టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పాల్గొంటున్న గుర్రం

ఫొటో సోర్స్, Embassy Group
- రచయిత, జాహ్నవీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున ఆడే బృందం అనగానే, ఎవరికైనా క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు మాత్రమే గుర్తుకు వస్తారు.
కానీ, టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున ఒక గుర్రం కూడా పాల్గొంటోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న గుర్రం పేరు డజారా-4. అది గుర్రపు స్వారీ చేసే ఫోవాద్ మీర్జాతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది.
2011లో జన్మించిన డజారా-4 జర్మన్ బే హాల్ట్స్‌నీర్ జాతి గుర్రం. ఇప్పటి వరకు ఈ గుర్రం 23 సార్లు పోటీలలో పాల్గొని, 5 సార్లు గెలిచింది.
ఫోవాద్‌ను స్పాన్సర్ చేస్తున్న ఎంబసీ గ్రూపు ఆ గుర్రాన్ని 2019లో 2,75,000 యూరోలకు కొన్నారు. వాళ్ళు ఫోవాద్‌కు మరో మూడు గుర్రాలను కూడా స్పాన్సర్ చేశారు.
అందులో డజారా 4 , సీగ్ నీయర్ మెడికాట్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాయి.
వాటి తీరు తెన్నులు, అన్ని విధాలా వాటితో ఉండే లాభాలను అంచనా వేసిన తర్వాత, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఫోవాద్ డజారాను ఎంపిక చేసుకున్నారు.
ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ పోటీ) చాలా విభిన్నమైన క్రీడ. ఈ క్రీడలో గుర్రపు స్వారీ చేసే వ్యక్తికి గుర్రంతో ఉండే సంబంధం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఆ గుర్రంతో స్వారీ చేసే వారు శిక్షణలో భాగంగా ఆ గుర్రంతో కొంత సమయం గడిపితేనే ఇద్దరి మధ్యా స్నేహసంబంధం ఏర్పడుతుంది.
"కొన్నేళ్లుగా గుర్రంతో కలిసి పని చేయడం వల్ల, ఇద్దరి మధ్యా ఒక విధమైన నమ్మకం కుదిరి సంబంధం ఏర్పడుతుంది. గుర్రపు శాలల్లో వాటికి మేత వేస్తూ, వాటిని లాలిస్తూ వాటితో చాలా సేపు గడపడం వల్ల కూడా మా మధ్య దృఢమైన బంధం ఏర్పడుతుంది.
ప్రపంచ వేదికల్లో పాల్గొనడంలో ఉండే ఒత్తిడిని డజారా 4 అర్ధం చేసుకోగలదని మాకు అనిపించింది" అని ఫోవాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Embassy Group
గుర్రానికి క్వారంటైన్
బెంగళూరుకు చెందిన 29 సంవత్సరాల మీర్జా జర్మనీలో బెర్గ్‌డోర్ఫ్ గ్రామంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయన గుర్రాల శాలల్లో ఈ గుర్రాలతో కలిసి రోజుకు 12 గంటల పాటు గడుపుతూ, వాటితో పాటూ శిక్షణ తీసుకుంటారు.
ఆయన, డజారాతో కలిసి త్వరలోనే ఒలింపిక్స్‌కు వెళ్లనున్నారు.
కోవిడ్ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు, ఇతర అధికారులందరికీ క్వారంటైన్‌లో ఉండటం తప్పని సరి. దాంతో, ఫోవాద్‌తో పాటు, డజారా 4 కూడా టోక్యోకు వెళ్లక ముందు 7 రోజులు, వెళ్లిన తర్వాత 7 రోజుల పాటు ఒక సురక్షితమైన బయో బబుల్‌లో క్వారంటైన్‌లోనే ఉంటారు.
గుర్రాన్ని సంరక్షించే బృందంలో సంరక్షకురాలు జోహానా పోహోనెన్, పశువైద్యులు డాక్టర్ గ్రిగో రియోస్ మలీస్ , ఫిజియో థెరపిస్ట్ వెరోనికా సింజ్ ఉంటారు.
డజారాతో కలిసి ఫోవాద్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలననే నమ్మకంతో ఉన్నారు.
ఈ గుర్రం 2020లో కేవలం 5 సార్లే పోటీలో పాల్గొంది. కానీ, ఈ ఏడాది పోటీకి సన్నద్ధంగా ఉంది.
ఈ ఏడాది మోంటెలిబ్రెటిలో జరిగిన పోటీలో ఐదవ స్థానం, ఇటలీ లో మూడవ స్థానం, బాబొరొకోలో, పోలండ్ లో మూడవ స్థానం, పోలండ్ లో జరిగిన ఎఫ్ఐఈ నేషన్స్ కప్‌లో రెండవ స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, Embassy Group
రెండు దశాబ్దాల నిరీక్షణ
ఒలింపిక్స్‌లో గుర్రపు స్వారీలో పాల్గొనేందుకు భారతదేశానికి 20 ఏళ్ల తర్వాత ఈ అవకాశం లభించింది.
ఫోవాద్ కంటే ముందు ఒలింపిక్స్ లో భారతదేశం నుంచి గుర్రపు స్వారీలో పాల్గొన్న వారిలో వింగ్ కమాండర్ ఐ జె లాంబా , ఇంతియాజ్ అనీస్ ఉన్నారు.
లాంబా 1996లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొనగా, ఇంతియాజ్‌కు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది.
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఫోవాద్ గత సంవత్సరమే అర్హత సంపాదించాడు.

