కేసీఆర్ ధర్నా: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?

ఫొటో సోర్స్, Facebook/TRS
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
కాంగ్రెస్ వర్గాల్లో ఒక జోక్ బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే... ఒక సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటిలానే కొంతమంది మిత్రులతో పిచ్చాపాటిలో ఉన్నారు. బండి సంజయ్ యాత్రల మీదికి చర్చ మళ్లింది. 'ఎందిరా బై, కాంగ్రెసోళ్లు ఏమయి పోయిన్రు' అని ముఖ్యమంత్రి అడిగారు. వెంటనే ఒక మిత్రుడు, "అన్నా, కాంగ్రెస్ ఎక్కడుందే, మనమే సంపినం' కదా అని సీఎంకు ఎదురు ప్రశ్న వేశారట.
గత ఏడేళ్ల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎపుడూ ముఖ్యమంత్రిని చికాకు పెట్టలేదు. ఆ పార్టీ అసెంబ్లీ, గాంధీభవన్‌ల నుంచి చేసిన ఉద్యమాలు, అరుపులు, కేకలు ప్రగతిభవన్‌లో ప్రకంపనలు సృష్టించేంత బలంగా ఎప్పుడూ లేవు. అసెంబ్లీలో సీఎం ఒక్కసారి గద్దిస్తే, ప్రతిపక్షం మళ్లీ నోరు విప్పేది కాదు.
గత ఏడేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆందోళనలు చేపట్టింది. అయితే, అవి కాంగ్రెస్ పార్టీలోనూ పెద్దగా ఆత్మవిశ్వాసాన్ని పెంచలేదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యే దాకా, కాంగ్రెస్ పార్టీ ఆందోళనలన్నీ వారం వారం రైతు బజార్లలాగా సాగాయి తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చికాకు పెట్టలేదు. దానికితోడు కాంగ్రెస్ పార్టీ నైతికంగా కూడా బాగా బలహీన పడింది. ప్రముఖులందరి మీద పార్టీ మారతారనే పుకార్లు వచ్చాయి.
తర్వాత, రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరామ్ అనేక ఉద్యమాలు చేపట్టారు. ఆయన తెలంగాణ పునర్నిర్మాణం కోసం 'తెలంగాణ జనసమితి' పార్టీని ఏర్పాటుచేశారు. పార్టీ ఒక శక్తిగా ఎదగలేకపోయినప్పటికీ, నేటికీ నిరసన కార్యక్రమాలకు ఆయనొక కేంద్ర బిందువు. నీటి పారుదల ప్రాజెక్టుల బాధితుల తరఫున ఆయన పోరాడారు. రైతుల కోసం రాష్ట్రమంతా తిరిగారు. ఉద్యోగాల కోసం ధర్నాలు చేశారు. బహిరంగ సభలు పెట్టారు. ఆయన తన ప్రచారం సీరియస్‌గా సాగిస్తున్నారు. అయితే, అవి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రభావం చూపలేకపోయాయి.

ఫొటో సోర్స్, Facebook/TRS
ఆయన తీరు వేరు..
ఇంతకు మించిన ఉద్యమాలు తెలంగాణలో రాలేదు. ప్రజా సంఘాలు లేవు. కార్మిక సంఘాలు లేవు. విద్యార్థి ఉద్యమాలు లేవు, ధర్నాల్లేవు, మార్చ్ ల్లేవు. ఏవీ బలంగా చెప్పుకోదగినట్టుగా లేవు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లూ, టీవీ గోష్టుల్లేవు. పైగా టీఆర్‌ఎస్ నాయకులకు పాలాభిషేకాలు కూడా జరుగుతున్నాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి తీరు చాలా విశిష్టంగా మారింది.
ఆయన దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకంటే భిన్నంగా ఆఫీస్‌కు వచ్చే అలవాటు లేకుండా పరిపాలన సాగించారు. ఆయన ఎవ్వరినీ ఖాతరు చేయలేదు. ఎక్కడైనా విమర్శ ఎదురైతే, వ్యంగ్యాస్త్రాలతో, పరుష పదజాలంతో నోరు మూయించే వారు.
ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ''ఉద్యమాలు చేయండి, ధర్నాలు చేయండి, కేంద్రాన్ని వెంటాడండి'' అని పిలుపు ఇస్తున్నారు. ఆయన స్వయంగా గురువారం ధర్నాలో కూర్చున్నారు. ఆయన అటువైపు చూడక ఎంత కాలమయిందో. ఎప్పుడో తెలంగాణ ఉద్యమకాలంలో ఒకటి రెండుసార్లు అక్కడ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచి కదన శంఖం పూరిస్తున్నారు.
బుధవారంనాడు ఆర్థికమంత్రి హరీష్‌రావు, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇందిరాపార్క్ దగ్గరకొచ్చి ధర్నా చౌక్‌ని ముఖ్యమంత్రి ధర్నాకు సిద్ధం చేశారు. అంత ఎత్తున ఉన్న మనిషి ఇంత కిందికి ఎలా వచ్చారు?
బీజేపీలో వచ్చిన దూకుడే దీనికి కారణం. పంజాబ్‌లో ధాన్యమంతా అంటే 90 శాతం కొన్న కేంద్రం.. తెలంగాణ విషయంలో ఆ చొరవ చూపడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Facebook/TRS
అలజడి.. అలజడి..
తొలిసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అలజడి మొదలయింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు స్తబ్దుగా ఉన్నపుడు అలజడి బాగా ఉపయోగపడేది బీజేపీకే. తెలంగాణ రాజకీయ వాతావరణం అలా బీజేపీ కోరుకుంటున్నట్లు మారుతున్నదేమో అనే అనుమానం కలుగుతోంది.
కేంద్రం కావాలనే వరి సమస్య సృష్టిస్తే, దాని మీద అలజడి రేపి రాజకీయంగా ఎదిగేందుకు తెలంగాణ బీజేపీ చూస్తోందా? లేక టీఆర్‌ఎస్‌లో ఉన్న అతివిశ్వాసం బెడిసికొడుతోందా?
ఎలా చెప్పుకున్నా బీజేపీ తెలంగాణను అలజడి వైపు మళ్లించడం మొదలుపెట్టింది. దీనికి కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విధానాలు రెండూ ఉపయోగపడుతున్నాయి.
ఇటీవల ఈ పార్టీలో పెల్లుబికిన గుండె ధైర్యం అంతా ఇంతకాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా మళ్లీ ధర్నాలకు నాయకత్వం వహించే పరిస్థితి వచ్చిందంటే బీజేపీ వ్యూహం ఎంతటి ప్రభావం చూపుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇంతవరకు తెలంగాణలో వచ్చిన నిరసనలు పూర్తి స్థానికంగా ఉంటూ వచ్చాయి. హుజూరాబాద్ ఊపుతో తెలంగాణలో రాష్ట్రమంతా రాజకీయ అలజడి సృష్టించేందుకు బీజేపీ సిద్ధమవుతూ ఉంది. దీనికి ఇప్పుడు సాగుతున్న వరిధాన్యం సేకరణ వివాదం బాట వేస్తోంది. వరి సమస్య లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించింది. యాసంగి వరి పేరుతో ఒకేసారి ఈ కుటుంబాలకు చేరువ కావచ్చని బీజేపీ ఆశిస్తోంది. బీజేపీ ఇంతవరకు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అనో.. కుటుంబ పాలన అనో నినాదాలు చేస్తూ వచ్చింది. తొలిసారి ఈ పార్టీకి ఒక సమస్య, అందులోనూ రైతు సమస్య దొరికింది.

ఫొటో సోర్స్, EPA
కేంద్రం అలా చెప్పిందా?
కేంద్రం వరి ధాన్యం సేకరించేందుకు నిజంగా నిరాకరిస్తోందా? స్పష్టంగా యాసంగి వరిని సేకరించేది లేదని చెప్పిందా? కేంద్రం అలా చెప్పలేదని బీజేపీ వాదిస్తోంది.
