జ్యోతిరాదిత్య సింధియా: గ్వాలియర్ రాకుమారుడు, అత్యంత సంపన్న రాజకీయవేత్త గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన తండ్రి మాధవ్‌రావ్ సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణా లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉండేవారు.

2001 సెప్టెంబర్ 30న ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మాధవ్‌రావ్ చనిపోయారు.

ఈ స్థానం నుంచి తొమ్మిదిసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1971 నుంచి ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదని చెప్తారు. జన్ సంఘ్ పార్టీ టికెట్ మీద కూడా ఆయన పోటీచేశారు.

ఆయన తల్లి కిరణ్ రాజ్యలక్ష్మీదేవి.. కాస్కీ, లాంజంగ్ మహారాజు జుద్ధా షంషేర్ జంగ్ బహదూర్ రాణా మునిమనుమరాలు. గైక్వాడ్ మరాఠా సంస్థానానికి చెందిన ప్రియదర్శిని రాజే సింధియాతో జ్యోతిరాదిత్య వివాహం జరిగింది.

మాధవ్‌రావ్‌ సింధియా, రాజీవ్‌గాంధీ

ఫొటో సోర్స్, JYOTIRADITYA M SCINDIA @FACEBOOK

ఫొటో క్యాప్షన్, మాధవ్‌రావ్‌ సింధియా, రాజీవ్‌గాంధీ

రాజకీయ ప్రవేశం...

మాధవ్‌రావ్ 2001లో చనిపోయిన తర్వాత మూడు నెలలకు ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య గుణా సీటులోనే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

మొదటిసారి 2002లో గెలిచిన ఆయన.. 2004, 2009, 2014ల్లో కూడా వరుసగా గెలుపొందారు.

అయితే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుణా సీటులో బీజేపీ అభ్యర్థి, ఒకప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోవటంతో జ్యోతిరాదిత్య ఆత్యస్థైర్యం దెబ్బతిన్నదని పరిశీలకులు చెప్తారు.

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, JYOTIRADITYA M SCINDIA @FACEBOOK

అత్యంత సంపన్న రాజకీయవేత్త...

సింధియాలు గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందినవాళ్లు. జ్యోతిరాదిత్య తాత జివాజీరావ్ సింధియా గ్వాలియర్ సంస్థానం చివరి పాలకుడు.

భారతదేశంలోని అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో జ్యోతిరాదిత్య సింధియా ఒకరు. తాత, తండ్రుల నుంచి ఆయన వారసత్వంగా పొందిన ఆస్తుల విలువ దాదాపు రూ. 25,000 కోట్లు ఉంటుంది. ఆయన కోర్టుకు సమర్పించిన 'చట్టబద్ధమైన వారసత్వ పిటిషన్' ఈ విషయం చెప్తోంది.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జ్యోతిరాదిత్య కేంద్రమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 2007లో సమాచారం, ఐటీ శాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009లో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా, 2014లో విద్యుత్ శాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు.

యూపీఏ మంత్రిమండలిలోని యువ మంత్రుల్లో ఆయన ఒకరు. కేంద్రమంత్రిగా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని ఆయనకు పేరుంది.

జ్యోతిరాదిత్య సింధియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, JYOTIRADITYA M SCINDIA @FACEBOOK

కరెంటు వివాదం...

జ్యోతిరాదిత్య 2012లో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కుప్పకూలింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విద్యుత్ వైఫల్యం అది.

ఆయన మంత్రి పదవుల్లో ఉన్నపుడు ఇతరత్రా ఎటువంటి వివాదాలేవీ లేనప్పటికీ.. పవర్ గ్రిడ్ కుప్పకూలి దేశమంతటా విద్యుత్ పోవటంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. యూపీఏ సంకీర్ణ భాగస్వాముల నుంచే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, JYOTIRADITYA M SCINDIA @FACEBOOK

క్రికెట్ ప్రేమికుడు...

జ్యోతిరాదిత్య ద డూన్ స్కూల్, హార్వర్డ్ కాలేజ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. ఆయనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.

భారత క్రికెట్ అసోసియేషన్ల పనితీరు మీద చాలా విమర్శలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా భారత క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం సందర్భంగా నిశిత విమర్శలు ఎక్కుపెట్టారు.

ఆయన విమర్శల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శి పదవికి సంజయ్ జగ్దలే రాజీనామా చేయాల్సి వచ్చింది.

కేపీఎస్ యాదవ్

ఫొటో సోర్స్, GOPAL BHARGAVA @FACEBOOK

ఫొటో క్యాప్షన్, కేపీఎస్ యాదవ్ చేతిలో జ్యోతిరాదిత్య ఓడిపోయారు

ఎన్నికల్లో ఓటమి...

2019 లోక్‌సభ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా బలంగా ప్రచారం చేసినప్పటికీ.. ప్రత్యర్థి కృష్ణ పాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పక్కన కమ్‌ల్‌నాథ్, జ్యోతిరాదిత్య ఇద్దరూ ఉండేవారు. కమల్‌నాథ్‌ను 'ప్రస్తుత అనుభవశాలి నాయకుడు' అని, జ్యోతిరాదిత్యను 'భవిష్యత్ నాయకుడు' అని రాహుల్ అభివర్ణించేవారు.

ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాకపోయినప్పటికీ.. జ్యోతిరాదిత్య తాను ముఖ్యమంత్రిని కావాలని బలంగా కాంక్షించారని విశ్లేషకులు చెప్పారు. అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించిందని.. అయితే ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కనీసం సగం మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని నిరూపించుకోవాలని ఆయనకు సూచించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కానీ జ్యోతిరాదిత్య కేవలం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కూడగట్టగలిగారని, దీంతో కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు.

జ్యోతిరాదిత్య సింధియా, రాహుల్ గాంధీ, కమల్‌నాథ్

ఫొటో సోర్స్, Twitter/RahulGandhi

ఫొటో క్యాప్షన్, జ్యోతిరాదిత్య సింధియా, రాహుల్ గాంధీ, కమల్‌నాథ్

గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం

గాంధీ కుటుంబంతో ప్రత్యేకించి రాహుల్‌గాంధీతో జ్యోతిరాదిత్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు.

అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఆయనకు చాలా విషయాల్లో పొసిగేది కాదు.

రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు మీద చాలా సార్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేసేవారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సింధియాను నియమించే అంశాన్నీ పార్టీ పరిగణనలోకి తీసుకుందని భోపాల్‌లో కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించే ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.

అయితే.. సింధియా ప్రభావం కేవలం చంబల్ లోయకు మాత్రమే పరిమితమని, రాష్ట్రమంతటి మీదా ఆయనకు పట్టు లేదని పార్టీ సీనియర్ నాయకులు వాదించినట్లు కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా తనను పార్టీ నామినేట్ చేస్తుందని కూడా జ్యోతిరాదిత్య ఆశించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ.. ఈ రాష్ట్రం నుంచి దిగ్విజయ్ సింగ్, ప్రియాంక గాంధీలు రాజ్యసభకు వెళ్తారన్న ఊహాగానాలు రావడంతో జ్యోతిరాదిత్య నిరాశచెందారు.

జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్

ఫొటో సోర్స్, JYOTIRADITYA M SCINDIA @FACEBOOK

సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు

మధ్యప్రదేశ్‌లోని సొంత పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు కొనసాగించారు సింధియా. తాజాగా ఫిబ్రవరి 18వ తేదీన తికామ్‌గఢ్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. '2018 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే రోడ్డెక్కి ఆందోళనలు చేపడతా' అని హెచ్చరించారు.

దీనిపై కమల్‌నాథ్ విలేకరుల సమావేశంలో స్పందిస్తూ.. ''అలాగే చేయనివ్వండి'' అని వ్యాఖ్యానించారు.

కానీ.. పార్టీలో ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులు చెప్తూ వచ్చాయి. సింథియా పార్టీని వీడిన రోజు ఉదయం కూడా ఇదే విధంగా స్పందించాయి.

సింథియా రాజీనామా

ఫొటో సోర్స్, TWITTER / SCINDIA

రాజీనామా...

జ్యోతిరాదిత్య సింధియా మార్చి 9వ తేదీనే రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. కానీ, మరుసటి రోజు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీలను ఆయన కలిసిన తర్వాతే ఆ రాజీనామా లేఖ బయటకువచ్చింది.

విభేదాలను పార్టీలోనే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని జ్యోతిరాదిత్య ఇదివరకు చెబుతూ వచ్చారు. అయితే, ఆయన సన్నిహితుడు మహేంద్ర సింగ్ సిసోడియా ప్రకటన.. జరగబోయే పరిణామాల గురించి ముందుగానే సంకేతాలు ఇచ్చింది.

''మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చబోం. కానీ జ్యోతిరాదిత్యను నిర్లక్ష్యం చేసిన మరుదినం ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడుతుంది'' అని సిసోడియా చెప్పారు.

జ్యోతిరాదిత్య తన రాజీనామా గురించి ప్రకటించటానికి ముందే.. ఆయనకు సన్నిహితులని భావించే 17 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు, గురుగ్రామ్‌లకు తరలించారు. ఇది కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది.

జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ డ్రామా...

ఈ పరిణామంతో కమల్‌నాథ్ ప్రభుత్వం అసమ్మతిని ఎదుర్కొంటోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కమల్‌నాథ్ సైతం మార్చి 9న సోనియాగాంధీని కలిశారు. కానీ పరిస్థితిని నియంత్రించటం కోసం వెంటనే మధ్యప్రదేశ్ వెళ్లిపోయారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి వివరించటానికి.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా మార్చి 9న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఇతర సీనియర్ నాయకులను కలిశారు.

ఇప్పుడు.. జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె.సి.వేణుగోపాల్ ప్రకటించటంతో.. బీజేపీలో జ్యోతిరాదిత్య చేరికకు రంగం సిద్ధమైంది.

జ్యోతిరాదిత్యకు రాజ్యసభ సభ్యత్వం కల్పించడంతోపాటు కేంద్ర కేబినెట్‌లో పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. జ్యోతిరాదిత్య విషయంలో ఏ నిర్ణయమైనా పార్టీ పార్లమెంటరీ కమిటీ, పార్టీ రాష్ట్ర శాసనసభా పక్ష కమిటీ సమావేశం తర్వాతే ఉంటాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)