హైపర్‌సోనిక్ క్షిపణి ఏంటి? ఇవి నిజంగా అంత ప్రమాదకరమైనవా?.. అమెరికా, చైనా, రష్యాల మధ్య పోటీ ప్రపంచానికి ప్రమాదంగా మారనుందా?

హైపర్‌సోనిక్ క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

గత నెలలో చైనా పైన ఆకాశంలో రాకెట్ లాంటిదేదో అత్యంత వేగంతో దూసుకెళ్లినట్లు కనిపించింది.

అది దాదాపు భూమినంతా చుట్టి వచ్చి, లక్ష్యానికి 40 కిలోమీటర్ల ముందే పడిపోయినట్లు సమాచారం.

ఇది ఓ కొత్త రకం హైపర్‌సోనిక్ క్షిపణి అని నిపుణులు అంటున్నారు. కానీ, ఈ వాదనను చైనా తిరస్కరించింది.

అయితే, ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే ఇలాంటి క్షిపణుల కారణంగా అమెరికా, చైనా, రష్యాల మధ్య ఆయుధాల రేస్ ప్రారంభమైందన్నది కూడా వాస్తవమే.

ఇంతకీ హైపర్‌సోనిక్ క్షిపణులంటే ఏంటి? ఇవి నిజంగా అంత ప్రమాదకరమైనవా? తెలుసుకుందాం.

ట్రెబుచే

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

ఫొటో క్యాప్షన్, ట్రెబుచే అనేది ఒక రకమైన భారీ స్లింగ్‌షాట్ ఆకారంలో ఉండే ఆయుధం, పెద్దపెద్ద రాళ్లు, ఇనుప బంతులను శత్రు సైన్యంపైకి దీంతో విసిరేవారు. గన్‌పౌడర్‌ను కనుగొనడానికి ముందు యుద్ధాల్లో ఇదే ప్రధాన ఆయుధం.

రాకెట్ సైన్స్ ప్రారంభం

డాక్టర్ గుస్తావ్ గ్రెస్సెల్ ఆస్ట్రియా రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ప్రస్తుతం యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ అఫైర్స్‌లో సీనియర్ పాలసీ ఫెల్లోగా ఉన్నారు.

యుద్ధ చరిత్ర ఎంత పాతదో శత్రువులను లక్ష్యంగా చేసుకుని గాల్లోకి ఆయుధాలు విసరడం కూడా అంత పాత పద్ధతే అని ఆయన అన్నారు.

గుండ్రంగా ఉండే పెద్ద రాళ్లు, లోహాలను దూరంగా విసిరేందుకు ఫిరంగుల్లాంటి వాటిని ఉపయోగించేవారు.

ఇంజను ఉపయోగించి వస్తువులను మరింత శక్తిమంతంగా ఎక్కువ దూరాలకు విసరవచ్చన్న అవగాహనే క్షిపణి సాంకేతికతకు పురుడుపోసింది.

1930లలో ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి పరిచింది జర్మనీ.

"జర్మనీలో ఐస్వయర్ (REichswehr) ఆర్మీ కాలంలో రాకెట్ లేదా మిసైల్ సాంకేతికతను అభివృద్ధి పరచడంపై దృష్టి పెట్టారు. జర్మనీ ఓ కొత్త ఆయుధం తయారు చేయాలనుకుంది. అందుకోసం వేలాదిమంది శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని తయారుచేసింది. వారి కృషి ఫలితంగా, సాంకేతికతకు సంబంధించి చాలావరకు ఇంజినీరింగ్ ఇబ్బందులను అధిగమించగలిగింది" అని గ్రెస్సెల్ వివరించారు.

మొదటి ప్రపంచ యుద్ధం చివర్లో చేసుకున్న వర్సైల్స్ ఒప్పందం ప్రకారం జర్మనీ వైమానిక దళాన్ని నిర్వహించకూడదు. సైనిక సాంకేతికను అభివృద్ధి చేయడంపై కూడా నిషేధం ఉంది.

