కోవిడ్ 19: జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు

తరుణ, ఆమె భర్త రాజీవ్

ఫొటో సోర్స్, TARUNA ARORA

ఫొటో క్యాప్షన్, తరుణ, ఆమె భర్త రాజీవ్
    • రచయిత, మేధావి అరోరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తరుణ అరోరా భర్త రాజీవ్ కోవిడ్‌తో మరణించారు. ఆయన 50వ పుట్టిన రోజుకు ఇంకో రెండు రోజులు ఉందనగా ఈ విషాదం చోటుచేసుకుంది.

దేశాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ కుదిపేస్తున్న సమయం, అంటే ఏప్రిల్‌లో రాజీవ్‌కు కోవిడ్ సోకింది. ఆక్సిజన్ కొరత, ఎక్కడా బెడ్ దొరకని పరిస్థితి. రాజీవ్‌ను ఆసుపత్రిలో చేర్చేందుకు ఆయన కుటుంబం ఎంతో ప్రయత్నించింది.

చివరికి, ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటు కోవిడ్ పడకల్లో రాజీవ్‌కు చోటు దక్కింది. కానీ, అక్కడ చేర్చిన రెండు వారాల తరువాత ఆయన చనిపోయారు.

"రాజీవ్ చనిపోవడంతో మెదడు మొద్దుబారిపోయింది. నా జీవితంలో అత్యంత చెడ్డ రోజులవి. కానీ విచారించే సమయం కూడా నాకు చిక్కలేదు. ఒక్కసారిగా జీవితం మొత్తం తలకిందులైపోయింది" అని 46 ఏళ్ల తరుణ చెప్పుకొచ్చారు.

రాజీవ్ టెలికాం రంగంలో పనిచేసేవారు. వారి కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం. ఆర్థిక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకునేవారు.

ప్రస్తుతం, తరుణ, ఆమె ఇద్దరు పిల్లలు ఇంత వరకు పొదుపు చేసిన సొమ్ముపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

"మా జీవితం చాలా హాయిగా గడిచేది. నాకు కావలసినవన్నీ దక్కాయి. ఇంటి ఖర్చులన్నీ ఆయనే చూసుకునేవారు. నాకేదైనా అవసరం అయితే డబ్బులు అడిగి తీసుకునేదాన్ని. ఇప్పుడు, పొదుపు చేసిన సొమ్ము ఎంతకాలం వస్తుందో తెలీదు. నేనెప్పుడూ ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టలేదు" అన్నారు తరుణ.

ఏదైనా ఉద్యోగం చేసి తన పిల్లలను పోషించుకోవాలని తరుణ ఆశపడుతున్నారు. కానీ, ఆమెకు ఉద్యోగం చేసిన అనుభవం లేదు. ఎక్కడ మొదలెట్టాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారామె.

"నాకో ఉద్యోగం దొరికితే చాలు. ఇల్లు వదిలి బయటికెళ్లాలి. మనుషులను కలవాలి. వారితో కూర్చుని టీ తాగాలి. ఇంట్లో ఉంటే ఈ బాధ భరించలేకపోతున్నాను. నిద్ర పట్టడం లేదు" అని తరుణ చెప్పారు.

కోవిడ్ కారణంగా భారతదేశంలో సుమారు 440,000 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ కారణంగా భారతదేశంలో సుమారు 440,000 మంది చనిపోయారు.

జీవితాలు అతలాకుతలం

కోవిడ్ మహమ్మరితో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారతదేశం ఒకటి. ఇప్పటి వరకు 4,40,000లకు పైగా కోవిడ్ మరణాలు అధికారికంగా నమోదు అయ్యాయి.

ఎన్నో జీవితాలు అతలాకుతలమై పోయాయి. వేలాదిమంది మహిళలు తమ సహచరులను కోల్పోయారు. మళ్లీ జీవితం ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారు.

వీరిలో చాలామంది మహిళలు గృహిణులే. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 2019లో భారతదేశ శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం రేటు 21 శాతం కన్నా తక్కువగా ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత తక్కువ రేటు.

కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోవడంతో ఒక్క రోజులో వారి జీవితాలు తలకిందులైపోయాయి. భర్త పోయిన బాధ ఒకవైపు, కుటుంబం ఎలా గడుస్తుందనే బాధ మరొకవైపు.

మన సమాజంలో ఉన్న పురుషస్వామ్యం కారణంగా చాలా వరకు మహిళలు ఆర్థికంగా భర్తలపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో వారి పాత్ర తక్కువే.

అత్యవసర సమయాల్లో డబ్బు సమకూర్చుకోగలిగే సామర్థ్యం భారతీయ పురుషుల కన్నా మహిళల్లో 13 శాతం తక్కువగా ఉందని 2017లో వచ్చిన ప్రపంచ బ్యాంకు గణాంకాలు తెలుపుతున్నాయి.

బ్యాంకు ఖాతాలు తెరిచే విషయంలో పురుషుల కన్నా మహిళలు 6 శాతం వెనుకబడి ఉన్నారు. వీరికి మొబైల్ ఫోన్లు, లేదా మొబైల్ ఇంటర్నెట్ ఉండే అవకాశం కూడా తక్కువే.

ఇలాంటి పరిస్థితుల్లో తరుణ లాంటి వారికి భారత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ సహాయం అందుకోవడం కూడా కష్టం అవుతుంది.

కోవిడ్ 19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50,000 రూపాయలు పరిహారం అందిస్తామని ఇటీవలే భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మహిళలకు అండగా..

సెకండ్ వేవ్ సమయంలోనే ముంబయికి చెందిన వ్యాపారవేత్త మధుర దాస్‌గుప్తా సిన్హా క్లాస్‌మేట్ ఒకరు కోవిడ్ బారిన పడ్డారు. 50 ఏళ్ల తన స్నేహితుడు కోవిడ్‌తో క్రిటికల్ కేర్‌లో చేరారు. ఆయన చికిత్స నిమిత్తం మధుర నిధులు సేకరించారు. కానీ, ఆయన చనిపోయారు.

సేకరించిన డబ్బు ఆయన కుటుంబానికి అందించాలని మధుర ఆశించారు. ఆ డబ్బులను ఏ అకౌంట్‌లో వేయాలని మధుర, ఆయన భార్యను అడిగారు. తనకు బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలీదని ఆమె చెప్పారు.

"ఏదైన విపత్కర పరిస్థితి వస్తే ఆర్థికంగా ఏం చేయాలో ఆమెకు తెలీదు. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి, ఆర్థిక విషయాలలో ముందు చూపు గురించి నేర్పించడానికి గానీ అది సమయం కాదు" అని 51 ఏళ్ల మధుర అన్నారు.

దీని తరువాత, కోవిడ్ కారణంగా భర్తలను పోగొట్టుకున్నవారికి సహాయం అదించేందుకు మధుర 'నాట్ అలోన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగం పంచుకునేందుకు అనేకమంది వలంటీర్లు ఉత్సాహం చూపించారు. సహాయం చేసేందుకు మరెంతోమంది ముందుకొచ్చారు.

సుమారు వందమంది మహిళలకు మధుర తన వలంటీర్లతో కలిసి సహాయం అందిస్తున్నారు. వీరిలో చాలామంది మానసికంగా బాగా కృగిపోయినవారు, డిప్రెషన్, ఎందుకు బతికున్నామన్న ఆలోచనలతో కుమిలిపోతున్నవారు ఉన్నారని మధుర చెప్పారు.

ఆత్మహత్య ధోరణులు కూడా కనిపించాయని ఆమె తెలిపారు.

"ఈ మహిళల్లో కొందరు వారసత్వ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి కొందరిని అత్తమామలు ఇంట్లోంచి బయటకు పంపించేస్తున్నారు. కొంతమందికి భర్త పని చేసిన ఆఫీసుల నుంచి కొంత సహాయం అందుతోంది. చాలామంది, పిల్లల స్కూలు ఫీజు కట్టలేక సతమతమవుతున్నారు. ఒకామెకు జీవిత బీమా ఎలా పనిచేస్తుందో తెలీదు. భర్త పోయిన తరువాత కూడా ఆమె ప్రీమియం కడుతూనే ఉన్నారు" అని మధుర వివరించారు.

