జై భీమ్: ‘నా కథతో తీసిన సినిమాను నేను చివరి దాకా చూడలేదు’ - బీబీసీ ఇంటర్వ్యూలో నిజజీవిత సినతల్లి పార్వతి

- రచయిత, ఆనంద ప్రియ
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
సూర్య నటించిన "జై భీమ్" సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. బహుభాషా చిత్రంగా విడుదలైన 'జై భీమ్' ఐఎండీబీ రేటింగ్స్‌లో 'షాషాంక్ రిడంప్షన్', 'ది గాడ్‌ఫాదర్' లాంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాలను కూడా అధిగమించింది.
ఇది తమిళనాడుకు చెందిన పార్వతి అనే అణగారిన కులానికి చెందిన మహిళ, ఆమె కుటుంబం కథ. ఈ కథ చర్చనీయాంశంగా మారిన తర్వాత, నిజ జీవిత సినతల్లి (పార్వతి) ఎవరు, ఆమె ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది అన్న సందేహాలు సినిమా అభిమానులలో కలిగాయి.
సినిమా విడుదలైన తర్వాత ఆమె అనుభవిస్తున్న పేదరికం పై కూడా చర్చ జరుగుతోంది. నిరుపేదరాలైన పార్వతిని ఆదుకోవాలని తమిళనాడులో కమ్యూనిస్టు పార్టీకి చెందిన నేత బాలకృష్ణన్ 'జైభీమ్' హీరో సూర్యను అభ్యర్ధించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సూర్య, ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. పది లక్షల రూపాయల చెక్కును పార్వతికి అందజేశారు
మరి ప్రస్తుతం పార్వతి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ‘జై భీమ్’ సినిమా చూశారా అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. పార్వతితో బీబీసీ తమిళ్ ప్రతినిధి ఆనంద ప్రియ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
బీబీసీ ప్రతినిధి: 'జైభీమ్' సినిమా కథ మీదేనని చాలామందికి తెలుసు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు?
పార్వతి: నా కూతురు, అల్లుడు, మనవరాళ్లతో కలిసి ఉంటున్నాను. వాళ్లు రోజు కూలీ చేసుకుని బతుకుతుంటారు. వయసు మీద పడింది. నేను పని చేసే పరిస్థితుల్లో లేను.
బీబీసీ: హీరో సూర్య వచ్చి మీకు చెక్ ఇచ్చారు. మీరెలా ఫీలవుతున్నారు? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు?
పార్వతి: సంతోషంగా ఉంది. కానీ, మేం పెద్దగా మాట్లాడుకోలేదు. ఆయన ఆ చెక్కును బ్యాంకు ఖాతాలో వేసుకోమని చెప్పారు. దాని మీద వచ్చే వడ్డీని వాడుకోవాలని, నా తర్వాత నా కూతురు, మనవలకు ఉపయోగపడుతుందని చెప్పారు. నాకు సహాయం చేయడానికి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు.

బీబీసీ: 'జై భీమ్' సినిమా చూశారా?
పార్వతి: నా మనవళ్లు మొబైల్ ఫోన్‌లలో చూపించారు. కానీ పూర్తిగా చూడలేకపోయాను. అన్నీ కోల్పోయాను, నిరాశలో ఉన్నాను. ప్రాణమే పోయింది, ఇప్పుడు సినిమా చూసి ఏం చేస్తాను?
బీబీసీ: అసలు అప్పుడేం జరిగిందో చెబుతారా?
పార్వతి: నేను వరికోత కోసం ఊతగోపాలపురం వెళ్లాను. మా ఊర్లో నాలుగంతస్తుల ఇల్లు ఉన్న ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన కూతురు, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. ఒకరోజు 40 సవర్ల బంగారం, 50 వేల రూపాయల నగదు తీసుకుని తల్లిదండ్రులకు చెప్పకుండా అతనితో వెళ్లి పోయింది.
ఆ రోజు రాత్రి 10 గంటలకు మా ఇంటికి పోలీసు వ్యాన్ వచ్చింది. ఇన్‌స్పెక్టర్ మాతో మాట్లాడాలనుకుంటున్నారని, స్టేషన్‌కి రమ్మని సబ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. నా భర్తకు పోలీసులంటే భయం. గొడవలకు దూరంగా ఉంటాడు. పోలీసులు వచ్చారని తెలీదు. అప్పుడే గుడి దగ్గరికి వెళ్లాడు.