కేంద్రం యాసంగి వరి సేకరణ జరిపేది లేదని చెప్పిందని, పార్ బాయిల్డ్ బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో ఇక కొనలేమని కేంద్రం స్పష్టం చేసిందని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ విషయంలో ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన ఒక లేఖను కూడా ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది.
వరి ధాన్యం కొంటారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. యాసంగి వరి అనేది రాబోయే పంట. ఈ పంటను పూర్తిగా వదులుకోవడం రైతులకు సాధ్యం కాదు. వేరే పంటకు ఒక్కరోజులో మారడం కూడా అంతే కష్టం. అందువల్ల ఈ సమస్యలో మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ భావిస్తున్నట్లు పార్టీ నేతల ప్రకటనల వల్ల అర్థమవుతుంది.
యాసంగి వరి వ్యవహారం తేలక ముందే మరొకవైపు ఖరీఫ్ సేకరణ సమస్య టీఆర్‌ఎస్‌కు చుట్టుకుంటోంది. ఖరీఫ్ ధాన్యం సేకరణ కూడా ఇంకా ఉపందుకోకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
నిజానికి ఖరీఫ్ వరి సేకరణ సమస్య కాదని అంతా చెబుతూనే ఉన్నా ఖరీఫ్ రైతుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఈ పాటికి ఖరీఫ్ సేకరణ బాగా జోరుగా ఉండాలి. కానీ ఎక్కడా అలా లేదు. నెల రోజులు గడిచినా పంట సేకరణ జరగలేదు.
భారత ఆహార సంస్థ వెబ్‌సైట్ ప్రకారం.. 11.11.2021 నాటికి, 36వేల టన్నుల ధాన్యమే సేకరించినట్లు కనబడుతోంది. దీనితో ముందుగా పంట చేతికొచ్చే నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ రైతులు ధాన్యం సేకరణ కోసం పడిగాపులు కాస్తున్నారు. సేకరణ మొదలు కాలేదు. దసరాకు పది రోజుల ముందు నుంచే కేంద్రాలకు రైతులు పంట తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నారు. సేకరణ జరగలేదు. ఈ లోపు వర్షాలు వస్తున్నాయి. ఖరీఫ్ ధాన్యం సేకరణ సమస్య కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
రైతు ప్రతినిధులు ఏం అంటున్నారు?
"కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ కొనుగోళ్లలో జాప్యం చేస్తోంది. దీని వల్ల డబ్బు అవసరాలున్న రైతులు ఎక్కువ కాలం ఆగలేక వచ్చిన రేటుకు ట్రేడర్లకు అమ్ముకుంటారు. అప్పుడు వరి సేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది" అని బీబీసీతో ఓ రైతు నాయకుడు అన్నారు.
"సేకరణ కాలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు తెలంగాణలో ఎక్కడా ఏర్పాట్లు లేవు. రోడ్ల మీద కుప్పలు పోసుకోవాలి. వర్షం వస్తే ధాన్యం నాశనం కాకతప్పదు. ఇదే ఇప్పుడు ఖరీఫ్‌లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు కట్టడమే వ్యవసాయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాదు. రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు, గోడౌన్లు, కొనుగోలు కేంద్రాలలో షెడ్లు కూడా ఉండాలి. కొనుగోళ్లలో జాప్యం చేస్తే రైతులు ట్రేడర్స్‌కు తక్కువ రేటుకు అమ్మేస్తారు. ఈ ఆరోపణను కాదనలేం" అని ప్రముఖ ఎన్‌జీవో 'సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్' డైరెక్టర్ డాక్టర్ బి.రామాంజనేయులు చెప్పారు.
ఒకసారి వానలో ధాన్యం తడిస్తే ఏమవుతుంది? రైతులకు విపరీతంగా నష్టం వస్తుందని 'రైతు స్వరాజ్య' డైరెక్టర్ కన్నెగంటి రవి తెలిపారు.
