మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్‌లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్‌కూ ఏమిటి సంబంధం?

అఫ్గానిస్తాన్ నుంచి ఆసియా, అమెరికాలకు డ్రగ్స్ సరఫరా అవుతుంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ నుంచి ఆసియా, అమెరికాలకు డ్రగ్స్ సరఫరా అవుతుంటాయి
    • రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్‌లోని ముంద్రా, ద్వారక నౌకా కేంద్రాల తర్వాత మోర్బీ జిల్లాలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

మోర్బి జిల్లాలోని జింజుడా ప్రాంతంలో దాడులు చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్( ఏటీఎస్) పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది. 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

United Nations Office on Drugs and Crime తాజాగా విడుదల చేసిన నవంబర్ 2021 రిపోర్ట్ ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో నల్లమందు గసగసాల సాగు 2020, 2021 మధ్య 8 శాతం పెరిగింది.

జులై 2021లో ముగిసిన అయిదో పంట కాలంలో దేశంలో నల్లమందు దిగుబడి విపరీతంగా పెరిగింది. ఈ సంవత్సరం, అఫ్గానిస్తాన్ 6,000 టన్నుల నల్లమందును పండించింది. దీని నుంచి 320 టన్నుల హెరాయిన్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

ఇక్కడ పండిన నల్లమందు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు రవాణా అవుతుంది.

ఒక నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో నల్లమందు ద్వారా ప్రజలకు వచ్చే ఆదాయం 1.8-2.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.12 నుంచి 13 వేల కోట్లు ఉంటుందని అంచనా.

అఫ్గానిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ డ్రగ్స్ ముఠాలు భారీగా లాభాలు గడిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో వినియోగించే మొత్తం హెరాయిన్‌లో 85 శాతం అఫ్గానిస్తాన్‌ నుంచే వస్తుంది.

అఫ్గానిస్తాన్ - నల్లమందు వ్యాపారం

అఫ్గానిస్తాన్‌ లోని డ్రగ్స్ స్థితిపై 2021 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం:

  • నల్లమందు, మెథాంఫెంటమైన్ వంటి మాదక ద్రవ్యాలు అక్రమార్కులు భారీగా లాభాలు తెచ్చి పెట్టాయి.
  • అఫ్గానిస్తాన్‌ డ్రగ్స్‌కు ఆసియా, ఉత్తర అమెరికాలు అతి పెద్ద కస్టమర్లు
  • ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఔషధాలలో 85% అఫ్గానిస్తాన్‌లోనే తయారవుతాయి.
  • అఫ్గానిస్తాన్ 2019లో 4000 టన్నులు, 2020లో 5000 టన్నులు, 2021లో 6000 టన్నుల నల్లమందు ఉత్పత్తి చేసింది.
  • 2021 ఆగస్టు తర్వాత నల్లమందు ధర బాగా పెరిగింద
  • అఫ్గానిస్తాన్ పొలాలు హెరాయిన్, మార్ఫిన్‌లను ఉత్పత్తి చేస్తాయి
  • చట్టవిరుద్ధంగా విక్రయించిన నల్లమందు కారణంగా 2020లో అఫ్గానిస్తాన్ జీడీపీని 9% చేర్చింది.
  • జులై 2021లో 1,77,000 హెక్టార్ల భూమిలో నల్లమందు పంటను వేశారు.
  • నల్లమందు సాగు ప్రతి సంవత్సరం 4,000 హెక్టార్లు పెరుగుతోంది
  • అఫ్గానిస్తాన్‌లోని హెల్మండ్ జిల్లాలో మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపు 20% భూమిలో నల్లమందును సాగు చేశారు.
గుజరాత్ పోర్టుల్లో ఇటీవల వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుజరాత్ పోర్టుల్లో ఇటీవల వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళతాయి?

ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికాలు ఈ డ్రగ్స్‌కు అతిపెద్ద మార్కెట్లు. తాజాగా విడుదలైన నివేదికలో గుజరాత్ తీరం పేరు వచ్చిందంటే, గత ఏడాది కాలంలో గుజరాత్ తీర ప్రాంతాలలో డ్రగ్స్ అక్రమ రవాణా ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్న వాటితో కలిపి ఈ ఏడాది గుజరాత్‌లో డ్రగ్స్ పట్టుబడటం ఆరోసారి. ఈ సంవత్సరం రాష్ట్రంలో దాదాపు 3,240 కిలోల డ్రగ్స్‌ పట్టుబడ్డాయని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు గుజరాత్ సముద్ర తీరం నుంచి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

గుజరాత్ సముద్ర సరిహద్దులో డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలు ఎందుకు పెరిగాయనే దానిపై అధికారుల నుండి బీబీసీ సమాచారం కోరింది. గుజరాత్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.ఎ. పటేల్ ఈ డ్రగ్స్ వ్యవహారం పై వివరాలు అందించారు.

