టోక్యో ఒలింపిక్స్: సానియా మీర్జా ఈసారి పతకం సాధిస్తారా

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్త్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారుల్లో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణి సానియా మీర్జా.

ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు డబుల్స్‌లో మూడు, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు వెరసి మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు.

మహిళా క్రీడాకారుల ర్యాంకింగ్‌లో, డబుల్స్‌లో ఆమె అగ్రస్థానంలో ఉండగా, సింగిల్స్‌లో 27వ స్థానంలో ఉన్నారు.

ఇది కాకుండా, సానియా మరో 40 పతకాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

కానీ, ఇప్పటికీ ఆమె ఒలింపిక్స్‌ పతకం కోసం ఎదురుచూస్తున్నారు.

34 ఏళ్ల సానియా మీర్జాకు ఈ నెలలో ఆరంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ నాలుగవది. బహుశా ఇదే ఆఖరిది కూడా కావచ్చు. ఈ ఒలిపింక్స్‌లో పాల్గొనడానికి సానియా చాలా ఉత్సాహంగా ఉన్నారు.

"ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో మూడుసార్లు పాల్గొనడం నా అదృష్టం. ఇది నాలుగవది. తల్లిని అయిన తర్వాత నేను కన్న కలల్లో ఒలింపిక్స్‌లో పాల్గొనడం కూడా ఒకటి" అని ఆమె అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో సానియా మీర్జా, అంకితా రైనాతో కలిసి మహిళల డబుల్స్‌లో ఆడబోతున్నారు.

సానియా తొమ్మిదో ర్యాంకింగ్‌తో, అంకితా రైనా 95వ ర్యాంకింగ్‌తో టోక్యో ఒలింపిక్స్‌కు టికెట్ దక్కించుకున్నారు.

అంకితా రైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంకితా రైనా

అంకితా రైనాకు ఇది తొలి ఒలింపిక్స్

28 ఏళ్ల అంకితా రైనా తొలిసారిగా ఒలింపిక్స్‌లో ఆడనున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన అంకిత ప్రస్తుతం భారతదేశంలో మహిళల సింగిల్స్‌లో నంబర్ వన్.

జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించారు.

అంకిత ఈ ఏడాది వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో కూడా ఆడారు. కానీ, మొదటి రౌండ్‌లోనే ఓడిపోయి వెనుదిరిగారు.

"నేను, సానియా మీర్జా కలిసి ఈ దేశానికి ఒలింపిక్ పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నాం" అని అంకిత అన్నారు.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

గత మూడు ఒలింపిక్స్‌లో సానియా ఆట తీరు

ఈసారి ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నా, అది అంత సులభం కాదని సానియాకు బాగానే తెలుసు.

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సానియా మీర్జా, సునీతా రావుతో కలిసి మహిళల డబుల్స్‌లో అడుగుపెట్టారు. కానీ, మూడో రౌండ్‌లో 4-6, 4-6తో రష్యా జోడీ స్వెత్లానా కుజ్నెత్సోవా, దినారా సఫీనాల చేతిలో ఈ జంట ఓడిపోయింది.

మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ఇవెటా బెనసోవాతో ఓడిపోయారు.

ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్‌లో రష్మి చక్రవర్తితో కలిసి ఆడారు. అయితే, తొలి రౌండ్‌లో చైనా-తైపీ జోడీ షిహ్ సు వీ, చువాంగ్ చియా జంగ్ చేతిలో ఓడిపోయారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందులో ఈ జంట 5-7, 6-7తో బెలారస్ జోడీ విక్టోరియా అజరెంకా, మాక్స్ మిర్నాయ్ చేతిలో ఓడిపోయింది.

అయితే, ఆ ఏడాది లండన్ వెళ్లే ముందు సానియ మీర్జాకు అఖిల భారత టెన్నిస్ సంఘంతో తీవ్ర ఘర్షణ జరిగింది.

లండన్‌లో సానియా, మహేష్ భూపతితో కలిసి ఆడాలనుకున్నారు. భారత టెన్నిస్ సంఘం తనను ఒక వస్తువులా చూస్తోందని ఆరోపించారు.

2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ప్రార్థనా థంబారేతో కలిసి ఆడారు. మొదటి రౌండ్‌లోనే 6-7, 7-5, 5-7తో చైనాకు చెందిన పంగ్ షువా, జాంగ్ షువా చేతిలో ఓడిపోయారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడారు. ఈ జోడీ సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, అంతటితో వెనుతిరిగింది. చెక్ రిపబ్లిక్ జోడీ లూసీ హార్డెకా, రాడెక్ స్టెపానెక్ వీరిని 1-6, 5-7 తేడాతో ఓడించి నాలుగో స్థానానికి నెట్టారు.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జోడీ లేదు

భారతదేశం నుంచి రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ కట్-ఆఫ్ తేదీ లోపల వారి సంయుక్త ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు టిక్కెట్లు పొందడంలో విఫలమయ్యారు.

1988లో టెన్నిస్‌ను మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చిన తరువాత భారతదేశం నుంచి పురుషుల డబుల్స్ జోడీ ఈ క్రీడల్లో పాల్గొనలేకపోవడం ఇదే మొదటిసారి.

