కాగ్: ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పు రూ. 1,10,010 కోట్లు - ప్రెస్ రివ్యూ

కాగ్ కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాగ్ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తూర్పారబట్టిందని 'ఈనాడు' కథనం రాసింది.

శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని కాగ్ ఆగ్రహించింది. శాసనసభ ఆమోదం పొందకుండానే అనుబంధ పద్దు మొత్తాలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. అసలు ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని హెచ్చరించింది.

అప్పుల తీరుతెన్నులను బడ్జెట్‌లో చూపకుండా అప్పు చేసి తెచ్చిన నిధులను ఖర్చుచేస్తున్న వ్యవహారాలను తప్పుబట్టింది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది.

ఒకవైపు సగటున 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు, కార్పొరేషన్లలో రూ.కోట్ల పెట్టుబడులు పెడుతూ కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందట్లేదని తేల్చిచెప్పింది.

ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు తీర్చేందుకు ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించే వనరులు మరింత తగ్గిపోతాయని చెప్పింది.

2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ పూర్తయిన పద్దుల ఆధారంగా కాగ్‌ ఈ విశ్లేషణ చేసింది. ఒక నివేదికను వెలువరించింది. ఆ నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

'ఒకవైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం పెరిగిపోతోంది. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే అధికం. గడిచిన అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65-81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోంది. అప్పు తీసుకుంటే దాంతో ఆస్తులు సృష్టించాలి. అంటే ప్రభుత్వానికి ఆదాయం అందించే అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించాలి. రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఈ రుణాలు చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండబోవు' అని కాగ్‌ సుస్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

రాబోయే ఏడేళ్లలోనే రూ.1,10,010 కోట్ల అప్పులను ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని 2020 మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం కాగ్‌ పేర్కొంద''ని ఆ కథనంలో రాశారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/revanthreddy

కేసీఆర్‌లో చలనం రావడానికి ఇంకెందరు రైతులు చనిపోవాలి?

సీఎం కేసీఆర్‌లో చలనం రావాలంటే ఇంకెందరు రైతులు బలి కావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని 'ఆంధ్రజ్యోతి' వార్తాకథనం తెలిపింది.

''కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో రైతు రాజయ్య గుండె ఆగి వరికుప్పపైనే ప్రాణాలు వదిలాడని రేవంత్ అన్నారు. అయినా బండరాయి లాంటి కేసీఆర్‌ గుండెకు చలనం లేదా అని శుక్రవారం రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, వరి, మొక్కజొన్న సహా యాసంగి పంటల సేకరణకు సీఎం కేసీఆర్‌ రూ.5 వేల కోట్లు కేటాయిస్తే ఏ సమస్యా రాకుండా తాను చూసుకుంటానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మెడలు వంచుతానంటూ ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌.. తానే మెడలు వంచుకుని వచ్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని, ఆ పార్టీకి 8 అసెంబ్లీ సీట్లు వస్తే గొప్పేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు అన్నారు. కొత్త సచివాలయం ప్రాంగణంలో గతంలో కూల్చిన రెండు మసీదులు యథాస్థానంలో నిర్మించడంలేదన్న అనుమానాన్ని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ వ్యక్తం చేశారు. మసీదుల ప్రారంభోత్సవానికి వెళ్లిన వారిలో కొందరు ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

మండలి

ఫొటో సోర్స్, www.aplegislature.org

స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలను దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ

ఏపీలో స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని 'సాక్షి' కథనం తెలిపింది.

''శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిటర్నింగ్‌ అధికారులు లాంఛనంగా జారీ చేయనున్నారు. దీంతో 58 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 20 నుంచి 31కు పెరగనుంద''ని అందులో పేర్కొన్నారు.

స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే..

విజయనగరం ఇందుకూరు రఘురాజు

విశాఖపట్నం వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్‌

తూర్పుగోదావరి అనంత ఉదయభాస్కర్‌

కృష్ణా తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌

గుంటూరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు

ప్రకాశం తూమాటి మాధవరావు

చిత్తూరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌

అనంతపురం వై.శివరామిరెడ్డి

కంగన రనౌత్

ఫొటో సోర్స్, Getty Images

‘కంగనపై కేసు పెట్టండి’

మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదుచేయాలని నాంపల్లిలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సైఫాబాద్‌ పోలీసులను ఆదేశించిందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''న్యాయవాది కరం కొమిరెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన కోర్టు, ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 504, 505 కింద కేసు నమోదు చేయాలని , దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చింద''ని అందులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)