మత మార్పిడి: ఉత్తర్‌ప్రదేశ్‌లో హిందూమతం స్వీకరించిన 19 మంది ముస్లింలు, అసలేం జరిగింది?

ముస్లిం కుటుంబం ఘర్ వాపసీ

ఫొటో సోర్స్, SHARAD MALLICK

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తర్‌ప్రదేశ్ షామ్లీ జిల్లాలో సోమవారం ఒకే ముస్లిం పరివారానికి చెందిన 19 మంది హిందూ మతం స్వీకరించారు.

దాదాపు 12 ఏళ్ల క్రితం తామంతా ఇస్లాం మతం స్వీకరించామని, ఇప్పుడు 'ఘర్ వాపసీ' అయ్యామని వాళ్లు చెప్పారు.

షామ్లీ జిల్లా కాంధ్లా పట్టణంలోని రాయ్ జద్‌గాన్ ప్రాంతంలో ఉంటున్న మొహమ్మద్ ఉమర్, ఆయన కుటుంబంలోని 18 మంది హిందూ మతం స్వీకరించారు.

వీరంతా కాంధ్లాలోని సూరజ్‌కుండ్ ఆలయానికి చేరుకుని అక్కడ నిర్వహించిన శుద్ధి హోమంలో పాల్గొన్నారు. తర్వాత తిరిగి హిందూ మతం స్వీకరించారు.

కాంధ్లాలో పూజలు జరిగిన ఆలయం

ఫొటో సోర్స్, SHARAD MALLICK

ఫొటో క్యాప్షన్, కాంధ్లాలో పూజలు జరిగిన సూరజ్ కుండ్ ఆలయం

'మమ్మల్ని మోసం చేసి ముస్లింలుగా మార్చారు'

12ఏళ్ల క్రితం మా నాన్న కుటుంబంతో సహా ఇస్లాం స్వీకరించారు. అప్పుడు మాకు ఏం తెలీదు. మమ్మల్నందరినీ మోసంతో మతం మార్పించారు. అప్పుడు మమ్మల్ని భయపెట్టడం, బెదిరించడం కూడా చేశారు. కానీ, ఇప్పుడు మేం మొత్తం మా కుటుంబంతో మళ్లీ హిందూ మతం స్వీకరించాం" అని ఉమర్ కొడుకు బీబీసీకి చెప్పారు.

"వీళ్లందరూ బంజారా సమాజానికి చెందినవారు. అందరూ హిందూ మతంలోకి 'ఘర్‌ వాపసీ' అయినట్లు చెబుతున్న ఈ కార్యక్రమాన్ని ముజఫర్‌నగర్‌లో ఉంటున్న మహంత్ జస్వీర్ మహారాజ్ చేయించారు" అని స్థానిక జర్నలిస్ట్ శరద్ మలిక్ చెప్పారు.

ఈ కుటుంబం చాలా రోజుల్నుంచి మహంత్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఇస్లాం మతం వదిలి హిందూ మతం స్వీకరించిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో హిందూ యువతుల బలవంతపు మతమార్పిడి

జిల్లా అధికారులకు దీని గురించి ఎలాంటి సమాచారం లేదని షామ్లీ కలెక్టర్ జస్జీత్ కౌర్ చెప్పారు.

కానీ పత్రాల్లో పేరు మార్చుకునే ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోడానికి కొన్ని రోజుల క్రితం ఒక జంట ఎస్డీఎం ఆఫీసుకు వచ్చిందని బీబీసీకి తెలిపారు.

"19 మంది హిందూ మతం స్వీకరించారని మాకు ఇప్పుడే తెలిసింది. కొన్ని రోజుల క్రితం భార్యాభర్త కలిసి ఎస్డీఎం ఆఫీసుకు వచ్చారు. పత్రాల్లో పేరు మార్చుకునే ప్రక్రియ ఎలా ఉంటుందని అడిగారు. వారికి అది ఎలా చేసుకోవాలో చెప్పాం. ఆ తర్వాత చాలా మంది మతం మార్చుకున్నట్లు నాకు తెలిసింది" అన్నారు.

"ఆ ప్రాంత అధికారులు ఆ కుటుంబాలతో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇష్టానుసారం స్వేచ్ఛగా మతం మారవచ్చు. వాళ్లు మాకు ఏదైనా ఫిర్యాదు చేస్తే, వారిని ఎవరైనా బలవంతం చేసినట్లు తేలితే.. మేం వారికి తగిన భద్రత కల్పిస్తాం. దీని గురించి మేం మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం" అని చెప్పారు.

పూజలు, హోమం నిర్వహిస్తున్న మహంత్ జస్వీర్ మహరాజ్

ఫొటో సోర్స్, SHARAD MALLICK

ఫొటో క్యాప్షన్, పూజలు, హోమం నిర్వహించి హిందూ మతం స్వీకరించారు.

