వేటగాళ్ల ఉచ్చుతో తొండం తెగడంతో ఏనుగు పిల్ల మృతి

గున్న ఏనుగు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆచే జయ పట్టణంలో గాయపడిన ఏనుగును స్థానికులు గుర్తించారు.

ఇండోనేసియాలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని సగం తొండాన్ని కోల్పోయిన సుమత్రన్ ఏనుగు పిల్ల చివరకు మృతి చెందింది.

ఏడాది వయస్సున్న ఈ గున్న ఏనుగు తొండం ఉచ్చులో చిక్కుకొని తెగిపోవడంతో తీవ్రంగా గాయపడింది. అది ఉచ్చులో చిక్కుకోగానే భయపడిన మిగతా ఏనుగులు దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాయి.

అచేజయ పట్టణంలో ఈ ఏనుగు పిల్లను గుర్తించిన స్థానికులు, చికిత్స కోసం ఏనుగుల పరిరక్షణ ఏజెన్సీకి తీసుకెళ్లారు.

గాయపడిన భాగంలో తొండాన్ని తొలగించి దాని ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నించామని ఏజెన్సీ అధికారులు చెప్పారు. కానీ గాయం అయిన రెండు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించారు.

''మేం దాని ప్రాణాలు కాపాడలేకపోయాం. ఎందుకంటే దాని గాయం చాలా తీవ్రమైనది. దానితో పూర్తిగా ఇన్ఫెక్షన్ సోకింది'' అని ఆచే న్యాచురల్ రీసోర్సెస్ కన్సర్వేషన్ ఏజెన్సీ హెడ్ అగస్ అరియాంటో తెలిపారు.

''ఏనుగుకు సహాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాం.''

గున్న ఏనుగు

ఫొటో సోర్స్, EPA

ఈ జాతి ఏనుగుల సహజ ఆవాసాలైన బోర్నియో, సుమత్రా దీవుల్లో అటవీ నిర్మూలన వేగంగా జరుగుతోంది. అందువల్ల వేగంగా అంతరించిపోతోన్న జాతిగా వీటిని పరిగణిస్తున్నారు.

ముఖ్యంగా ఈ జాతికి చెందిన మగ ఏనుగులకు వేటగాళ్ల నుంచి అధిక ముప్పు పొంచి ఉంటుంది. వీటి దంతాలు అధిక విలువ పలుకుతుండటంతో, వీటిని అక్రమ దంతాల మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

వేటగాళ్ల వలన ఏనుగు మరణించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిది. దీనికన్నా ముందు ఈ ఏడాది జూలైలో ఒక ఏనుగు దంతాలను వేటగాళ్లు చీల్చుకొని తీసుకెళ్లారు.

వీడియో క్యాప్షన్, ఈ గున్న ఏనుగు సరదాలు చూసి తీరవలసిందే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)