"ఉన్నట్లుండి వర్షం వస్తే, రైతుల దగ్గర టార్పాలిన్లు కూడా ఉండవు. వాటిని అద్దెకు తెచ్చుకోవాలి. అదీ భారమే. వర్షం వచ్చి తడిస్తే, వాటిని ఆరబోసుకోవాలి. అపుడు తూకంలో తేడా వస్తుంది. ధాన్యం రంగు మారుతుంది. లేదా మొలకెత్తుతుంది. క్వింటాల్‌కు ఏడెనిమిదికి కేజీల తరుగు వస్తుంది. రైతులు బాగా ఆర్థికంగా నష్టపోతారు. రైతుబంధు సాయం దీనిని పూడ్చలేదు'' అని కన్నెగంటి రవి అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/TRS
ఎప్పుడూ ఇలా లేదు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వంలోనూ తీవ్ర అలసత్వం కనిపిస్తోందని, కేంద్రం ఒక విధంగా దెబ్బతీస్తే, మరొక విధంగా రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు జాప్యం మీద అనుమానాలు వ్యక్తం చేశారు.
"నాలుగైదు వేల సేకరణ కేంద్రాలు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవి ఎక్కడున్నాయి? అక్కడక్కడ ప్రారంభమైన కేంద్రాల్లో సేకరణ నత్తనడక నడుస్తూ ఉంది. కొంటామని చెబుతూ కుంటిసాకులతో వాయిదా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు కొంటారని ఆశతో రైతులు ధాన్యం తీసుకుని వస్తున్నారు. కొనుగోళ్లు జరగడం లేదు. ఇలాంటి రైతులంతా వర్షాలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. రైతు ఇంత మానసిక వేదనకు ఎప్పుడూ గురికాలేదు'' అని రావుల అన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున సేకరణ కేంద్రాలు తెరవాలి, సేకరణ వేగం పెరగాలి, లేకపోతే తెలంగాణ రైతు సంక్షోభంలో పడిపోతాడని ఆయన అన్నారు. అలాగే తొందరగా యాసంగి పంట మీద నిర్ణయం ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖరీఫ్ సేకరణ అంతంత మాత్రమే!
నిజానికి ఖరీఫ్ సేకరణ అనేది కొత్త సమస్య. ఇంతవరకు అందరికి తెలిసి సమస్య యాసంగి వరి పంట వేయాలా వద్దా అనేదే.
యాసంగి పంటకు ఇప్పుడు నారు పోయాల్సిన సమయం వచ్చింది. రైతులు వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. జాప్యమయితే అదొక నష్టం. ఇలాంటప్పుడు కేంద్రం యాసంగి పంట కొనడం లేదు, ఆ పంట వేయవద్దని చెప్పిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతూ వస్తున్నారు.
అయితే, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ వాదనని ఖండిస్తున్నారు. అలాంటి నిర్ణయమేమీ లేదని, కేసీఆర్ బుకాయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
''యాసంగిలో వరి పంట వేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనదో చూస్తాం'' అని బండి సంజయ్ కౌంటర్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖను ప్రస్తావిస్తూ.. ఆ లేఖలో కేంద్రం యాసంగి వరి కొనేది లేదని చెప్పినట్లు పేర్కొనలేదని ఆయన అన్నారు.
వరి ఇప్పుడు వివాదం కావడానికి కారణం మొన్నమొన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వం వరి పంట ఉత్పత్తి రికార్డు గురించి విపరీతంగా ప్రచారం చేసుకోవడమే. వరి ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతే, ఉపద్రవమేదైనా ఉంటుందా అని ఊహించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పండగ చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బహిరంగ సభలో చేసిన ప్రకటనను కన్నెగంటి రవి గుర్తుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కారణం అదేనా?
"ఖరీఫ్, రబీలలో కలిపి తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండింది. తెలంగాణ ధాన్యాగారంగా మారింది. ఎఫ్‌సీఐకి అత్యధిక వడ్లు సరఫరా చేయడం ద్వారా, దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ ఎదిగింది. ప్రభుత్వం అన్ని గ్రామాలలో సెంటర్లు పెట్టి ధాన్యం కొంటుంది. తన ప్రభుత్వం గ్రామాలలో సెంటర్లు పెట్టి ధాన్యం కొంటుందని గొప్పగా చెప్పుకున్నారు కేసీఆర్. ఆ మాటలను రైతులు నమ్మారు కూడా. ఇప్పటివరకూ ధాన్యం సేకరణలో కేంద్రం పాత్రేమీ లేదని సాధారణ రైతులు అనుకున్నారు. కేసీఆర్ గొప్ప పని చేస్తున్నాడని మెచ్చుకున్నారు. ఎప్పుడు, ఎంత వరి ధాన్యం సాగు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కొనాలని అందుకే డిమాండ్ చేస్తున్నారు" అని రవి వివరించారు.
