ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తారా? -ప్రెస్‌రివ్యూ

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, APIandPR

ఇప్పటికే అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు-2020ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గవర్నర్‌కు పంపినట్లు సాక్షి పత్రిక ప్రధాన కథనంగా ఇచ్చింది.

సీఆర్డీఏ రద్దుతోపాటు, రాజధానుల వికేంద్రీకరణ అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. మండలిలో రెండుసార్లు ఈ బిల్లు ఆగిపోయినా, నిర్ణీత గడువు ముగిసి పోవడంతో దాని ఆమోదం అవసరం లేదని సాక్షి పత్రిక కథనం వెల్లడించింది. ప్రాంతీయ సమగ్రమాభివృద్ధికే ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చినట్లు కథనం పేర్కొంది.

అయితే, గవర్నర్‌ ఈ బిల్లులను ఏం చేస్తారోనంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు ఇచ్చాయి. వీటిని యథాతథంగా ఆమోదిస్తారా, న్యాయ నిపుణుల సలహా ఏమైనా తీసుకుంటారా, లేక రాష్ట్రపతికి నివేదిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ఇచ్చాయి. రేపే దీనిపై గవర్నర్‌ నిర్ణయం ఉండే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి రాసింది.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, cgkhabar/bbc

తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కలకలం- ఆటలు సాగవన్న డీజీపీ

తెలంగాణ ప్రాంతంలో మళ్లీ పట్టుబిగించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పార్టీ శ్రేణులకు కొత్త జనరల్ సెక్రటరీ బస్వరాజ్‌ దిశానిర్దేశం చేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందిందని ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.

చత్తీస్‌గఢ్‌ అడవుల్ని దాటి తెలంగాణలో బలమైన బేస్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని బస్వరాజ్‌ ఇచ్చిన ఆదేశాలను నిఘా వర్గాలు గుర్తించినట్లు ఈ కథనంలో పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్‌, తిర్యాణి, ములుగు, వెంకటాపురం, మణుగూరు ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు నిఘా వ్యవస్థలు గుర్తించాయని ఈ కథనం పేర్కొంది.

అయితే, మావోయిస్టుల ఆటలు సాగనివ్వబోమని ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. నక్సలైట్ల కదలికలు, వాటిని అడ్డుకునేందుకు వ్యూహాలకు సంబంధించి పోలీసులు అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేసినట్లు ఈ కథనం వెల్లడించింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి

ఫొటో సోర్స్, YSRCongress

సీబీఐకి వివేకా హత్య కేసు- సిట్‌ నుంచి విచారణ వివరాల సేకరణ

వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మొదలు పెట్టిందని ఆంధ్రజ్యోతి సహా పలు పత్రికలు ప్రముఖంగా రాశాయి.

శనివారం కడపకు చేరుకున్న సీబీఐ బృందం, ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్ నుంచి కేసు వివరాలు తీసుకున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది. దీంతోపాటు పలువురిని విచారించినట్లు కూడా ఈ కథనంలో పేర్కొంది.

సంచలనం సృష్టించిన ఈ కేసును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్‌కు అప్పగించగా, అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారని ఈ కథనంలో వెల్లడించింది. కడప ఎంపీ వై.ఎస్. అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15మంది పేర్ల జాబితాను ఆంధ్రజ్యోతి ఈ కథనం పేర్కొంది.

కర్నూలు

సెప్టెంబర్‌ 5 నుంచి ఏపీలో స్కూళ్లు - ఇంకా నిర్ణయించని తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లను ప్రారంభిస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలతో జరిపిన సమావేశంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయగలరో చెప్పాలని కోరారు.

తమిళనాడు, తెలంగాణ ఏ తేదీనీ ప్రకటించకపోగా, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీ రాష్ట్రాలు తాము ఆగస్టులో 3 నుంచి స్కూళ్లు తెరగవగలమని వెల్లడించాయి. అయితే ఈ నెల 15 నాటి సమావేశపు నిర్ణయాలలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తెలపాల్సిందిగా తాజాగా కేంద్రం వివిధ రాష్ట్రాలకు లేఖ రాయగా, ఇంతకు ముందు ప్రకటించిన ఆగస్టు 3 నుంచి కాక, సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమాధానం పంపినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/kcr

గ్రామాల్లోనే కరోనా గుర్తింపు- సబ్‌సెంటర్ల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం

ప్రాథమిక దశలోనే కరోనాను గుర్తించేందుకు గ్రామస్థాయిలో కరోనా గుర్తింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం ఇచ్చింది. గ్రామస్థాయిలో సబ్‌ సెంబర్లు ఏర్పాటు చేసి జ్వరంతో వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించినట్లు ఈ కథనంలో పేర్కొంది.

పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌కు పంపుతామని, సీరియస్‌ కేసులను పెద్ద ఆసుపత్రికి పంపిస్తామని మంత్రి చెప్పారు. మందుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పిన మంత్రి, ఆసుపత్రులు రోగులను ఎట్టి పరిస్థితుల్లో తిప్పి పంపవద్దని అధికారులకు సూచించారు.

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

కరోనా పెళ్లికి కొత్త గైడ్‌లైన్స్‌- ఆధార్‌, కరోనా రిపోర్ట్‌ తప్పనిసరి

శ్రావణ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఒకేచోట గుమి గూడకుండా నిరోధించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఆంధ్రప్రభ ఒక కథనం ఇచ్చింది.

ఈ కథనం ప్రకారం పెళ్లికి అనుమతులను ప్రభుత్వం కలెక్టర్ల నుంచి తాశీల్దారులకు బదిలీ చేసింది. పెళ్లి కాక ఏ ఇతర ఫంక్షన్లకు అనుమతులు ఇవ్వవద్దని నిర్ణయించింది. వధువు,వరుడు తరుఫున కేవలం 20మందే హాజరుకావాలని, హాజరైన వారి వివరాలను అధికారులకు అందించాలని పేర్కొంది.

పెళ్లిపత్రిక, కరోనా రిపోర్టు, ఆధార్‌ కార్డు, నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని శనివారంనాడు విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆంధ్రప్రభ కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)