పోలీసులు వచ్చి నా భర్త గురించి అడగగా, తెలియదని చెప్పాను. వారు వెంటనే నా కొడుకులను, మా మరుదులను, నన్ను తీసుకుని గోపాలపురం వెళ్లారు.
పోలీస్ కుక్కలను తీసుకొచ్చి మా వాసన చూపించారు. మేం నగలు దొంగిలించినట్లయితే, కుక్కలు పట్టుకుంటాయి కదా? కుక్కలు నగలు పోయిన ఇంటి చుట్టూనే తిరిగాయి కానీ మా దగ్గరకు రాలేదు.
మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు గదుల్లో పెట్టి దారుణంగా కొట్టారు. ఇప్పుడు కూడా నేను ఈ చేయిని పైకి ఎత్తలేను. ఎందుకు కొడుతున్నారని అడిగితే, దొంగిలించిన నగలు అప్పజెప్పమని అడిగేవారు.
అప్పుడు పార్టీ వారు(కమ్యూనిస్టు పార్టీ), కొందరు గ్రామస్థులు నా భర్త వద్దకు వెళ్లి, మీ ఇంట్లో వాళ్లను స్టేషన్‌కు తీసుకెళ్లారు, నువ్వు స్టేషన్‌కు వెళ్లి పోలీసులను కలవమని చెప్పారు.
కానీ, నా భర్త స్టేషన్‌కు రాకముందే, ఆయన్ను కొందరు వ్యక్తులు పట్టుకుని గ్రామ సర్పంచ్ వ్యాన్‌లోకి నెట్టారు. రెండు గ్రామాల మధ్య ముళ్ల పొదలు ఉన్నాయి. దుస్తులు విప్పి ఆయన్ను ఆ పొదల్లో, ముళ్ల చెట్టుకు కట్టేసి, బాగా కొట్టి ఆ తర్వాత స్టేషన్ తీసుకొచ్చారు.
నేను ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకుని మేమేం తప్పు చేయలేదని, వదిలి పెట్టాలని బతిమాలాను. ఆయన నన్ను ఒక్క తన్ను తన్నాడు.
తర్వాత నన్ను వదిలిపెట్టారు. కానీ నా భర్త, కుల్లన్, గోవిందరాజన్‌లను స్టేషన్‌లోనే ఉంచారు. వాళ్లు నా మరుదులను వేళ్లు విరిచి విపరీతంగా కొట్టారు. దాని వల్ల వచ్చిన నొప్పులను వాళ్లు చాలాకాలం అనుభవించారు. (కాసేపు మౌనంగా ఉన్నారు పార్వతి)
సాయంత్రం నాలుగు గంటలకు, నా కొడుకును, నా మరుదులను విడుదల చేశారు. మరుసటి రోజు నా భర్తకు అన్నం తీసుకురావాలని చెప్పారు. నేను అన్నం, ఎండు చేపల కూర సిద్ధం చేసుకుని స్టేషన్‌కు వెళ్లాను.
అప్పటికే నా భర్తను దుస్తులు లేకుండా కట్టేసి ఉంచారు. పోలీస్ స్టేషన్ గోడలు, కిటికీల మీద రక్తం కనిపించింది. నేను పోలీసులను బతిమాలాను. మేం దొంగలం కాదు, విడిచి పెట్టమని వేడుకున్నాను. కానీ, నగలు ఇస్తేనే వదిలిపెడతామని వాళ్లు చెప్పారు.
నా భర్త జుట్టు పట్టుకుని పదే పదే కొడుతూనే ఉన్నారు. అప్పటికే నా భర్త చనిపోయాడు. కానీ వాళ్లు మాత్రం ఆయన్ను కాలితో తంతూనే ఉన్నారు. నేను అన్నం తినిపించినా తినలేదు. డాక్టర్లు ఇచ్చిన మాత్రలు కూడా నా భర్త మింగలేదు. బతికి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి వేళ్లతో కళ్లను పొడిచి చూశారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ బాగా తాగి ఉన్నాడు. నా భర్త చనిపోయినట్లు నటిస్తున్నాడని అనుమానించాడు. బతికున్నాడో లేదో తెలుసుకోడానికి నీళ్లలో కారం కలిపి నోట్లో, ముక్కులో పోశారు. ఆయన నుంచి స్పందన రాలేదు. చనిపోయాడని నిర్ధరించుకున్నారు.
చనిపోయాడని తెలిశాక పోలీసులు వాళ్లలో వాళ్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్ధం కాలేదు. నన్ను కొట్టి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు.