కానీ, ఈ ఒప్పందంలో రాకెట్ సాంకేతికత గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అప్పటికి అది అభివృద్ధి చెందలేదు.

కాబట్టి, జర్మనీ ఈ సాంకేతికతపై పరిశోధన ప్రారంభించింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి రెండు సరి కొత్త ఆయుధాలను తయారుచేసింది.

వీడియో క్యాప్షన్, హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం

పీనే నది బాల్టిక్ సముద్రాన్ని కలిసేచోటుకు సమీపంలో పీనేముండే అనే ప్రదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద, అత్యంత ఆధునిక ఆయుధ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించింది జర్మనీ.

ఈ ప్రాంతంలో వారికి 400 కిమీ టెస్టింగ్ రేంజ్ లభించింది.

"జర్మనీ రెండు విభిన్న పరిశోధనా కార్యక్రమాలను చేపట్టింది. అవి వీ-1, వీ-2. వీటి కింద అల్ప శ్రేణి, దీర్ఘ శ్రేణి క్షిపణులను తయారుచేశారు. ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన ఆయుధాలు" అని గ్రెస్సెల్ వివరించారు.

వీటిని "వెంజెన్స్ వెపన్స్" అని పిలిచేవారు. అంటే ప్రతీకార ఆయుధాలని అర్థం.

జెట్ ఇంజన్ల సహాయంతో చాలా దూరం విసరగల బాంబు లేదా ఎగిరే బాంబు వీ-1. ఇవి క్రూయిజ్ క్షిపణులకు పూర్వ రూపమని చెబుతారు.

ధ్వని వేగంతో ప్రయాణించగల క్షిపణి వీ-2.

అయితే, ఈ రెండింటిలోనూ లోపాలు బయటపడ్డాయి.

వీ-1 చాలా త్వరగా వేడెక్కి, మార్గాన్ని కోల్పోతుంది. వీ-2లో లోపాలు ఉండడంతో హిట్లర్ దాన్ని అమెరికాపై ప్రయోగించలేకపోయారు.

"దీని గైడింగ్ టెక్నిక్‌లో లోపాలున్నాయి. రేంజ్ పెరిగితే టెక్నిక్ సపోర్ట్ చేయదు. అందువల్ల లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. న్యూయార్క్‌పై దాడి చేయాలంటే క్షిపణి పరిమాణం పెంచాలి. కానీ, అది లక్ష్యాన్ని చేరుకోగలదో లేదో నిర్థారించలేకపోయారు. ఇది జర్మనీ సైన్యం అంచనాలను అందుకోలేకపోయింది."

యుద్ధంలో లండన్, ఆంట్‌వెర్ప్, పారిస్‌లపై జర్మనీ క్షిపణులను ప్రయోగించింది. కానీ, అది యుద్ధం దిశను మార్చలేదు.

తరువాత, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన శాస్త్రవేత్తలు అమెరికా, సోవియట్ యూనియన్ వెళ్లిపోయి ఆయుధాల పరిశోధన, స్పేస్ మిషన్‌లపై పరిశోధనలు కొనసాగించారు.

ఈ రెండు దేశాలూ తమ సైన్యం బలాన్ని పెంచుకోవడం కోసం క్షిపణి సాంకేతికపై విస్తృతమైన పరిశోధనలు చేశాయి.

వెర్నర్ వాన్ బ్రాన్‌ను జర్మన్ రాకెట్ సైన్స్ పితామహుడిగా పిలుస్తారు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, వెర్నర్ వాన్ బ్రాన్‌ను జర్మన్ రాకెట్ సైన్స్ పితామహుడిగా పిలుస్తారు

హైపర్‌సోనిక్ క్షిపణి

జర్మనీ తయారుచేసిన వీ-1, వీ-2 క్షిపణులే నేటి క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులుగా రూపాంతరం చెందాయి.

క్రూయిజ్ క్షిపణులు భూమి ఉపరితలానికి దగ్గరగా ఎగురుతూ, తక్కువ దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు.

