'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి

ఫొటో సోర్స్, Dr.GuravaReddy
- రచయిత, డాక్టర్ గురవారెడ్డి
- హోదా, బీబీసీ కోసం
అవును మేమిద్దరం మా తోకలు మార్చుకున్నాం. ఆయన నన్ను 'గురవయ్య శాస్త్రి' అని పిలుస్తారు. మా సంభాషణ ఎప్పుడు జరిగినా మొదటగా ఇలా సంబోధించుకుని, తెగ నవ్వేసుకుని ఆ తర్వాత అసలు సంగతికొస్తాం.
ఆ మాటకొస్తే, సిరివెన్నెల గారు ప్రతి వాక్యం అవ్వగానే చివరలో ఓ విరుపు విరిచి, ఓ చెణుకు చరిచి - పొట్ట పగిలినట్లు నవ్వి, మనల్ని నవ్వించి ఆ తర్వాత రెండో వాక్యం మొదలెడతారు.
ఆయనలో కవిత్వం ఎంత ఉందో అంతకు మించి వ్యంగ్యం, హాస్యం ఉంటాయి.
ఆయనతో ఓ గంట కబుర్లు దొరికితే, దొర్లితే విందు భోజనమే. అన్ని రుచులు సంగీతం, హాస్యం, శృంగారం, రాజకీయం, విప్లవం, విరహం, నైవేద్యం, వైరాగ్యం, ప్రబోధం, ప్రశాంతం, ఒకటేవిటి జీవనయానంలో అన్ని కోణాలూ స్పర్శించి, దర్శించి రావచ్చు.
గత పది రోజుల నుంచి, ఆయన ECMO (వెంటిలేటరు లాంటిది) మీద "ఒప్పుకోనురా ఓటమి" అని పోరాడుతుండడం చూస్తూనే ఉన్నాను.
ఏదన్నా అద్భుతం జరిగి బయట పడతాడేమోననే ఆశతో ఎదురు చూశాను. కానీ అద్భుతాలు సిన్మాల్లో తప్ప జరగవు.
ఏడాది కిందట బాలు, ఇప్పుడు శాస్త్రి గారు.. ఇద్దరూ నాకు అత్యంత సన్నిహితులు, నేనారాధించే తారలు - రాలిపోయినాయి.
తెలుగు జాతి ప్రాకారంలో రెండు మూలస్తంభాలు కూలిపోయినాయి.

ఫొటో సోర్స్, Raja Chembolu
సిరివెన్నెలలో 'విధాత తలపున' పాట వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లు తెలుగు డిక్షనరి కొనుక్కుని మరీ 'అర్థం చేసుకున్నాను.
అదే సిన్మాలో 'అది భిక్షువుని" పాట నిందాస్తుతికి పరాకాష్ట.
అప్పటిదాకా వేటూరి, సినారెల భక్తుడినైన నేను నిశ్శబ్దంగా పార్టీ మార్చి, శాస్త్రిగారి అభిమాన సంఘంలో చేరిపోయాను.
తర్వాత 1996లో గుణ్ణం గంగరాజు తీసిన 'లిటిల్ సోల్జర్స్'లో నా కూతురు కావ్య నటించినప్పుడు గంగు ద్వారా శాస్త్రి పరిచయ భాగ్యం కల్గింది. ఆ తర్వాత కావ్య ప్రతి ఫంక్షన్‌కి శాస్త్రిగారు తప్పక వచ్చేవారు.
ఆయనతో మాట్లాడాలన్నా, పోట్లాడాలన్నా రాత్రి పది దాటిన తర్వాతే.
ఆయన ఆణిముత్యాలన్నీ - నిశీధి రాత్రిళ్లలో దొర్లినవే.
జగమంత కుటుంబం వారి పాట పుట్టు పూర్వోత్తరాలు, ఆ పదాల వెనకున్న జీవిత సత్యాలు, మాలాంటి పామర జనులకి అర్థమయ్యేట్లు, అనర్గళంగా ఓ రెండు గంటలు ఆయన సంభాషించిన ఓ రాత్రి ఇంకా నాకు గుర్తే.

ఫొటో సోర్స్, VICE PRESIDENT OF INDIA/FB
శాస్త్రి గారి శైలిలో ఉన్న వైవిధ్యం మరే రచయితలో కనపడలేదు నాకు. ప్రబోధ గీతాలు ఆయనకి కొట్టిన పిండి.
‘‘కన్నీటి ముత్యాలు పారేసుకోకు-చిరునవ్వు రతనాలు దాచేసుకోకు- పగలబడి నవ్వితేనే కనులు తడి కావాలి -(పరుశురాముడు), ‘‘సరేలే ఊరుకో - పరేషానెందుకో, చలేసే ఊరిలో జనాలే ఉండరా’’ (లిటిల్ సోల్టర్స్), "దేహముంది-ప్రాణముంది, నెత్తురుంది-సత్తువుంది యింతకన్న సైన్యముండునా’’(పట్టుదల), ‘‘అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు-అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు" (గాయం )... ఇవన్నీ కొన్ని మచ్చుతునకలు మాత్రమే.
అప్పుడప్పుడు ప్రశాంతమైన సిరివెన్నెల.. మలయమారుతం నుంచి, ప్రళయతాండవంలాగా మారిపోతాడు. అప్పుడు ఆయన కలం తుపాకీలోంచి "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని-అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని" (గాయం), " అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా - ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా" (సింధూరం) లాంటి బుల్లెట్లు గుండెల్లో దిగిపోతాయి.
ఇంతటి వాదం, నిర్వేదం, ప్రబోధం గీతాలతో మన గుండెలు బరువెక్కగానే, ‘‘బోటనీ పాఠముంది - మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా" (శివ), "వారేవా ఏమి ఫేసు. అచ్చు హీరోలా ఉంది బాసు", భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు" (మనీ) లాంటి కామెడీ పాటలతో నవ్వించేస్తాడు.
అదే కలంతో కలల్ని సృష్టించి "బలపం పట్టి భామ బళ్లో" (బొబ్బిలి రాజా) అంటూ శృంగార రసంలో ముంచి తేలుస్తాడు.
ఇంకో విషయం-అచ్చమైన, అందమైన తెలుగు పాటల్లో అలవోకగా, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు మాటల్ని అతికించి చమత్కారం చేసేస్తాడు.

