పీరియడ్ సెలవుల కోసం పోరాడుతున్న మహిళా టీచర్లు

నెలసరి సెలవుల కోసం యూపీ టీచర్ల ఉధ్యమం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రతి నెలా నెలసరి సమయంలో మూడు రోజులపాటు సెలవు కావాలంటూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయులు ఇటీవలే ఒక ఉద్యమం ప్రారంభించారు.

సుదూర ప్రాంతాల్లో ఉన్నపాఠశాలకు వెళ్లేందుకు తమకు సరైన ప్రజారవాణా సౌకర్యాలు కూడా లేవని చాలా మంది టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా, వాడలేని స్థితిలో ఉండటంతో నెలసరి సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెల్లడించారు.

గతనెలలో ప్రారంభమైన ఈ ఉద్యమం నెమ్మదిగా తీవ్రం అవుతోంది. రాష్ట్ర మహిళా టీచర్ల సంఘం 'మహిళా శిక్షక్ సంఘ్' ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో రాష్ట్రంలోని 1,68,000 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2 లక్షల మంది మహిళా టీచర్లు సభ్యులుగా ఉన్నారు.

మహిళా సిబ్బందిలో 70 శాతానికి పైగా గ్రామాల్లోనే పనిచేస్తున్నారని సంఘం అధ్యక్షురాలు, బారాబాంకీ జిల్లా పాఠశాల ప్రిన్సిపాల్ సులోచనా మౌర్య చెప్పారు.

"నెలసరి సమయంలో చాలా మంది మహిళలు శారీరక ఇబ్బందులకు, మానసిక వేదనకు గురవుతారు కాబట్టి వారికి విశ్రాంతి అవసరం. ఇలాంటి సమయాల్లో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు వెళ్లేందుకు రోజూ 30-60 కి.మీ ప్రయాణించాల్సి రావడం మరింత బాధాకరం" అని ఆమె బీబీసీతో అన్నారు.

"కొన్ని ప్రాంతాల్లో ప్రజారవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉండదు. అందుకే పాఠశాల చేరుకునేందుకు టీచర్లు ఒక్కోసారి ట్రాక్టర్లలో, ఎద్దుల బండిలో కూడా ప్రయాణించాల్సి వస్తోంది' అని ఆమె చెప్పారు.

టీచర్లు పాఠశాలలోని మరుగుదొడ్లను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుతారని లక్నోకు 200కి.మీ దూరంలో ఉన్న ఒక గ్రామంలోని స్కూల్ టీచర్ చెప్పారు. ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

"మా పాఠశాలలో 6 మరుగుదొడ్లు ఉన్నాయి. రోజూ వాటిని శుభ్రం చేయడం ఉండదు. వందల మంది విద్యార్థులు వాటిని వాడడం వల్ల అవి ఎప్పుడూ అపరిశుభ్రంగానే ఉంటాయి. వాటిని ఉపయోగించలేం" అన్నారు.

"స్థానికంగా ఉండే టీచర్లకు కాస్త వెసులుబాటు ఉంటుంది. అవసరమైనప్పుడు వాళ్లు తమ ఇళ్లకు వెళ్లి వస్తారు. కానీ, దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే టీచర్లకు ఇది చాలా పెద్ద సమస్య" అని ఆమె చెప్పారు.

నెలసరి సమయంలో విద్యార్థినులు కూడా పాఠశాలకు రావట్లేదని మౌర్య వెల్లడించారు. '

"ప్రస్తుతం మా టీచర్లంతా సెలవు కోసం పోరాడుతున్నాం. తర్వాత, దీనిని విద్యార్థినులకు కూడా వర్తింపజేస్తాం" అని చెప్పారు.

నెలసరి సెలవుల కోసం యూపీ టీచర్ల ఉధ్యమం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో 'పీరియడ్ లీవు' విధానం కొత్తదేమీ కాదు. గత కొన్నేళ్లుగా పలు ప్రైవేటు కంపెనీలు ఈ సెలవులు ఇస్తున్నాయి. డిజిటల్ మీడియా సంస్థ 'కల్చర్ మెషీన్', టాటా స్టీల్ కంపెనీతో పాటు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా తమ మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను అనుమతించాయి.

పొరుగు రాష్ట్రమైన బీహార్‌లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రతినెలా 2 రోజులు ప్రత్యేక సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. గత 30 ఏళ్లుగా అక్కడ ఇది కొనసాగుతోంది.

"ఉత్తర్ ప్రదేశ్‌ కూడా ఇలా ఎందుకు చేయదు? మనమంతా ఒకే దేశ పౌరులం. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఎందుకు ఉండాలి?" అని మౌర్య ప్రశ్నించారు.

