డీమోనిటైజేషన్ స్కాంలో ఈడీ చార్జ్‌షీట్: రాత్రికి రాత్రి రూ. 111 కోట్ల అమ్మకాలు చూపించి బ్లాక్ మనీ వైట్‌గా మార్చేసి దొరికిపోయారు

రూ. 2 వేల నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

సంచలనం సృష్టించిన హైదరాబాద్ డీమోనిటైజేషన్ కుంభకోణం కేసులో ఈడీ చార్జిషీటు వేసింది.

హైదరాబాద్‌కి చెందిన పలువురు వ్యాపారులు ఈ రూ. 136 కోట్ల స్కాంలో భాగస్వాములుగా ఉన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా కైలాశ్ గుప్తా, నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తాలపైనా.. అలాగే ముసద్దిలాల్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్స్ ప్రై.లి. సంస్థలపైనా ఈడీ కేసు పెట్టింది.

అంతకు ముందే తెలంగాణ రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా ఈడీ విచారణ సాగించింది.

కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ కుంభకోణం?

కుంభకోణం ఎలా జరిగిందో ఈడీ తన అభియోగపత్రంలో పేర్కొంది.

‘‘ప్రధాన నిందితులు కైలాశ్, అతని కుటుంబ సభ్యులు ముందుగా తమ దగ్గర ఉన్న డబ్బూ, కావాల్సిన వారి నుంచి సేకరించిన డబ్బూ కలిపి మొత్తం రూ. 111 కోట్లను ముసద్దిలాల్ గ్రూపు, వైష్ణవి కంపెనీలకు పంపారు.

ఆ డబ్బుతో 30 కోట్ల బ్యాంకు లోన్ తీర్చేశారు. తరువాత సుమారు రూ. 80 కోట్లను నాలుగు కంపెనీలకు చెల్లించి, వారి దగ్గర నుంచి 270 కేజీల బంగారం కొన్నార’’ని పేర్కొంది.

కరెన్సీ

ఫొటో సోర్స్, Pti

డీమోనిటైజేషన్ లో బ్లాక్ మనీ దందా

నిందితులు తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకుని, భారీ లాభాలు పొందడానికి డీమానిటైజేషన్ ను ఉపయోగించుకున్నారని ఈడీ విచారణలో తేలింది.

కేవలం 4 గంటల వ్యవధిలో అంటే 2016 నవంబరు 8 రాత్రి 8 గం.ల నుంచి 12గం.ల మధ్య ఏకంగా 111 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్టు చూపించి, దానికి ఆధారంగా 5,911 ఇన్‌వాయిస్‌లు (సేల్ బిల్లులు) తయారు చేశారు. ఆ తరువాత ఆ డబ్బును అమ్మకాలు ద్వారా వచ్చిన డబ్బుగా చూపించి బ్యాంకులో వేశారు.

ఇందులో సింహ భాగం ప్రధాన నిందితుల సొంత సొమ్ము కాగా మిగిలింది, వేరే వారి నుంచి కమిషన్ పద్ధతిలో తీసుకున్నది.

ఆ సొమ్ములో కొంత భాగాన్ని పాత పన్ను బాకీలు కట్టడానికీ, బ్యాంకు అప్పులు కట్టడానికి కూడా ఉపయోగించారు. అలాగే ఇంకొంత మొత్తంతో బంగారం కొన్నారు. తరువాత ఆ బంగారాన్ని మంచి ధరకు అమ్మి లాభాలు గడించారు.

దీంతో మొత్తం అక్రమ లావాదేవీల విలువ దాదాపు 139 కోట్ల రూపాయలని తేల్చింది ఈడీ. వీరంతా ఈ నగదును ముందుగా ముసద్దీలాల్ గ్రూపులో వేసి తరువాత బంగారంగా మార్చారు.

2021 ఫిబ్రవరి ఒకటిన దాదాపు 130 కోట్ల 57 లక్షల రూపాయల స్థిర, చరాస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. అందులో ఏకంగా 86 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం ఉంది. ఇవన్నీ ఈడీ సోదాల్లో దొరికినవి.

గతంలో మొత్తం 13 మందిపై రెండు చార్జిషీట్లు వేయగా, మే 31న తుది చార్జిషీటు వేసింది ఈడీ. కైలాశ్ గుప్తా, నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తాలు ప్రధాన నిందితులు.

వారి సంస్థలను, వారి చార్టెడ్ ఎక్కౌంటెంట్లనూ, బంగారం డీలర్లనూ, వారికి బ్లాక్ ఇచ్చిన వారిని, ఇతరత్రా భాగస్వాములనూ చార్జీషీట్లో పేర్కొన్నారు. వ్యక్తులూ, సంస్థలూ కలపి మొత్తం 41 పేర్లు తుది చార్జిషీట్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)