ఏజెన్సీ ప్రాంతానికీ, షెడ్యూల్ ఏరియాకూ తేడా ఏంటి? నాన్ షెడ్యూల్ ఏరియాల్లో గిరిజనులకు హక్కులు ఎందుకు లభించట్లేదు?

వీడియో క్యాప్షన్, రాజ్యాంగం ఇచ్చిన గిరిజన హక్కులు కోల్పోతున్న గిరిజనులు

వాళ్లంతా గిరిజనులు. రాజ్యాంగపరంగా గుర్తింపు పొందినా సరే.. వాళ్లకు ఏజెన్సీలో ఉన్న రాయితీలు అందడం లేదు. కనీసం రిజర్వేషన్లు కూడా వర్తించడం లేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కుల్ని కోల్పోతున్న గిరిపుత్రుల దుస్థితి ఇది.

గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా, కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్-షెడ్యూల్డ్ ఏరియాల్లో నమోదై ఉండటమే దీనికి కారణం.

రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజనులు ఆ హక్కులను, చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు.

మరి, కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు ? ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు?

ఏజెన్సీ, షెడ్యూల్డ్ ఏరియా అంటే...

బ్రిటిష్ పాలనలో...గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు. అందుకోసం Scheduled Districts Act 1874 అమల్లోకి తెచ్చారు.

మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్ లో చేర్చారు. అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్-షెడ్యూల్డ్ ఏరియాలు అంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటివి 552 గ్రామాలు ఉన్నాయి.

అయిదవ షెడ్యూల్ లో ఏముంది...

అయిదో షెడ్యూలు లోని క్లాజ్ 6 ప్రకారం ప్రభుత్వం నోటిఫై చేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార, సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

అయిదో షెడ్యూల్ లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొలగించడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది.

"షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు...హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70 వంటి చట్టాలు అమలులో ఉంటాయి. అదే నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ భూములపై సివిల్ కోర్టుల్లో కేసులు కూడా వేయవచ్చు'' అని నాన్-షెడ్యూల్డ్ గిరిజనుల సంఘం అధ్యక్షులు సి.హెచ్. పోతురాజు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సబ్ ప్లాన్ నిధులు షెడ్యూల్డ్ ఏరియాకే వర్తిస్తాయని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టంలాంటివి అమల్లో ఉంటాయని పోతురాజు వెల్లడించారు. మైనింగ్ అనుమతులు ఇవ్వాలన్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు.

''నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో పీసా చట్టం, గ్రామ సభల అనుమతులతో పని లేదు. ఇలా నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణను పొందలేకపోతున్నారు" అన్నారు పోతురాజు.

ఉద్యోగాలు రావట్లేదు

ప్రభుత్వ రికార్డులు ప్రకారం నాన్-షెడ్యూల్డ్ ఏరియాలుగా ఉన్న గిరిజన గ్రామాలు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లోని గిరిజనులు మౌలిక వసతులు, అభివృద్ధి, హక్కులు, రక్షణ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఐటీడీఏ పరిధిలో ఏదైనా ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు వెళ్లినా షెడ్యూల్డ్ ఏరియాలో లేని ఆదివాసీలుగా భావించి...ఉద్యోగాలు ఇవ్వడం లేదని నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న నాన్-షెడ్యూల్డ్ గిరిజన గ్రామానికి చెందిన వసుంధర చెప్పారు. ఆమె డీఎడ్ పూర్తి చేసి రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.

"నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం వల్ల షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే ఆదివాసీలకు లభించే ఏ అవకాశాలు పొందలేకపోతున్నాం. చదువుకున్నా నాకు ఉద్యోగం రాకపోవడంతో మా చెల్లిని, తమ్ముణ్ని చదివిస్తున్నా...అది కూడా దండగేనని మా తల్లిదండ్రులు భావిస్తున్నారు" అని వసుంధర తెలిపారు.

షెడ్యూల్డ్ ప్రాంతంగా మారాలంటే...

విశాఖపట్నంలోని నాన్ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పుపడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్ కనకరావు బీబీసీతో చెప్పారు.

"రావికమతం మండలంలో నాన్ -షెడ్యూల్డ్ ఏరియాలో 33 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఎస్టీ జనాభా 50 శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత, సమీప షెడ్యూల్డ్ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ఉంది. రావికమతం మండలంలో 5 గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు" అని కనకరావు చెప్పారు.

‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’

రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1) ఆర్టికల్, అయిదవ షెడ్యూల్ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు.

గిరిజనుల హక్కులు, సంక్షేమం, నాన్ షెడ్యూల్డ్ ఏరియాల అంశాలను ప్రస్తావిస్తూ...తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లకు ఆయన లేఖలు రాశారు.

"ప్రాజెక్టుల విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టాల కింద గ్రామ సభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభుత్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనేతరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయాలను గుర్తించి, మీరు తగిన చర్యలను తక్షణమే తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)