ఎలాన్ మస్క్: ‘పక్కదారి పట్టించే ట్వీట్ల’తో టెస్లా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసన

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

స్టాక్ మార్కెట్ మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎలాన్ మస్క్.. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైర్మన్ పదవి నుంచి దిగిపోయి.. సీఈఓగా కొనసాగేలా అమెరికా నియంత్రణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రస్తుతం పబ్లిక్ లిమిటెడ్‌ సంస్థగా ఉన్న టెస్లాను పూర్తిగా సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నానని, అందుకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకున్నట్టు ఎలాన్ మస్క్ గత ఆగస్టు నెలలో చేసిన ట్వీట్ చేయటంతో.. ఆయనపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) గురువారం ఆర్థిక మోసం దావా వేసింది.

ఈ నేపథ్యంలో ఆ సంస్థతో మస్క్ ఒక ఒప్పందానికి వచ్చారు. దానిప్రకారం.. టెస్లా కంపెనీ సీఈఓగా ఆయన కొనసాగుతారు. అయితే.. చైర్మన్ పదవి నుంచి మూడేళ్ల పాటు వైదొలగుతారు. మస్క్‌తో పాటు టెస్లా కూడా రెండు కోట్ల డాలర్లు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

టెస్లా

ఫొటో సోర్స్, Getty Images

ట్వీట్లలో ఎలాన్ మస్క్ ఏం చెప్పారు?

టెస్లా కంపెనీని స్టాక్ మార్కెట్ లిస్టింగ్ నుంచి తొలగించి ప్రైవేటు యాజమాన్య సంస్థగా మార్చే విషయం గురించి ఆలోచిస్తున్నానని ఎలాన్ మస్క్ ఆగస్టులో చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.

ఆ ప్రతిపాదనకు ‘నిధులు కూడా సమకూర్చాన’ని రాశారు. దానివల్ల టెస్లా షేరు విలువ ఒక్కొక్కటి 420 డాలర్లు అవుతుందని చెప్పారు. ఆ ట్వీట్ల అనంతరం కంపెనీ షేర్ల విలువ అమాంతంగా పెరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ పడిపోయింది.

ఆయన చేసిన ఆ ట్వీట్లు ’అసత్యం.. పక్కదారి పట్టించేవ‘ని ఎస్‌ఈసీ తప్పుపట్టింది. ‘‘నిజానికి మస్క్ ఎటువంటి నిధులు సమకూర్చే సంస్థతోనూ.. ఒప్పందం ఖరారు చేసుకోవటం .. కంపెనీ ధర, విధివిధానాల వంటి కీలక అంశాలపై అసలు చర్చించనేలేదు’’ అని పేర్కొంది.

ఈ ఆరోపణలపై మస్క్ తొలుత స్పందిస్తూ.. తనపై కేసు వేయటం ‘అన్యాయమని’.. ‘నిబద్ధత, పారదర్శకత.. వాటాదారుల ప్రయోజనాల’ మేరకే తాను వ్యవహరించానని చెప్పారు.

గర్ల్ ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, AFP

ఈ ఒప్పందం ఏమిటి?

టెస్లా చైర్మన్ పదవి నుంచి ఎలాన్ మస్క్ 45 రోజుల్లో దిగిపోవాలి. జరిమానా చెల్లించటంతో పాటు.. సంస్థ గురించి ట్వీట్లు చేసేటపుడు కంపెనీ సమాచార విధివిధానాలను పాటించాలి.

స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన ఏ సంస్థ బోర్డులోనైనా ఎలాన్ మస్క్ పనిచేయకుండా నిషేధం విధించాలని ఎస్ఈసీ తొలుత కోరింది. అయితే.. తాజా ఒప్పందం ప్రకారం.. ఆయన టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతారు.

టెస్లా కంపెనీకి కొత్తగా ‘స్వతంత్ర చైర్మన్’ను నియమించటం జరుగుతుంది. ఇందుకోసం టెస్లా సంస్థ చైర్మన్ - సీఈఓ పదవులు, బాధ్యతలను విభజించాల్సి వస్తుంది. దీనివల్ల సంస్థలో అంతర్గతంగా ఎలాన్ మస్క్ అధికారం పరిమితమవుతుంది.

అయితే.. ఈ ఒప్పందం ఎలాన్ మస్క్‌కి మేలు చేస్తుందని.. కంపెనీ రోజు వారీ కార్యకలాపాలకు ఆయన సీఈఓ హోదాలో ఇన్‌చార్జ్‌గానే ఉంటారని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరీ ఎలాన్ మస్క్?

దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్ మస్క్.. ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపుల సంస్థ పేపాల్ ద్వారా కోట్లు గడించారు. అనంతరం టెస్లా సంస్థకు, రాకెట్ కంపెనీ స్పేస్-ఎక్స్‌కు వచ్చారు.

ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల బాజితాలో మస్క్ 25వ స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం సంపద విలువ 1,970 కోట్ల డాలర్లుగా అంచనా.

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన చిన్నారులను రక్షించటంలో పాలుపంచుకున్న ఒక బ్రిటిష్ డైవర్ మీద ఆయన ఆరోపణలు చేయటంతో.. ఆయన మీద పరువునష్టం దావా నడుస్తోంది.

అలాగే.. సెప్టెంబర్ ఆరంభంలో గంజాయి పీలుస్తూ ఒక పాడ్‌కాస్ట్‌లో కనిపించటం ద్వారా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. గంజాయి తాగటం.. ఆ పాడ్‌కాస్ట్‌ను రికార్డు చేసిన కాలిఫోర్నియాలో చట్టబద్ధమే అయినా.. ఎలాన్ గంజాయి తాగుతూ కనిపించిన తర్వాత టెస్లా షేర్లు 9 శాతానికి పైగా పడిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)