మతం మారాలని చాలా మంది సంప్రదిస్తున్నారు

మరోవైపు ఘర్ వాపసీ కోరుకుంటున్న ఎంతోమంది తనను సంప్రదిస్తున్నారని మహంత్ జస్వీర్ మహారాజ్ బీబీసీకి చెప్పారు.

"బంజారా సోదరులను భయపెట్టి, బెదిరించి బలవంతంగా ఇస్లాం స్వీకరించేలా చేశారు. మేం మా అభిప్రాయాలను వారి ముందుంచినపుడు వారికి అది అర్థమైంది. వారంతా మళ్లీ హిందూ మతంలోకి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేశారు" అని ఆయన చెప్పారు.

"వీరిని మళ్లీ హిందూ మతంలో తీసుకువచ్చాం. హిందువులైనా, ముస్లింలు అయినా అందరి రక్తం ఒకటే. హిందూ గుర్జర్లు కూడా చౌహాన్ అని రాసుకుంటారు. ముస్లిం గుర్జర్లు కూడా చౌహాన్ అని పెట్టుకుంటారు" అని జస్వీర్ తెలిపారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

అయితే, ఘర్ వాపసీ అయిన ఈ కుటుంబ సభ్యులు, అంతకు ముందు ఇస్లాం మతం స్వీకరించేలా తమపై ఎవరు ఒత్తిడి తెచ్చారో, ఎవరు భయపెట్టారో చెప్పలేదు.

మళ్లీ హిందూ మతం స్వీకరించిన తర్వాత వీరందరూ తమ పేర్లు కూడా మార్చుకున్నారు. వీరిలో చాలామంది శుద్ధీకరణ సమయంలో చెప్పిన మంత్రాలను చెప్పడం కూడా నేర్చుకున్నారు. కొంతమంది గాయత్రి మంత్రం కూడా జపిస్తున్నారు.

ఈ కుటుంబం తిరిగి హిందూ మతంలోకి రావడానికి సోమవారం కాంధ్లాలోని సూరజ్ కుండ్ ఆలయంలో ఒక కార్యక్రమం నిర్వహించారని స్థానిక జర్నలిస్ట్ శరద్ మలిక్ చెప్పారు. మహంత్ జస్వీర్ స్వయంగా జర్నలిస్టులకు దాని గురించి సమాచారం ఇచ్చారని, ఆ సమయంలో అక్కడ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన చాలా మంది ఉన్నారని తెలిపారు.

సూరజ్ కుండ్ ఆలయంలో కార్యక్రమం

ఫొటో సోర్స్, SHARAD MALLICK

ఫొటో క్యాప్షన్, సూరజ్ కుండ్ ఆలయంలో 'ఘర్ వాపసీ' కార్యక్రమం

శవాలు ఖననం చేయనివ్వలేదనే...

ఈ కుటుంబంలో ఇమ్రానా నుంచి అనితగా మారిన ఒక మహిళ అంతకు ముందు తాము ముస్లింలుగా ఎందుకు మారాల్సి వచ్చిందో బీబీసీకి చెప్పారు.

"మొదట చనిపోయిన మా వాళ్లను ఖననం చేసేవాళ్లం. హిందువులు వారిని ఖననం చేయనిచ్చేవారు కాదు. అందుకే, మా కుటుంబం 12 ఏళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించింది. కానీ ఇప్పుడు మేం మళ్లీ హిందూ మతంలోకి వచ్చాం. మా ఇష్ట ప్రకారం సంతోషంగా ఘర్ వాపసీ అయ్యాం. ఎవరూ ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. మొత్తం మూడు కుటుంబాల్లోని 19 మంది మళ్లీ హిందూ మతం స్వీకరించాం. అందులో పెద్దలు, పిల్లలు అందరూ ఉన్నారు" అన్నారు.

షామ్లీలో గత వారం ఒక ముస్లిం జంట తాలూకా ఆఫీసుకు వెళ్లి మళ్లీ హిందూ మతం స్వీకరించడానికి సంబంధించి అధికారులకు దరఖాస్తు ఇచ్చారు.

వారు సమర్పించిన అఫిడవిట్‌లో తమ పేర్లను రషీద్ నుంచి వికాస్‌గా, మంజూ బానో నుంచి సంజూగా మార్చుకున్నామని, మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చామని చెప్పారు.

సోమవారం మహంత్ జస్వీర్ చేయించిన పూజల్లో ఈ దంపతులు కూడా ఉన్నారని శరద్ మలిక్ చెప్పారు.

మహంత్ జస్వీర్ 2015లో మహమ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద ప్రకటన చేయడంతో చర్చల్లో నిలిచారని శరద్ మలిక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)