వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ‘మూడు రాజధానులపై ముందుకే.. అమరావతి అంటే నాకు వ్యతిరేకత లేదు’

చంద్రబాబు అంచనా ప్రకారమే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం లక్షకోట్లు ఖర్చవుతాయని, ఇప్పుడు లక్షకోట్ల అంచనా అంటే పదేళ్ల తర్వాత లక్ష కోట్లు ఆరేడు లక్షల కోట్లు కావొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ డబ్బుతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వేయడం కూడా సాధ్యం కాదన్నారు.
ఇలాంటప్పుడు రాజధాని ఏర్పాటు సాధ్యమేనా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే నగరం ఎప్పటికి వస్తుంది? అని ప్రశ్నించారు.
చదువుకున్నవాళ్లంతా పెద్ద నగరాలైన బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అని అడిగారు.
ఇప్పుడు ఏపీలో పెద్ద నగరం విశాఖపట్నం అని, అక్కడ ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సుందరీకరణ, వసతులపై శ్రద్ధ పెట్టి, విలువ పెంచితే ఐదు, పదేళ్లలో హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో కచ్చితంగా పోటీ పడుతుందని జగన్ చెప్పారు.
ఇది వాస్తవ పరిస్థితి అని, ఇలాంటి వాస్తవాలను గుర్తెరిగే.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పరిగెత్తాలనే తాము విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని నిర్ణయించామన్నారు.
అయితే, తమ నిర్ణయంపై రకరకాల అపోహలు రేకెత్తించి, న్యాయపరమైన చిక్కులు కల్పిస్తున్నారని చెప్పారు.
తాము ప్రకటించిన వెంటనే పనులు ప్రారంభించి, అమల్లోకి తీసుకొస్తే ఈపాటికే వికేంద్రీకరణ ఫలితాలు చూసేవాళ్లమని జగన్ ప్రకటించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడకూడదని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.
అన్ని ప్రాంతాలూ, కులాలు, మతాలు, వారి ఆశలు, ఆంకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని, ఆవిష్కరించిందని.. కాబట్టే తమ ప్రభుత్వాన్ని గత రెండున్నరేళ్లలో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ దీవిస్తూ వచ్చారన్నారు.
అయితే, వికేంద్రీకరణ గురించి అనేక అపోహలు, అనుమానాలు, దుష్ప్రచారాలు, న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు.. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి దుష్ప్రచారం చేశారన్నారు.
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, బిల్లుల్ని మరింత మెరుగు పర్చేందుకు, అన్ని ప్రాంతాలకూ, అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇకేమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపర్చేందుకు ఇంతకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని వెనక్కు తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో ప్రభుత్వం సభ ముందుకు వస్తుందన్నారు.
విస్తృత, విశాల, ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని జగన్ తెలిపారు.