బాలిస్టిక్ క్షిపణులు భూవాతావరణం నుంచి బయటకు వెళ్లి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా గురిపెట్టగలవు.

లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడానికి, శత్రువులు తన జాడను పసిగట్టకుండా ఉండేందుకు ఆకాశంలో తన కదలికలను నియంత్రించుకోవడం క్షిపణులకు అవసరం.

ఆధునిక హైపర్‌సోనిక్ క్షిపణులు ఈ పని చేయగలవని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా ఉన్న డాక్టర్ లారా గ్రెగో తెలిపారు.

"ఏరోడైనమిక్స్ ఫోర్స్ ఉపయోగించి ఇవి తమ దారి మళ్లించుకోగలవు. ఆకాశంలో చాలా వేగంగా ఎగురుతున్నప్పుడు కూడా పైకి, కిందకు జరగడానికి, కుడి, ఎడమలకు తిరగడానికి సులువుగా వీటిని డిజైన్ చేశారు."

దీనివల్ల శత్రువు కన్నుగప్పి దాడి చేసే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ క్షిపణిని ట్రాక్ చేయడం కష్టం కాదని లారా అంటున్నారు.

వీడియో క్యాప్షన్, హిరోషిమాలో కన్నా ముందే అణు బాంబు పేలింది ఇక్కడే!

"ఇవి కాంతిని ప్రతిబింబించడమే కాక, వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీని ద్వారా సెన్సర్లు వీటిని గుర్తించగలవు. బాలిస్టిక్ క్షిపణులను గుర్తించేందుకు అమెరికా, రష్యాలు అంతరిక్షంలో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో కూడిన ఉపగ్రహ వ్యవస్థను రూపొందించాయి. వేడి, కాంతి కారణంగా ఇన్‌ఫ్రారెడ్ సిస్టం వీటి పూర్తి మార్గాన్ని గుర్తించగలదు. కింద పడిపోయేటప్పుడు వీటి వేగం నెమ్మదిస్తుంది. అప్పుడు రాడార్లు కూడా వీటిని పసిగట్టగలవు."

హైపర్‌సోనిక్ క్షిపణులు పూర్తిగా శత్రువుల కళ్లుగప్పి ప్రయాణించగలవని చెప్పడం సరికాదని లారా అభిప్రాయపడ్డారు.

అయితే, క్రూయిజ్ క్షిపణులకు ఉన్న ఒక ప్రధానమైన లోపాన్ని హైపర్‌సోనిక్ క్షిపణులు అధిగమించగలిగాయని అన్నారు.

"ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలితో ఘర్షణ కారణంగా క్షిపణి వేడెక్కుతుంది. ఈ ఉష్ణోగ్రతను తగ్గించాలంటే వేగం తగ్గించాలి. ఈ విషయంలో హైపర్‌సోనిక్ క్షిపణులకు అనుకూలత ఉంది. ఎందుకంటే అవి చాలావరకు భూవాతావరణాన్ని దాటి ప్రయాణిస్తాయి. అందువల్ల ఎక్కువ వేడెక్కవు."

హైపర్‌సోనిక్ క్షిపణులు పెద్ద ముప్పుగా పరిణమించవచ్చనే వాదనతో లారా ఏకీభవించరు.

"అత్యంత వేగవంతమైన క్షిపణులను తయారుచేస్తున్నామని కొన్ని దేశాలు చెబుతున్నాయిగానీ అది నిజం కాదు. బాలిస్టిక్ క్షిపణులు వీటికి సరితూగగలవు. ఇవి రహస్యంగా దాడి చేస్తాయన్న వాదన కూడా తప్పు. ప్రయోగించినప్పటి నుంచి, కింద పడిపోయేవరకు వీటి మార్గాన్ని గుర్తించవచ్చు. వేగంగా ఎగురుతున్నప్పుడు దిశను మార్చుకోగలిగే విషయానికొస్తే, ఆధునిక క్షిపణులు కూడా ఈ పని చేయగలవు."

