ఆంధ్రప్రదేశ్: ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’

ఫొటో సోర్స్, YS JAGAN/FB
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ-2020కు సంబంధించిన చట్టాన్ని(Andhra Pradesh Decentralisation and Inclusive Development of All Regions Act, 2020) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
మొదట ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్, రాజధాని కేసులను విచారిస్తున్నఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనానికి చెప్పారు. ఇది సంచలనం సృష్టించింది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాజధాని వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ ఆమోదించింది. మధ్యాహ్నం మూడు గంటల దాకా ప్రభుత్వం నిర్ణయం మీద ఉహాగానాలు వచ్చాయి.

అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగాలని ఆందోళన చేస్తున్న రైతులు ఇది తమ ఘనవిజయంగా భావించారు.
కేంద్రం పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చర్యను స్వాగతించారు.
'ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ, అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుంది. రైతుల మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది'' అని కిషన్ రెడ్డి స్పందించారు.
ఇలాగే టీడీపీ కూడా ఈచర్యను రైతుల ఘన విజయంగా వర్ణించింది.
''3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం హర్షణీయం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతోన్న పోరాటానికి ఇది తొలి విజయం'' అని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఈ ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'ఉపసంహరణ బిల్లు' మీద వివరణ ఇవ్వగానే ఒక్కసారిగా అసంతృప్తి పెల్లుబికింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం వెనక ఏదో ఎత్తుగడ ఉందని అనుమానాలు మొదలయ్యాయి. అమరావతి వాదులంతా ఇది మోసం అని కేకలు వేశారు.
అమరావతి రైతు ఉద్యమానికి పెద్దదిక్కుగా ఉంటున్న వారిలో ప్రముఖుడైన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు బీబీసీతో మాట్లాడుతూ.... ''రాష్ట్ర ప్రభుత్వం మరొక వంచనకు పూనుకుంటున్నది. కోర్టును కూడా పెడదారి పట్టిస్తున్నది. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం కొనసాగుతుంది'' అని ప్రకటించారు.
మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లు సభ ఆమోదం పొంది, ప్రస్తుతానికి అమరావతియే రాజధాని అయినట్లు న్యాయపరంగా కనిపించినా... రాజధాని వికేంద్రీకరణ ఆశయంలో ఎలాంటి మార్పులేదని ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టంగా ప్రకటించారు.
రాజధాని వికేంద్రీకరణ ఉపసంహరణ అనేది కేవలం వ్యూహాత్మక ఉపసంహరణ మాత్రమేనని, దీనిని మరొకరూపంలో అమలు చేయబోతున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
జగన్ ఎప్పుడూ 'మడమ తిప్పని నేత' అని భావించే అభిమానుల్లో, రాష్ట్ర ప్రభుత్వ చర్య ఎక్కడ అసంతృప్తికి దారితీస్తుందోనని అందరికంటే ముందుగా పసిగట్టిన వ్యక్తి పంచాయతీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఆయన వెంటనే రంగ ప్రవేశం చేసి అభిమానులకు అభయమిస్తూ, "చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే. సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు హైకోర్టులో ఉపసంహరణ బిల్లు అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను" అని ప్రకటించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PEDDIREDDY RAMACHANDRA REDDY
అయితే, సాయంత్రానికల్లా ఇరు వర్గాల్లో స్పష్టత వచ్చింది. అమరావతి వాదులంతా ఇదొక ఎత్తుగడ మాత్రమేనని గమనించారు. జగన్ రాజధాని తరలింపును మానుకోలేదని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.
"మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టినా... మూడు ముక్కల ఆలోచనను విడనాడలేదని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. పాత బిల్లును మాత్రం వెనక్కి తీసుకొని, లోపాలు లేకుండా సమగ్రంగా తయారుచేసి, మళ్ళీ శాసనసభ ముందుకు వస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా వెల్లడించారు" అని సామాజిక ఉద్యమకారుడు టి. లక్ష్మీనారాయణ అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ ఆయన రెండు ప్రశ్నలు వేశారు.
