COP26: వాతావరణ సదస్సుతో ఎంత కాలుష్యం వెలువడిందంటే..

COP26

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వేలాది మంది ప్రతినిధులు, వందలాది ప్రపంచ నాయకులు గ్లాస్గోకు వచ్చారు

వాతావరణ మార్పుపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశాన్ని మీరు నిర్వహించబోతున్నట్లయితే, దాన్ని సాధ్యమైనంత కాలుష్యరహితంగా నిర్వహించడానికి ప్రయత్నించాలి.

ఈ ఈవెంట్‌ని "కార్బన్ న్యూట్రల్"గా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం చెప్పింది.

కానీ, మాడ్రిడ్‌లో జరిగిన మునుపటి శిఖరాగ్ర సమావేశం కంటే రెట్టింపును మించి ఉద్గారాలు గ్లాస్గో శిఖరాగ్ర సమావేశ నిర్వహణ సమయంలో జరిగాయని ఓ కొత్త నివేదిక తెలిపింది.

వీడియో క్యాప్షన్, కాప్ 26 అంటే ఏంటి? ఈ సదస్సు ఎందుకు?

ఎక్కువ మంది ప్రతినిధులు, ఎక్కువ ఉద్గారాలు

COP26 సమావేశ సమయంలో విడుదల అయిన మొత్తం కార్బన్ ఉద్గారాలు 1,02,500 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానంగా ఉండనున్నాయని యూకే ప్రభుత్వానికి అందిన ప్రాథమిక అంచనా నివేదిక ద్వారా తెలిసింది.

ఇది దాదాపు 10,000 యూకే గృహాల నుండి ఒక ఏడాది మొత్తం వచ్చే ఉద్గారాలకు సమానం.

2019లో మాడ్రిడ్‌లో జరిగిన చివరి వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో జరిగిన ఉద్గారాలతో పోల్చితే COP26 సమావేశానికి అయిన ఉద్గారాలు రెట్టింపు.

2019లో మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో 27,000 మంది పాల్గొనగా, కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, గ్లాస్గో COP26 సమావేశానికి 39,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యూకే ప్రభుత్వం తెలిపింది.

ప్రైవేట్ జెట్

ఫొటో సోర్స్, Alamy

అంతర్జాతీయ విమానాలు, ప్రైవేట్ జెట్‌లు

నివేదిక ప్రకారం, COP26 ఉద్గారాలలో 60% అంతర్జాతీయ విమానాల ద్వారానే వచ్చినట్లు అంచనా వేశారు.

విమానాల నుండి వచ్చే ఉద్గారాలను నియంత్రించడానికి, హాజరయ్యే వారు సాధ్యమైతే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలని కోరారు.

అయినా, చాలా మంది ప్రపంచ నాయకులు ప్రైవేట్ జెట్‌ విమానాల్లో వచ్చారు. అంతేకాకుండా వారి సొంత కాన్వాయ్‌ వాహనాలను, హెలీకాప్టర్‌లను తీసుకురావడానికి ప్రత్యేకంగా కార్గో విమానాలను వాడారు.

నవంబర్ 1 వరకు గ్లాస్గో చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగు రోజుల్లో ప్రైవేట్ జెట్‌లు లేదా వీఐపీ విమానాలు అన్నీ కలుపుకుని మొత్తం 76 విమానాలు వచ్చాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియమ్, బీబీసీ రియాలిటీ చెక్‌తో చెప్పింది.

వీడియో క్యాప్షన్, చెట్లకు జ్ఞాపక శక్తి ఉంటుందా? అవి గుర్తుపెట్టుకుంటాయా?

పునరుత్పాదక ఇంధన వనరుల ఉపయోగం

సస్టైనబిలిటీ కన్సల్టెంట్ అరూప్.. ప్రభుత్వం కోసం ఈ నివేధిక తయారు చేశారు. ఇది COP26 కోసం చేసిన ప్రాథమిక అంచనా మాత్రమే అని, ఇతర ఉద్గారాల గణాంకాలను పొందుపరచలేదని తెలిపారు.