ఫొటో సోర్స్, JAIBHIM
నేను మా ఊరు వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తుండగా, మా గ్రామానికి పోలీసు వ్యాన్ వెళ్లింది. పోలీసులు ఆంటోనిసామి, వీరాసామి, రామసామి, రాజకన్నులు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు.
నేను మా ఊరు చేరుకున్నాను. వారు అప్పటికే నా మరుదులను తీసుకెళ్లారు. గ్రామస్తులు జరిగిన విషయాలన్నీ నాకు చెప్పారు. అదే బస్సు ఎక్కి తిరిగి స్టేషన్‌కి వెళ్లాను. స్టేషన్‌లో ఏం జరుగుతుందో చూడాలని, కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయేమో గమనించాలని పార్టీ నాయకులు చెప్పారు.
కానీ స్టేషన్‌లో ఒక పోలీసు తప్ప ఎవరూ లేరు. అతను కూడా ఎంట్రన్స్ దగ్గర మంచంలో పడుకుని నిద్రపోతున్నాడు. స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది. తలుపు తెరిచి ఉంది.
వాళ్లు నా భర్త మృతదేహాన్ని జేయంకొండలో పడేశారు. టీ తాగేందుకు దగ్గర్లోని టీ స్టాల్‌కు వెళ్లాం. గ్లాసులు రక్తం వాసన వేశాయి. టీ పడేసి మా ఊరుకు వెళ్లాం. పార్టీ నాయకులు, గ్రామస్తులు తరలివచ్చారు.
నేను బస్సు దిగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయాను. ఏం జరిగిందని అంతా అడిగారు. నేను జరిగిన విషయం చెప్పగానే అందరూ గుంపుగా స్టేషన్‌కి వెళ్లారు.
అప్పటికే స్టేషన్ లాకప్‌లో ఉన్న వారిని రాజకన్ను చనిపోయినట్లు ఎవరికీ చెప్పొద్దని, చెబితే మీకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. అక్కడ కస్టడీలో ఉన్నవారిని మరో జైలుకు తరలించారు. ఈ ఘటనను చూసి, వారంతా భయపడ్డారు.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని పార్టీ కార్యాలయంలో ఉండాలని అడిగారు. అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు కడలూరు వెళ్లాం. రాజకన్ను పారిపోయాడంటూ పోలీసులు వెతుకుతున్నట్లు నటించారు. ఆ తర్వాత కేసు కొనసాగింది.

ఫొటో సోర్స్, JAIBHIM
బీబీసీ: ఇదంతా జరిగినప్పుడు మీ వయస్సెంత?
పార్వతి: నేను చిన్నదానిని. కానీ గోవిందన్ (సీపీఎం నాయకుడు) పొరపాటున నా వయసు 40, నా భర్త వయసు 35 అని చెప్పారు. షాక్‌లో ఉన్న మేం తర్వాత దాన్ని మార్చలేకపోయాం.
13 ఏళ్ల విచారణ అనంతరం తీర్పు వచ్చింది. పరిహారంగా వచ్చిన రూ.2లక్షల డబ్బు నుంచి ఒక లక్ష రూపాయలను బ్యాంకు ఖాతాలో వేసి, ప్రతినెలా వడ్డీ డబ్బులు అందుకుంటున్నాను.
మిగిలిన డబ్బు నా మరుదులకు ఇచ్చేశారు. కుల్లన్, గోవిందరాజన్‌లు చనిపోయారు.
నాకు ముగ్గురు పిల్లలు. తండ్రి మృతితో షాక్‌కు గురై ఓ కొడుకు చనిపోయాడు. నా మొదటి కొడుకును పోలీసులు కొట్టడంతో అతని చెవి దెబ్బతింది. అతను ఇప్పుడు మానసికంగా దెబ్బతిని ఉన్నాడు. నా కూతురు మాత్రమే నాతో ఉంది.
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
- దుస్తులు తొలగించకుండా తాకినా లైంగికంగా వేధించినట్లే: సుప్రీంకోర్టు
- COP26: వాతావరణ సదస్సుతో ఎంత కాలుష్యం వెలువడిందంటే..
- ‘చేసింది కొంతే.. చేయాల్సింది చాలా ఉంది’
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- రాణి కమలాపతి ఎవరు? హబీబ్‌గంజ్ స్టేషన్‌కు ఆమె పేరెందుకు పెట్టారు?
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