దీన్నిబట్టి, మిసైల్ డిఫెన్స్ సిస్టం నుంచి హైపర్‌సోనిక్ క్షిపణులు తప్పించుకోలేవని స్పష్టమవుతోంది.

మరి ఇటీవల చైనా నిర్వహించిన పరీక్షపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?

9M729 క్రూయిజ్ క్షిపణి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 9M729 క్రూయిజ్ క్షిపణి

హైపర్‌సోనిక్ క్షిపణుల పోటీ

ఫ్రాన్స్, ఇండియా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా దేశాలు హైపర్‌సోనిక్ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్నాయి.

కానీ, ఈ అంశంలో అమెరికా, రష్యా, చైనాల వద్ద అత్యంత ఆధునిక సాంకేతికత ఉంది.

మిలటరీ టెక్నాలజీ విషయంలో ముందుండేందుకు పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయని హాంబర్గ్ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ పాలసీలో రీసెర్చ్ ఫెలోగా ఉన్న డాక్టర్ మరీనా ఫవారో అంటున్నారు.

"సాధారణంగా క్షిపణి ఎంత వేగంగా ఉంటే అంత మెరుగైనదని విశ్వాసం. మరోవైపు, ఆయుధాలు దేశ గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా మారాయి. ఈ దేశాలు ఆయుధాలను తయారుచేస్తున్నాయంటే, వాటిని ప్రయోగించాలని కాదు. తాము అత్యంత ఆధునిక ఆయుధాలను తయారుచేయగలమని నిరూపించుకోవడమే వాటి లక్ష్యం."

అంటే, టెక్నాలజీ విషయంలో తాము అమెరికాకు సరి సమానమని చూపించే ప్రయత్నంలో భాగంగా చైనా తాజా ప్రయోగం చేసిందని భావించవచ్చు.

"భవిష్యత్తులో ఎదురుకాగల బెదిరింపులను నిలువరించడానికి, అవసరమైతే ఎదురుదాడి చేయడానికి హైపర్‌సోనిక్ సాంకేతికపై పనిచేస్తున్నట్లు అమెరికా చెబుతోంది. రష్యా, చైనాలు ఈ ఆయుధాలను తయారుచేస్తున్నాయని చాలామంది నాయకులు నమ్ముతున్నారు. కాబట్టి అమెరికాకు కూడా అదే చేయాల్సిన అవసరం ఏర్పడింది" అని డాక్టర్ మరీనా అన్నారు.

ఇలాగే ఆయుధ సాంకేతికతలో పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!

పరస్పర హాని సూత్రం

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్‌లు అణ్వాయుధాలను తయారుచేశాయి కానీ వాటిని పరస్పరం ప్రయోగించుకోలేదు.

ఈ ఆయుధాలను ఉపయోగించేవారు కూడా వీటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేయకుండా ఈ పరస్పర హాని సూత్రం నిరోధిస్తుంది. సమతుల్యతను కాపాడుతుంది.

యుద్ధం కనుక వస్తే, సంప్రదాయ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో అమెరికా రక్షణ వ్యవస్థ తమ కంటే మెరుగ్గా ఉందని రష్యా, చైనాలు భావిస్తున్నాయి. అందుకే అవి ఆధునిక ఆయుధాల వైపు మొగ్గు చూపుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

అయితే, అమెరికా విషయంలో అది అతిశయోక్తి కావొచ్చని డాక్టర్ మరీనా అన్నారు.

కాగా ఇప్పటివరకు తాము నిర్వహించిన పరీక్షల గురించి చైనా పెద్దగా సమాచారం ఇవ్వలేదు. అది పాత అంతరిక్షనౌకలను ఉపయోగించేందుకు జరిపిన పరీక్ష అని పేర్కొంది.

