నమాజు ముగిసే సమయంలో తెల్లటి బట్టలు వేసుకున్న దాదాపు 200 మంది ఆటోమేటిక్ ఆయుధాలు బయటికి తీశారు. వారిలో కొందరు ఇమామ్‌ను చుట్టుముట్టారు. మసీదు మైక్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని, ఇక మహదీ వస్తున్నారని చెప్పారు.

ఈ సాయుధ సున్నీ ముస్లిం సలాఫీ వర్గానికి బధూ మూలాలున్న సౌదీ యువ మత ప్రభోదకుడు జుహేమాన్ అల్-ఒతాయ్బీ నేతృత్వం వహించాడు.

కాసేపటి తర్వాత ఆయన బావ మరిది మొహమ్మద్ అబ్దుల్లా అల్-కహ్తానీ ముందుకొచ్చి నేనే ఇమామ్ మహదీ అన్నాడు.

మక్కాలో దాడి

ఫొటో సోర్స్, Getty Images/AFP

తర్వాత సౌదీ ప్రభుత్వం మసీదును తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేలమంది సైనికులను, విదేశీ బలగాలను మక్కా దగ్గరికి పంపింది.

మసీదు లోపల బలప్రయోగానికి సౌదీ అరేబియా రాజ పరివారం మత పెద్దల అనుమతి కూడా కోరింది.

తర్వాత కొన్ని రోజులపాటు అక్కడ ఘర్షణ కొనసాగింది. మసీదులోని ఒక పెద్ద భాగం ధ్వంసమైంది.

మసీదును మిలిటెంట్ల నుంచి విడిపించడానికి పాకిస్తాన్ కూడా ఒక కమాండో టీమ్‌ను సౌదీకి పంపించింది.

కొంతమంతి ఫ్రెంచ్ కమాండోలు కూడా రహస్య ఆపరేషన్ కింద సౌదీ అరేబియా వచ్చారు. లోపల ఉన్నవారిని ఎదుర్కోడానికి సౌదీ భద్రతా బలగాలకు సాయం చేశారు.

ఈ సంక్షోభం 1979 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 4 వరకూ కొనసాగింది. లోపలున్న సున్నీ సలాఫీ వర్గంలో చాలా మంది చనిపోయారు, కొంతమంది లొంగిపోయారు.

తనను తాను ఇమామ్ మహదీగా చెప్పుకున్న అల్-కహ్తానీ కూడా ఈ ఘర్షణల్లో చనిపోయాడు.

మొత్తం 63 మందికి సౌదీ అరేబియా ఉరిశిక్ష విధించింది. వారిలో జుహేమాన్ అల్-ఒతాయ్బీ కూడా ఉన్నారు. మిగతావారిని జైళ్లలో పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)