"శ్రీభాగ్ ఒడంబడికలో విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఉన్నదా? అభివృద్ధి చెందిన హైదరాబాద్ మీదే దృష్టి కేంద్రీకరించడం మూలంగా నష్టం జరిగిందంటూనే... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం ప్రాంతాన్నే రాజధానిగా మేలన్న పల్లవిని ఎందుకు శాసనసభలో వినిపించారు? సమాధానం చెప్పాలి" అని లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు.
"ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల అంశం విచారణలో ఉంది. విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో కోర్టు నుంచి వస్తున్న వ్యాఖ్యలు చూస్తే తీర్పు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చేలా ఉంది. ఈ దశలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటే కోర్టులో ఎదురు దెబ్బతగలకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకసారి కోర్టులో ఓడిపోతే, సుప్రీంకోర్టుకు వెళ్లాలి. అక్కడా ఎదురు దెబ్బతగిలితే నైతికంగా ఎదురుదెబ్బ తగులుతుంది. దీన్నంతా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతుంది'' అని వడ్డే శోభనాద్రీశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు.
కోర్టు వ్యవహారం ముగిశాక మరొకసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతూ.. ''ఈ సారి శాసన మండలిలో కూడా మెజారిటీ వచ్చింది. ఈసారి బిల్లు ప్రవేశపెడితే, సెలెక్ట్ కమిటీకి పంపాలనే ప్రతిపాదన కూడా రాదని ప్రభుత్వం భావిస్తోంది'' అని ఆయన వివరించారు.
పర్యావరణ కోణం నుంచి అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో అనేక కేసులను వేసిన బోలిశెట్టి సత్యనారాయణ మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడాన్ని స్వాగతించారు.
అయితే, జగన్ ప్రభుత్వం ఈ చర్యతో మరింత గందరగోళం సృష్టించిందని అన్నారు.
''బిల్లు ప్రవేశపెట్టడంలో జగన్ ప్రభుత్వానికి నిజాయతీ లేదని అర్థమవుతోంది. ఎందుకంటే, ఒక వైపు బిల్లు ప్రవేశపెడుతూ మరొక వైపు మరింత కట్టుదిట్టంగా మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని అన్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశ్యం వెల్లడైంది'' అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న సత్యానారాయణ అన్నారు.
అమరావతి రాజధాని వ్యవహారం మీద మరింత వివరణ ఇస్తూ... ''అమరావతి రాజధాని ఏర్పాటులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిది ఒక రకం అరాచకమైతే, అమరావతి వికేంద్రీకరణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది మరొక రకమైన అరాచకం.''
''ఆరోజు జరీభూములను రాజధాని కోసం ధ్వంసం చేయవద్దని మేం న్యాయపరంగా పోరాడాం. ఆయన వినలేదు. ఇక రాజధాని విషయానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆరోజు జగన్ అమరావతికి అంగీకరించారు. సంతకం చేశారు. ఒకసారి అంగీకరించిన తర్వాత వెనక్కి వెళ్లడానికి వీల్లేదు. కానీ జగన్, వికేంద్రీకరణ అంటూ ఇప్పుడు చెబుతున్నారు.''
‘‘కోర్టులో ఓటమి ఎదుర్కోవడానికి బదులు..’’
''అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నపుడు వికేంద్రీకరణ గురించి ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదు. దానికి తోడు ఇప్పుడు మూడు రాజధానులను ఉపసంహరించుకుంటూ మరొక వైపు మళ్లీ బిల్లు పెడతామని సస్పెన్స్ సృష్టిస్తున్నారు. ఇది రాజనీతిజ్ఞుడు చేయాల్సిన పని కాదు'' అని సత్యనారాయణ అన్నారు.
అమరావతి కేసులను గ్రీన్ ట్రిబ్యునల్‌లో వాదించిన న్యాయవాది కరణం శ్రవణ్ కుమార్ కూడా 'ఉపసంహరణ'లో చిత్తశుద్ధి లేదని భావిస్తున్నారు.
రాజధాని నిర్మాణం అనేది గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ప్రధానాంశం కాదు అని చెబుతూ రాజకీయంగా రాజధానిని వాడుకోవడమే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానాంశమని శ్రవణ్ అన్నారు.
