హైదరాబాద్‌కు డ్రగ్స్ వయా గోవా- ప్రెస్ రివ్యూ

డ్రగ్స్ ముఠా

గోవా నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలను తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 21 లక్షల విలువ చేసే 89 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం, గోవాకు చెందిన ట్రావెల్స్ నిర్వాహకుడు పియూష్‌కు డ్రగ్స్ అమ్మే నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి డ్రగ్స్ దందా మొదలెట్టాడు.

8 నెలల క్రితం గోవాకు వెళ్లిన బంజారాహిల్స్‌ వాసి యు.శంకర్‌తో ఓ మధ్యవర్తి ద్వారా పియూష్‌కు పరిచయం ఏర్పడింది. శంకర్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు.

శంకర్‌ ద్వారా గోవా నుంచి మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు పంపించి పియూష్‌ డ్రగ్స్‌ వ్యాపారం చేయసాగాడు.

కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌లో కొకైన్‌ విక్రయించాలని పథకం వేశారు.

అందుకోసం ఒక్కో గ్రాము చొప్పున ప్యాక్ చేసిన కొకైన్‌ను శంకర్‌కు ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చిన పియూష్‌ను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు.

ఉద్యోగావకాశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఒకేరోజు 7 నోటిఫికేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలు, పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,386 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ సోమవారం 7 నోటిఫికేషన్లు విడుదల చేసిందని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.

గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసెస్‌, గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ లెక్చరర్లు, గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్లను వెబ్‌సైట్‌(https://psc.ap.gov.in)లో ఉంచారు.

  • గ్రూప్‌-1లో 169 పోస్టులు
  • గ్రూప్‌-2లో 446 పోస్టులు
  • ఎఫ్‌డీవో 43 పోస్టులు
  • ఏఐఎఫ్‌ 10 పోస్టులు

2018 జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 42 ఏళ్ల వయసు మించని అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించితే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దరఖాస్తులు 25 వేలలోపు వస్తే నేరుగా మెయిన్స్‌ ఒక్కటే ఉంటుంది. రాత పరీక్షలో నెగిటివ్‌ మార్క్‌ ఉంటుంది.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, DIPTENDU DUTTA/AFP/Getty Images

బెంగాల్లోనూ రైతు బంధు, రైతు బీమా పథకాలు

నూతన సంవత్సరం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి రైతుల కోసం రెండు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇప్పటికే అమల్లో ఉన్న 'కృషి కృషక్‌ బంధు'లో భాగంగా వీటిని తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారని 'ఈనాడు' ఓ కథనంలో పేర్కొంది.

ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.5000 వంతున సహాయం అందించనున్నట్టు మమత చెప్పారు. రూ.2,500 చొప్పున రెండు వాయిదాల్లో ఇవ్వనున్నట్టు తెలిపారు.

రెండో సంక్షేమ పథకంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. 18-60 ఏళ్ల రైతులకు రూ.2 లక్షల వంతున జీవిత బీమా ఇస్తామన్నారు.

అజారుద్ధీన్

ఫొటో సోర్స్, TandurCongressParty/fb

కారు ఎక్కనున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారముందని 'సాక్షి' రాసింది.

సంక్రాంతి తర్వాత టీఆర్‌ఎస్‌లో అజారుద్దీన్‌ అధికారికంగా చేరుతున్నట్టు ఆయన సన్నిహితులు, అభిమానులు వెల్లడించారు.

ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన అజారుద్దీన్‌ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరా దాబాద్‌ స్థానం నుంచి గెలుపొందారు.

2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయన్ను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడటంతో అజారుద్దీన్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

ఇదే వార్త ఈనాడు పత్రికలోనూ వచ్చింది. కానీ, ఆయన పేరును వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)