కరోనావైరస్‌ను నిరోధించే శక్తి కొందరిలో సహజంగా ఉంటుందా... ఈ శక్తి మరింత మెరుగైన వ్యాక్సీన్‌కు దారి చూపిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘర్
- హోదా, బీబీసీ హెల్త్ & సైన్స్ కరస్పాండెంట్
కరోనావైరస్ వేగంగా వ్యాపించే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొంత మందికి కోవిడ్ సోకడం లేదు. ఆ వైరస్‌ను అడ్డుకోగల రోగ నిరోధక శక్తి వారిలో ఉండడమే అందుకు కారణం. అలాంటి వ్యక్తుల శరీరంలోని రక్షణ వ్యవస్థను అర్థం చేసుకోగలిగితే మరింత మెరుగైన వ్యాక్సీన్లను తయారుచేయవచ్చని పరిశోధకులు అంటున్నారు.
మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కావడానికి ముందే కొందరిలో ఒక స్థాయిలో కోవిడ్ రోగ నిరోధక శక్తి ఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ తెలిపింది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరం పెంపొందించుకోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
ఈ రక్షణ శక్తిని వ్యాక్సీన్లలో ప్రవేశపెట్టగలిగితే ఇప్పుడు ఉన్నవాటి కంటే ప్రభావవంతమైనా టీకాలను తయారుచేయవచ్చని పరిశోధకుల బృందం వివరించింది.
మహమ్మారి మొదటి దశలో చురుకుగా పనిచేసిన ఆస్పత్రి సిబ్బందిని నిశితంగా పర్యవేక్షించారు. తరచూ వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు.
ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ, అధ్యయనం చేస్తున్న వారిలో కొందరికి కోవిడ్ సోకలేదు.
ఈ అధ్యయన ఫలితాలను 'నేచర్' జర్నల్‌లో ప్రచురించారు.

ఫొటో సోర్స్, Getty Images
సహజ కోవిడ్ రోగ నిరోధక శక్తికి కారణం ఏంటి?
పది మందిలో ఒకరికి కోవిడ్ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ, వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. పరీక్షల్లో ఎప్పుడూ పాజిటివ్ రాలేదు. వారిలో ఎప్పుడూ యాంటీబాడీస్ అభివృద్ధి చెందలేదు.
వీరిలో సహజంగా కోవిడ్ రోగ నిరోధక శక్తి ఉంది. వైరస్ శరీరంపై దాడి చేయకముందే దాన్ని నిరోధించే శక్తి వారిలో అభివృద్ధి చెందింది.
దీన్నే "అబార్టివ్ ఇంఫెక్షన్" (నిరోధక సంక్రమణ) అంటున్నారు.
వీరిలో మహమ్మారికి ముందే రక్షక 'టీ కణాలు' ఉన్నాయని రక్త నమూనా పరీక్షల్లో తేలింది.
కోవిడ్ సోకిన కణాలను గుర్తించి, నాశనం చేయడంలో ఈ టీ కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
కొత్త వ్యాధిని ఎదుర్కోవడానికి వీరి శరీరాలు ముందే "సన్నద్ధంగా ఉన్నాయని" పరిశోధకులలో ఒకరైన డాక్టర్ లియో స్వాడ్లింగ్ అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వైరస్‌లో ఒక భాగాన్ని కనుగొని, దానితో పోరాడేందుకు రోగ నిరోధక శక్తిని ప్రేరేపితం చేస్తాయి.
కానీ, ఈ టీ-కణాలు దానికన్నా భిన్నమైన వైరస్ భాగాన్ని గుర్తించగలిగాయి.
కరోనావైసర్‌పై ఉండే స్పైక్ ప్రొటీన్లపై వ్యాక్సీన్లు దాడి చేస్తాయి.