ఫొటో సోర్స్, Embassy Group
ఆయన ఆసియా క్రీడా వేదికల పై విజయం సాధించారు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియన్ క్రీడల్లో రెండు వెండి పతకాలు గెలుచుకున్నారు.
టోక్యోలో ఆయన వ్యక్తిగత విభాగంలో పాల్గొంటున్నారు. ఆయన ఆగ్నేయాసియా, ఓషియానియా గ్రూప్‌లో అత్యున్నత ర్యాంకింగ్ సాధించిన తర్వాత గత సంవత్సరమే ఒలింపిక్‌లో స్థానం సంపాదించుకున్నారు.
ఆయన తండ్రి పశువైద్య నిపుణులు. ఫోవాద్‌కు చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీ అంటే మక్కువ. ఆయనకు 2019లో అర్జున అవార్డు లభించింది.

ఫొటో సోర్స్, Embassy Group
భారతదేశంలో గుర్రపు స్వారీ చిత్రాన్ని ఫోవాద్ మార్చగలరా?
భారతదేశ సంస్కృతి, చరిత్రలో గుర్రాలు ఒక భాగంగా ఉంటూ వచ్చాయి. శివాజీ మహారాజు, మహారాణా ప్రతాప్, చేతక్, రాణి లక్ష్మీభాయ్, బాదల్ లాంటి ప్రముఖుల గుర్రాల సంపద గురించి చారిత్రక కథనాలు కూడా ఉన్నాయి.
17, 18వ శతాబ్దాల్లో మరాఠా సేనల ఆధిపత్యానికి డెక్కన్ జాతి అని చెప్పే భీమ్‌థడి లాంటి ప్రముఖమైన జాతులే కారణమని చాలా మంది భావిస్తారు.
ఇప్పటికీ మహారాష్ట్రలోని సారంగ్‌ఖేడా లోని గుర్రాల మార్కెట్‌లో గుర్రాలు కొనేందుకు కొన్ని లక్షల రూపాయిలు ఖర్చు పెడుతూ ఉంటారు.
గుర్రపు స్వారీ ఒక క్రీడగా దేశంలో అంతగా పరిణామం చెందలేదు.
"ఇది చాలా ఖరీదుతో కూడుకుని ఉండటంతో పాటు దీనికి చాలా పెట్టుబడి కూడా అవసరం ఉండటమే ఇది క్రీడగా ప్రాముఖ్యం చెందకపోవడానికి ప్రధాన కారణం" అని ఎంబసీ గ్రూప్ చైర్మన్ జీతూ వీర్వాని వివరించారు.
"దీనికి ఇంకా చాలా ఆటంకాలున్నాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి కూడా మేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ, పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నాం" అని అన్నారు.
అలాగే, ఈ క్రీడకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరూ ప్రముఖ క్రీడాకారులు లేరు. ఫోవాద్, డజారా కలిసి గుర్రపు స్వారీ పై దేశంలో ఆసక్తిని పెంచుతారని నిపుణులు భావిస్తున్నారు. ఈ అభిప్రాయంతో ఫోవాద్ ఏకీభవిస్తున్నారు.
"ఇప్పటికే మేము చరిత్రను సృష్టించే మార్గంలో ఉన్నాం. ఆ క్షణాన్ని చేరేందుకు డజారా మాకు సహాయం చేస్తుంది. డజారా చాలా మంచి, అందమైన గుర్రం. ఈ క్రీడకు తగినంత దృష్టిని తీసుకుని వచ్చి యువతరానికి స్ఫూర్తి ఇస్తుందని ఆశిస్తున్నాను" అని ఫోవాద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- BBCISWOTY: క్రీడల్లో మహిళల గురించి భారతీయులు ఏమనుకొంటున్నారు?
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- క్విజ్: పీవీ సింధు గురించి మీకేం తెలుసు?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