హైదరాబాద్ వల్లే ప్రత్యేక వాదం బలపడింది - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి బిల్లును అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక, శాసన వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను ఆయన ప్రస్తావిస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను ప్రస్తావించిన బుగ్గన.. హైదరాబాద్‌లోనే మొత్తం అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే వెనుకబాటుతనంపై చర్చ జరిగిందని, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందని తెలిపారు.
అలాగే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కేంద్రీకరణ జరగకూడదని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు నివేదించాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయొద్దని శివరామకృష్ణన్ స్పష్టంగా చెప్పారన్నారు.
ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలే రాష్ట్రాభివృద్ధికి కీలకంగా ఉండేవని, అవే రాష్ట్రాలను అభివృద్ధి చేసేవని బుగ్గన తెలిపారు. అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా చాలా రాష్ట్రాలు అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రాధాన్యం ఇచ్చాయని, కాబట్టే ఆయా రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళుతున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 శాతం సంస్థలను హైదరాబాద్‌లోనే పెట్టారని, దీనివల్లే హైదరాబాద్ మహానగరం అయ్యిందని.. ఉమ్మడిగానే కొనసాగితే ఇంకా పెద్ద నగరం అయ్యేదని బుగ్గన అన్నారు. అయితే, దీనివల్ల మిగతా రాష్ట్రం మొత్తం వెనకబడిందని చెప్పారు.
ఇలా అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లనే ప్రత్యేకవాదం బలపడిందని శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు.
ఈ నేపథ్యంలోనే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీలో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు.
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లా సమానంగా అభివృద్ధి చెందాలని తాము నిర్ణయించామన్నారు.
ముంబాయి మహా నగరం 4 వేల కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందగా.. అమరావతిని 7500 కిలోమీటర్లు మేర అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు కాల్పనిక అంచనా వేశారన్నారు.
చంద్రబాబు హయాంలో ఏమాత్రం చిత్తశుద్ధి, ఆలోచన లేకుండా నిర్ణయాలు జరిగాయని బుగ్గన ఆరోపించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని,
చంద్రబాబు అంచనా ప్రకారం అభివృద్ధి చేయాలంటే కనీసం లక్ష కోట్లు కావాలని, ఇలా చేయడం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమేనా? అని బుగ్గన ప్రశ్నించారు.
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బోర్డులు ఏర్పాటు చేస్తామని, రాజ్యాంగబద్ధమైన కార్యకలాపాలను మాత్రం మూడు ప్రాంతాల నుంచి చేపడతామని బుగ్గన వివరించారు.
శాసన కార్యకలాపాలు అమరావతి నుంచి జరుగుతాయని, కార్యనిర్వాహక కార్యకలాపాలు విశాఖపట్నం నుంచి జరుగుతాయని తెలిపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు.
ఒక సంవత్సరంలోనే మూడు నగరాల నుంచి పరిపాలన జరుగుతుందన్నారు.
విశాఖపట్నం ఇప్పటికే గొప్ప నగరం అని, కొంచెం మద్దతు ఇస్తే మహా నగరం అవుతుందని చెప్పారు.
2019లో వైసీపీకి ఊహించని మెజార్టీ వచ్చిందని, తాము గొప్ప నిర్ణయం తీసుకున్నామని, దీంతో తమకు వ్యతిరేకంగా 1-2 శాతం మంది ఆందోళన చేస్తున్నారని బుగ్గన అన్నారు.
నూటికి నూరు శాతం మంది కలసి, మెలసి, ఆనందంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించాలని ఎంతో ఉదారంగా వ్యవహరించామని తెలిపారు.
1-2శాతం వాళ్లకు కూడా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాలనే పాత చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, APCMO
3 రాజధానుల చట్టం వెనక్కు తీసుకుంటాం, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టం విషయంలో వెనక్కు తగ్గింది.
ఏపీ పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకి నివేదించారు.
ఏపీ హైకోర్టులో ఈ చట్టాల మీద విచారణ సాగుతోంది. అనేక మంది అభ్యంతరాలు వేస్తూ పిటీషన్లు వేయడంతో నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిగా మారింది.
ఈ చట్టాన్ని కొన్ని సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తొలుత పాత చట్టాన్ని రద్దు చేస్తూ ఓ బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది.
ఏపీ కేబినెట్ ఈ అంశంపై అత్యవసర భేటీలో చర్చిస్తోంది. ఆ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, facebook/Peddireddy Ramachandra Reddy
నేను ఇప్పటికే 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా, సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే ఉపసంహరణ: మంత్రి పెద్దిరెడ్డి
ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. 3 రాజధానుల చట్టాల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి అధికారిక ప్రకటన చేస్తారని మంత్రులు వెల్లడించారు.
కాగా ఈ చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని.. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.
ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని అన్న ఆయన అమరావతి రైతుల పాదయాత్ర ఏమైనా లక్షలమందితో సాగుతోందా? అని ప్రశ్నించారు.
రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని.. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే ఉపసంహరించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, YS JAGAN/FB
2019 డిసెంబరు 19 నుంచి ఇప్పటి వరకు..
డిసెంబర్ 19 , 2019లో మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు.
మూడు రాజధానుల బిల్లును తొలుత 2020 జనవరి 20న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాత 2020 జూన్ 16న రెండోసారి కూడా శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది.
కానీ శాసనమండలి ఈ బిల్లును ఆమోదించలేదు. మండలి చైర్మన్ తన విశిష్ట అధికారాలను ఉపయోగిస్తూ.. ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీలకు పంపించారు. కానీ అప్పట్లో ఆ కమిటీలేవీ ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. రాజ్యాంగంలోని 197 (1), (2) అధికరణల కింద ఈ బిల్లును 2020 జులై నెలలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జులై 31న దీనిని ఆమోదించటంతో ఈ బిల్లు చట్టంగా మారింది.
దీనిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. కోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది.

ఈ రోజు కోర్టులో ఏం జరిగింది?
మూడు రాజధానులు చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలని త్రిసభ్య ధర్మాసనం సూచించింది.అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని.. అనంతరం ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు.బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు స్పష్టం చేసిన అడ్వకేట్ జనరల్.. తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతుందో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని కోర్టుకి చెప్పారు.దీంతో హైకోర్టు ఈ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
మహాపాదయాత్ర కొనసాగుతుంది : అమరావతి ఐకాస
ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అమరావతి ఐకాస తెలిపింది.ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస కోరింది.
ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమాన్ని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని ఐకాస నేతలు అన్నారు.
3 రాజధానులు బిల్లు ఉపసంహరణ హర్షణీయం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ కోరారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- అణు జలాంతర్గామి ప్రత్యేకత ఏమిటి? ఆస్ట్రేలియా ఎందుకు ఇలాంటి సబ్‌మెరైన్ తయారుచేస్తోంది
- హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది
- భారత సరిహద్దుల సమీపంలో చైనా తన అణు సామర్ధ్యాన్ని పెంచుకుంటోందా?
- పాకిస్తాన్: అత్యాచార నేరస్థులను నపుంసకులుగా మార్చే బిల్లుకు ఆమోదం
- 1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది
- ‘భారత్‌లో మహిళలను పగలు పూజిస్తారు... రాత్రివేళల్లో వారిపై అత్యాచారాలు చేస్తారు’- వివాదంలో కమెడియన్ వీర్ దాస్
- చైనా తన అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటోందని ఆరోపించిన అమెరికా
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- 'అణ్వాయుధాలు భారత్ కంటే చైనా, పాకిస్తాన్ల దగ్గరే ఎక్కువున్నాయి'
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- దుస్తులు తొలగించకుండా తాకినా లైంగికంగా వేధించినట్లే: సుప్రీంకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














