హైదరాబాద్ రోడ్ డాక్టర్: సొంత ఖర్చుతో గుంతలు పూడుస్తున్న రిటైర్డ్ ఇంజనీర్

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఒక రోజు నేను పొద్దున్నే ఆఫీసుకు వెళ్తున్నాను. హైదరాబాద్ నార్సింగి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గుంత ఉండడంతో బైక్ నడిపే వ్యక్తి అందులో పడి గాయపడ్డాడు. చేతులు, కాళ్లూ విరిగాయి. తలకు బలమైన దెబ్బ కూడా తగిలింది" అని తన జీవితంలో ఒక రోజు జరిగిన ఓ ఘటనను హైదరాబాద్‌కు చెందిన కాట్నం గంగాధర తిలక్ అనే రిటైర్డ్ ఇంజినీర్ బీబీసీకి వివరించారు.
‘‘నేను ఆ దృశ్యం చూశాను. అక్కడ ఉన్న పోలీసుల దగ్గరకు వెళ్లి వారి రిపోర్టులో గుంత వల్లే ఈ ప్రమాదం జరిగిందని రాయమన్నాను. అంతేకాదు, వారికి తెలిసిన ఇంజినీర్లకు ఈ విషయం చెప్పాలని సూచించాను.
గుంత వల్లే ప్రమాదం జరిగిందని రికార్డుల్లో ఉండాలనేదే నా ఉద్దేశం. కానీ పోలీసులు చిరాకు పడ్డారు. అవతల ప్రమాదం గురించి చూస్తుంటే నువ్వు గుంతలు అంటావేంటి అన్నారు"అయితే, తిలక్ అనుభవం ఆ ఒక్క రోజుతోనే అయిపోలేదు.
‘‘కొన్ని రోజుల తరువాత అదే రోడ్డు. మరో ప్రమాదం. ఈసారి రోడ్డు తవ్విన చోట స్లో అయిన ఆటోను బస్సు ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. బస్సు ఆటోను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. మళ్ళీ పోలీసుల దగ్గరకు వెళ్లాను రికార్డుల్లో గుంతల వల్ల ప్రమాదం జరిగింది అని రాయాలన్నాను. వాళ్లు నన్ను గుర్తు పట్టారు. మొన్న వచ్చింది కూడా మీరే కదా.. ఎంతసేపు గుంతలని మా వెంట పడతారేంటి.. అని చిరాకు పడ్డారు’’ అని తిలక్ వెల్లడించారు.
రోడ్ల మీద గుంతల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను గమనించిన కాట్నం గంగాధర తిలక్ దీన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు.
‘‘ఒక రోజు ఆఫీసుకు వెళ్తూ ఆ గుంత దగ్గర కారు ఆపి చాలాసేపు ఆలోచించాను. ఆ పక్కనే అంతకు ముందు రోడ్డు వేసేప్పుడు తవ్విన తారు పెళ్లలు కనిపించాయి. కొత్త రోడ్డు వేసే ముందు పాత రోడ్డును తవ్వేసి వాటిని అక్కడ పడేశారు. నేను వెంటనే నేను ఒక పెద్ద తారు పెచ్చు తీసుకువచ్చి ఆ గుంతలో వేశాను. తర్వాత దానిపై ఒక బస్సు వెళ్లడంతో అది కాస్త అణిగింది. ఇదేదో బావుందే అని, అక్కడున్న తారు పెళ్లలన్నీ తెచ్చి ఆ గుంతలో వేసాను. కార్లు, బస్సులు వెళ్లాయి. అరగంటలో అక్కడ గుంత చాలా ప్రొఫెషనల్ గా పూడ్చినట్టు తయారైంది. తర్వాత సంతృప్తిగా ఆఫీసుకు వెళ్లాను’’ అని తిలక్ వెల్లడించారు.
'రోడ్ల డాక్టర్' అని అందరూ ముద్దుగా పిలుచుకునే గంగాధర తిలక్‌ను కదలిస్తే ఇలాంటి అనుభవాలెన్నో చెబుతారు.

ఫొటో సోర్స్, SORAYA KIRA
మీకెందుకు అన్నారు
హైదరాబాద్ హైదర్షాకోట్ దగ్గర ఉండే ఆయన, ప్రమాదాల నివారణ కోసం రోడ్లను బాగు చేసే పని స్వచ్ఛందంగా మొదలుపెట్టారు.