గోదావరి నీళ్లు రాష్ట్రంలో పారేది ఎందుకు, వ్యవసాయానికి కాదా అని కిసాన్ కాంగ్రెస్ అఖిల భారత ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు.
"కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల నీళ్లు రాష్ట్రమంతా పారిస్తున్నామని ఒకవైపు చెబుతూ మరొకవైపు వరి మానుకోమంటే ఎలా? వరి తప్ప మరొక పంట ఈ భూముల్లో పండదు. చెరకు కూడా పండదు. రైతులు వరే వేస్తారు. వరే పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం వీటిని కొనితీరాల్సిందే" అని కోదండరెడ్డి వాదించారు.
ఉన్నట్లుండి ఇప్పుడు యాసంగి వడ్లు కొనలేమని కేంద్రం చెప్పగానే కేంద్రాన్ని ఒప్పించడానికి బదులు కేసీఆర్ కూడా పంట వేయవద్దని రైతుల మీద ఒత్తిడి తీసుకురావడం ఏమిటని కోదండ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు ప్రధానికి లేఖ రాయడం పట్ల కోదండ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Facebook/TRS
లేఖలో ఏముంది?
"బఫర్ నిల్వలను నిర్వహించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలను సరఫరా చేయడం, ప్రజలకు ఆహార భద్రత కల్పించడం.. తదితర ఆదేశాలు ఉన్నా.. రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గందరగోళానికి గురిచేస్తోంది. సేకరణ లక్ష్యం ఏడాది పొడవునా ఒకేసారి నిర్ణయించడం లేదు. ఉత్పత్తి ఏటా పెరుగుతున్నా కొనుగోళ్ల వేగం పెరగడం లేదు" అని ముఖ్యమంత్రి లేఖలో రాశారు.
"2021 ఖరీఫ్‌లో తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 55.75 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, సేకరణ కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులే. ఇది ఉత్పత్తిలో 59 శాతమే. ఖరీఫ్ 2019-20లో సేకరించిన 78% కంటే ఇది తక్కువ. సేకరణ స్థాయిలలో ఇలాంటి విస్తృత వ్యత్యాసాలు రాష్ట్రంలో హేతుబద్ధమైన పంట విధానాలను అమలు చేయడానికి అనుమతించవు" అని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం మధ్య బండి సంజయ్ రెండు మూడు రోజులుగా వరి సేకరణ కేంద్రాల పర్యటన జరుపుతున్నారు. ఈ పర్యటనలు ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నాయి. ఆయన పెద్ద ఎత్తున కార్యకర్తలను వెంటేసుకునే వస్తున్నారు. రైతు కష్టాలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలీసులు లాఠీచార్జ్ చేశారని, కొంతమంది రైతులకు గాయాలయ్యాయని రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
70 మంది బీజేపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయని, 15 మంది తలలకు గాయాలయ్యాయని ఆయన బుధవారం నాడు చెప్పారు.
అయితే, కార్యకర్తలతో వచ్చి సేకరణ కేంద్రాలలోని రైతుల మీద బండి సంజయ్ దాడులు జరుపుతున్నారని టీఆర్‌ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదని, అందువల్ల సేకరణ కేంద్రాల్లో పర్యటించే అధికారం ఆయనకు లేదని మంత్రులు విలేఖరుల సమావేశం పెట్టి విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
యాసంగి నుంచి కరీఫ్‌కు..
