తెలంగాణ: 'శాసనసభ అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలి... కుస్తీ పోటీలకు కాదు' - కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO/FB
తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, శాసనసభ నిర్వహణలోనూ అదే ఒరవడి కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారని ఈనాడు ఒక వార్తను ప్రచురించింది. శుక్రవారం శాసనసభ వాయిదా అనంతరం కమిటీ హాలులో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభా కార్యకలాపాల కమిటీ (బీఏసీ) సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారని ఈ వార్తలో రాశారు.
గౌరవ మర్యాదలతో సభ సాగాలని కోరిన కేసీఆర్. గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆలోచన చేయాలన్నారు.
వీలయినన్ని ఎక్కువ రోజులు సభను నడిపించాలని, అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున సూచించిన పరిశ్రమలు, ఐటీ, హరితహారం, వ్యవసాయం, పాతబస్తీ అభివృద్ధి, మైనారిటీలు అనే అంశాలతో పాటు ప్రతిపక్షం చర్చించాలనుకున్న వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
పార్లమెంటులో మాదిరి శాసనసభలో కూడా కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ని ఏర్పాటు చేయాలని, తద్వారా నూతన సభ్యులకు, మాజీ సభ్యులకు కార్యశాలలు, బోధనకోసం వేదికను కల్పించాలని సీఎం కేసీఆర్ స్పీకర్‌కు సూచించారు.
‘‘ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, వాయిదా తీర్మానాల వంటి సంప్రదాయాలను విధిగా పాటిస్తూ సభ జరగాలి. బిల్లులను సభ్యులకు ముందుగా పంపించాలి. సభ్యులకు గౌరవమర్యాదల నిబంధనలను పాటించేలా సభాపతి చర్యలు చేపట్టాలి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రయివేటు మెంబర్ బిల్లుపై చర్చ జరిగే అంశాన్ని పరిశీలించాలి. రూల్ బుక్‌ను సమీక్షించాలి. శాసనసభా కమిటీ సమావేశాలు క్రమంతప్పకుండా జరగాలి. వీలైతే కమిటీలు దేశంలో, బయటి దేశాల్లో పర్యటనలు చేపట్టాలి. నూతన అంశాలను నేర్చుకునేలా అవి సాగాలి’’ అని కేసీఆర్ సూచించారని ఈ కథనంలో తెలిపారు.

శ్రీవారి దర్శనానికి మొదటి డోసు వ్యాక్సీన్ వేసుకున్నా చాలు
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేయనున్నట్లు ఈవో జవహర్‌రెడ్డి తెలిపారని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.
శుక్రవారం ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు.
మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావచ్చన్నారు. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుంచి 15 వరకు ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
త్వరలో బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానిస్తామన్నారు. కాగా.. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా ఈవో జవహర్‌రెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 14,200కు పైగా పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని, ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారమి సాక్షి పత్రిక తెలిపింది.
పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి అధికారులు చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అక్టోబరు 1 నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం, కోవిడ్–19 నివారణ, వ్యాక్సినేషన్‌పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బంది, జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుత అవసరాలు తదితర వివరాలపై సీఎం ఆరా తీశారని ఈ వార్తలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సర్కారు కాలేజీల్లో ఏ కులం విద్యార్థులకైనా ఇంజినీరింగ్ విద్య ఉచితం
తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివిన పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించిందని, ఎంసెట్‌లో పదివేలకంటే ఎక్కువ ర్యాంకు వచ్చినా ఈ ఏడాది నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తున్నదని నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది.
గతేడాది వరకు ఓసీ, బీసీ విద్యార్థులకు ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు వస్తేనే ఇంజినీరింగ్‌లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండేది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.
ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 4,566 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. టాప్‌టెన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చినా ప్రభుత్వ విద్యార్థులకు ఈ అవకాశం ఉండనున్నది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ఎంసెట్‌లో 10వేలలోపు ర్యాంకు వచ్చినవారికి ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏ కులం వారికైనా ఇది వర్తిస్తుంది.
పదివేల పైన ర్యాంకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తమ కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికంటే తక్కువే ఉన్నదని ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తున్నది. పదివేల పైన ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు రూ.35 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లిస్తుండగా, మిగతా ఫీజును విద్యార్థులే భరించాలి.
తాజా నిర్ణయం ప్రకారం సర్కారు కాలేజీల్లో చదివిన ఏ కులం విద్యార్థులకైనా ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వ కాలేజీలతోపాటు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కార్పొరేట్ కాలేజీ స్కీమ్‌లలో లబ్ధిపొందిన విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిసుంది.
వీరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మించి ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో మోదీ: చైనాను ఎదుర్కొనేందుకు క్వాడ్ సదస్సు భారత్‌కు సాయం చేస్తుందా
- కోవిడ్-19 వ్యాక్సీన్: దుష్ప్రభావాలకు గురైతే ఏం చేయాలి?
- విశాఖలో కుక్కల పార్కుపై వివాదమేంటి? వద్దంటున్నదెవరు, కావాలనేదెవరు
- అమెరికాలో మోదీ కలవబోతున్న ఐదు కంపెనీల సీఈవోలు ఎవరు, ఈ సమావేశాలు ఎందుకంత కీలకం?
- 'కన్యాదానం' అమ్మాయిలకే ఎందుకు? భారతీయ సంప్రదాయాలను సవాలు చేస్తున్న ప్రకటనలు
- మోదీ ఈ అంశంపై బైడెన్‌తో చర్చించాలనుకుంటున్నారు, ఏం జరగబోతోంది?
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు ఇప్పుడు ఐఎస్ శత్రువుగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