మధుర దాస్‌గుప్తా సిన్హా

ఫొటో సోర్స్, MADHURA DASGUPTA SINHA

ఫొటో క్యాప్షన్, మధుర దాస్‌గుప్తా సిన్హా

'ఆర్థిక వ్యవహారాలు తెలియకపోవడమే ప్రధాన కారణం'

దీనంతటికీ కారణం ఆర్థిక వ్యవహారాల్లో ఏ మాత్రం జ్ఞానం లేకపోవడమేనని మధుర అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా 30% మంది మహిళలతో పోలిస్తే 35% మంది పురుషులు ఆర్థిక వ్యవహార జ్ఞానం ఉన్నవారని రేటింగ్స్ ఏజెన్సీ 'స్టాండర్డ్ అండ్ పూర్స్' (ఎస్పీ) 2015లో జరిపిన ఓ సర్వేలో తేలింది.

అయితే, భారతదేశంలో మొత్తంగా ఆర్థిక వ్యవహార జ్ఞానం తక్కువగా ఉంది. జెండర్ వ్యత్యాసాలూ ఎక్కువే. 20% మంది మహిళలతో పోలిస్తే 27% మంది పురుషులు ఆర్థిక వ్యవహార జ్ఞానం కలిగి ఉన్నారు.

మళ్లీ ఉద్యోగంలో చేరాలని, సంపాదించాలని మధుర బృందం ఈ మహిళలను ప్రోత్సహిస్తున్నా, కొంతమంది సుముఖత చూపట్లేదు.

ఇలాంటివారికి కౌన్సిలింగ్ ఇప్పించడం అవసరం. కానీ అదంత సులభం కాదు. ఎన్నో వారాలు కష్టపడి కౌన్సిలింగ్ ఇప్పించిన తరువాత కూడా ఏదో ఒక చిన్న విషయం గుర్తొచ్చి మళ్లీ వాళ్లు దుఃఖంలో మునిగిపోతారు.

అయితే, ఉపాధి వెతుక్కునేందుకు సిద్ధపడిన వారిని మెల్లిగా ప్రోత్సహిస్తూ, కెరీర్ గైడెన్స్, అవసరమైన మద్దతు అందిస్తున్నారు.

చాలామంది మహిళలకు ఏవో ఆలోచనలు, ఆశయాలు ఉంటాయి. వాటిని చిన్న చిన్న వ్యాపారాలుగా మలిచేందుకు వలంటీర్లు సహాయపడుతున్నారు.

కోవిడ్ వలన జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు ఎందరో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కోవిడ్ వలన జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు ఎందరో

అవకాశాలు ఉన్నాయి

ఈ మహిళలకు ఉద్యోగావకాశాలు ఇస్తామంటూ కొన్ని స్టార్టప్‌లు ముందుకు వచ్చాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పటికే 12 మంది మహిళలు తొలిసారిగా ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. మరి కొంతమంది ఆ దిశలో ఉన్నారు.

మధుర స్నేహితుడి భార్య కూడా మెల్లగా ఒక బ్యాంకు ఖాతా తెరవగలిగారు. శ్రేయోభిలాషుల నుంచి ఆమెకు కొంత డబ్బు సమకూరినా, ఆదాయం అంటూ ఉండాలనే ఉద్దేశంతో మధుర బృందం ఆమెకు ఒక ఉద్యోగం చూపించారు.

కానీ, ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా లేనని, మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నానని ఆమె ఆ అవకాశాన్ని నిరాకరించారు.

అయితే, మధుర ఓపికగా ఆమె కోలుకునేవరకూ వేచి చూశారు. చివరికి, ఆమె ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు.

"ఇప్పుడు ఆమె ఎంతో జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేర్చుకున్నారు. కూతురి చదువుకు కావల్సిన డబ్బు సమకూర్చుకున్నారు. ఇవన్నీ చిన్న విషయాలుగా కనిపించవచ్చు కానీ మాకు ఇవి పెద్ద విజయాలు" అని మధుర అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)