" మీరు రోడ్లు పూడ్చడం ఎందుకు? అది గవర్నమెంటు పని కదా? కావాలంటే కొందరికి అన్నం పెట్టండి అని కొందరు నాతో అనేవారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రమాదం జరిగితే ఆ కుటుంబమంతా ఏమైపోతుందోననే బాధ నన్ను తొలచివేసేది. ఈ రకంగా నేను ప్రమాదాలు నివారిస్తే ఆ కుటుంబాలకు అన్నం పెట్టినట్టే అని వారికి చెబుతుంటాను" అన్నారు తిలక్.
''రోడ్డు ప్రమాదాలను ఇంత సులభంగా కూడా నివారించవచ్చా అని సంతోషం వేసింది. ఇలాంటి గుంతల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ అవి ఫోకస్ కావు'' అంటారు ఈ రోడ్ల డాక్టర్.
ప్రస్తుతం గంగాధర తిలక్ వయసు 73. రిటైర్ అయిన తరువాత ఆయన 2010లో ఈ పని ప్రారంభించారు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన తిలక్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా పనిచేశారు. పెన్షన్ వస్తుంది. అదనంగా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో డిజైనింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుండడంతో ఆ జీతం కూడా వస్తోంది.
జీవితం ప్రశాంతంగా గడిచిపోతున్న సమయంలో ఇప్పుడు ఆయన ఇలా రోడ్ల గుంతలపై దృష్టి పెట్టారు.
నిజానికి పైన చెప్పిన ప్రమాదాల ఘటనల కంటే ముందే, అలాంటి సందర్భం ఒకటి ఆయనకే ఎదురైంది.
సారీ చెప్పాలనుకున్నా
తిలక్ నివసించే కాలనీలో వర్షం కురిస్తే రోడ్డు బాగా బురద అవుతుంది. ఒకరోజు ఆయన కార్లో వెళ్తుంటే, ఆ బురద చెదిరి కొందరు పిల్లలపై పడింది. తిలక్ వెంటనే కారు ఆపి వాళ్లకు సారీ చెపుదాం అనుకున్నారట. కానీ ఆ పిల్లలు అది తమకు రోజూ మామూలే అన్నట్టు తుడుచుకుని వెళ్లిపోయారు.
''వాళ్లకు సారీ చెప్పుంటే బావుండేది. కానీ వాళ్లు ఆగకుండా వెళ్లిపోయారు. నాకెందుకో ఆ రోజంతా మనసు అదోలా అయిపోయింది. పిల్లల దుస్తులు బురద చేసేశామే అనిపించింది. అప్పుడు, ఒక ఆరు ట్రక్కుల మట్టి పోస్తే ఆ రోడ్డు చదునవుతుంది కదా అనిపించింది. మర్నాడే ఉప సర్పంచి దగ్గరకు వెళ్లి అడిగా, అప్పటికే చాలా సార్లు బాగు చేశామనీ, నిధులు లేవని చెప్పారు" అన్నారు తిలక్.
కానీ, తిలక్ ఊరుకోలేదు.దగ్గర్లో భవన నిర్మాణం జరుగుతుంటే అక్కడకు వెళ్లి, సప్లయిర్ దగ్గర ఆరు ట్రక్కుల మట్టి కొన్నారు. ట్రక్కు మామూలుగా రూ.600, అర్జెంటు అయితే రూ.700 అన్నారు. రూ.4200 కాంట్రాక్టరు చేతిలో పెట్టి, సొంత డబ్బుతో రోడ్డుపై మట్టి వేయించారు.
ఆ తర్వాత వారాతంలో ఇద్దరు కూలీలను పెట్టుకుని, తన మనవళ్లతో కలసి ఆయన ఆ రోడ్డు బాగు చేయించారు.
''ఆ తరువాత సోమవారం నేను అదే రోడ్డుపై వెళుతుంటే, నా వల్ల బురద పడ్డ ఆ విద్యార్థులు, ఇంకా చాలా మంది వచ్చి థ్యాంక్స్ చెప్పారు. నేను సారీ చెప్పినపుడు, బురద పడినా ఇంటికెళ్లి మార్చుకునే టైం లేక అవే బట్టలతో ఎన్నోసార్లు స్కూలుకు వెళ్లామని వాళ్లు నాకు చెప్పారు'' అని తిలక్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Gangadhara Tilak
ఉద్యోగానుభవాలే స్ఫూర్తి
"రైల్వేలో నాకొకటి అలవాటైంది. ఏదైనా సిగ్నల్ సమస్యను సరిదిద్దగానే, సమస్యను ఇప్పుడు ఎలా సరిచేశారు? అని మాకు ఒక ప్రశ్న వస్తుంది. భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అని అడుగుతారు. ఆ రోడ్డు ప్రమాదాలు చూడగానే, నాకూ అదే అనిపించింది. ప్రమాదాలు జరక్కుండా గుంతలు పూడ్చడమే మార్గం అనుకుని, అదే చేయడం మొదలుపెట్టాను. రికార్డుల్లో గుంతల వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులను రాయమనడానికి కూడా అదే కారణం'' అన్నారాయన.
