ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల భవనాల నిర్మాణానికి సెంట్రల్ విస్టా ఆర్కిటెక్ట్‌ బిమల్ పటేల్ సంస్థ - ప్రెస్‌ రివ్యూ

BIMAL PATEL

ఫొటో సోర్స్, FACEBOOK/BIMAL PATEL

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాల నిర్మాణంలో, దిల్లీలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సెంట్రల్ విస్టాలో భాగమైన ఆర్కిటెక్టు బిమల్ పటేల్ సేవలను వినియోగించుకునేందుకు సర్కారు ఆసక్తి చూపిస్తున్నట్లు 'ద హిందు' పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

''మూడు రాజధానుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, అసెంబ్లీ భవన నిర్మాణంలో బిమల్ పటేల్ సేవలను ఉపయోగించుకోనున్నట్లు రాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

''ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థను విశాఖపట్నానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై కోర్టు కేసు ఉన్నప్పటికీ, మూడు రాజధానుల ప్రణాళిక మాత్రం అనుకున్నట్లుగానే ముందుకు సాగుతోంది. అమరావతిలో సేకరించిన భూముల్లో అసెంబ్లీ భవనాల నిర్మాణం, కర్నూలులో హైకోర్టును నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం బిమల్ పటేల్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రభుత్వ భవనాల నిర్మాణంలో ఆ కంపెనీకి ఉన్న అపారమైన అనుభవం కారణంగానే ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని'' ఆ అధికారి వివరించినట్లు హిందు దినపత్రిక వెల్లడించింది

ఈ అంశాన్ని బిమల్ పటేల్ కూడా ధ్రువీకరించారు. 'ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ ప్రాజెక్టు పనులను మాత్రమే చూస్తున్నాం. కోర్టు కేసులు పరిష్కారమయ్యాకే, అధికారికంగా మిగతా ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టడం సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వ అధికారులు చెప్పారు' అని బిమల్ పటేల్ అన్నట్లు 'ద హిందు' పేర్కొంది.

KTR

ఫొటో సోర్స్, KTR/FACEBOOK

సమయం, సందర్భాన్ని బట్టి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్

సమయం, సందర్భాన్ని బట్టి తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.

'ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సప్ యూనివర్సిటీ ప్రచారమే తప్ప నిజం లేదని చెప్పారు. ప్రపంచంలోని అతి గొప్ప పథకాల్లో ఒకటైన దళితబంధును ఆపడం ఎవరి తరం కాదన్నారు.

నవంబర్ 3 తర్వాత అది రాష్ట్రమంతటా యథాతథంగా కొనసాగుతుందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

నాగార్జునసాగర్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిని ఓడించాం. ఈటల రాజేందర్ అంతకన్నా గొప్పనైతేం కాదు. హుజురాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుంది. రేవంత్, ఈటల తదితరులు తెరాసపై కుట్రకు తెరలేపారు. కావాలనే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదని, అది ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంలాంటిదని వ్యాఖ్యానించారు. ప్లీనరీ, తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 9 నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.

నవంబర్ 15 తర్వాత తమిళనాడుకు వెళ్లి డీఎంకే, అన్నాడీఎంకేల నిర్మాణాన్ని అధ్యయనం చేయనున్నట్లు కేటీఆర్ చెప్పినట్లు'' ఈనాడు పేర్కొంది.

ASADUDDIN

ఫొటో సోర్స్, ANI

ముస్లిం మగాళ్లకో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా: అసదుద్దీన్ ఓవైసీ

'బుర్ఖా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్ఖా వేసుకున్న అమ్మాయి.. మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. ముస్లిం యువకుడు ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం యువతి మాత్రం అలా కనిపించకూడదా? మగాళ్లకో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా? అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?.. 'అని అఖిల భారత మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించినట్లు 'సాక్షి' పేర్కొంది.

''మజ్లిస్‌ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్‌లోని దారుస్సలంలో మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా సోమవారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం, దేశం మారిందని.. ఇది 1969 కాదని, 2021లో ఉన్నామని గ్రహించాలని, కాలానికి తగట్టుగా మారక తప్పదని స్పష్టం చేశారు.

దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ఉగ్రవాదుల చేతిలో మన సైనికులు మరణిస్తుంటే ఆ దేశంతో భారత్‌ టీ- 20 మ్యాచ్‌ ఆడుతుందా? అని ప్రధాని మోదీపై ఒవైసీ ధ్వజమెత్తారు.

పాక్‌ నిత్యం భారత పౌరుల జీవితాలతో 20-20 మ్యాచ్‌ ఆడుతోందని, జమ్మూకశ్మీర్‌లో పౌరుల నరమేధం కొనసాగుతోందని అన్నారు. నిఘా విభాగం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారని నిలదీశారు.

ధరల సవరణ పేరుతో పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజూ పెంచుతుండటంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని ఓడించి తీరుతామని అసదుద్దీన్‌ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి చోటా పోటీ చేసే అవకాశం పార్టీలకు ఉందని, పట్టు ఉన్న చోట పోటీ చేసి తీరుతామని అసదుద్దీన్ చెప్పారని'' సాక్షి పేర్కొంది.

DRUGS

ఫొటో సోర్స్, Getty Images

మత్తుబాబుల కొత్త ఎత్తులు..

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్‌ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికీ, ఇతర రాష్ర్టాల నుంచి గంజాయి, వైట్‌నర్‌ మాఫియా సాగిస్తున్న దందా సమస్యాత్మకంగా మారుతోందని 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''మెడికల్‌ దుకాణాల్లో తేలికగా లభించే వివిధ రకాల దగ్గు, నొప్పి నివారణ మందులకు యువత బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను రాష్ట్ర పోలీసులు నిర్మూలించడంతో వాటికి బానిసైనవారు మత్తునిచ్చే ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నాయి.

మెడికల్‌ దుకాణాల్లో చట్టబద్దంగా దొరికే దగ్గు మందులు, నొప్పి నివారణ మందులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వీటిని అతిగా వాడటం ఆరోగ్యానికి హానికరమని తెలిసీ అలవాటుపడుతున్నారు.

మత్తుబాబులు ప్రధానంగా ఓపైడ్‌ డ్రగ్స్‌ (నొప్పి నివారణ), సెడెటివ్‌ డ్రగ్స్‌ (మత్తునిచ్చి నిద్రపుచ్చేవి) ఎక్కువగా వాడుతున్నట్టు పోలీసుల పరిశీలనలో తేలింది.

ఇటీవల నల్లగొండలో కొందరు యువకులు 'ట్రెమడాల్‌' అనే నొప్పి నివారణ ట్యాబ్లెట్లను వాడుతున్నట్టు బయటపడింది. సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి నైట్రోవెట్‌ ట్యాబ్లెట్లను ఒక్కో షీట్‌ రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించి కొనుగోలు చేసి మత్తు కోసం వాడినట్టు ఈ నెల 12న పోలీసులు గుర్తించారు.

మరికొందరు టెర్మైన్‌ ఇంజెక్షన్లు, కిటోమిన్‌ వర్గానికి చెందిన మందులు, ఇతర దగ్గుమందులు వాడుతున్నారు. వైట్‌నర్‌ను చేతి రుమాలులో పోసి వాసన పీల్చడం ద్వారా కొందరు మత్తులో జోగుతున్నట్లు'' నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)