ఫొటో సోర్స్, SIRIVENNELASITHARAMASASTRY/FB
గమ్మత్తైన విషయమేమిటంటే ఆయన ఒక్కోసారి మామూలు మాటల్ని రాసేసి వాటిని పాటలుగా చలామణీ చేసేసి సూపర్ హిట్ కొడ్తుంటారు. ఉదాహరణకు... ‘‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషమూ నేను" (గులాబి)-ఇది మనం ఫోన్లో ప్రియురాలితో ప్రతిసారీ మాట్లాడే వాక్యం. దీన్ని అంత అందమైన పాటగా చేయడం ఆ మహనీయునికే చెల్లింది.
కాసింత కళాపోషణ, కాసింత సాహిత్య స్పృహ ఉన్న విశ్వనాథ్, రాంగోపాల్ వర్మ, గుణ్ణం గంగరాజు, త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, క్రిష్, ఇంద్రగంటి, ఏలేటి, రాజమౌళి లాంటి డైరెక్టర్లందరూ సిరివెన్నలామృతాన్ని లోటాల నిండుగా తాగి, మనందరికీ మత్తెక్కించే పాటలని అందించారు.
కూసేవాడు (బాలు), రాసేవాడు (శాస్త్రి) ఇద్దరూ లేని ఈ నేపథ్యంలో, ఈ తీసేవాళ్ళు ఎలా తీస్తారో-ఏమి తీస్తారో నాకు పాలుపోవడం లేదు.
శాస్త్రిగారి ఓ విలక్షణమైన వ్యక్తిత్వం- తోటి రచయితలు బాగా రాస్తే - ఆయన పనిగట్టుకుని, నంబరు పట్టుకుని ఫోన్ చేసి అభినందించాల్సిందే.
అందుకే-చంద్రబోసు, అనంత శ్రీరాం, రామజోగయ్య శాస్త్రిలాంటి వాళ్ళు సిరివెన్నల గారిని గురువు క్రింద పరిగణించి ప్రతిరోజూ ఆయనకి రాగ నీరాజనాల్ని అందిస్తూనే ఉంటారు.
పోయిన సంవత్సరం ఆయన రాసిన పాటలు 6 వాల్యూమ్స్ నాకు పంపించి గురవయ్య శాస్త్రికి "గుండెలో గూడుకట్టుకున్న ఓ వంద పాటలు" సెలెక్ట్ చేసి ఉంచితే మనం దాన్ని సంగీత రూపకంగా చేద్దాం అని కోరారు.

ఫొటో సోర్స్, Dr.AVGuravareddy
"పోయిన నెలే - "బాలు గారికి గురు- పార్థుడు" ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు తనతో మాట్లాడాను. తనకిష్టమైన బాలు పాటలు పంపారు. మొన్న ఓ వారం పాటు- సన్‌షైన్ హాస్పిటల్‌లో గడిపారు. పేషెంట్‌గా కాదు. మా ఆడిటోరియంలో తనమీద డాక్యుమెంటరీ చేస్తే షూటింగులో పాల్గొన్నారు. ఆ సెట్ ఇంకా అలానే ఉంది. శాస్త్రిగారు మాత్రం తెర వేసేసి తెరమరుగైపోయాడు.
నాకెంతో ఆప్తులైన ఇద్దరు మహానుభావుల నిష్క్రమణంతో గుండె బరువయింది. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. వారి ఆత్మ శాంతికి ప్రార్థిస్తూ అశ్రునయనాలతో - గురవయ్య శాస్త్రి
(అభిప్రాయాలు వ్యక్తిగతం. రచయిత వైద్యులు)
ఇవి కూడా చదవండి:
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ ఎవరు? ఆయన గురించి మాజీ సీఈవో ఏం చెప్పారు?
- ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?
- భారత్-చైనా: సరిహద్దుల్లో ఘర్షణలున్నా క్రీడల కోసం ఎందుకు చేతులు కలిపాయి?
- యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు - సీఎం కేసీఆర్ ప్రకటన
- షారుక్ ఖాన్‌ను మహిళలు ఎందుకు ఇష్టపడతారు?
- ఆంధ్రప్రదేశ్‌లో చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