కానీ, ఈ అరుదైన టీ-కణాలు వైరస్ లోపలి ప్రొటీన్లను గుర్తించగలిగాయి. లోపల ఉన్న ప్రొటీన్లే వైరస్ సంఖ్య పెరగడానికి కారణం.
"కోవిడ్ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు దాని నుంచి తప్పించుకోవడానికి కారణం వారి శరీరంలో టీ-కణాలు అభివృద్ధి చెందడమే. మహమ్మారి వ్యాప్తికి ముందే వారిలో టీ కణాలు ఉండి ఉండవచ్చు" అని డాక్టర్ స్వాడ్లింగ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'వైరస్ లోపలి ప్రొటీన్లే లక్ష్యంగా టీకాలు తయారుచేవచ్చు'
కరోనావైరస్‌లన్నింటిలోనూ లోపలి ప్రొటీన్లు ఒకేలాగ ఉంటాయి. సాధారణ జలుబుకు కారణమైన కరోనావైరస్‌లలో కూడా ఇవే ప్రొటీన్లు ఉంటాయి.
అంటే, ఈ లోపలి ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని టీకాలు తయారుచేయగలిగితే అన్ని రకాల కరోనావైరస్‌లనూ జయించవచ్చు. కొత్తగా పుట్టే వైరస్‌లతో పోరాడడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు కోవిడ్ వ్యాధి తీవ్రం కాకుండా కాపాడుతున్నాయిగానీ వైరస్ సోకకుండా పూర్తిగా నియంత్రించడంలో అంత సఫలీకృతం కాలేదని పరిశోధకుల బృందం తెలిపింది.
"వ్యాక్సీన్లను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో టీ-కణాలను పొందుపరచగలిగితే, వ్యాధి సంక్రమణ నుంచి తప్పించుకోవచ్చు. కొత్త వైరస్‌లను గుర్తించడంలో కూడా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి" అని ప్రొఫెసర్ మాలా మైని చెప్పారు.
దాదాపు ప్రతీ ఒక్కరూ సాధారణ కరోనావైరస్ వలన కలిగే జలుబు బారిన పడే ఉంటారు. కానీ అందరిలోనూ ఈ రక్షక టీ-కణాలు అభివృద్ధి చెంది ఉంటాయని చెప్పలేం.
ఆస్పత్రి సిబ్బంది, వైరస్ అధికంగా ఉండే వాతావరణంలో పనిచేస్తుండడం వలన వారి శరీరం వైరస్‌లతో పోరాడే శక్తిని సంపాదించి ఉండవచ్చు. అందుకే వారిలో రక్షక టీ-కణాలు అభివృద్ధి చెంది ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.
"కొత్త వ్యాక్సీన్లను అభివృద్ధి పరచడంలో ఈ అధ్యయన ఫలితాలు కీలకం కావొచ్చు. టీకాల అభివృద్ధికి ఈ పరిశోధన దోహదపడుతుంది" అని రీడీంగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అలెగ్జాండర్ ఎడ్వర్డ్స్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- 21 వారాలకే పుట్టాడు.. అర కిలో బరువు కూడా లేడు
- ‘కరోనా అరికట్టడంలో విఫలమయ్యారంటూ దేశాధ్యక్షుడిపై క్రిమినల్ కేసు’
- సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?
- డెల్టా ప్లస్ కరోనా వేరియంట్: ఇట్టే వ్యాపిస్తుంది... ఇప్పుడున్న వ్యాక్సీన్లకు లొంగుతుందా?
- ఊహించని ప్రకటన చేసిన అమెరికా, చైనా.. ఈయూ, యూఎన్, గ్రీన్‌పీస్ ఏమన్నాయంటే..
- కోవిడ్ 19: జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు
- తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను కైవసం చేసుకున్న తరువాత నా జీవితం ఎలా అయిపోయిందంటే..
- వాతావరణాన్ని కాపాడేందుకు మీ వంతుగా చేయాల్సిన నాలుగు పనులు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండా, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