తిలక్ తర్వాత కూడా దానిని కొనసాగించారు. ''నేను 12 గోనె సంచులు, ఒక పలుగు, ఒక చీపురు కొని కార్లో పెట్టాను. మొదట ఎక్కడైనా తారు పెళ్లలు కనిపిస్తే, వాటిని సంచుల్లో మూట కట్టి కార్లో వేసి, ఎక్కడ గుంతలు కనిపిస్తే అక్కడ వేసి పూడ్చడం మొదలుపెట్టాను. ఒక్కోసారి మూడు నాలుగు ట్రిప్పులు పట్టేది. అలా ఎన్నో పూడ్చాను. పెద్ద తారు పెళ్లలు ఎత్తడం కష్టం, వాటిని పలుగుతో పగలగొట్టి తీసేవాడిని" అన్నారు.
60 ఏళ్ల వయసులో కూడా తారు పెళ్లలు మోసుకొచ్చి గుంతల్లో వేస్తూ చురుగ్గా పనిచేశారు తిలక్.
దశాబ్ధ కాలంగా..
''నేను ఇది మొదలుపెట్టి పదేళ్లు దాటేసింది. అప్పుడు ఇంకా ఎనర్జీ ఉండేది. ఇప్పటికీ చేస్తున్నా, అప్పట్లో చేసినంత ఎక్కువ చేయలేకపోతున్నాను. 73 దాటింది కదా.. చిన్న చిన్న గుంతలు పూడుస్తున్నా, బాగా పెద్దవి చేయలేక పోతున్నాను. అప్పట్లో రోజుకు 150 కి.మీ పైగా తిరిగి గుంతలు పూడ్చేవాడిని. ఇప్పుడు కాస్త తగ్గింది." అంటారు ఈ రోడ్ల డాక్టర్.
రోడ్డు పక్కన ఉన్న తారు పెళ్లలు మొత్తం వాడేశాక, రోడ్లు వేసే కాంట్రాక్టర్ల దగ్గరకు వెళ్లి పది వేల రూపాయల సరిపడా తారు ఒకేసారి కొని తెలిసిన స్థలాల్లో వేయించేవారు తిలక్. దాన్ని సంచుల్లో నింపి కార్లో తీసుకెళ్లేవారు.
కృష్ణబాబు, సోమేశ్ కుమార్ లాంటి ఐఏఎస్ అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్లుగా ఉన్నప్పుడు తిలక్ సేవలను గుర్తించి, జీహెచ్ఎంసీ తరపున ఆయనకు మెటీరియల్ కూడా సరఫరా చేసారు.
అలా కొంత కాలం తిలక్‌కు మెటీరియల్ ఖర్చు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆయన తన సొంత ఖర్చుతోనే గుంతలు పూడుస్తున్నారు.
''కొన్ని గుంతలకు రూ.2 వేలు, కొన్నిటికి రూ.పది వేలు అవుతుంది. కానీ, చాలా వరకూ చిన్న గుంతలే ఉంటాయి. నేను ఇప్పటి వరకూ 2 వేలకు పైగా గుంతలు పూడ్చాను'' అని ఆయన చెప్పారు.

ఉద్యోగం మానేసి..
2010లో ఈ పని ప్రారంభించిన ఆయన, పూర్తిగా దీనికే సమయం వెచ్చించడానికి ఏడాది తర్వాత రిటైర్ అయ్యాక చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగం కూడా మానేశారు.
"2011 జులైలో ఉద్యోగం మానేశాక, ఇదే ఫుల్ టైం పెట్టుకున్నాను. ఉదయాన్నే 8 గంటలకల్లా బయల్దేరి వెళ్లి, మధ్యాహ్నం వరకూ చేస్తుంటా. ఎండలో వద్దని నా భార్య వారించినా పని అప్పుడే తేలిగ్గా అవుతుంది. ఎండకు తారు కరిగి తీయడానికి సులువుగా వస్తుంది. రోడ్డుకు కూడా బాగా అతుక్కుంటుంది. అందుకే ఎక్కువ ఎండలో పని చేసేవాడిని. నేను మాట వినడంలేదని, చివరకు నా కొడుకు జోక్యం చేసుకున్నాడు" అన్నారాయన.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆయన కొడుకు, భార్య మొదట్లో ఆయనకు ఇలాంటివి వద్దని వారించారు. కానీ ఆయన చేస్తున్న పని చూశాక, వారు అడ్డు చెప్పడం మానేశారు. తర్వాత భార్య కూడా ఈ పనిలో ఆయనకు చేయడం ప్రారంభించారు.
