సెల్‌ఫోన్ల దోపిడీ కేసులో మధ్యప్రదేశ్ అడవుల్లో చిత్తూరు పోలీసుల సాహసాలు: ప్రెస్ రివ్యూ

పోలీస్

ఫొటో సోర్స్, AP POLICE

ఆగస్టులో చిత్తూరు జిల్లాలో దోపిడీకి గురైన 8 కోట్ల విలువైన సెల్ ఫోన్ల కేసును పోలీసులు ఛేదించారని ఈనాడు కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. అసలే దట్టమైన అడవి... ఆపై అర్ధరాత్రి... అటువైపు ఉన్నదేమో నరహంతక కంజరభట్‌ ముఠా... వారికి చిక్కితే ప్రాణాలకే ముప్పు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య వారి స్థావరంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు.

ఆగస్టు 25న పుత్తూరు-నగరి మధ్య కంటైనర్‌పై దాడిచేసి రూ. 8 కోట్ల విలువైన 7,522 సెల్‌ఫోన్లు దోచుకున్న ముఠాలోని ముగ్గురిని పట్టేశారు. చోరీ సొత్తునంతా స్వాధీనం చేసుకున్నారని ఈనాడు రాసింది.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా థానేఘాటి గ్రామంలోని అటవీ ప్రాంతంలో సాగిన ఈ ఆపరేషన్‌ ఎంతో ఉద్విగ్నంగా సాగింది. మరో 18 మంది కోసం గాలిస్తున్నారు.

నిందితులను అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై మరో రెండు రోజుల్లో చిత్తూరుకు తీసుకురానున్నట్లు సమాచారం అందిందని కథనంలో తెలిపారు.

తమిళనాడులోని శ్రీపెరంబదూరులోని షియోమీ కంపెనీ నుంచి ఆగస్టు 25న 16 సెల్‌ఫోన్‌ బాక్సులతో ముంబయికి కంటైనరు బయలుదేరింది.

వీటి విలువ రూ. 16 కోట్లు. కంటైనరు నగరి సమీపంలోకి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో దుండగులు ఓ లారీతో.. లోడుతో వెళ్తున్న కంటైనరును ఢీకొట్టి అందులోని 8 బాక్సులను చోరీ చేశారు.

తడ మార్గంలోని అప్పటి సీసీ పుటేజీలను, ప్రస్తుత చోరీలో పుత్తూరు- నగరి మార్గంలోని ఇళ్లు, వ్యాపార సముదాయాల సీసీ పుటేజీలను సరిపోల్చగా చోరీకి పాల్పడింది కంజర్‌భట్‌ ముఠానే అని తేలింది.

దీంతో చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ఆగస్టు 27న మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు వెళ్లగా, మరో బృందం తమిళనాడులోనూ విచారించాయి. అనంతరం వీరు కూడా దేవాస్‌ వెళ్లారు.

దేవాస్‌లో కొన్ని గ్రామాల్లోని వారే ఇలాంటి దారి దోపిడీలకు పాల్పడతారని అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో నెల రోజులపాటు బృందాలు అక్కడే ఉండి దర్యాప్తు చేశాయి.

బృందంలోని పోలీసులంతా స్థానికంగా కూలీ పనులు చేసుకునే వారిలా మారువేషాలు ధరించారు. ఇండోర్‌లో బస చేసి అక్కడి నుంచి 100 కి.మీ దూరంలోని థానేఘాటి గ్రామానికి, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లొచ్చేవారు.

కూలీ పనుల కోసం వెతుకులాటలో ఉన్నట్లు నటించి కంజర్‌భట్‌ ముఠా సభ్యుల వివరాలు, వారు బసచేసే ప్రాంతాల గురించి కూపీ లాగేవారు. దాదాపు 20 రోజుల పాటు ఇలా శ్రమించాక గుట్టు చిక్కటంతో తమ ఆపరేషన్‌కు వ్యూహం సిద్ధం చేశారు.

అంతా పక్కాగా సిద్ధమయ్యాక సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అడవిలోకి ప్రవేశించారు. అక్కడున్న ముఠా సభ్యులు ఏం జరుగుతుందో తెలుసుకుని, తేరుకునేలోపే ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు.

కొంతమంది పోలీసుల్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా.. ఇంకొందరు అక్కడి నుంచి పారిపోయారు. చివరికి ముఠాలోని ఇద్దరు కీలక సభ్యుల్ని, ఓ మధ్యవర్తిని పట్టుకుని.. సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

చోరీ అయిన సొత్తు పూర్తి స్థాయిలో రికవరీ చేయడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయని ఈనాడు రాసింది.

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

సెలబ్రిటీల వాట్సాప్‌ ఓటీపీ అడుగుతున్న సైబర్ నేరగాళ్లు

వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఓటీపీ చెబితే వాట్సాప్‌ గోల్‌మాల్‌ అవుతుంది..! సెలబ్రిటీలు, డాక్టర్లు, ప్రముఖులే టార్గెట్‌..! ఆరంకెల నంబరు చెబితే.. బాధితుల వాట్సా్‌పలోని గ్రూపుల వివరాలు.. వాటిల్లో ఉండే సభ్యుల మొబైల్‌ నంబర్లు మోసగాళ్ల చేతికి వెళ్లినట్లే..!

ఇది హ్యాకింగ్‌ కాదని, సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా కేటుగాళ్లు చేస్తున్న గిమ్మిక్కులని సైబర్‌ నిపుణులు చెబుతున్నారని ఆంధ్రజ్యోతి రాసింది.

హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే ఈ తరహా మోసాలకు తెరలేచిందని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

పలువురు సెలబ్రిటీలకు కేటుగాళ్ల నుంచి సందేశాలు వచ్చాయంటున్నారు. ఈ తరహా మోసంలో ‘‘ఎమర్జెన్సీ హెల్ప్‌’’ అంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వాట్సా్‌పలో మెసేజ్‌లు వస్తాయంటున్నారు.

‘‘క్షమించండి.. నాకు ఓ ఓటీపీ రావాల్సి ఉంది. పొరపాటున నేను మీ నంబర్‌ను ఎంటర్‌ చేశాను. అది మీ ఫోన్‌కు వచ్చి ఉంటుంది. కాస్త ఆ నంబరు చెబుతారా? నాకు చాలా ఎమర్జెన్సీ’’ అని కోరుతారని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు.

ఆ నంబరు చెప్పిన వెంటనే.. బాధితుల వాట్సాప్‌ లాగ్‌ అవుట్‌ అయిపోతుందని, మళ్లీ వాళ్లు వాట్సాప్‌ నంబరును రిజిస్టర్‌ చేశాకే.. పునరుద్ధరణ అవుతుందని వివరిస్తున్నారు.

సెలబ్రిటీల నంబర్‌తో వాట్సా్‌పలో లాగిన్‌ అయ్యే సైబర్‌ నేరగాళ్ల చేతికి.. వారు యాక్టీవ్‌గా ఉన్న గ్రూపుల వివరాలు వెళ్తాయి.

గ్రూపు ఇన్ఫోను క్లిక్‌ చేస్తే.. అందులో ఉండే అందరు సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు తెలుసుకోవచ్చు. సెలబ్రిటీలు తిరిగి తమ వాట్సా్‌పలోకి లాగిన్‌ అయ్యేలోపు.. ఆయా గ్రూపుల్లో వచ్చే సందేశాలను కేటుగాళ్లు యాక్సెస్‌ చేయగలరు.

వాటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడతారు? అనే అంశంపై ఇప్పటికైతే ఓ స్పష్టత లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారని ఆంధ్రజ్యోతి రాసింది.

సోనూ సూద్

ఫొటో సోర్స్, SONU SOOD/FACEBOOK

సోనూసూద్ సేవలకు ఐక్యరాజ్యసమితి పురస్కారం

సినీ నటుడు సోనూ సూద్‌కు ఐక్యరాజ్యసమితి పురస్కారం లభించిందని ‘సాక్షి’ సహా ప్రధాన పత్రికలన్నీ ప్రచురించాయి.

కరోనా సంక్షోభ కాలంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవను గుర్తించి, ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ).. ప్రతిష్టాత్మక ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమాని టేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో సత్కరించిందని సాక్షి రాసింది.

సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా సోనూసూద్‌కి ఈ అవార్డును ప్రదానం చేశారు. కరోనా సంక్షోభం సినీ పరిశ్రమలోని నిజమైన హీరోలను తెరపైకి తెచ్చింది. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందితో పాటు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ లాంటి మానవతా వాదులను సమాజానికి పరిచయం చేసింది.

ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రలతో సుపరిచితమైన సోనూసూద్‌ అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి, విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, కోవిడ్‌ సంక్షోభంతో ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో నిఖార్సయిన హీరోగా నిలిచిపోయారు.

ఆయన చేసిన కృషిని సామాజిక మాధ్యమాల్లో ఎందరో అభినందించారు. సోనూసూద్‌ ఈ అవార్డు తనకు అత్యంత అరుదైన గౌరవమని, ఎంతో ప్రత్యేకమని, తన కృతజ్ఞతలు తెలిపారని పత్రిక చెప్పింది.

తనచుట్టూ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోన్న ప్రజలకు నిస్వార్థంగా, తనకు తోచిన సాయం చేసినట్లు సోనూసూద్‌ అన్నారని సాక్షి వివరించింది.

చీరలు

ఫొటో సోర్స్, Kandukuri Ramesh Babu/FB

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచుల కోసం చీరెలు సిద్ధం అయ్యాయని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిఏటా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరఫున అందించే చీరెలను అక్టోబర్‌ 9 నుంచి పంపిణీచేస్తామని ఐటీ, చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

కరోనా నేపథ్యంలో స్వయంసహాయక సంఘాలతో ఇంటింటికీ అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీకోసం నాలుగేండ్లలో రూ.1,033 కోట్లు వెచ్చించినట్టు చెప్పారని పత్రికలో రాశారు..

ఈసారి బతుకమ్మ చీరెలను 287 డిజైన్లు, రంగు ల్లో తయారుచేయించామని అన్నారు. వెండి, బంగారు రంగు జరీ అంచులతో చూడముచ్చటగా ఉన్నాయని తెలిపారు.

మంగళవారం బేగంపేట హరితప్లాజాలో బతుకమ్మ చీరెల ప్రదర్శనను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ తిలకించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుకు పెద్దన్నగా, మేనమామగా బతుకమ్మ చీరెలను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు.

నాలుగేండ్లుగా కోటిమంది మహిళలకు ఉచితంగా పంపిణీచేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.1,033 కోట్లను వెచ్చించామన్నారు.

ఈసారి బతుకమ్మ చీరెలను సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్‌లో తయారు చేయించామని కేటీఆర్ తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)