ఏపీ కేంద్రాన్ని అడుక్కునే స్థితిలో ఉందన్న తెలంగాణ మంత్రి, కేసీఆర్‌లా కాళ్లు పట్టుకోవడం జగన్‌కు రాదన్న వైసీపీ మంత్రి - ప్రెస్‌రివ్యూ

వేముల ప్రశాంత్ రెడ్డి, పేర్ని నాని

ఫొటో సోర్స్, facebook/vemulaprashantreddy/perninani

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌ ఎక్స్‌‌రోడ్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

'తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు అడుక్కుతింటారని అప్పటి మంత్రులు, నేతలు అన్నారు. ప్రస్తుతం ఏపీలో అదే పరిస్థితి ఏర్పడింది. నిధుల కోసం ఆ రాష్ట్ర సీఎం జగన్‌.. కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులు కావాలి' అని వ్యాఖ్యానించారు.

కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు.

ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాదిరిగా బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం జగన్మోహన్‌రెడ్డికి తెలియదన్నారు.

కేంద్ర నిధుల కోసం తాము బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో బ్యాంకులను అడిగితే తెలుస్తుందన్నారు.

కేసీఆర్‌ తరచుగా కేంద్రం వద్దకు వెళ్తున్నారని, నిధులిస్తే కేంద్రంలో చేరుతామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ పెద్ద పాలకుండ లాంటిదని, అలాంటి హైదరాబాద్‌ ఉండి కూడా తెలంగాణ అప్పుల పాలైందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ నేతల వైఖరి.. అత్తమీద కోపాన్ని దుత్తమీద చూపించినట్లుగా ఉందన్నారు.

కాగా, ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌ చేయించినవి కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

కేసీఆర్‌ మెప్పు పొందేందుకే కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఏపీకి లేదని, కేంద్రాన్ని నిధులు అడగడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందని అన్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

మద్యం విక్రయాలు

ఫొటో సోర్స్, Getty Images

అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల అమలు బాధ్యత స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్‌కు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై ఏపీలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా చూడనుందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''మద్యం విక్రయాల ద్వారా లభించే ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని కాపాడేలా సంబంధిత సంక్షేమ పథకాలకు వినియోగించనుంది ఏపీఎస్‌బీసీఎల్. ఈ మేరకు ఆ కంపెనీకి కొత్తగా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌) చట్టం-1993కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేపట్టింది.

సెప్టెంబరు 3న ఆర్డినెన్సు ఇచ్చింది. అది శుక్రవారం వెలుగులోకొచ్చింది. దాని ప్రకారం చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలుకు ఇకపైన ఏపీఎస్‌బీసీఎల్‌ బాధ్యత వహించనుంది.

ఆయా పథకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలకు సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు మార్పులు చేపట్టొచ్చు. ఏపీఎస్‌బీసీఎల్‌ ఇప్పటికే రూ.వేల కోట్లు అప్పులు తీసుకుంది.

కొత్తగా మరిన్ని రుణాలు తీసుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యతను ఈ కంపెనీకి అప్పగిస్తూ చట్ట సవరణ చేయటం చర్చనీయాంశమైంది.

ఏపీఎస్‌బీసీఎల్‌కు కొత్తగా అప్పగించిన బాధ్యతల్లో ప్రధానమైనవి:

  • రుణాలపై నిర్దేశిత కాలంలో అసలు, వడ్డీ చెల్లించేందుకు అవసరమైన నగదు కోసం కార్పొరేషన్‌ తన మెమొరాండం ఆఫ్‌ అసోషియేషన్‌, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోషియేషన్‌కు అవసరమైన సవరణలు చేసుకోవొచ్చు.
  • మద్యం విక్రయాల ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు వచ్చే ఆదాయం ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలు కాపాడేలా వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం మాత్రమే వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, సామాజిక సుస్థిరత కోసం మద్యం ఆదాయాన్ని వినియోగించాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వారు నిర్దేశించే సంక్షేమ పథకాల అమలు బాధ్యతలు చూడాలి'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
jagan

ఫొటో సోర్స్, facebook/Ysrcongress

సీఎం జగన్‌ను ఆహ్వానించిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఆహ్వానం పంపిందని సాక్షి కథనం తెలిపింది.

''2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరింది.

ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్‌ ప్రతినిధి బోర్జ్‌ బ్రెండె..మంత్రి గౌతమ్‌ రెడ్డిని కలిశారు. ఈ సారి 'వర్కింగ్‌ టుగెదర్‌, రీస్టోరింగ్‌ ట్రస్ట్‌' నేపథ్యంలో సమావేశం జరగనున్నట్లు బోర్జ్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏపీ ఆర్థికవృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతం రెడ్డి ఆయనకు వివరించారు.

కాగా కోవిడ్‌-19 నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్నా చర్యలను బోర్ట్‌ బ్రెండె ప్రశంసించారు. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తదితరవిషయాలపై బ్రెండె ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ధర్నా

ఫొటో సోర్స్, Trs

మర్లబడ్డ రైతన్న

యాసంగి వడ్లు కొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రమంతా శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించాయని 'నమస్తే తెలంగాణ' పత్రిక తెలిపింది.

''ఊరూవాడా మళ్లీ నాటి తెలంగాణ ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించాయి.

మహాధర్నా సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉరకలెత్తే ఉత్సాహం తొణకిసలాడింది.

మంత్రులు, నాయకులు వారి హోదాలను మరచి జనంతో మమేకమయ్యారు. తమ పూర్వ ఉద్యమరూపాలను ఆవిష్కరించారు.

రైతులు తమ పంటలతో ధర్నా ప్రాంగణాలకు తండోపతండాలుగా తరలివచ్చారు. వరిగొలుసులు, జొన్నకంకులు నిరసన జెండాలై ఎగిరాయి.

రైతులు, యువకులు ధర్నాల్లో పాల్గొని ఉద్యమస్ఫూర్తిని చాటారు.

అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి బాధ్యులు, గ్రామం నుంచి రాష్ట్రం దాకా అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)