సుప్రీంకోర్టు: ''నేరస్థుడి లైంగిక ఉద్దేశాలను గమనించాలి.. చర్మానికి చర్మం తగిలిందా లేదా అని చూడకూడదు''

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

12 ఏళ్ల బాధితురాలి చర్మాన్ని నిందితుడు తాకకపోవడంతో దాన్ని లైంగిక నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితుడికి విముక్తి కలిగించేలా బాంబే హైకోర్టు గతంలో వివాదాస్పద తీర్పు ఇచ్చింది.

జనవరిలో బాంబే హైకోర్టుకు చెందిన మహిళా జడ్జి వెలువరించిన ఈ తీర్పుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.

ఇది భవిష్యత్‌లో ‘‘ప్రమాదకర ఉదాహరణ''గా నిలిచిపోతుందని కార్యకర్తలు, న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ తీర్పు తమపై జరిగిన వేధింపులు చెప్పకుండా పిల్లలు వెనకడుగు వేసేలా చేస్తుందని కార్యకర్తలు పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

''లైంగిక ఉద్దేశాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ శరీరానికి శరీరానికి మధ్య సంబంధం ఏర్పడిందా? లేదా? అనే వాటిని చూడకూడదు'' అని గురువారం ఈ కేసు తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

''చర్మానికి చర్మం తగిలితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందనే భావన చాలా సంకుచితమైనది, సైద్ధాంతికపరంగా తప్పుడు నిర్వచనం కూడా'' అని లీగల్ వెబ్‌సైట్ లైవ్ లా పేర్కొంది.

''బాంబే హైకోర్టు ఆదేశాలు లైంగిక వేధింపులను సమర్థిస్తున్నట్లు ఉన్నాయి. చట్టంలోని నిబంధనలు నేరస్థుడికి నేరం నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఇవ్వకూడదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ తీర్పు వల్ల పిల్లలు మరింత ప్రమాదంలో పడతారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

అసలు ఆ కేసు ఏంటి?

12 ఏళ్ల బాలిక శరీరాన్ని అసభ్యంగా తడిమాడనే ఆరోపణలతో 2016 డిసెంబర్‌లో 39 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

''నిందితుడు నా కూతుర్ని అతని ఇంటికి తీసుకెళ్లి, ఆమె వక్షోజాలను నొక్కాడు. ఆ తర్వాత ఆమె పైజామాను తొలిగించేందుకు ప్రయత్నించాడు'' అని బాధితురాలి తల్లి ఆరోపించారు.

దీనిపై పోక్సో చట్టం కింద అతన్ని దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

కానీ జనవరి 12న, బాంబే హైకోర్టు జడ్జి పుష్ప గనెడివాలా ఈ కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

''బట్టలు తొలగించకుండా బాలిక వక్షోజాలను తాకడాన్ని లైంగిక వేధింపుల కింద చూడలేం. శరీరానికి శరీరానికి మధ్య సంబంధం ఏర్పడనందున ఈ వేధింపుల కేసును చిన్న శిక్షతో సరిపెట్టవచ్చు''అని అన్నారు.

మహిళా జడ్జి చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాల వారు ఖండించారు. ఈ మేరకు బాంబే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ విషయంపై తాము నిర్ణయం తీసుకునే వరకు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు జనవరి 27న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రయల్ కోర్టు సూచించిన మేరకు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు గురువారం ఉత్తర్వులు వెలువరించింది.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

సవాలు

బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు 'అతి దారుణమైనది' అని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఈ కేసు విషయంలో నిందితుడికి వ్యతిరేకంగా ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

''ఈ ఆదేశాన్ని కొట్టివేసి ఉండకపోతే, భవిష్యత్‌లో అది తీవ్ర ప్రమాదరకరమైన ఉదాహరణగా మారే అవకాశం ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల నేరం నమోదు చేయాలంటే 'స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్' అనేది అవసరమైన అంశమేం కాదు'' అని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు.

''ఒకవేళ రేపు ఎవరైనా ఒక వ్యక్తి సర్జికల్ గ్లౌజులు వేసుకొని, ఒక మహిళ శరీరాన్నంతా తడిమితే.. అతన్ని కూడా లైంగిక వేధింపుల నేరం కింద శిక్షించకూడదు అన్నట్లుగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది'' అని వేణుగోపాల్ వ్యాఖ్యానించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

''నిందితుడు, బాలిక సల్వార్‌ (పైజామా)ను కిందకు లాగడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడికి బెయిల్ దొరికింది'' అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

బాంబే హైకోర్టులోని మహిళా జడ్జి ఇచ్చిన ఈ తీర్పును 'హేయమైనది, అమోదించతగనిది' అని బాలల హక్కుల కార్యకర్తలు, పౌర సమాజం కార్యకర్తలు విమర్శించారు.

చిన్నపిల్లలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు.

ఈ తీర్పు వల్ల పిల్లలు మరింత ప్రమాదంలో పడనున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో లైంగిక వేధింపులు అనేవి పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతీ ఏడాది వేల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి.

2007లో ప్రభుత్వం చేసిన పరిశోధనలో భారత్‌లోని ప్రతీ ముగ్గురిలో ఇద్దరు పిల్లలు శారీరక వేధింపులకు గురైనట్లు తెలిసింది. మొత్తం 12,300 మంది పిల్లలపై సర్వే చేయగా, 53 శాతం మంది వివిధ రకాలుగా తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పారు.

గతేడాది పోక్సో చట్టం కింద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 43,000 కేసులను నమోదు చేసింది. అంటే ప్రతీ 12 నిమిషాలకు సగటున ఇలాంటి ఒక కేసు నమోదు అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)