మోదీ మంత్రివర్గ విస్తరణ: 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర క్యాబినెట్ విస్తరణకు కొన్ని గంటల ముందు 12 మంది మంత్రులు రాజీనామా చేశారు.
వారి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్దన్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఆ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రి, రసాయనాలు, ఎరువుల శాఖమంత్రి డి.వి. సదానందగౌడ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబూలాల్ సుప్రియో రాజీనామాలు సమర్పించారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పోఖ్రియాల్ పేర్కొన్నారు.
అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
రాజీనామా చేసిన వారి జాబితా

ఫొటో సోర్స్, ugc
ఎంపీలతో ప్రధాని సమావేశం
అంతకుముందు మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎంపీలతో ప్రధాని మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, ANI
మరోవైపు కొత్తగా మంత్రి వర్గంలో చేరనున్నట్లు భావిస్తున్నా పలువురు నేతలు దిల్లీకి చేరుకుంటున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ ఉదయం ప్రధానమంత్రిని కలుసుకున్నారు.
అలాగే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు నేతలు, బీజేపీ నాయకులు కూడా ప్రధానమంత్రితో సమావేశమయ్యారు
ఇది వరకు కూడా జరిగింది...
తొలిసారి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మోదీ మూడుసార్లు మంత్రి వర్గాన్ని విస్తరించారు.
2014 మేలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే నవంబరులో క్యాబినెట్ విస్తరణ జరిగింది.
అయితే కొన్ని నెలల్లో అంటే 2015 ప్రథమార్ధంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
2016లో రెండో సారి మోదీ క్యాబినెట్‌ను విస్తరించారు. ఒక సంవత్సరం తర్వాత ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.మూడోసారి 2017లో క్యాబినెట్‌ను విస్తరించారు. ఆ తర్వాతి ఏడాది మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఇప్పుడు రెండో దఫా ఏర్పాటైన మోదీ ప్రభుత్వంలోని క్యాబినెట్‌ను 2021, జులై 7న విస్తరిస్తున్నారు.
వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలతో వీటిని ముడిపెట్టొచ్చు. ఎందుకంటే గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే మంత్రి వర్గాన్ని విస్తరించారు.
మోదీ ప్రభుత్వ పని తీరును దగ్గరుండి గమనించేవారికి.. మంత్రి వర్గ విస్తరణకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య సంబంధం బోధపడుతుంది.
మంగళవారం నియమించిన గవర్నర్ల పదవులను చూసిన కూడా ఇదే విషయం స్పష్టం అవుతుంది.

ఫొటో సోర్స్, ANI
ఎవరికి చోటు దక్కుతుంది?
ప్రస్తుతం మోదీ క్యాబినెట్‌లో 50 మందికిపైగా మంత్రులు ఉన్నారు. లోక్‌సభలోని సభ్యులను ప్రకారం చూస్తే, క్యాబినెట్‌లో 81 మంది వరకు మంత్రులు ఉండొచ్చు.
అంటే ఇప్పుడు రెండు డజన్ల మందికిపైగా మంత్రులుగా బాధ్యతలు తీసుకునే అవకాశముంది.
కొత్తగా ఎవరు మంత్రులు అవ్వబోతున్నారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ, దిల్లీకి పయనమైన నాయకులు మాత్రం బెర్తుల రేసులో ముందున్నారని చెప్పొచ్చు.
ఇప్పుడు దిల్లీకి చేరుకున్న నాయకుల్లో కాంగ్రెస్ మాజీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే, పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు మాత్రమే తాను దిల్లీకి వస్తున్నానని రాణె ఇప్పటికే మీడియాతో చెప్పారు.
దీంతోపాటు వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అందువల్ల ఈ రాష్ట్రాల నాయకులకు క్యాబినెట్‌లో ప్రాధాన్యమిచ్చే అవకాశముంది.
ఈ జాబితాలో అనుప్రియా పటేల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమెను ఉత్తర్ ప్రదేశ్‌లో పార్టీ బీసీ ప్రతినిధిగా ప్రజల ముందుకు తీసుకెళ్లే యోచనలో బీజేపీ ఉంది. ఇటీవల ఈమె అమిత్ షాను కూడా కలిశారు.