ఈ ఏడాది వింబుల్డన్‌లో సానియా

సానియా మీర్జా, అంకితా రైనా కూడా టోక్యో వెళ్లే ముందు వింబుల్డన్‌లో ఆడారు. అమెరికా క్రీడాకారిణి బెథానీ మాటెక్-సాండ్స్‌‌తో కలిసి సానియా మహిళల డబుల్స్ ఆడారు. అయితే రెండో రౌండ్‌లోనే ఈ జోడీ వెనుదిరిగింది.

అంకిత-సానియా జోడీ బలాబలాలు

రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతో భారత టెన్నిస్ జట్టు కోచ్ జీషన్ అలీ నిరాశ వ్యక్తం చేశారు. జీషన్ అలీ స్వయంగా ఒలింపియన్, భారత డేవిస్ కప్ జట్టు మాజీ ఆటగాడు కూడా.

"ఈసారి రోహన్ బోపన్న, సానియా మీర్జా కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకం సాధిస్తారని చాలా ఆశలు పెట్టుకున్నాం. రోహన్ టోక్యోకు టికెట్ సాధించలేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. రియోలో కూడా చాలా దగ్గర వరకు వెళ్లి సెమీస్‌లో ఓడిపోయారు" అని జీషన్ అలీ అన్నారు.

సానియ మీర్జా దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తరువాత టెన్నిస్ ఆడుతున్నారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత ఆమె కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. ఐదేళ్ల కిందట సానియాకు ఉన్న ఫిట్‌నెస్ ఇప్పుడు అదే స్థాయిలో లేదని జీషన్ అలీ చెప్పారు.

అయితే, సానియా మీర్జాకు ఆటలో సుదీర్ఘ అనుభవం ఈసారి ఉపయోగపడవచ్చని జీషన్ అలీ అభిప్రాయపడ్డారు.

"సానియా మీర్జాకు ఇది నాలుగవ ఒలింపిక్స్. ఆమె ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కూడా కొన్నాళ్లు కొనసాగారు. కాబట్టి ఫిట్‌నెస్ అసలు ఉండదని అనుకోలేం. అంకితకు ఇంత పెద్ద పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి. సానియా అనుభమే వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా" అని ఆయన అన్నారు.

అంకిత కొంత ఒత్తిడికి లోనవ్వచ్చు. సానియాకు ఆమె అండగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇంత పెద్ద వేదికపై ఆడాలంటే మానసిక స్థైర్యం చాలా ముఖ్యమని జీషన్ అలీ అన్నారు.

సానియా మీర్జా చిన్నప్పటి నుంచీ ఆమె ఆటను జీషన్ అలీ గమనిస్తున్నారు. జీషన్ తండ్రి, మాజీ టెన్నిస్ ఆటగాడు, ఒకప్పటి కోచ్ అఖ్తర్ అలీ కూడా సానియా మీర్జాకు ప్రారంభంలో కోచింగ్ ఇచ్చారు.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

సానియా మీర్జా ప్రత్యేకతలు ఏమిటి?

సానియా మీర్జాకు కష్టించి పనిచేసే తత్వం ఉందని జీషన్ అలీ చెప్పారు.

"భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదు. కానీ, క్రీడాకారులకు ఉండాల్సిన కసి, కఠోర పరిశ్రమ చేయగలిగే సామర్థ్యం, ఆట కోసం మిగతా విషయాలను త్యాగం చేయగల గుణం, అదీ మంచి వయసులో ఉన్నప్పుడు... ఇవన్నీ కూడా సానియా మీర్జాకు పుష్కలంగా ఉన్నాయి" అని ఆయన ప్రశంసించారు.

కోవిడ్ నిబంధనల ప్రభావం ఎంతవరకు ఉంటుంది?

టోక్యోలో ఒలింపిక్స్ సందర్భంగా కఠిన కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నారు.

వీటన్నిటి మధ్య ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరచడం సాధ్యమేనా?

"భారత క్రీడాకారులకు ఈసారి కఠిన పరీక్షలే ఎదురవబోతున్నాయి. ఇక్కడి కోవిడ్ పరిస్థితుల కారణంగా అక్కడకు వెళ్లే ముందు, వారం రోజులపాటూ రోజూ కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. జపాన్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాలి."

భారత క్రీడాకారులు అక్కడకు చేరుకున్న తరువాత మూడు రోజుల పాటు క్వారంటీన్‌లో ఉండాలి. మళ్లీ ఇండియా తిరిగి వచ్చేవరకు రోజూ పొద్దున్న, సాయంత్రం కోవిడ్ టెస్టు చేయించుకోవాలి.

"ఇవన్నీ ఆటగాళ్లపై పెద్ద ప్రభావమే చూపుతాయి. ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఎక్కడకు వెళ్లాలి మొదలైన ఆంక్షల మధ్య ఆడాలి. అన్ని దేశాల క్రీడాకారులకు ఇది వర్తిస్తుంది కానీ, కొంచం కష్టమే."

"ఒక క్రీడాకారుడు లేదా క్రీడాకారిణికి దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం. అది ఒలింపిక్స్ అయినా, కామన్వెల్త్ అయినా, ఆసియా క్రీడలైనా సరే ఆడడమే ముఖ్యం. ఈసారి సానియా మీర్జా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాం" అని జీషన్ అలీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)