ప్రపంచంలో ఎక్కడికైనా గంటలోపే

ఫొటో సోర్స్, SPACEX
ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోపే చేరుకునే అత్యాధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ప్రముఖ రాకెట్ తయారీ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు.
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానాటికల్ కాంగ్రెస్(ఐఏసీ)లో ఆయన ఈ ప్రకటన చేశారు.
‘స్పేస్ఎక్స్’ సంస్థ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. అందులో చెబుతున్న వివరాల ప్రకారం దిల్లీ నుంచి జపాన్‌లోని టోక్యోకు 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ నగరాల మధ్య దూరం దాదాపు 5,800 కిలోమీటర్లు. అంటే నిమిషానికి 193 కిలోమీటర్ల వేగంతో ప్రయాణమన్నమాట!
ఇవి కూడా చదవండి
2024లో అంగారకుడి మీదకు ప్రజలను తీసుకెళ్లే వాహక నౌకలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మస్క్ ప్రకటించారు. అందుకోసం వచ్చే ఏడాది నుంచి స్పేస్‌ఎక్స్ సంస్థ నౌకల తయారీని ప్రారంభిస్తుందని వెల్లడించారు.

ఫొటో సోర్స్, AFP
భూమి మీది ప్రాంతాల మధ్య రవాణాతోపాటు, గ్రహాల మధ్య ప్రయాణాలనూ సులువు చేసే విధంగా బీఎఫ్‌ఆర్ అనే రాకెట్‌ను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు కూడా ఈ రాకెట్ ఉపయోగపడుతుందట.

ఫొటో సోర్స్, SPACEX
ఇప్పటికే ఫాల్కన్ 9, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లను స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు వాటిని వినియోగిస్తున్నారు.
అంగారకుడి యాత్ర గురించి 2016 ఐఏసీలోనే మస్క్ తన కోరికను వెలిబుచ్చారు. ఆ మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తాజా సదస్సులో వెల్లడించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)