ఇప్పుడు కొడుకు కూడా తనకు పూర్తిగా అండగా నిలిచాడని తిలక్ చెబుతున్నారు.
''ఇంటి ఖర్చు నేను చూసుకుంటాను అన్నాడు. దాంతో, పెన్షన్ మొత్తం ఈ పనికే ఖర్చు పెట్టగలగుతున్నాను'' అన్నారు.
కొడుకు ఫేస్ బుక్ ఎలా వాడాలో కూడా చెప్పడంతో, తను చేస్తున్న పనుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తిలక్ అందరి అభిమానం సంపాదించారు. అలా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఆయనతో కలిసి పని చేయడం ప్రారంభించారు.
''ఒకసారి ఒకబ్బాయి వచ్చాడు. మిమ్మల్ని నేను రోడ్డుపై చూశా. కానీ. ఎవరో పిసినారి కాంట్రాక్టర్ అయ్యుంటాడులే అనుకున్నాను. కూలీల ఖర్చుకు కక్కుర్తి పడి సొంతంగా పని చేసేసుకుంటున్నాడు అనుకున్నాను. సారీ. మీరు చాలా మంచి పనిచేస్తున్నారు'' అని అభినందించాడు అంటూ తిలక్ నవ్వుతూ చెప్పారు.
చాలా మంది ఆఫీసులకు వెళ్తున్నా, ఆగి తనకు సాయం చేస్తుంటారని తిలక్ చెప్పారు.

''ఇప్పుడు హైదరాబాద్లో మరికొందరు కూడా ఇలా చేస్తున్నారు. అలాగే ముంబయి, దిల్లీ, ఫరీదాబాద్‌లో కూడా రోడ్లపై గుంతలు పూడుస్తున్నారు'' అంటారు తిలక్.
ఊరికి వెళ్తూ హైవేమీద, విజయవాడ నగరంలో కూడా ఆయన ఇలాగే గుంతలు పూడ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత ఊళ్లో కొంత తారు సంచులు స్టాక్ పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లి చుట్టుపక్కల పనులు చేయించారు.
"నేను ఇలా చేస్తుండడంతో యంత్రాంగం కూడా కదిలింది. ప్రభుత్వం స్పందించడం వల్ల గతంతో పోలిస్తే గుంతల సంఖ్య తగ్గింది. నిజానికి ఇది చాలా సులువు, చవక పని. కానీ ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టవు. కొందరు అధికారులు ఉన్నప్పుడు పని బాగా జరుగుతుంది. కొందరు ఉంటే సిబ్బంది అసలు పనిచేయరు" అన్నారు.
గంగాధర తిలక్ టెడ్ టాక్ లో పాల్గొన్నారు. స్టార్ టీవీ కోసం ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన అమితాబ్ బచ్చన్ ఒక కారు కూడా బహూకరించారు. బీబీసీ కూడా అన్ సంగ్ హీరోస్ జాబితాలో చేర్చి 2016లో తిలక్ పై కథనం ఇచ్చింది
"మన దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. దేశ భక్తి అంటూ జెండా భుజాన వేసుకుని తిరగడం కాదు. ఇప్పుడు స్వతంత్ర్య సమరయోధులు అంటే సమస్యలపై పోరాటం చేసేవారే. అన్నీ మనం తీర్చలేం. మనకు ఆసక్తి ఉన్న రంగంలో పనిచేయాలి. ఇలా అందరూ తలో చెయ్యి వేసి, ఎంతో కొంత పనిచేస్తే సమస్యలు వాటంతట అవే తగ్గుతాయి. అదే గొప్ప దేశ భక్తి. అలా చేస్తే స్వతంత్ర్య సమరయోధులతో సమానం అవుతాం" అంటారు తిలక్.
తనలో శక్తి ఉన్నంత కాలం జబ్బు పడిన రోడ్లకు చికిత్స చేస్తూనే ఉంటానంటున్న ఈ రోడ్ల డాక్టర్. వ్యక్తిగతంగా తనకు సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