ఇలా నిన్న బండి సంజయ్ సూర్యాపేట జిల్లాలో పర్యటించే సమయంలో సమస్య యాసంగి నుంచి ఖరీఫ్‌కు కూడా విస్తరించింది. దీనితో బీజేపీ కత్తి రెండంచులా పదునెక్కింది. ఒకవైపు యాసంగి పంట వేయవద్దని కేంద్రం చెప్పలేదని, మరొకవైపు వానాకాలం పంటను సేకరించకుండా జాప్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులను కుంగదీస్తోందని వాదించడం మొదలుపెట్టారు.
నిజానికి వరి కుప్పల మీదే రైతులు చనిపోయినా ఖరీఫ్ సేకరణ జాప్యం వివాదం కాలేదు. ఇప్పుడు సంజయ్ పర్యటనతో ఖరీఫ్ పంట సేకరణ కూడా ప్రధాన సమస్య అయి కూర్చుంది.
"వానాకాలం పంట కొని తీరాలి. గ్రామగ్రామాన కాంట ఏర్పాటు చేయాలి. తెలంగాణ కంటే ఎక్కువ వరి పండిస్తున్న రాష్ట్రాలలో కొనుగోలు సమస్య రావడం లేదు. కేవలం తెలంగాణలోనే వస్తోంది ఎందుకు? కేసీఆర్ కావాలనే కొనుగోలు సమస్య సృష్టిస్తున్నారు'' అని బుధవారం బండి సంజయ్ అన్నారు.
దసరాకు పదిరోజుల ముందు నుంచే రైతుల కేంద్రాలకు వచ్చారని. వాళ్ల ధాన్యం ఇంకా కొనుగోలు చేయకపోవడంతో రైతులు షాక్‌కు గురై చనిపోతున్నారని, ఇంతవరకు ఆరుగురు చనిపోయారని సంజయ్ చెప్పారు.
యాసంగి పంట కొనేది లేదని కేంద్రం చెప్పనేలేదనే క్యాంపెయిన్ బీజేపీ మొదలుపెట్టగానే కేసీఆర్ ఎదురుదాడి ప్రారంభించారు. కేంద్రం యాసంగి ధాన్యం కొంటుందో లేదా తేల్చి చెప్పాలని, చెబితే మా ప్లాన్ మేం రైతులకు వివరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. నవంబర్ 18 తర్వాత రెండు రోజులు చూసి తమ ప్రణాళిక తాము అమలు చేస్తామని చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, రాష్ట్రమంతా ధర్నాలు చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులుగా వరసగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. యాసంగి పంటను కొంటారా? లేదా అనేది క్లారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి అడుగుతున్నారు.

ఫొటో సోర్స్, Facebook/BJPTelangana
బీజేపీ కోరుకుంటున్నదే జరుగుతోందా?
మొత్తానికి తెలంగాణలో బీజేపీ కోరుకుంటున్న ఉద్రిక్త వాతావరణ నెలకొంటోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యమం నడపాలనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇలా మళ్లీ రోడ్డెక్కేలా చేసింది తమ వ్యూహమేని బీజేపీ వర్గాలు చాలా సంబరపడుతున్నాయి. ఆ పార్టీకి కావలిసింది కూడా ఈ వాతావరణమే.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే దాకా తాము ఆందోళన చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అంతేకాదు "దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని ఉద్యమిస్తాం, నిరుద్యోగ భృతి ఇవాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని, రుణమాఫీ అమలుచేయాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేస్తాం"అని కూడా ఆయన చెప్పారు.
ఉద్రిక్త వాతావరణం బీజేపీకి లాభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తారా? లేక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమై ఎదురుదాడికే ప్రాధాన్యమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- సుప్రీంకోర్టు: ''నేరస్థుడి లైంగిక ఉద్దేశాలను గమనించాలి.. చర్మానికి చర్మం తగిలిందా లేదా అని చూడకూడదు''
- ఎవరు మీలో కోటీశ్వరుడు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
- వేటగాళ్ల ఉచ్చుతో తొండం తెగడంతో ఏనుగు పిల్ల మృతి
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్‌ఫాదర్‌ను అధిగమించిన భారతీయ సినిమా
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