జేడీయూకు అవకాశం
గత కొన్ని రోజులుగా దిల్లీ చుట్టూ తిరుగుతున్న నేతల్లో జేడీయూ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ కూడా ఉన్నారు. జేడీయూ..ఎన్డీయేకు మిత్రపక్షం.
ప్రస్తుతం సింగ్‌కు కూడా బెర్తు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు, ఈ విషయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కూడా అవునన్నట్లుగానే తలూపారు.
''ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు సింగ్ వెల్లడిస్తారు. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారో నాకు తెలీదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఏం జరగాలో అదే జరుగుతుంది''అని నీతీశ్ వ్యాఖ్యానించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే తక్కువ స్థానాలనే జేడీయూ గెలుచుకుంది. అయినప్పటికీ, జేడీయూ నాయకుడైన నీతీశ్ కుమార్‌నే సీఎంగా కూర్చోబెట్టింది బీజేపీ.
బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహకం
ఇటీవల ఎల్జేపీ లోక్‌సభా పక్ష నేతగా ఎన్నికైన పశుపతి పరాశ్‌కు కూడా మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ వార్తలపై చిరాగ్ పాసవాన్ సానుకూలంగా స్పందించడం లేదు.
ఎల్జేపీ కోటాలో పశుపతి మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే, ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందని చిరాగ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ముందుండి నడిపించి, మంచి ఫలితాలు రాబట్టిన నాయకులకు కూడా ఈ దఫా మంత్రులుగా అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి.
ఈ జాబితాలో వినిపిస్తున్న పెద్ద పేరు సర్బానంద్ సోనోవాల్. ఇటీవల ఈయన అసోం సీఎం పదవిని వదిలేశారు. దీంతో ఈయన్ను కేంద్రానికి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
బిహార్ డిప్యూటీ సీఎం పదవిని వదిలిపెట్టిన సుశీల్ మోదీ పేరు కూడా బెర్తు దక్కించుకునే నాయకుల జాబితాలో వినిపించింది. అయితే, ఆయన ఇంకా పట్నాలోనే ఉన్నారు.
ఎందుకు ఈ విస్తరణ
రెండో దఫా ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారిగా క్యాబినెట్‌ను విస్తరించబోతోందని కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మంగళవారం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడం, మరో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో క్యాబినెట్‌లో మార్పులపై వార్తలు మరింత పెరిగాయి.
సహకార సంఘాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. క్యాబినెట్ విస్తరణ సమయాన్ని దూరదర్శన్ ట్వీట్ చేయడంతో ఈ ఊహాగానాలు నిజమేనని స్పష్టమైంది.
రెండో దఫా ఏర్పాటైన మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్‌ను జులై 7, సాయంత్రం 6 గంటలకు విస్తరించబోతున్నారని దూరదర్శన్ న్యూస్ స్పష్టం చేసింది.
ఆ బెర్తులు ఖాళీ...
కేంద్ర మంత్రి థావర్‌చంద్ గహ్లోత్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించారు. దీంతో క్యాబినెట్‌లో ఓ బెర్తు ఖాళీ అయ్యింది.
మరోవైపు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ మరణంతో ఓ క్యాబినెట్ బెర్తు ఖాళీ అయ్యింది. ఎన్డీయే నుంచి అకాలీ దళ్ విడిపోవడంతో ఆ పార్టీకి కేటాయించిన క్యాబినెట్ పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి.
వీటికి కొంతమంది క్యాబినెట్ మంత్రులకు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. ప్రస్తుత క్యాబినెట్ విస్తరణతో వారిపై కాస్త ఒత్తిడి తగ్గే అవకాశముంది.
పార్టీలో ఎలాంటి పదవులూ దక్కని కొందరు సీనియర్ నాయకులకు కొత్తగా మంత్రి పదవులు దక్కే అవకాశముంది.
రైతుల ఉద్యమంతో పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని బీజేపీ కొంత ప్రభావితమైందని, ఈ ప్రాంతాన్ని శాంతింపజేసేలా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
చాలా ప్రశ్నలు, విమర్శలకు ఒకే బాణంతో మోదీ సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








