డేవిడ్‌ బ్యూక్: ‘లక్షల కోట్ల కంపెనీకి ఆద్యుడు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చనిపోయాడు’

డేవిడ్ బ్యూక్

ఫొటో సోర్స్, GENERAL MOTORS

ఫొటో క్యాప్షన్, డేవిడ్ బ్యూక్
    • రచయిత, మాగ్నస్ బెనెట్
    • హోదా, బీబీసీ స్కాట్‌లాండ్ న్యూస్

ప్రపంచంలో గొప్ప ఆవిష్కర్తల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డేవిడ్ డన్‌బర్ బ్యూక్ వారిలో అత్యుత్తమంగా కనిపిస్తారు.

ఆయన తన జీవిత కాలంలో లాన్-స్ప్రింక్లర్ సిస్టమ్, టాయిలెట్ ఫ్లషింగ్ పరికరం, ముడి ఇనుముతో చేసిన సింక్‌లు, బాత్ టబ్‌లను ఎనామిల్ చేయడంలాంటి విషయాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారులలో ఒకటైన జనరల్ మోటార్స్‌కు పునాదిగా మారిన వాహనాన్ని సృష్టించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. గత శతాబ్దంలో 5 కోట్లకుపైగా వాహనాలపై బ్యూక్ పేరు ఉంది.

కానీ, ఇన్ని ఆవిష్కరణలు చేసిన ఆయన, చివరి దశలో చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితికి వెళ్లారు. ''ఆయన గొప్పతనం అనే కప్పులో టీ సిప్ చేశాడు. కానీ తర్వాత అంతా ఒలికిపోయింది'' అని బ్యూక్ సమకాలికుడైన అమెరికన్ వ్యాపారవేత్త ఒకరు వ్యాఖ్యానించారు.

డేవిడ్ బ్యూక్ రూపొందించిన వాహనానికి ప్రతిరూపం

ఫొటో సోర్స్, GENERAL MOTORS

ఫొటో క్యాప్షన్, 1904లో డేవిడ్ బ్యూక్ రూపొందించిన వాహనానికి ప్రతిరూపం

అయితే ఇది ఎలా జరిగింది?

బ్యూక్ కథ వింటే ఆయనలో ఒక గొప్ప ఆవిష్కర్త ఉన్నాడు తప్ప, గొప్ప బిజినెస్‌మెన్ లేడు అన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. అదృష్టం రెండుసార్లు తలుపు తట్టినా దానిని వినియోగించుకోలేక పోయారు.

1856లో తన చిన్నతనంలోనే స్కాట్లాండ్‌లోని అర్‌బ్రోత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయిన ఆయన, మొదట్లో పంబ్లింగ్ బిజినెస్ ప్రారంభించారు. ఈ వ్యాపారం ఆయన అద్భుతమైన విజయాలలో ఒకటిగా నిరూపణ అయ్యింది. మంచి ఆవిష్కర్తగా, మేధావిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

కానీ, బ్యూక్ సంతోషంగా లేరు. 19వ శతాబ్దం చివరినాటికి, ఆయన మరొక ఆవిష్కరణపై దృష్టి పెట్టారు. అదే ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజిన్.

ప్లంబింగ్ వ్యాపారంలో తన వాటాను 100,000 డాలర్లు అంటే సుమారు రూ.74 లక్షలకు అమ్మేశాడు. నేటి విలువలో అది సుమారు రూ.24 కోట్లు ఉంటుంది. ఆ డబ్బుతో సొంత ఆటోమొబైల్ సంస్థను ప్రారంభించారు.

ఓవర్‌హెడ్ వాల్వ్ ఇంజిన్‌ను తయారు చేసే బ్యూక్ ఆటో విమ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ తయారీ ఇంజిన్లు నేటికీ వాడుతున్నారు. కానీ 1902 నాటికి, ఆయన కేవలం ఒక కారును మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. చేతిలో ఉన్న డబ్బు కూడా అయిపోయింది.

డెట్రాయిట్‌లోని ఆయన కంపెనీకి విలియం క్రాపో డ్యూరాంట్ అనే వ్యాపారి ఆర్ధిక సహాయం చేశారు. ఆ తర్వాత డ్యూరాంట్ జనరల్ మోటార్స్ కంపెనీని స్థాపించారు. ఇది ఇటీవల వరకు ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు.

ఆధునిక కాలపు బ్యూక్ కారు

ఫొటో సోర్స్, buick

ఫొటో క్యాప్షన్, ఆధునిక బ్యూక్ కారు

"ఈ ఆధునిక బ్యూక్ బ్రాండ్‌లో, జనరల్ మోటార్స్‌‌లో ఆయన ప్రాముఖ్యతను ఏ మాత్రం తగ్గించలేం" అని జనరల్ మోటార్స్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

"డేవిడ్ బ్యూక్ కథ చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఆయన లేకుండా ఆటోమొబైల్ పరిశ్రమ లేదు. ఇందులో ఎవరికీ సందేహం లేదు'' అని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

బ్యూక్ కొన్ని సంవత్సరాల తర్వాత మరో 100,000 డాలర్లు అంటే నేటి రూ.24 కోట్లు తీసుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన వ్యాపారంలో తన వాటాలను అలాగే ఉంచినట్లయితే, అప్పుడు ఆయనకు దక్కింది చాలా కొద్ది మొత్తం అయ్యేంది.