ఇతర అంశాలతోపాటూ శిఖరాగ్ర సమావేశం జరిగిన ఎస్‌ఈసీ క్యాంపస్‌లో "కరెంట్‌, నీరు, వ్యర్థాలు" కూడా ఉద్గారాల మదింపులోకి తీసుకున్నామన్నారు.

అరూప్ నివేదిక ప్రకారం, తాత్కాలిక భవనాలకు విద్యుత్‌ను అందించడానికి ఎస్‌ఈసీ వద్ద కొత్త మెయిన్స్ విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులలో బ్యాకప్ పవర్ మినహా, జనరేటర్ల వినియోగాన్ని తగ్గించడానికి ఈ ఏర్పాట్లు చేశారు.

ఈవెంట్ సమయంలో అవసరాలకు పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.

వేదికల వద్ద, రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు

రవాణాకు, తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను వాడాలని COP నిర్వాహకులు ప్రోత్సహించారు.

బ్లూ జోన్‌కు చెందిన ప్రతినిధులకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ట్రావెల్ కార్డ్‌లు, ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ని ఉపయోగించి ఈవెంట్ సమయంలో కాన్ఫరెన్స్ షటిల్ బస్సులను అందుబాటులో ఉంచారు.

COP26

ఫొటో సోర్స్, Getty Images

"తక్కువ కార్బన్" క్యాటరింగ్ విధానం

COP వేదికలో "తక్కువ కార్బన్" క్యాటరింగ్ విధానాన్ని అనుసరించారు. వీటిలో స్థానికంగా లభించే, కాలానుగుణ వంటకాలను మెనూలో అందుబాటులో ఉంచారు.

ఈ ఈవెంట్‌లో సింగిల్ యూజ్ కప్పులు, ప్లాస్టిక్‌లను వాడలేదని COP26 కేటరింగ్ హెడ్ లోర్నా విల్సన్ బీబీసీతో చెప్పారు.

బదులుగా, వేదిక చుట్టు పక్కల దాదాపు 400 వాటర్ కూలర్లు ఉంచి ప్రతినిధులు నీరు తాగడానికి తిరిగి ఉపయోగించే బాటిళ్లను అందుబాటులో ఉంచామని ఆమె చెప్పారు.

విల్సన్‌కు చెందిన సిబ్బంది ఓ క్యాటరింగ్ వ్యూహంతో 80% స్కాటిష్ ఫుడ్, 15% యూకే, 5% విదేశాలకు చెందిన ఫుడ్‌ తయారు చేయడానికి పని చేశామని ఆమె చెప్పారు.

మెనూలో 40% మొక్కల ఆధారిత ఆహారం, 60% శాఖాహారాలు అందించామని ఆమె చెప్పారు.

అయితే మెనూలో మాంసం, సీఫుడ్‌ని చేర్చడాన్ని యానిమల్ రెబెల్లియన్ తీవ్రంగా విమర్శించింది.

యానిమల్ రెబెల్లియన్ ప్రతినిధి బిగ్ ఇష్యూతో మాట్లాడుతూ ఇది అశాస్త్రీయ నిర్ణయం అన్నారు. ఇలా చేయడం ఊపిరితిత్తుల క్యాన్సర్ సదస్సులో, సిగరెట్లను అందించడం లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, భలే ఐడియా.. గాలి పటాలతో విద్యుత్‌ ఉత్పతి చేస్తున్న వ్యక్తి

COP26 కార్బన్ న్యూట్రల్‌గా ఎలా అవుతుంది?

ఓ వైపు 1,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలకు ఈవెంట్ కారణమని నివేదిక చెబుతుంటే, అది కార్బన్ న్యూట్రల్‌ ఎలా అవుతుంది?

సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది.

వీటిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, చెట్ల పెంపకం వంటివి ఉన్నాయి.

కార్బన్ న్యూట్రాలిటీపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణం PAS2060కి అనుగుణంగా నిర్వహించిన మొదటి COP ఇదే అని యూకే ప్రభుత్వం చెప్పింది.

ఇటీవల కార్న్‌వాల్‌లో జరిగిన మూడు రోజుల జీ7 సమ్మిట్‌లో 20,000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలు విడుదల అయినా ఇది కూడా "కార్బన్ న్యూట్రల్"గా గుర్తింపు పొందింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. లో సబ్‌స్క్రైబ్ చేయండి.)