పుష్ప: అల్లు అర్జున్‌తో ప్రత్యేక గీతంలో సమంత - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, INSTAGRAM/SAMANTHARUTHPRABHUOFFL
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్పలో సమంత ఒక ప్రత్యేక గీతంలో నర్తించనుందని ఆ సినిమా చిత్రబృందం చెప్పినట్లు నమస్తే తెలంగాణ పత్రిక వార్త ప్రచురించింది.
ప్రత్యేకగీతాల్ని అందరు మెచ్చేలా జనరంజకంగా తీర్చిదిద్దిడంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ది అందెవేసిన చేయి.
ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో ప్రేక్షకుల్ని హుషారెత్తించే ఐటెంసాంగ్‌కు చోటుంటుంది. తాజా చిత్రం 'పుష్ప'లో కూడా సుకుమార్ అద్భుతమైన ప్రత్యేకగీతానికి రూపకల్పన చేస్తున్నారు.
ఈ పాటలో అగ్ర కథానాయిక సమంత నర్తించబోతుండటం విశేషం. ఆమె కెరీర్‌లో ఇదే తొలి ఐటెంసాంగ్ కాబోతున్నది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'పుష్ప' ప్రత్యేక గీతంలో సమంత భాగం కావడం ఆనందంగా ఉందని చిత్రబృందం ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేసింది.
'ఈ పాటలో నటించడానికి అంగీకరించిన సమంతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అల్లు అర్జున్‌తో జోడీగా ఆమె వెండితెరపై సందడి చేస్తుంది. సినిమాలోని ఈ ఐదో గీతం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది' అని చిత్రబృందం వ్యాఖ్యానించిందని పత్రిక రాసింది.
'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్‌తో జోడీగా నటించింది సమంత. సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరోమారు తెరపై ఆవిష్కృతంకాబోతుండటం విశేషం.
ఎర్రచందనం అక్రమ రవాణా ఇతివృత్తంతో రూపొందిస్తున్న 'పుష్ప' చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, BJP Telangana
బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత, రాళ్లు రువ్వుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు
బీజీపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నట్లు ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఉద్రిక్తంగా సాగింది.
పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకున్నారని ఈనాడు రాసింది.
దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తొలుత నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సంజయ్ అక్కడికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ప్రతిగా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారని పత్రిక చెప్పింది.
‘దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసరడంతో బీజేపీ కార్యకర్తలు వారి పైకి దూసుకెళ్లేందుకు యత్నించారు.
పోలీసులు అడ్డుకున్నా తోపులాటకు దిగడంతో ఐకేపీ కేంద్రంలోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం చెల్లాచెదురైంది.
పలువురు రైతులు రెండు పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్రిక్తతల మధ్యే సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
తర్వాత వేములపల్లి మండలం కుక్కడం వద్ద ఉన్న కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లగా నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వెంటనే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శెట్టిపాలెం వద్ద ధాన్యాన్ని మిల్లులకు తీసుకువచ్చిన రైతులతో మాట్లాడటానికి వచ్చిన సంజయ్‌కు వ్యతిరేకంగా అక్కడే ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి.
దీంతో ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకోగా.. ఓ టీవీ ఛానల్ విలేకరితో పాటు పలువురు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
సూర్యాపేట జిల్లాకు వెళుతున్న సంజయ్ కాన్వాయ్‌పై మూసి బ్రిడ్జి వద్ద టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేయడంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
రాళ్లతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాన్వాయ్‌ను సూర్యాపేట జిల్లాలోకి అనుమతించార’’ని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy
ఒక్క గుంత కూడా కనిపించకూడదు- ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతుల పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, రహదారులపై ఎక్కడా ఒక్క గుంత కూడా కనిపించొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆంధ్రజ్యోతి పత్రిక వార్త ప్రచురించింది.
‘‘ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల పరిధిలోని రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆయా శాఖలను ఆదేశించారు.
న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ప్రాజెక్టుల్లో పనులు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్ సోమవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని, వచ్చేఏడాది జూన్ నాటికి పనులు పూర్తికావాలని ఆదేశించారు.
'రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి. ఏదో సగం సగం పనులు చేసి వదిలేశారన్న విమర్శ రానీయొద్దు. ప్రమాణాల మేరకు రహదారులు అభివృద్ధి చేయాలి.. రోడ్ల పరిస్థితిపై రిపేరుకు ముందు, తర్వాత ఫోటోలు తీయాలి' అని సూచించారు.
కాగా.. కొన్నిచోట్ల ఇప్పటికే వర్క్‌లు చేపట్టామని, కోస్తా జిల్లాల్లో వర్షాల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం’’ అని చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ‘స్వలింగ సంపర్క’న్యాయవాదిని సిఫారసు చేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, గే అయిన సౌరభ్ కిర్పాల్‌ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుందని సాక్షి పత్రిక వార్త ప్రచురించింది.
‘‘భారత అత్యున్నత న్యాయ స్థానం సంచలన నిర్ణ యం తీసుకుంది. సీనియర్ న్యాయవాది, గే అయిన సౌరభ్ కిర్పాల్‌ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
కొలీజియం సిఫార్సును ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్ వార్తలకెక్కనున్నారు.
ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో 'లా'లో అండర్ అండర్‌గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసిన సౌరభ్.. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకుపైగా లాయర్‌గా ఉన్నారు.
తొలిసారిగా 2017 అక్టోబర్‌లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ దిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా అది కార్యరూపం దాల్చలేదు.
ఆయన పేరును సిఫార్సు చేయడం ఇది నాలుగోసారి’’ అని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- IPLలో కెప్టెన్‌గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. తన దేశానికి వరల్డ్ కప్ అందించాడు
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- విశాఖ నుంచి అమెజాన్ ద్వారా గంజాయి విక్రయం - మధ్యప్రదేశ్ పోలీసులు
- గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- COP26: గ్లాస్గో సదస్సులో కుదిరిన ఒప్పందంలోని 5 ముఖ్యాంశాలు
- డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యమేనా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