'మహిళా శిక్షక్ సంఘ్' సభ్యులంతా కలిసి ఇటీవలే తమ డిమాండ్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ ముందుంచారు. ట్విట్టర్ వేదికగా ఒకరోజంతా ఈ అంశంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే తాము ఇంకా టీచర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి, బీబీసీతో చెప్పారు.

ఇప్పుడు వీరి పోరాటం వల్ల 'నెలసరి లీవు' అనేది మహిళలకు నిజంగా ఉపయోగపడుతుందా అనే అంశం మరోసారి చర్చకు వచ్చింది.

ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో మహిళల ఆరోగ్యపరంగా దీనిని హర్షించదగిన చర్యగా భావిస్తే, మరికొందరు మాత్రం ఈ అంశం మహిళల ఉద్యోగావకాశాలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. పని ప్రదేశాల్లో మహిళలను బలహీనులుగా భావించే అవకాశం కల్పిస్తుందనే వాదన కూడా ఉంది.

నొప్పితో కూడిన నెలసరి సమయంలో ఇది తమకు ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది మహిళలు చెబుతున్నారు.

కానీ, ఇది మహిళలకు చేటు చేసే అంశమేనని పలువురు వాదిస్తున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ అమ్మాయిలకు ఉద్యోగం ఇవ్వడానికి సంస్థలు వెనుకడుగు వేస్తాయని అంటున్నారు.

నెలసరి సెలవుల కోసం యూపీ టీచర్ల ఉధ్యమం

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్ లీవ్ మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని రుతుక్రమంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే ఎన్‌జీవో సంస్థల నెట్‌వర్క్ కంపెనీ 'మెన్‌స్ట్రువల్ హెల్త్ అలియెన్స్ ఆఫ్ ఇండియా' (ఎంహెచ్ఏఐ)కు చెందిన తాన్యా మహాజన్ అన్నారు.

"నెలసరిని ఇది సులభం చేస్తుంది. ముఖ్యంగా నొప్పితో విలవిల్లాడేవారికి ఇది చాలా అవసరం. వారు ఆ సమయంలో పని నుంచి విశ్రాంతి పొందవచ్చు" అని వివరించారు.

కానీ, చాలామంది మహిళలు కార్యాలయాల్లో, ముఖ్యంగా మగ బాస్‌లు ఉన్నప్పుడు పీరియడ్ లీవ్ అడగడానికి సంకోచిస్తారు అని ఆమె చెప్పారు.

ఎందుకంటే మనదేశంలో పురాతన కాలం నుంచి బహిష్టును అపవిత్రంగా పరిగణిస్తున్నారు. నెలసరిలో ఉన్నమహిళలను అంటరానివారిగా భావిస్తారు. వారిపై వివక్ష చూపిస్తారు.

నెలసరిలో ఉన్న మహిళలను సామాజిక, మతపరమైన కార్యాక్రమాల్లో దూరం పెడతారు. ఆ సమయంలో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం నిషిద్ధం.

కొన్ని ప్రాంతాల్లో వారిని ఇంట్లో వంటగదిలోకి కూడా వెళ్లకూడదు. పశ్చిమ భారతంలోని కొన్ని గిరిజన తెగల్లో ప్రజలు... నెలసరిలో ఉన్న మహిళలను గ్రామానికి వెలుపల, అడవులకు సమీపంలో ఏర్పాటు చేసిన గుడిసెల్లో ఉంచుతారు.

నగర ప్రాంతాల్లో విద్యావంతులైన మహిళల్లో ఈ దురాచారాలను ఎదిరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ, రుతుక్రమంపై అవసరమైన చర్చల్ని మాత్రం ఇంకా రహస్య అంశంగానే పరిగణిస్తున్నారు.

దీనివల్ల ప్రతీ ఏడాది 2 కోట్ల 30 లక్షల మంది బాలికలు పాఠశాలలకు దూరమవుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. యుక్తవయస్సు వచ్చిన విద్యార్థినులకు పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్లు, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడం వల్లే వీరంతా చదువుకు స్వస్తి పలుకుతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది.

మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడం మంచి చర్యే అయినప్పటికీ, దానివల్ల సగం ప్రయోజనమే కలుగుతుందని మహాజన్ అన్నారు. రుతుక్రమం గురించి బహిరంగ చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

"కానీ, ఇలాంటి చర్చలు జరుగుతున్నాయా? పాఠశాలల్లో, కార్యాలయాల్లో మహిళలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయా? ఇలాంటి చర్యలను తీసుకోకుండా కేవలం లీవ్ విధానంలో మార్పులు చేసినంత మాత్రాన ఒరిగేదేం ఉండదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)