తుపాకులను పప్పుబెల్లాల్లా పంచుకున్నారు - ప్రెస్ రివ్యూ

ఏపీ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

పోలీస్‌ కార్యాలయంలో దాచిన ఆయుధాలను పట్టుకుపోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 582 పైచిలుకు ఆయుధాలను ఏపీ పోలీసులే పంచుకున్నట్లు 'సాక్షి' వెల్లడించింది.

''పోలీస్‌ అధికారులు స్థాయిని బట్టి ఇది నీకు.. అది నాకు అన్నట్టుగా తలా ఒకటి తీసేసుకున్నారు. విషయం బయటపడకుండా అంతా పక్కాగా టెండర్లు పిలిచినట్టు ఓ నాటకానికి తెరతీసి రక్తి కట్టించారు.

పోలీసులు పంచేసుకున్న వాటిలో పిస్టళ్లు, రివాల్వర్లు, ఎస్‌బీబీఎల్‌(సింగిల్‌ బ్యారెల్‌ బీచ్‌లోడెడ్‌), డీబీబీఎల్‌ (డబుల్‌ బ్యారెల్‌ బీచ్‌లోడెడ్‌) తుపాకులు, కార్బన్‌.. ఇలా పలు రకాల ఆయుధాలున్నాయి. వీటిలో రష్యా, బ్రెజిల్, బెల్జియం, యూఎస్‌ దేశాల్లో తయారైన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలానే ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. 1969 నుంచి జిల్లా కేంద్రం కాకినాడ పోలీసు కార్యాలయం ఆర్మర్డ్‌ రిజర్వులో భద్రపరిచిన 582 ఆయుధాలను నామ్‌కే వాస్తేగా వేలం వేసి పోలీసు అధికారులు పంచేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

చట్ట విరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, అలాగే లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకుని తీసుకువెళ్లని తుపాకులు వంటి వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వులో భద్రపరుస్తారు.

డీజీ అనుమతితో వాటిని వేలం వేస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలంటే.. డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

డీజీ కార్యాలయం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాలి. అనంతరం వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇవన్నీ జరిగాక సీల్డ్‌ కమ్‌ ఓపెన్‌ టెండర్లు పిలవాలి.

ఆయుధాలు ఎన్ని వేలం వేస్తున్నారు.. వాటి ఖరీదు ఎంత.. అనేది నిర్ధారించాక, నిర్దేశించిన తేదీన వేలం వేయాలి. అలాగే వేలంలో అత్యధికంగా కోడ్‌ చేసిన ఆయుధాలు కొనుగోలు, విక్రయ లైసెన్స్‌ కలిగిన వారి టెండర్‌ను ఖరారు చేయాలి. ఆ వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి.

కానీ నిబంధనలన్నింటికీ పోలీసులు పాతరేశారు. లైసెన్స్‌ ఉన్న ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై 17 చలానాలు తీయించి నామ్‌కే వాస్తేగా టెండర్లు వేయించారు.

హైదరాబాద్‌ అబిడ్స్‌కు చెందిన ఓ వ్యక్తి పేరుతో 2021 ఏప్రిల్లో టెండర్‌ ఖరారు చేశారు. టెండర్లో రూ.8 లక్షలు వచ్చినట్టుగా రికార్డు చేసి ఖజానాలో జమ చేశారు.

అసలు టెండర్లు పిలవకుండానే, ఆయుధాలకు ధర నిర్ణయించకుండానే రూ.8 లక్షలకు ఖరారు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ విధంగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఖజానాకు కన్నం వేశారు.

వైన్స్ దుకాణం

ఫొటో సోర్స్, Getty Images

వైన్ షాపు దరఖాస్తులకు నేడే తుదిగడువు

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనున్నట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.

''రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లైసెన్సులు జారీచేసేందుకు ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైన విషయం తెలిసిందే.

బుధవారం సాయంత్రం వరకు మొత్తం 23,700 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. బుధవారం ఒక్కరోజే 8,949 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది.

దీని ప్రకారం ఇప్పటివరకు ఒక్కో దుకాణ లైసెన్సు కోసం సగటున 9 దరఖాస్తులు అందాయి. గురువారం చివరి రోజు కావడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.

ఇప్పటివరకు ఖమ్మం డివిజన్‌లో అత్యధికంగా 210 దుకాణాలకు 4,678 దరఖాస్తులు అందాయి.

ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతోనే తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు భావిస్తున్నారు.

రంగారెడ్డి, హైదరాబాద్‌ డివిజన్లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి డివిజన్‌లోని 495 దుకాణాలకు 4,633 దరఖాస్తులు, హైదరాబాద్‌ డివిజన్‌లోని 179 దుకాణాలకు 1,366 దరఖాస్తులు వచ్చాయి.

క్యాంపస్‌లలో నియామకాలు

ఫొటో సోర్స్, Getty Images

కాలేజీ క్యాంపస్‌లలో కొలువుల పంట

ఐటీ రంగంలో కొత్త నియామకాలు జోరందుకున్నట్లు 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

''కరోనా మహమ్మారి నుంచి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో.. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రాలతో పాటు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీలు గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

దీంతో హైదరాబాద్‌తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని కళాశాలల్లో కూడా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు జోరుగా సాగుతున్నాయి.

ఐటీ సంస్థల నుంచి ఉద్యోగులు తమ కొలువుల్ని వీడుతుండటం ఆసక్తికరం.

ఏటా ఇది సాధారణమే అయినా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉండటమే చర్చనీయాంశం.

కరోనా కారణంగా ఇంటి నుంచి విధి నిర్వహణలో సంస్థల తీరు, పనిభారం పెంచడం, ఇతర సంస్థల్లో కొత్త అవకాశాలు, విదేశాల్లో భారత నిపుణులకు పెరిగిన డిమాండ్‌, కొత్త సాంకేతికతల్లో విస్తృత ఉపాధి అవకాశాలు వంటి పలు కారణాలు ఉద్యోగుల నిష్క్రమణ వెనుక ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్‌కు భారత్‌లో 2,04,500 ఉద్యోగులుండగా.. వీరిలో 60వేలకు పైగా ఉద్యోగులు సంస్థను వీడారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర, విప్రో.. ఇలా ప్రధాన సంస్థలన్నీ కలుపుకొంటే దేశవ్యాప్తంగా 2.34 లక్షల మంది ఐటి ఉద్యోగులు రాజీనామా చేశారు.

హైదరాబాద్‌లో గత 6 నెలల్లో ఈ సంఖ్య 40వేలు. దీంతో భారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు సంస్థలు కొత్త నియామకాలపై దృష్టి సారించినట్లు'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANACMO/FB

ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్ ధర్నా

యాసంగి వడ్లను కేంద్రమే కొనాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న ధర్నాల్లో గురువారం పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు 'వెలుగు' ప్రకటించింది.

''ఐదేళ్ల కింద ఆయనే ఎత్తేసిన ధర్నా చౌకే ఇందుకు వేదికవుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లకే ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ను ఎత్తేయడం, ఆ నిర్ణయం చెల్లదంటూ 2018 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైకోర్టు కొట్టేయడం తెలిసిందే.

ధర్నా చౌకే ఉండొద్దన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు ఆందోళన చేయడానికి అక్కడికే పోతుండటంపై చర్చ జరుగుతోంది.

బుధవారం మంత్రులు హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, తలసాని, పార్టీ ముఖ్య నేతలు చౌక్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం ఉదయమే సీఎం చౌక్ వద్దకు చేరుకుంటారు.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 దాకా ధర్నా సాగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లంతా పాల్గొంటారు.

తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు'' వెలుగు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)