గుజరాత్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ వ్యక్తులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ వ్యక్తులు

ఎలా పట్టుకున్నారు?

జామ్‌ నగర్‌‌లోని సలాయా ప్రాంతానికి చెందిన ముఖ్తార్‌ హుస్సేన్‌, గులాం బగద్‌ అనే ఇద్దరు వ్యక్తులు సముద్ర మార్గంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని పటేల్ తెలిపారు.

నవంబర్ 14న వారు సమావేశమైనట్లు తమకు తెలిసిందని, ఆ సమావేశం ద్వారా అందిన సమాచారంతో షంసుద్దీన్ హుస్సేన్‌మియా అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి 120 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ.600 కోట్ల అని ఆయన వెల్లడించారు.

ముఖ్తార్‌, గులామ్‌లు ఒక పాకిస్తానీ పడవ ద్వారా సముద్ర మార్గంలో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటిని పంపిన వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన జాహిద్ బషీర్ బలోచ్ అనే డ్రగ్ పెడ్లర్.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 2019లో 227 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ నుంచి గుజరాత్‌కు ఆ సరుకును పంపిన వ్యక్తి కూడా జాహిద్ బలోచే.

అయితే, పోలీసు రికార్డుల ప్రకారం జాహిద్‌ పాకిస్తాన్‌లో ఇంత వరకు ఎప్పుడూ అరెస్టు కాలేదు.

ముఖ్తార్, గులాంలకు అక్టోబర్ చివరివారంలో బలూచ్ హెరాయిన్‌ను డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు స్మగ్లర్లు గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఉన్న జింజుడా గ్రామంలో ఈ సరుకును దాచారు.

ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే హెరాయిన్‌లో 85శాతం అఫ్గానిస్తాన్ నుంచే ఉత్పత్తి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే హెరాయిన్‌లో 85శాతం అఫ్గానిస్తాన్ నుంచే ఉత్పత్తి అవుతుంది.

ఈ సరకుకు అంతర్జాతీయ లింక్ ఏంటి?

యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రూపొందించిన DRUG SITUATION IN AFGHANISTAN 2021 ప్రకారం, అఫ్గానిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా నల్లమందు సాగులో గత రికార్డులను బద్దలు కొడుతూ ఎదిగింది.

"మాకు అందిన సమాచారం ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు చాలామంది రైతులు నల్లమందును సాగు చేస్తున్నారు. ఈ పంట పాకిస్తాన్‌కు రవాణా అవుతుంది. అక్కడ ప్రాసెస్ అయ్యాక తయారైన హెరాయిన్‌ను సముద్ర మార్గంలో గుజరాత్‌కు పంపిస్తారు'' అని గుజరాత్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

గుజరాత్‌లో మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోందని, పోలీసులతో పాటు ఇతర ఏజెన్సీలు రాష్ట్రం గుండా వెళుతున్న ప్రతి సరుకును స్వాధీనం చేసుకుంటున్నాయని గుజరాత్ రాష్ట్ర డీజీపీ ఆశిష్ భాటియా విలేఖరులతో అన్నారు.

అలాగే 2021వ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆరుసార్లు మాదకద్రవ్యాల సరుకులు పట్టుబడ్డాయని, ఇది పోలీసుల అప్రమత్తత వల్లేనని ఆయన తెలిపారు.

"ఈ సరకును ఎక్కడికి ఎలా డెలివరీ చేయాలనే దానిపై యూఏఈలో సమావేశాలు జరుగుతాయి. ఈ 600 కోట్ల రూపాయల సరుకు రవాణా వ్యవహారం కూడా అక్కడి నుంచే నడిచింది'' అన్నారాయన.

పాకిస్తాన్ ‌లో ప్రాసెస్ అయ్యే హెరాయిన్ గుజరాత్ తీరంగా ఇతర దేశాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు

ఫొటో సోర్స్, ATS GUJARAT

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ‌లో ప్రాసెస్ అయ్యే హెరాయిన్ గుజరాత్ తీరంగా ఇతర దేశాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు

గుజరాత్ సముద్ర మార్గాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు?

దీనిపై బీబీసీ గుజరాత్ సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడింది.

"గుజరాత్ సముద్ర మార్గాన్ని ప్రధానంగా ల్యాండింగ్, రవాణా కోసం వాడుకుంటారు. ఈ 120 కిలోల హెరాయిన్‌ను యూరోపియన్ దేశాలకు డెలివరీ చేయాల్సి ఉంది. ఇది ఇక్కడ నుండి చిన్న ప్యాకెట్లలో వివిధ దేశాలకు పంపిణీ అవుతుంది" అని ఆ అధికారి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)