''పర్యావరణానికి హాని లేకుండా అమరావతిని నిర్మించడానికి బదులు గత ప్రభుత్వం మహారాజధానికి పూనుకుంది. ఇపుడు, ఆ రాజధానిని గత ప్రభుత్వం చేపట్టింది కాబట్టి వికేంద్రీకరణ పేరుతో దాని విధ్వంసానికి ఇప్పటి ప్రభుత్వం పూనుకుంటోంది. రెండు ధోరణులు కూడా ప్రజలకు మేలు చేసేవి కావు'' అని ఆయన అన్నారు.
విజయవాడకు చెందిన మరొక సీనియర్ న్యాయవాది బోడేపూడి విఠల్ రావు కూడా జగన్ ప్రభుత్వ 'ఉపసంహరణ' నిర్ణయంలో చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.
సాంకేతిక కారణాల కోణం నుంచి తాము రాజధాని పిటీషన్లను పరిశీలిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడంతో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందని ప్రభుత్వం భావించినట్లు కనిపిస్తోంది.
''అందువల్ల కోర్టులో ఓటమి ఎదుర్కోవడానికి బదులు మూడు రాజధానుల చట్టాన్ని ఉసంహరించుకుని గౌరవంగా కోర్టు నుంచి బయటపడాలనుకుంది'' అని విఠల్ రావు అన్నారు.
ఇలాంటి ఎత్తుగడ వెనుక లాజిక్ గురించి చెబుతూ... ''ఏ కారణం చేతనైనా మూడు రాజధానుల చట్టం చెల్లదని కోర్టు తీర్పు చెబితే, మళ్లీ ఏరూపంలో కూడా ఈ ప్రతిపాదనను తీసుకురావడం జగన్ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇది గమనించే తెలివిగా ఉపసంహరణ పేరుతో కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగలకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నది'' అని విఠల్ రావు అనుమానించారు.

అమరావతి మహారాజధాని నిర్మాణం, పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తుందని వాదిస్తూ వస్తున్న ప్రముఖ పర్యావరణవాది, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఈఏఎస్ శర్మ... ఈ మొత్తం రాజధాని వ్యవహారం వికేంద్రీకరణచుట్టూ తిప్పడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాజధానుల వికేంద్రీకరణ కంటే ముందు జరగాల్సిన వికేంద్రీకరణలు చాలా ఉన్నాయని, వాటిని విస్మరించి రాజధానియే సకల రోగాలను నయం చేసే విషయం అన్నట్లు ప్రభుత్వాలు భావిస్తున్నాయని డాక్టర్ శర్మ అన్నారు.
''రాజధాని వికేంద్రీకరణ వల్ల ప్రాంతీయంగా కొంత మేలుంటుంది. అయితే, ప్రజాస్వామిక వికేంద్రీకరణ జరగాలి. పంచాయతీలకు, గిరిజన ప్రాంతాలకు, గ్రామసభలకు అధికారాల వికేంద్రీకరణ జరగాలి. నిధుల వికేంద్రీకరణ జరగాలి.''
''రాజధాని బలంగా ఉన్నా, సెక్రటేరియట్ బలంగా ఉన్నా ఎవరికి ప్రయోజనం? కాంట్రాక్టర్లకే కదా.. గ్రామసభల దాకా అధికార వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం బాగు పడుతుంది.''
''స్థానిక స్వపరిపాలన వికేంద్రీకరణ జరగకుండా ప్రజాస్వామిక పాలన సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వాలు ముందు చేయాల్సిన పని రాజధాని వికేంద్రీకరణ కాదు. రాజ్యాంగంలోని నియమాల ప్రకారం అధికారాల వికేంద్రీకరణ జరగాలి. అధికారాలను సెక్రటేరియట్ నుంచి గ్రామాలకు, గిరిజన గూడాలకు వికేంద్రీకరించాలి'' అని డాక్టర్ శర్మ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- హైపర్సోనిక్ క్షిపణి ఏంటి? ఇవి నిజంగా అంత ప్రమాదకరమైనవా?
- వైఎస్ జగన్: ‘అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించిన విశాఖ గృహిణి
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