కానీ, ఆయన కాలిఫోర్నియాలో చమురు పరిశ్రమ, ఫ్లోరిడాలో భూమి మీదా పెట్టుబడి పెట్టి రెండోసారి వ్యాపారంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు బ్యూక్.

1924లో, 69 సంవత్సరాల వయస్సులో, చేతిలో ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరిగి డెట్రాయిట్‌కు వచ్చారు బ్యూక్. అప్పట్లో ఆయన ఇంట్లో టెలీఫోన్ కొనడానికి కూడా డబ్బు ఉండేది కాదు.

చివరకు డెట్రాయిట్ స్కూల్ ఆఫ్ ట్రేడ్స్‌లో బోధకుడిగా ఉద్యోగం సంపాదించగలిగారు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం చెడిపోయింది.

జనరల్ మోటార్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనరల్ మోటార్స్

మీద పడిన వృద్ధాప్యం

ఆర్‌బ్రోత్‌కు చెందిన రిటైర్డ్ జర్నలిస్ట్ ఇయాన్ లాంబ్, బ్యూక్ జీవితాన్ని స్మరించుకోవడానికి పట్టణంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రచారం చేశారు.

"వయసు కారణంగా ఆయన మరింత బలహీనంగా మారడంతో, ఇన్ఫర్మేషన్ డెస్క్‌ పని అప్పజెప్పారు. తన లావు కళ్లద్దాలతో సందర్శకులను చూస్తూ, మాట్లాడుతూ కాలం గడిపారు'' అని లాంబ్ పేర్కొన్నారు.

పెద్ద పేగులో కణితిని తొలగించేందు 1929 మార్చిలో ఆయనకు డెట్రాయిట్‌లోని హార్పర్ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు. తర్వాత కొంతకాలానికి న్యుమోనియాతో మరణించారు. అప్పటికి బ్యూక్ వయసు 74 సంవత్సరాలు.

ఆసుపత్రికి వెళ్లడానికి కొద్దిసేపటి ముందు బ్యూక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ''ఫెయిల్యూర్ అంటే కిందపడిన వ్యక్తి పైకి లేవకుండా అక్కడే కూర్చుని నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది అని లెక్కలేసుకుని చింతించడమే'' అని వ్యాఖ్యానించారు.

"రేపటి వైపు చూడటమే విజయం. నన్నెవరో మోసం చేశారని నేను అనుకోవడం లేదు. నేను స్థాపించిన కంపెనీలో నుంచి నేను వెళ్లి పోవడం ఆటలో ఒక భాగం'' అన్నారాయన.

1994 జూన్‌లో ఆర్‌బ్రోత్‌లోని పాత మాసోనిక్ హాల్‌లో ఆయన పేరిట స్మారక ఫలకం ఏర్పాటు చేశారు. ఆయన పుట్టిన వీధిలో మిగిలిన ఉన్న ఏకైక భవనం ఇదే.

''20వ శతాబ్దంలో అమెరికన్ ఆటోమొబైల్స్‌ రంగంలోని గొప్ప వ్యక్తులతో బ్యూక్ ఒకరు'' అని శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తూ జనరల్ మోటార్స్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ కొలెట్టా వ్యాఖ్యానించారు.

"ఈ వ్యక్తిని మనం తప్పకుండా గౌరవించాలి. ఎందుకంటే మన ఆటోమొబైల్‌ రంగంలో ఆయనకొక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనలోని మేధ నేటి అపూర్వమైన ఆటోమోటివ్ విజయగాథకు నాంది" అని కొలెట్టా అన్నారు.

కానీ, ఒక ఆటోమోటివ్ విప్లవానికి నాంది పలికన బ్యూక్ పేరు క్రమంగా కనుమరుగవుతోంది. ఆయనొక విస్మృత మేధావిగా మారుతున్నారు. ఉత్తర అమెరికా మోడళ్ల వెనుక భాగంలో బ్యూక్ పేరు ఇక ఉండదని రెండు సంవత్సరాల క్రితం న్యూయార్క్ టైమ్స్ రాసింది.

ప్రస్తుతం చైనాలో బ్యూక్స్ కార్లు చాలా అమ్ముడవుతున్నా నేమ్‌ప్లేట్ మీద ఆయన పేరు లేదు.

ఇయాన్ లాంబ్ తోపాటు మరికొందరు ప్రయత్నాలు చేసినా, చరిత్ర పుస్తకాలలో ఆయన పేరుగానీ, ఆయన సొంత పట్టణంలో విగ్రహంగానీ ఇంత వరకు ఏర్పాటు కాలేదు.

వీడియో క్యాప్షన్, 70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
డేవిడ్ బ్యూక్ పుట్టిన వీధిలోని స్మారక ఫలకం

ఫొటో సోర్స్, IAN LAMB

ఫొటో క్యాప్షన్, డేవిడ్ బ్యూక్ పుట్టిన వీధిలోని స్మారక ఫలకం

'అగ్రగణ్యుడు'

ఆర్‌బ్రోత్‌లో ఆయన వారసత్వంగా మిగిలిన స్మారక ఫలకం తప్ప మరేమీ లేదు. ఇది కూడా చాలామందికి కనిపించదు. ''ఈ మేధావి విగ్రహం ఏర్పాటు చేయడం సముచితం, అదే ఆయనకు ఘనమైన నివాళి'' అని ఇయాన్ లాంబ్ అన్నారు.

"డేవిడ్ బ్యూక్‌ మోటారు కార్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆయన ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి'' అన్నారు లాంబ్.

"గుర్తుంచుకోవడానికి బ్యూక్ అర్హుడు"అని లాంబ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)