నరేంద్ర మోదీ అమెరికా పర్యటన: అఫ్గాన్ అంశంపై మోదీ చర్చించాలనుకుంటున్నారు.. చైనా గురించి బైడెన్ ఆందోళన చెందుతున్నారు.. సమావేశంలో ఏం జరగబోతోంది?

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

అయిదు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని చేస్తున్న రెండో విదేశీ పర్యటన ఇది. ఈ ఏడాది మార్చిలో ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించారు.

అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ పలు దేశాల నేతలతో సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ చర్చలు జరుపుతారు.

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నేతలు పాల్గొనే క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తారు.

జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఇరు దేశాల నేతల మధ్య సమావేశం జరగడం ఇదే మొదటిసారి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో కూడా మోదీ సమావేశమవుతారు.

రెండు దేశాల మధ్య సంబంధాలే ప్రధాన అజెండా అయినప్పటికీ, మోదీ, బైడెన్‌ల మధ్య సమావేశంలో అఫ్గానిస్తాన్ వ్యవహారాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

''అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను విస్మరించలేం'' అని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు.

అయితే, సైన్యాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్తాన్‌ విషయాన్ని వదిలేయాలని అటు అమెరికా ప్రజలు, ఇటు ఆ దేశ నాయకత్వం భావిస్తున్నట్లు విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం ఆసక్తికరంగా మారింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అఫ్గానిస్తాన్ విషయంలో మోదీ బైడెన్‌ను ఒప్పించగలరా?

50 నిమిషాలపాటు సాగే ఈ చర్చల్లో బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరువురు నాయకులు సమీక్షిస్తారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ అన్నారు.

వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారాలను బలోపేతం చేయడంతోపాటు అఫ్గాన్ సమస్య కూడా సెప్టెంబర్ 24 నాటి సమావేశంలో కీలకం కానుంది.

బైడెన్‌తో చర్చల సందర్భంగా అఫ్గాన్ అంశాన్ని మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని డియాగో స్టేట్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్పెషలైజేషన్‌‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అహ్‌మెట్ కురు అన్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

''అఫ్గానిస్తాన్‌ నుంచి బైటికి రావాలని అమెరికా ఎప్పుడో నిర్ణయించింది. ఇప్పుడు అక్కడ తాను చేయాల్సింది ఏమీ లేదని అమెరికా భావిస్తోంది. ఆ దేశం పట్టించుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి'' అని కురు అన్నారు.

''ఇండియా అమెరికాలు వ్యూహాత్మకంగా స్నేహితులే. వారిద్దరి ప్రధాన ప్రత్యర్థి చైనాయే. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి బయటకు వచ్చింది. అందుకే భారత్ అభద్రతలో ఉంది'' అని చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ టామ్ గిన్స్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

భారత్ అమెరికా జెండాలు

ఫొటో సోర్స్, Reuters

గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇండియా, చైనాల మధ్య సంబంధాలు బాగా చెడిపోయాయని, ఈ పరిస్థితుల్లో అమెరికాతో చేతులు కలపక తప్పదని ఇండియా భావిస్తున్నట్లు మరికొందరు నిపుణులు వ్యాఖ్యానించారు.

చైనాతో ముప్పు ఉందని, పరస్పర సహకారంతో ముందుకు పోవాలని ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో పరోక్షంగా చెప్పిన బైడెన్, దీనికి వ్యతిరేకంగా పోరాడటంలో అమెరికా ముందుంటుందని అన్నారు.

ఇటీవల జరిగిన AUKUS జలాంతర్గామి ఒప్పందం ఇందులో ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇండియా తనవైపు ఉండటం ఇటు అమెరికాకు కూడా అవసరమే.

''ఇటీవల జరిగిన AUKUS ఒప్పందం కేవలం ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఉద్దేశించిందే. అది పక్కాగా అమలు కావాలంటే ఇండియాలాంటి దేశాల తోడు అమెరికాకు అవసరం'' అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం వల్ల తనకు భద్రతా సమస్యలు ఉంటాయని ఇండియా భావిస్తోంది.
ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం వల్ల తనకు భద్రతా సమస్యలు ఉంటాయని ఇండియా భావిస్తోంది.

''వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఇండియా కీలక శక్తి అవుతుంది''

బైడెన్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు లేకపోయినప్పటికీ, ఆయనకు దగ్గరయ్యే అవకాశం మోదీకి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

''ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ కోసం అమెరికా AUKUS ఒప్పందానికి సిద్ధపడింది. ఇలాంటి సమయంలో ఆసియాలో చైనాను ప్రధాన సమస్యగా చూపగలిగితే వైట్‌హౌస్‌లో మోదీ మంచి పలుకుబడి సాధించవచ్చు'' అని డియాగో స్టేట్ యూనివర్సిటీలో ఇంటర్నేషన్ సెక్యూరిటీ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ విభాగం డైరెక్టర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ లతా వరదరాజన్ అభిప్రాయపడ్డారు.

''అఫ్గానిస్తాన్‌లో ఓటమి తర్వాత ప్రపంచానికి పెద్దగా తన పరపతి నిలబెట్టుకోవడం ఇప్పుడు అమెరికాకు అత్యవసరం. ఈ పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరిస్తే ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలకమైన శక్తిగా ఆవిర్భవించవచ్చు'' అని ప్రొఫెసర్ హాంకీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)