మహారాష్ట్ర: అమరావతిలో బంద్ హింసాత్మకం, షాపులు ధ్వంసం, నగరంలో కర్ఫ్యూ విధించిన పోలీసులు

అమరావతి

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC

మహారాష్ట్రలోని అమరావతిలో శుక్రవారం జరిగిన విధ్వంసానికి నిరసనగా బీజేపీ, ఇతర హిందూ సంస్థలు శనివారం బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శనివారం ఉదయం కొందరు వ్యక్తులు అమరావతిలోని కొన్ని షాపులను ధ్వంసం చేశారని చెబుతున్నారు. కొన్ని దుకాణాలపై రాళ్లు విసిరారు. కొన్ని షాపులను నిరసనకారులు బలవంతంగా మూసివేయించారు. దుకాణాలపై రాళ్లు విసిరిన ఘటనలు ఇతర ప్రాంతాల్లో కూడా చోటు చేసుకున్నాయి.

మరోవైపు, బీజేపీ, హిందూ సంస్థల మద్దతుదారులు పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగం అమరావతిలో కర్ఫ్యూ విధించింది.

శనివారం ఉదయం నగరంలోని రాజ్‌ కమల్ చౌక్‌ వద్ద బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. బంద్ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

అమరావతి

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC

త్రిపురలో మతపరమైన హింసకు వ్యతిరేకంగా శుక్రవారం ముస్లిం సంస్థల నిరసన

త్రిపురలో మతపరమైన హింసకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం నిరసన ర్యాలీలు చేపట్టాయి.

ఈ సమయంలో రాళ్ల దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి నిరసనగా శనివారం బీజేపీ, ఇతర హిందు సంస్థలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి.

కాషాయ జెండాలు పట్టుకున్న వందలాది మంది నిరసనకారులు అమరావతిలోని రాజ్‌కమల్ చౌక్‌ దగ్గర నినాదాలు చేశారని అమరావతి నగర పోలీసు ఒకరు చెప్పారు.

వీరిలో కొందరు షాపులపై రాళ్ల దాడి చేశారని, దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. శుక్రవారం నాటి ఘటనలతో సంబంధం ఉన్న 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అమరావతి

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC

హోంమంత్రి విజ్ఞప్తి

ప్రజలు సంయమనం పాటించాలని రాష్ట్ర హోంమంత్రి పిలుపు ఇచ్చారు. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. పుకార్లను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

రాళ్ల దాడి కేసుల్లో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇలాంటి సందర్భాల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, ప్రతిఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంయమనంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.

బంద్, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంజయ్ రౌత్

ఫొటో సోర్స్, ANI

సంజయ్ రౌత్ ఏం చెప్పారు?

ఈ హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం కఠినంగా ఉందని, బాధ్యులైన వారిని త్వరలో పట్టుకుంటామని మీడియాతో సంజయ్ చెప్పారు.

"మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న లక్ష్యంతో మహారాష్ట్రలో ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలను ఆధారంగా చేసుకుని విపక్షాలు గవర్నర్‌ను కలుస్తాయి. రాష్ట్రంలో చట్టం అమలు కావడం లేదంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరుగుతాయంటూ చెబుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉంది" అని సంజయ్ చెప్పారు.

మహారాష్ట్ర హోంశాఖ దీనిపై దర్యాప్తు చేస్తుందని, ఈ ఘటనలకు బాధ్యులైన వారిని గుర్తించి, ప్రజల ముందుకు తీసుకొస్తామని ఆయన తెలిపారు.

శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీన్ని మహా వికాస్ అఘాడి ప్రభుత్వమని పిలుస్తున్నారు.

అమరావతి

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC

ఇతర నాయకులు ఏమన్నారు

"నిన్న (శుక్రవారం) జరిగింది సరైంది కాదు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. నిరసన తెలిపే హక్కు మీకు ఉంది. కానీ నిరసనలు హింసాత్మకంగా ఉండకూడదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. హింసాత్మక ఘటనలు ఇక జరగవు. శాంతికి విఘాతం కలిగించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు" అని ఎన్‌సీపీ నాయకుడు, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.

మరోవైపు, అమరావతి హింసను ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలాల్ ఖండించారు.

"త్రిపుర, మహారాష్ట్రలలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నాను. త్రిపురలో హింసను ఖండించిన వారు.. మహారాష్ట్ర హింసను ఎందుకు ఖండించడం లేదని ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారిని అడుగుతున్నాను. మహారాష్ట్రలో ఏ పార్టీ అయినా ఈ హింసను ప్రతీకార చర్యగా చూస్తే మాత్రం అది వారి బాధ్యతారాహిత్యమే" అని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలాల్ అన్నారు.

మరోవైపు, ఇరువర్గాలు సంయమనం పాటించాలని అమరావతి ఎంపీ నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు.

అమరావతి

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC

త్రిపురలో హింస ప్రభావం

త్రిపురలో ముస్లింలపై చేసినట్లు చెబుతున్న అరాచకాలకు నిరసనగా శుక్రవారం మహారాష్ట్రలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. మాలేగావ్, నాందేడ్, అమరావతిలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

త్రిపురలో హింసకు వ్యతిరేకంగా మాలేగావ్‌లో బంద్‌కు పిలుపు ఇచ్చారు. బంద్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

అదే సమయంలో కొందరు రాళ్లు రువ్విన ఘటనలతో నాందేడ్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రాళ్ల దాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు.

దీని ప్రభావం అమరావతిలోనూ కనిపించింది. కొన్నిచోట్ల విధ్వంసం జరిగినట్లు పోలీసులు చెప్పారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 22 షాపులు ధ్వంసం అయినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. నిరసనకారులు కూడా చాలా ప్రాంతాల్లో రాళ్లు రువ్వినట్లు పోలీసులు వెల్లడించారు.

అమరావతి

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC

పోలీసులు ఏం చేస్తున్నారు?

ఈ హింసాత్మక ఘటనల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. యూఏపీఏ చట్టం కింద పోలీసులు చర్యలు తీసుకుంటే, దానిపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఫేక్ ఫొటోలు, వీడియోలు, అభ్యంతరకర సమాచారాన్ని ప్రచారం చేస్తూ మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేస్తున్న వారిపై తాము చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

అయితే, యూఏపీఏ చట్టాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు ఒక వర్గం వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

మాలేగావ్‌లో రజా అకాడమీ సహా పలు ముస్లిం సంస్థలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. త్రిపురలో మతపరమైన హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు పిలుపు ఇచ్చారు.

అమరావతిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరి నుంచి ఒక ర్యాలీ తీశారు. ఈ నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. కానీ ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

వీడియో క్యాప్షన్, కారంచేడు హింసాకాండకు నేటితో 36 ఏళ్లు, బాధితులకు న్యాయం జరిగిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)