తెలంగాణ: 'కంటోన్మెంట్ రోడ్ల మూసివేత ఆపండి' - రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ -ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, KTR/FB
సికింద్రాబాద్‌లో కీలకమైన నాలుగు కంటోన్మెంట్ రోడ్లను కోవిడ్ పేరు చెప్పి లోకల్ మిలటరీ అథారిటీ మూసివేసిందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, ఈ మూసివేతను వెంటనే ఆపాలంటూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారని ‘మన తెలంగాణ పత్రిక’ ప్రచురించింది.
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నా కంటోన్మెంట్ అధికారులు రోడ్లు మూసివేయడం అన్యాయం, దీనివల్ల ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
ఎన్ని లేఖలు రాసిన స్థానిక మిలటరీ అధికారుల తీరు మారడం లేదని కూడా ఆయన ఆక్షేపించారు. వెంటనే ఈ రోడ్ల మూసివేతను ఆపేయాలని కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖలో కేటీఆర్ కోరారు.

నిండు గర్భిణిని ఎత్తుకుని 3 కిలోమీటర్లు పరుగు
విశాఖ మన్యంలో ఓ గర్భిణిని కుటుంబీకులు చేతులపై మోస్తూ 3 కిలోమీటర్లు పరుగు తీసి ఆస్పత్రిలో చేర్పించారని ఈనాడు వార్త రాసింది.
ముంచంగిపుట్టు మండలం, బూసిపుట్టు పంచాయతీ, సుల్తాన్ పుట్టు గ్రామానికి చెందిన గర్భిణి పాంగి చెల్లమ్మ పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. అయితే, వాహనం కుమడ ఘాట్ రోడ్డు మీద బురదలో కూరుకుపోయింది.
ఎంతకీ కదలకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆమెను చేతులపై 3 కిలోమీటర్లు మోసుకుంటూ కుమడ గ్రామానికి పరుగుతీశారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రూఢకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు ఈ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, KNagababu/FB
'ప్రకాశ్ రాజ్‌కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే..' -నాగబాబు
శివాజీరాజా మా అధ్యక్షుడిగా ఉండగా అమెరికాకు వెళ్లి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఫండ్ సేకరించారు. వాటిని సంక్షేమం కోసం ఉపయోగించారు. నరేశ్ టర్మ్‌లో ఆ ఎఫర్ట్ పెట్టలేదని సినీ నటుడు నాగబాబు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.
మా అసోసియేషన్‌కు సంబంధించి ప్రకాశ్ రాజ్‌కు ఓ క్లారిటీ ఉందన్న నాగబాబు, "తెలుగు పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. అందుకే, నేను కూడా పరిశ్రమ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని అంటున్న ప్రకాశ్ రాజ్ పక్కా యాక్షన్ ప్లాన్‌తో ఉన్నారు. కార్యాలయ భవనానికి స్థలం, నిర్మాణం విషయంలో ఆయనకు పక్కా ప్రణాళిక ఉంది" అని చెప్పారు.
ప్రకాశ్ గెలిచినా, విష్ణు గెలిచినా అంతా కలిసే పని చేస్తామని కూడా నాగబాబు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రూ. 2 వేల నోట్లు రద్దంటూ 45 లక్షల దోపిడీ
రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతాయని చెబుతూ రూ. 45 లక్షలకు టోకరా వేసిన ఘటన చిత్తూరులో జరిగిందని సాక్షి ఒక వార్తా కథనం ప్రచురించింది.
'ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉంది. అన్నీ 2 వేల నోట్లే. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్లు 500 రూపాయల నోట్లతో 90 లక్షలు ఇస్తే, కోటి రూపాయల 2 వేల నోట్లు ఇస్తా. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా' అని డీల్ కుదుర్చుకుని రూ. 45 లక్షలు దోచుకెళ్ళిన ఘటనలో చిత్తూరు పోలీసులు తమిళనాడుకు చెందిన కొందరిని అరెస్ట్ చేశారని ఈ కథనంలో రాశారు.
నిందితుల నుంచి పోలీసులు రూ. 32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








