నారా చంద్రబాబు నాయుడు: తనపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ - Newsreel

నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

అమరావతి ప్రాంత భూములపై సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పొంగునూరు నారాయణ కూడా ఇదే కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు.

అమరావతి భూముల వ్యవహారంలో అసైన్డ్ భూముల సేకరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం.. ఈ కేసులో విచారణకు రావాలంటూ చంద్రబాబుకు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది. వివిధ ఐపీసీ సెక్షన్‌లతో పాటుగా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం, అసైన్డ్ భూముల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మార్చి 22న విచారణకు రావాలని నారాయణకు, మార్చి 23 విచారణకు రావాలని చంద్రబాబును అలాగే మార్చ్ 19న రావాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికీ నోటీసులు పంపారు.

ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు.

అయితే తమపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, నోటీసులు ఇవ్వటం చట్ట విరుద్ధం అంటూ చంద్రబాబు నాయుడు, నారాయణలు హైకోర్టుకి వెళ్లారు. తమకు నోటీసులు ఇచ్చి, ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారని ఇది చట్ట విరుద్ధం అని వారు పేర్కొన్నారు.

దీనిపై వెంటనే విచారణ జరపాలని చంద్రబాబు, నారయణల తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. శుక్రవారం ఉదయం విచారణ చేపడతామని హైకోర్టు చెప్పింది.

line

ఇండియా నుంచి వాక్సీన్ సరఫరాలో ఆలస్యం.. బ్రిటన్‌లో వాక్సీన్‌లకు కొరత

కోవిడ్ వాక్సీన్

ఫొటో సోర్స్, PA Media

భారతదేశం నుంచి బ్రిటన్ కి సరఫరా చేయవలసి ఉన్న 50 లక్షల ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా డోసుల సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో ఏప్రిల్ నెలలో యూకెలో కోవిడ్ వ్యాక్సీన్ నిల్వలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సీన్ సరఫరాలో నాలుగు వారాల పాటు జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు బీబీసీకి తెలిసింది.

ఈ సరఫరాలో జరుగుతున్న జాప్యానికి ఏ ఒక్క సంస్థ కానీ దేశం కానీ బాధ్యులు కారని బ్రిటన్ హౌసింగ్ కార్యదర్శి రాబర్ట్ జెన్రిక్ చెప్పారు.

జూలై చివరి నాటికి అందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలని యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. అయితే, ఈ విభాగం స్థానిక ఆరోగ్య సంస్థలకు రాసిన లేఖల్లో వ్యాక్సీన్ సరఫరా తగ్గవచ్చని పేర్కొంది.

కొన్ని వారాల క్రితమే యూకేకి 50 లక్షల డోసులను సరఫరా చేసినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి చెప్పారు. ''ప్రస్తుత పరిస్థితుల్లో.. భారతదేశంలో అమలవుతున్న వ్యాక్సీన్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న వారాల్లో మరిన్ని డోసులను సరఫరా చేసేందుకు చూస్తాం" అని పేర్కొన్నారు.

మార్చి కల్లా మిగిలిన 50 లక్షల డోసులను సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ వాటి సరఫరాకు ఒక నిర్ధరిత సమయం నిర్ణయించుకోలేదన్నారు.

వ్యాక్సీన్ సరఫరాలో సమస్యలున్నట్లు కొన్ని రోజుల క్రితమే తెలిసిందని జెన్రిక్ బీబీసీకి చెప్పారు. ప్రస్తుతం యూకెలో అందరికీ వ్యాక్సీన్ ఇచ్చేందుకు అవసరమైన దాని కంటే తక్కువగానే వ్యాక్సీన్ నిల్వలు ఉన్నప్పటికీ ఏప్రిల్ నాటికి వాటి సరఫరా తగినంత అందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీని వలన వ్యాక్సీన్ ఇవ్వడం అనుకున్న సమయం కంటే కాస్త నెమ్మదిగా జరగవచ్చు గాని ఏప్రిల్ 15 లోగా 50 సంవత్సరాలు పై బడిన వారికి , మిగిలిన పెద్ద వయసు వారందరికీ జూలై ఆఖరికల్లా తొలి డోసు వ్యాక్సీన్ ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యంలో ఎటువంటి జాప్యం జరగదని చెప్పారు.

line

జాన్ మగుఫులి: టాంజానియా అధృక్షుడి మృతి.. కోవిడ్ సోకటం వల్లనేనని వదంతులు

జాన్ మగుఫులి

ఫొటో సోర్స్, AFP

టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి హృద్రోగ సంబంధిత సమస్యలతో బుధవారం మరణించినట్లు ఆ దేశ ఉపాధ్యక్షురాలు సామియా సులుహు హస్సన్ ప్రకటించారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.

ఆయన గత రెండు వారాలుగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి అనేక వదంతులు ప్రచారమయ్యాయి. ఆయనకు కోవిడ్ సోకి ఉండవచ్చని ప్రతిపక్ష నాయకులు చెప్పినప్పటికీ ఈ విషయాన్ని ఎవరూ నిర్ధరించలేదు.

కరోనావైరస్ తీవ్రతను కొట్టి పడేసి వైరస్ పట్ల అనుమానాలు వ్యక్తం చేసిన వ్యక్తుల్లో మగుఫులి ఒకరు. వైరస్ ఎదుర్కోవడానికి మూలికలతో కూడిన ఆవిరి పెట్టుకుని, ప్రార్ధనలు చేసుకోమని ఆయన ప్రజలకు సూచించారు.

"టాంజానియా ఒక ధైర్యవంతుడైన నాయకుడిని కోల్పోయిందని చెప్పడానికి చింతిస్తున్నాను" అని హస్సన్ అన్నారు.

టాంజానియా

ఫొటో సోర్స్, AFP

ఆయనకు 14 రోజుల పాటు జాతీయ సంతాపం తెలిపి, జెండాలను కిందకు ఎగరవేస్తామని తెలిపారు.

టాంజానియా రాజ్యాంగాన్ని అనుసరించి హస్సన్ దేశాధ్యక్షురాలిగా 24 గంటల లోపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మగుఫులికి మిగిలిన నాలుగు సంవత్సరాల పదవీ కాలాన్ని ఆమె పూర్తి చేస్తారు.

మగుఫులి ఆఖరి సారి ఫిబ్రవరి 27న బయటకు కనిపించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు దేశ ప్రధాని గత వారం ప్రకటించారు.

దేశాధ్యక్షుని ఆరోగ్యం పై వచ్చిన వదంతులను ఆయన ఖండించారు.

కానీ, మగుఫులి కెన్యా లోని ఒక ఆసుపత్రిలో కరోనావైరస్ కోసం చికిత్స తీసుకున్నట్లు తనకు తెలిసిందని ప్రతిపక్ష నాయకుడు టుండు లిస్సు బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)