"తమ వద్ద హైపర్‌సోనిక్ క్షిపణులు ఉన్నాయన్న విషయాన్ని చైనా ఖండించలేదు. ముందు నుంచే ఈ విషయాన్ని ప్రపంచానికి చెబుతూ వచ్చింది. దేశాలు సైనిక శక్తిని పెంచుకోవడం కొత్త విషయమేం కాదు. ప్రతీ దేశం హైపర్‌సోనిక్ క్షిపణులను తయారుచేసుకోవాలని కోరుకుంటుంది. ఇదే ఆయుధాల పోటీకి దారి తీస్తోంది"అని మరీనా అన్నారు.

అయితే, ఈ పోటీ ప్రపంచానికి ప్రమాదంగా మారనుందా?

క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

వ్యూహాలు, ఆయుధాలు, ఉద్రిక్తతలు

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అణు దాడి ప్రమాదాన్ని తగ్గించడానికి అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలలో చాలా వాటికి గడువు ముగిసింది. చివరి ఒప్పందం 2026లో ముగుస్తుంది.

కానీ, అమెరికా, చైనాల మధ్య ఈ తరహా ఒప్పందాలేమీ లేవు.

డాక్టర్ కామెరాన్ ట్రేసీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్‌లో రీసెర్చ్ స్కాలర్.

దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడంలో హైపర్‌సోనిక్ క్షిపణులు పెద్ద పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.

"దేశాల మధ్య ఆయుధాల పోటీ ఉందని, దానివల్ల భవిష్యత్తులో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్నది స్పష్టం. కానీ, హైపర్‌సోనిక్ క్షిపణుల వలన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పలేం. అయితే, సరిహద్దుల వల్ల ఈ క్షిపణులను మోహరిస్తే ఉద్రిక్తతలు కచ్చితంగా పెరుగుతాయి. ఇది బెదిరింపు చర్యలా ఉంటుంది. దాంతో అవతలి దేశం దాడికి దిగవచ్చు."

చైనా, రష్యాలు హైపర్‌సోనిక్ ఆయుధాలను తయారు చేయడం వెనుక కారణం అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని భావించడమే. అయితే, వీరి చర్యలను అమెరికా నివారించగలదా?

"తమ రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడడానికి అమెరికా సిద్ధంగా ఉండి, క్షిపణి రక్షణ వ్యవస్థ పరిమితులపై ఒప్పందాల్లో పాలుపంచుకుంటే.. చైనా, రష్యాలు పోటీ పడి హైపర్‌సోనిక్ క్షిపణులు తయారుచేయకుండా నివారించవచ్చు.

కానీ, ఇదంత సులభం కాదు. అమెరికా తన రక్షణ వ్యవస్థ గురించి చర్చించేందుకు ఇష్టపడదు. ఆయుధాల పోటీని నిలువరించడానికి ఇది ఉత్తతమైన మార్గం. కానీ, రాజకీయ కారణాల వల్ల ఇది జరగదు. నా ఉద్దేశంలో మరిన్ని రకాల హైపర్‌సోనిక్ క్షిపణులు తయారవుతాయి. ఎప్పుడైనా వీటి అవసరం రావొచ్చని, ముందే దేశాలు వీటిని అభివృద్ధి చేసే పనిలో పడతాయి. నా దృష్టిలో ఈ పోటీ ఇప్పుడప్పుడే తగ్గేది కాదు" అని డాక్టర్ ట్రేసీ అన్నారు.

ఏది ఏమైనప్పటికీ, హైపర్‌సోనిక్ క్షిపణులు సంప్రదాయ క్రూయిజ్ క్షిపణుల కన్నా వేగవంతమైనవి, బలమైనవి. అవసరమైనప్పుడు దిశ, గమనాలను మార్చుకోగలవు. శత్రువుల కన్నుగప్పి ప్రయాణించగలవని చాలామంది విశ్వసిస్తున్నారు.

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి. వీటివల్ల మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏ ఆయుధమూ చివరిది కాదు. దేశాల మధ్య పోటీ ఎప్పటికీ అంతం కాదు.

కానీ, సంఘర్షలను నివారించడానికి ప్రపంచంలోని పెద్ద దేశాలు పూనుకుని, ప్రయత్నించడం అవసరం.

ప్రొడ్యూసర్ - మానసీ దాస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)