చైనా: చరిత్రాత్మక తీర్మానంతో తన హోదాను సుస్థిరం చేసుకున్న షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters
చైనా రాజకీయ చరిత్రలో షీ జిన్‌పింగ్ హోదాను సుస్థిరం చేస్తూ ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ 'చరిత్రాత్మక తీర్మానం' చేసింది.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్రను వివరించే ఈ డాక్యుమెంట్‌లో పార్టీ కీలక విజయాలు, భవిష్యత్ గమనాలను ప్రస్తావించారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన తరువాత ఇలాంటి డాక్యుమెంట్ రూపొందించడం ఇది మూడోసారి మాత్రమే. తొలిసారి 1945లో మావో ఆమోదించగా, అనంతరం 1981లో డెంగ్ జియావోపింగ్ ఆమోదించారు. తాజాగా మూడో డాక్యుమెంట్‌ను గురువారం పార్టీ ఆరో ప్లీనరీ సెషన్‌లో ఈ డాక్యుమెంట్‌ను ఆమోదించారు.
పార్టీ వ్యవస్థాపకుడు మావో, ఆయన వారసుడు డెంగ్‌లకు సమాన స్థాయిలో షీ జిన్‌పింగ్‌ను నిలిపే లక్ష్యంతో ఈ తీర్మానం చేశారు.
డెంగ్ కాలంలో మొదలై అనంతరం జియాంగ్ జెమిన్ కాలంలో కొనసాగిన వికేంద్రీకరణ విధానాలకు ముగింపు పలికేందుకు జిన్‌పింగ్ చేస్తున్న ప్రయత్నమే ఈ తీర్మానమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వ్యక్తి ఆరాధనవైపు చైనా వెళ్తోందనడానికి దీన్ని సంకేతంగానూ చెబుతున్నారు.
చైనా అగ్రనాయత్వమంతా ఉండే పార్టీ 19వ కేంద్ర కమిటీ అంతర్గత సమావేశాలు గత నాలుగు రోజులుగా జరుగుతున్నాయి. పూర్తికాల, ప్రత్యామ్నాయ సభ్యులు 370 మంది ఈ సమావేశాలలో పాల్గొన్నారు.
వచ్చే ఏడాది జరగబోయే జాతీయ కాంగ్రెస్ కంటే ముందు జరిగే చివరి ప్రధాన సమావేశం ఇదే. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ మూడోసారి కొనసాగేందుకు జాతీయ కాంగ్రెస్‌లో ప్రతిపాదిస్తారని భావిస్తున్నారు.
రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడిగా ఉండరాదన్న నిబంధనను జిన్‌పింగ్ 2018లో రద్దు చేశారు. దీంతో ఆయన మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు అడ్డంకి తొలగిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ తీర్మానం ఎందుకంత కీలకం?
ఈ తీర్మానంతో జిన్‌పింగ్ అధికారం సుస్థిరమవుతుందని నిపుణులు బీబీసీతో చెప్పారు.
''చైనా ఇతిహాసంలో తనను తాను గొప్ప కథానాయకుడిగా చూపించుకునేందుకు జిన్‌పింగ్ ప్రయత్నిస్తున్నారు'' అని చైనా వర్తమాన వ్యవహారాల గురించి రాసే 'చైనా నీకాన్' ఎడిటర్ 'ఆడమ్ నీ' అన్నారు.
''పార్టీ, ఆధునిక చైనా మహ కథనంలో తనను తాను కేంద్రబిందువుగా చూపించుకుంటున్న ఈ తీర్మానంతో జిన్‌పింగ్ తన బలాన్ని ప్రదర్శిస్తున్నార''ని ఆడమ్ అన్నారు. దీంతో పాటు ఈ డాక్యుమెంట్ ఆయన అధికారాన్ని నిలుపుకోవడానికీ తోడ్పడుతుందని అన్నారు.
జిన్‌పింగ్ తాజా అడుగు చైనా గత నాయకుల కంటే ఆయన భిన్నమని చెబుతోందని సింగపూర్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ చోంగ్ జా ఇయాన్ అన్నారు.
చైనా పూర్వ నేతలైన హ్యూ జింటావో, జియాంగ్ జెమిన్‌లు ఎన్నడూ ఇంతలా మొత్తం అధికారాన్ని తమ చేతిలోకి తీసుకోలేదని చోంగ్ చెప్పారు.
కాగా జిన్‌పింగ్ మాదిరి గతంలో తీర్మానాలు చేసిన మావో, డెంగ్ ఇద్దరూ ఆ తీర్మానాలను అంతకుమునుపటి ప్రభావాలను
ఆపేందుకు వినియోగించారు.
1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేస్తూ మావో ప్రకటించినప్పుడు ఆయనకు సర్వాధికారాలు దఖలు పడేందుకు వీలు కల్పించేలా 1945 ప్లీనరీలో ఆమోదించిన మొదటి తీర్మానం ఉంది.
ఆ తరువాత 1978లో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన డెంగ్ 1981లో రెండో తీర్మానం చేశారు. 1966 నుంచి 1976 మధ్య లక్షలాది మంది మరణాలకు కారణమైన సాంస్కృతిక విప్లవం సమయంలో మావో 'తప్పులను' డెంగ్ తన తీర్మానంలో విమర్శించారు. అంతేకాదు.. చైనాలో ఆర్థిక సంస్కరణలకూ డెంగ్ పునాదులు వేశారు.
అయితే, వారిద్దరి తీర్మానాలకు విరుద్ధంగా జిన్‌పింగ్ తన తాజా తీర్మానంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేలా దీన్ని రూపొందించారని ఆడమ్ అన్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా చైనా అంతర్జాతీయ శక్తిగా అవతరించిన సమయంలో జిన్‌పింగ్ తీర్మానం వచ్చింది.
''చైనా ఇప్పుడు గణనీయమైన ఆర్థిక వృద్ధి, తిరుగులేని సైనిక సామర్థ్యంతో ఉంది. అంతేకాదు చైనా కమ్యూనిస్ట్ పార్టీ, దాని నాయకత్వం దేశీయంగా ఎలాంటి వ్యతిరేకంత లేకుండా పాతుకుపోయాయి'' డాక్టర్ చోంగ్ అభిప్రాయపడ్డారు.
జిన్‌పింగ్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఏం చేసినా కూడా రాబోయే కాలంలో అనూహ్యమైనవి ఏమైనా జరగబోయే అవకాశాలనూ కొట్టిపారేయలేమని చోంగ్ అన్నారు.
చైనా రాజకీయాలు పారదర్శకమైనవి కాకపోవడంతో అక్కడ ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ఉంటాయన్నారు చోంగ్.
ఇవి కూడా చదవండి:
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’
- శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










